శ్రీవారి భక్తులకు విశేషంగా సేవలందాలి..


Ens Balu
2
Tirumala
2021-02-05 21:56:34

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల సడలింపు అనంతరం భక్తులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనేకమంది భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకున్నారు.  అన్న ప్రసాదం భవనంలోని భోజన శాలల్లోకి వెళ్లి భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడారు. భక్తులు తిరుమలకు ఎప్పుడు వచ్చారు? వసతి సులువుగానే దొరికిందా? దర్శనంలో ఇబ్బందులు ఉన్నాయా? అన్న ప్రసాదం నాణ్యత, రుచి ఎలా ఉందని అనేకమంది మంది భక్తులతో మాట్లాడి వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. సుమారు గంట పాటు తనిఖీలు చేసిన ఛైర్మన్   శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వసతి, భోజనం, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు.  భక్తులు అన్న ప్రసాదం పారేయకుండా జాగ్రత్తగా వడ్డించేలా చర్యలు తీసుకువాలని అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ నాగరాజును ఆదేశించారు.             భోజనశాలల్లో వడ్డించేప్పుడు అన్నం కింద పదుతోందనీ, భక్తులు అన్నం తొక్కుతున్నారని ఛైర్మన్ అధికారులకు చెప్పారు. అన్నం కింద పడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో  తమకు అందుతున్న సేవల గురించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం రుచి,నాణ్యత బాగున్నాయని చెప్పారు. అన్న ప్రసాదం నాణ్యతను పరిశీలించడానికి అకస్మాత్తుగా అక్కడే భోజనం చేశారు. వసతి, ఇతర సదుపాయాలకు సంబంధించి తిరుమలలో సూచిక బోర్డులు లేనందువల్ల ఇబ్బంది పడ్డామని వరంగల్లు కు చెందిన యజ్ఞం శ్రీను చైర్మన్ కు చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని  సుబ్బారెడ్డి చెప్పారు.   మాడ వీధుల్లో....             ఈ నెల 19వ తేదీ రథ సప్తమి సందర్భంగా మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో భక్తులను భౌతిక దూరం పాటిస్తూ ఎలా అనుమతించాలి ? గ్యాలరీల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలను పరిశీలించారు.           లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడి లడ్డూలు సిఫారసు లేకుండా దొరుకుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. లడ్డూల పంపిణీకి పేపర్, బట్ట కవర్లను ఉపయోగిస్తున్న తీరు గమనించారు. కవర్లు ఎంతకు విక్రయిస్తున్నారని భక్తులను అడిగారు. అనంతరం బూందీ పోటులో ప్రమాదాలు జరక్కుండా, పోటు కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి  అధునాతన " థర్మో ఫ్లూయిడ్" టెక్నాలజీతో నిర్మించిన బూందీ పోటును చైర్మన్  సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇండియా సిమెంట్స్ సంస్థ విరాళం కింద నిర్మించిన నూతన పోటులో ట్రయల్ రన్ చేశారని, త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త పోటు ప్రారంభిస్తామని చైర్మన్ మీడియాతో చెప్పారు.  శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  హరీంద్ర నాథ్, పోటు పేష్కార్  శ్రీనివాస్, విజివో  బాలిరెడ్డి, ఏవి ఎస్వో  గంగరాజు చైర్మన్ వెంట ఉన్నారు.