కష్టపడి చదివితే ఉత్తమ భవిష్యత్తు..


Ens Balu
2
Madanapalle
2021-02-07 17:05:28

విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుని అనేక రకాల బాషలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని  భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తెలిపారు. ఆదివారం భారత రాష్ట్రపతి మదనపల్లె సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమం నిర్మాణానికి శంకుస్థాపన, భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించారు.  ఆశ్రమం లోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. అలాగే విశ్వ విద్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు, 38 పడకల స్వాస్థ్య ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి విద్యాలయంలో 6 నుండి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థులను వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, వృత్తి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మంచి విద్యాలయంలో చదువుతున్నారని, విద్యార్థులు తనలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. అంతకు మునుపు సత్సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సత్సంగ్ ఫౌండేషన్ కు రావడం సంతోశంగా ఉందని, సత్సంగ్ నిర్వాహకులు తమ విద్యార్థుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాల వైపు వెళ్లారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విద్యార్థులు మదనపల్లెకి వచ్చి విద్యను అభ్యసించడం ఈ సంస్థ పై ఉన్న నమ్మకాన్ని తెలుపుతోందన్నారు. ఆ తరువాత భారత రాష్ట్రపతి భారత్ యోగా విద్యాకేంద్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతి రోజు ఉదయం యోగా చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలన్నారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్, అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా, ఎస్.పి సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, పద్మభూషన్ అవార్డ్ గ్రహీత మరియు సత్సంగ్ ఫౌండేర్ ఎం (ముంతాజ్ అలీ) సత్సంగ్ విద్యాలయ డైరెక్టర్ స్టీఫెన్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర హెడ్ కృష్ణ, అధికారులు, విద్యాలయ టీచర్ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.