రూ.267.08 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్లు..


Ens Balu
1
Tadepalle
2021-06-18 14:58:36

కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందన్న నిపుణులు సూచనలను దృష్టిలో పెట్టుకుని 12,187 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ  4,175 కాన్సంట్రేటర్లు.. ఇప్పటికే వచ్చాయని, మిగిలిన 8 వేలు ఈ నెలాఖరుకు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఈ నెల 24వ తేదీన 10 వేల డి టైప్‌ సిలెండర్లు రానున్నాయన్నారు. 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.267.08 కోట్లతో వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 28 లోకేషన్లలో ఆక్సిజన్ ప్లాంట్లు(పీఎస్ఏ)  కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 113 లోకేషన్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందన్నారు. 113 పీఎస్ఏ ప్లాంట్ల కోసం ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామని, ఇందుకోసం 111.65 కోట్లు వ్యయమవుతోందని తెలిపారు. ఈ ప్లాంట్లు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గుర్తించిన మూడు లోకేషన్లలో లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 100 పడకలు పైనున్న 39 ఆసుపత్రుల్లో అదనంగా 10 కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకులను కూడా లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నెలన్నర రోజుల్లో ఈ స్టోరేజ్ అందుబాటులోకి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రూ. 49.31 కోట్లతో అన్ని జిల్లాల్లో 6,151 అదనపు ఆక్సిజన్ బెడ్లను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారన్నారు. డీజీ సెట్లకు రూ.36 కోట్లు, ట్రాన్స్ ఫార్మర్లకు రూ.58 కోట్లు వ్యయం కానున్నాయన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుకు రూ.267.08 కోట్లతో వ్యయంతో చేయనున్నట్లు ఆయన తెలిపారు.