అశ్వవాహనంపై కల్కిగా..
Ens Balu
2
Tirumala
2020-10-23 22:53:09
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు. కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని అయిన మహల్లో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతిరెడ్డి, కుపేంద్రరెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.