ఎన్ఈపీ విజయవంతం అందరి బాధ్యత..


Ens Balu
4
Tadepalle
2021-06-17 15:46:10

రాష్ట్రంలో అమలు చేయనున్న జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందని రాష్ట్ర ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందే ఢిల్లీలో పర్యటించి, అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేని ప్రైవేటు పాఠశాలలో అప్పో సప్పో చేసి తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్చుతున్నారన్నారు. ఇవన్నీ గమనించే... జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీర్ఘకాలిక విజన్ తో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్ర ఏకపక్షంగా వ్యవహరించదని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయుల తనను సంప్రందించొచ్చునన్నారు. జాతీయ విద్యా విధానంపై తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కు సూచించారు.


ఎన్ఈపీని స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు.. 
అంతకుముందు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తెలుసుకున్నారు. అన్ని సంఘాల నేతలూ జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాడు – నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టిని కొనియాడారు. జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను మంత్రి, విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై వినతలను మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు అందజేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.