భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓనెంబరు 2 మాయని మచ్చలా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శిల నిరసనకు కారణమైంది. ప్రభుత్వం విడుదల చేసి జిఓ నెంబరు 110, 149లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఇపుడు వాటికి విరుద్ధంగా జీఓనెంబరు2 విడుదల చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా వున్న 15003 సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ప్రభుత్వంపై గుర్రుగా మారడానికి ప్రధాన కారణమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థను మెచ్చుకొని వారి రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించిన తరుణంతో జీఓ నెంబరు-2, 73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అసలు సచివాలయ వ్యవస్థే దండగ అని వ్యాఖ్యానించేలా చేసిందంటే ఇంతకంటే చెడ్డపేరు మరొకటి లేదనే వాదన తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను కీలకం చేయాలని భావించి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2 వలన ఇపుడు కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ జీఓ విడుదల సమయంలోనే డిగ్రీ చదివి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఇంటర్ మాత్రమే పాసైన వీఆర్వోల వద్ద పనిచేయడం ఇబ్బందిగా ఫీలవుతున్నారనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా తెలియజేసింది. అదే విషయాన్ని ఇపుడు రాష్ట్ర హైకోర్టు కూడా ఈ జీఓ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశం అయ్యింది. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న అభివ్రుద్ధిని, లోపాలను ప్రజల ముందుంచే ఈఎన్ఎస్ చెప్పినట్టుగా అన్ని జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ మొన్నటి వరకూ గ్రామస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ లుగా వున్న వారిని ఖాళీలును భర్తీ చేయడానికి ప్రభుత్వం వారికి ప్రమోషన్లు కల్పించి వీఆర్వోలను చేసింది. ఆపై వెంటనే జీఓ 2 ఇవ్వడంతో డిడిఓగా వీఆర్వోలు మారిపోయారు..దీనితో అప్పటి వరకూ పంచాయతీలను పరిపాలిస్తున్న కార్యదర్శిలు, సర్పంచ్ ల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. దీనితో గుంటూరు జిల్లాకి చెందిన సర్పంచ్ క్రిష్ణమోహన్ హైకోర్టులో వాజ్యం వేయడంతో వాదనలు విన్న హైకోర్టు అసలు పంచాయతీలు ఉండగా ఇక సచివాలయాలు ఎందుకున్న అని ప్రశ్నించడం, కార్యదర్శిలు హక్కులు, అధికారాలు లాగేస్తారని అని ప్రభుత్వ జీపీని ప్రశ్నించడం..అది కాస్తా పతాక శీర్షిక మీడియాలో రావడంతో సచివాలయ వ్యవస్థ ఆదిలోనే కనుమరుగ వుతుందనే భయాన్ని కూడా కలుగ జేసింది. అటు గతంలో నుంచి పంచాయతీ కార్యదర్శిలుగా ఉన్నవారు కూడా తమ ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టడంతో...ప్రభుత్వం మొన్నటికి మొన్న ఉద్యోగుల జీతాల పేరుతో రెండు నెలలు డిడిఓలుగా పంచాయతీ కార్యదర్శిలే ఉంటారు..అదీ కూడా ఉద్యోగుల జీతాలకు సమస్యలు వాటిల్ల కూడదని ఓ మెట్టు దిగి జీఓ2 కి ప్రత్యామ్నాయ ఉత్తర్వులు జారీచేసింది. ఆపై ఇపుడు కోర్డులో జీఓ2పై వాదనలు జరగడం, ప్రభుత్వం నుంచి కోర్టుకి సరైన వివరణ లేకపోవడంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏడాదిన్నరకే పురిటి కష్టాలు మొదలైనట్టు అయ్యింది. వాస్తవానికి ఒక ప్రభుత్వ శాఖలో ఏదైనా జీఓ జారీచేసే సమయంలో ఆటుపోట్లను, రాజ్యాంగ సవరణలను, గతంలో ఇచ్చిన జీఓల అమలను అన్నింటినీ బేరీజు వేసుకొని కొత్త జీఓలు జారీ చేస్తారు. అలాకాకుండా పంచాయతీలకు, గ్రామసచివాలయాలకు డిడిఓలుగా వీఆర్వోలను చేస్తూ వచ్చిన ఈ జిఓ విషయంలో పెద్ద రచ్చే జరిగి చివరకి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగులు కోపం పెంచుకునేలా చేశాయి. సచివాలయ వ్యవస్థపై ఆదిలోనే మచ్చపడేలా చేశాయి. ఈ క్రమంలో కోర్టులో పెండింగ్ లో వున్న తీర్పు ఏ విధంగా వస్తుందనేది ఆశక్తి కరంగా మారింది..!