జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయ సిబ్బంది..
Ens Balu
2
సీఎం క్యాంపు ఆఫీస్
2020-10-27 17:09:16
గ్రామసచివాలయాల్లో కొలువుల కోసం వేచిస్తున్నవారికి శుభవార్త. ఇటీవల నిర్వహించిన గ్రామసచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మిగిలిన 16208 ఉద్యోగాలను నేటి ఫలితాలతో భర్తీచేయనున్నామని అన్నారు. అభ్యర్ధుల ఫలితాలు, వచ్చిన మార్కులు ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తరువాత అపాయింట్ ప్రక్రియ మొదలవుతుందని అంతా కలిపి రెండు నెలల్లో ఈ ప్రక్రియ ముగించి వచ్చే జనవరి నాటికి పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సిబ్బందిని భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు అభ్యర్ధుల హాల్ టిక్కెట్ల ఆధారంగా వారికి వచ్చిన మార్కులను సరిచూసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.