ధాన్యం కోసం రూ.1637 కోట్లు చెల్లింపు..


Ens Balu
2
Tadepalle
2021-06-18 14:13:20

రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతుల నుండి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకూ రూ. 1637కోట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ ద్వారా చెల్లించామని  పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి, ఆశాఖ కమీషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయ  ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రతి ధాన్యం కొనుగోలు సీజన్ కు ముందు కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తుగా నిధులు విడుదల అవుతుంటాయని కాని ఈసారి నిధులు విడుదలలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1637 కోట్ల రూ.లను పౌరసరఫరాల సంస్థ తీసుకుని రైతులకు చెల్లించడమైందని తెలిపారు.కేంద్రం నుండి 3వేల 299కోట్ల రూ.లు విడుదల కావాల్సి ఉండగా వాటిలో ఈనెల 21వ తేదీన మొదటి త్రైమాసికానికి సంబంధించి 1200 కోట్ల రూ.లను విడుదల చేయనున్నట్టు కేంద్రం నుండి సమాచారం అందిందని శశిధర్ పేర్కొన్నారు.కేంద్ర నిధులు వచ్చేలోగా ధాన్యం అమ్మిన రైతులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి  మరో 500కోట్ల రూ.లను విడుదల చేయగా గత రెండు రోజుల్లో 300కోట్ల రూ.లను రైతులకు చెల్లించగా శనివారం నుండి రోజుకు 200కోట్ల రూ.లను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ధాన్యం అమ్మి 21 రోజులు దాటినా సొమ్మి చెల్లించాల్సిన బకాయిలు 1619కోట్ల రూ.లు ఉన్నాయని వాటిని ఈనెల 21న కేంద్రం నుండి నిధులు రాగానే చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 996కోట్ల రూ.లను కూడా రైతులకు చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని కోన శశిధర్ పేర్కొన్నారు. కాగా గత యేడాది రబీలో 6వేల 331కోట్ల రూ.లతో 34లక్షల 73వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈయేడాది సుమారు 8వేల కోట్లతో 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 28లక్షల 35వేల 447 మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పారు.కరోనా,తుఫాను,ఆకాల వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధికమించి రైతుల నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఇఓ సెక్రటరీ శశిధర్ పేర్కొన్నారు.మెట్ట ప్రాంతాల నుండి తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామని,అంతేగాక అనంతపురం,కడప వంటి రాయలసీమ జిల్లాల నుండి కూడా ధాన్యాన్ని కొంటున్నామని చెప్పారు.అనంతపురం జిల్లా నుండి 16వేల 247 మెట్రిక్ టన్నులు,కడప జిల్లా నుండి 11వేల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పారు.  రైతులెవ్వరూ దళారులు,మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతు భరోసా కేంద్రాలల్లోనే విక్రయించుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.