ఇళ్ల స్థలాల పంపిణీ సజావుగా సాగాలి..
Ens Balu
11
Visakhapatnam
2020-12-22 21:18:01
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల స్థలాల పంపిణీ పధకం నగర పరిధిలో సజావుగా చేపట్టడానికి మున్సిపాలిటీ / కార్పోరేషన్ స్థాయిలో తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామల రావు తో కలసి ఆ శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ జివిఎంసి కార్యాలయము నుండి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పట్టణాల పరిధిలో డిశంబర్ – 25 తేది నుండి జనవరి 7వ తేది వరకు చేపట్టాలని అందరు మున్సిపల్ కమిషనర్లను కోరారు. పధకం సజావుగా నిర్వహించడానికి మంత్రివర్యులు పలు సూచనలు చేస్తూ టిడ్కో ద్వారా మంజూరు అయిన గృహాల లబ్ది దారులకు ప్రభుత్వం జారీ చేసిన నూతన నియమావళి ప్రకారం మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ పరిధిలో న్యాయ పరమైన సమస్యలు ఉన్న చోట ప్రభుత్వం జారీ చేసిన అధీకృత లేఖను అర్హులైన లబ్దిదారులకు అందించాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ నెల 25 తేది న కాకినాడలోను, 28 వ తేదిన శ్రీకాళహస్తిలోను, 30వ తేదిన విజయనగరంలో జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమంనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొనుచున్నారని, అక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని మిగతా ప్రాంతాలలో లబ్దిదారులు వీక్షించే విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి తదుపరి అక్కడ కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల సహాయంతో నిర్వహించాలని కోరారు.
ఇండ్ల స్థలాలకు గుర్తించిన జాబితాలను సంబందిత వార్డు సచివాలయాలవద్ద పారదర్శకతను సూచించే విధంగా ప్రచురించాలని సూచించారు. మున్సిపల్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ కమిషనర్లు ఈ పధకం చేపట్టడానికి తీసుకుంటున్న చర్యల గురుంచి అందర్నీ అడిగి తెలుసుకున్నారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ కార్పోరేషన్ పరిధిలో టిడ్కో గృహాలు కేటాయింపు మరియు ఇండ్ల స్థలాల కేటాయింపు లేఖలను లబ్దిదారులకు అందించడానికి కావలిసిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియపర్చారు. సి.డి.ఎం.ఎ. విజయ కుమార్ మాట్లాడుతూ పధకం యొక్క ప్రగతిని ప్రతీ రోజూ కమిషనర్ వారి కార్యాలయమునకు పంపించేందుకు మూడు ప్రోఫార్మాలు పంపుచున్నామని వాటిలో ప్రగతిని నింపి ఎప్పటికప్పుడు తెలియపర్చాలన్నారు.
తదుపరి, మున్సిపల్ శాఖామాత్యులు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న 560 అర్బన్ హెల్త్ సెంటర్లకు కావలసిన మౌళిక సదుపాయాలూ ఏర్పాటునిమిత్తం తగు చర్యలు త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇదివరకే బిల్డింగులు ఉన్న చోట ఫర్నిచరు గాని, అవసరమైన చోట రిపేర్లు చేపట్టాలని, బిల్డింగులు కట్టవలసిన ప్రాంతాలో స్థలాలు సమకూర్చికొని రాష్ట్ర స్థాయిలో ఒకే బిల్డింగు డిజైను ఏర్పాటు చేసి, అన్ని మున్సిపల్ / కార్పోరేషన్లో అదే డిజైన్ తో భవనాలు నిర్మించడానికి తగుచర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎం.ఏ & యు.డి. కార్యదర్శి జె. శ్యామలరావు, సిడి.ఎం.ఎ. విజయ కుమార్, టిడ్కో మనేజింగు డైరెక్టరు శ్రీధర్,, ఇ.ఎన్.సి. చంద్రయ్య, రాష్ట్ర స్థాయిలో అందరు మున్సిపల్ కమిషనర్లు, విశాఖపట్నం నుండి వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ వి. కోటేశ్వరరావు, జివిఎం.సి. కమిషనర్ జి. సృజన, ఏ.డి.సి.లు రమణి, సన్యాసిరావు, డి.సి.ఆర్. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, ఎస్.ఇ.లు వినయ్ కుమార్, వేణుగోపాల రావు, సి.ఎం.ఓ.హెచ్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.