విశాఖ ఉక్కును ధారాధత్తంచేస్తే ఊరుకోం..


Ens Balu
2
Visakhapatnam
2021-02-16 17:35:04

కాంగ్రెస్ ప్రారంభించిన విశాఖ ఉక్కును ప్రయివేట్ వ్యక్తులకు ధారాధత్తంచేస్తే చూస్తూ ఊరుకోమని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ హెచ్చరించారు.మంగళవారం విశాఖ నగర కాంగ్రెస్,విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శైలజానాథ్ సారధ్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంవద్ద చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ, దాదాపు రెండులక్షల కోట్ల భూములకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును ప్రవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్య మంత్రి జగన్,చేతకాని పార్లమెంటు సభ్యులు కలిసి  ఆంధ్ర రాష్ట్రాన్ని,రాష్ట్ర ప్రజల గౌరవ మర్యాదలని మోడీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని  విమర్శించారు. పోస్కో కంపెనీ ప్రతినిధులతో,కేంద్ర ఉక్కు శాఖామంత్రితో మాట్లాడింది నిజం కదా అని ఘాటుగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ ఉద్యమం నుంచి ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకే జీవీఎంసీ ఎన్నికలను ప్రకటించారన్నారు. విశాఖ ఉక్కు కాంగ్రెస్ ఆంధ్రులకు ఇచ్చిన కానుక అని ఇష్టారీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు.ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొని పోరాడాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసి,పీ.వీ.నరసింహారావు జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కును దాదాపు ప్రపంచదేశాల్లో వెలివేసిన పోస్కోకు కట్టపెట్టడం మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్టగా అభివర్ణించారు.మాజీ కేంద్ర మంత్రి జెడీ.శీలం మాట్లాడుతూ, విశాఖ ఉక్కు 32మంది ఆంధ్రుల ప్రాణత్యాగంతో సాధించుకున్నదని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటామన్నారు.పీసీసీ ప్రధానకార్యాదర్శి జిఏ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెచప్పుడైనా విశాఖ ఉక్కును ప్రాణత్యాగం చేసైనా కాపాడుకుంటామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ బెంగాల్, ఛత్తీస్ గఢ్,ఒరిస్సా రాష్టాల్లో తన్ని తరిమేస్తే విశాఖ ఉక్కును దోచుకోవడానికి పోస్కో కుట్రపన్నిందన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా స్పందించింది ముందు కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖ ఉక్కును ప్రవేటీకరణ చెయ్యడం వలన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు.రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు పేడాడ రమణి కుమారి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వల్ల దాదాపు లక్షలాది మంది రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేసారు.అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీరామ మూర్తి మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని,నష్టాల పేరుచెప్పి ప్రవేటు వ్యక్తులకు ధారపోస్తే చూస్తూ  ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు భోగి రమణ మాట్లాడుతూ ఇప్పటికైనా విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గకపోతే ఆంధ్రుల పౌరుషాన్ని మోడీకి రుచిచూపిస్తామన్నారు.విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ గోవింద రాజు మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలమేరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాసరావు,మూల వెంకటరావు,బొడ్డు శ్రీనివాస్,నూనెలపోలరావు,శేషంశ్రీనివాస్,తుమ్మల త్రినాధరావు, సుధాకర్,బొడ్డు సత్యవతి,ఆర్.శ్రీనివాసరావు,రాజులునాయుడు,తమ్మిన నాయుడు  పరదేశి, ఇంకా జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు,పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,మహిళలు పాల్గొని విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.