వైఎస్ఆర్ చేయూత‌లో విజయనగరం నెం.1


Ens Balu
3
Vizianagaram
2020-12-19 21:58:40

జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ చేయూత‌, వైఎస్ఆర్ బీమా ప‌థ‌కాల అమ‌లును వేగ‌వంతం చేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ రూపొందించిన ప్ర‌త్యేక వ్యూహం ఫ‌లిత‌మిచ్చింది. ఈ ప‌థ‌కం అమ‌ల్లో జిల్లా గ‌ణ‌నీయ‌మైన పురోభివృద్దిని సాధించింది. వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కంలో ఏకంగా రాష్ట్రంలోనే మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోగా, వైఎస్ఆర్ బీమా ప‌థ‌కంలో ద్వితీయ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అమ‌ల్లో ఈ నాలుగు రోజుల్లోనే మంచి పురోభివృద్ది చోటుచేసుకుంది.   ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఈ మూడు ప‌థ‌కాల అమ‌లుపై జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక వ్యూహాన్ని రూపొందించి అమ‌లు చేశారు. జిల్లా అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డ‌మే కాకుండా, తాను సైతం స్వ‌యంగా ప‌లు బ్యాంకుల‌కు వెళ్లి త‌నిఖీ చేశారు. జాయింట్ క‌లెక్ట‌ర్లు కూడా వివిధ బ్యాంకుల‌ను త‌నిఖీ చేశారు.  ప‌థ‌కాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు డిఆర్‌డిఏ కార్యాల‌యంలో 24 గంట‌లు ప‌నిచేసేలా ఒక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు.   క్షేత్ర‌స్థాయిలో మండ‌లాల‌కు ఐటిడిఏ పివో, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా), స‌బ్ క‌లెక్ట‌ర్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్‌, ఆర్‌డిఓ, డివిజ‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారుల‌ను  ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణాధికారుల‌ను నియ‌మించారు.  వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారుల‌తో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేశారు.  అలాగే క్షేత్ర‌స్థాయిలో  స‌మ‌స్య‌లు ఎదురైతే, వాటిని విశ్లేషించి,  ప‌ర్య‌వేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌లు వ‌ర‌కూ సిద్దంగా ఉండి ప‌నిచేసింది. వివిధ‌ శాఖ‌ల ప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, సాంకేతిక స‌హ‌కారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వ‌ర్యంలో, ఆయా శాఖ‌ల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో  24 గంట‌లూ అందుబాటులో ఉండి ప‌నిచేస్తున్నారు. మొత్తం కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌ ప‌ర్య‌వేక్షించారు.                 ఈ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కార‌ణంగా ఈ ప‌థ‌కాల అమ‌లు వేగ‌వంతం అయ్యింది. వైఎస్ఆర్  చేయూత ప‌థ‌కం అమ‌ల్లో శ‌త‌శాతం ల‌క్ష్యాల‌ను సాధించ‌డం ద్వారా, రాష్ట్రంలోనే మ‌న జిల్లా అగ్ర‌స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ బీమా ప‌థ‌కం అమ‌ల్లో రాష్ట్రంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు ద్వితీయ స్థానం ద‌క్కింది. జిల్లాలో సుమారుగా 6,97,161 బియ్యం కార్డులు ఉండ‌గా, 5,92,827 కార్డుల‌కు స‌ర్వే పూర్తి అయ్యింది. వీటిలో 5.25.215 కుటుంబాల వివ‌రాల‌ను బ్యాంకుల‌కు అంద‌జేయ‌డం జ‌రిగింది. బీమా ప‌థ‌కంలో మొద‌టి స్థానంలో విశాఖ జిల్లా నిల‌వ‌గా, మ‌న త‌రువాత స్థానంలో చిత్తూరు, అనంత‌పురం, నెల్లూరు జిల్లాలు నిలిచాయి. జ‌గ‌నన్న తోడు ప‌థ‌కం క్రింద ఇప్ప‌టివ‌ర‌కు 25,635 ద‌ర‌ఖాస్తుల‌ను బ్యాంకులు ఆమోదించాయి.  వీరిలో ఇప్ప‌టికే 9,475 మందికి రూ.9,47,50,000 మొత్తాన్ని అంద‌జేయ‌డం జ‌రిగింది. మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో రుణాలు మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.