అదనపు పనిగంటల..ఆపై బెదిరింపులు..


Ens Balu
5
Tadepalle
2021-06-20 02:37:14

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తప్పా ప్రభుత్వం మిగిలిన అన్ని శాఖల సిబ్బందికి, అధికారులకు కరోనా సమయంలోనూ కార్యాలయ సమయాల్లో పనిగంటలు తగ్గించింది. కానీ సచివాలయ సిబ్బంది మాత్రం సాధారణ సమయం కంటే అధనపు సమయంతో పాటు సెలవురోజులైన ఆదివారాలు, రెండవ శనివారాలు కూడా విధులు నిర్వహించారు. ఆ సమయంలో అత్యధికంగా రెండు టీకాలు తీసుకున్నా కరోనా వైరస్ భారిన పడి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకకుండా ప్రజలకు టీకాలు వేయించే విషయంలో బెదిరిపులు భరిస్తూ అధికారులు ఇచ్చిన టార్గెట్లు కూడా వీరే పూర్తిచేస్తూ వస్తున్నారు. కష్టం సచివాలయ ఉద్యోగులదైతే జిల్లా కలెక్టర్ల వద్ద తామే తెగ కష్టపడిపోయి టార్గెట్లు రీచ్ అయినట్టు కలరిస్తున్నారు మండల అధికారులు. ఈ తరుణంలో సిబ్బంది అధనంగా పనిచేసిన సమయం, ఆదివారాల్లో విధులు నిర్వహించిన అదనపు సమయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా కరోనా టీకాలు వేసే ప్రాంతాల వద్ద సచివాలయ సిబ్బందికి శానిటైజర్లు గానీ, మాస్కులు గానీ, హేండ్ గ్లౌజులు కాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. ఈ కారణంగానే తాము వైరస్ బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో మూడు రోజులు టీకా వేసే సమయంలో ఉద్యోగులంతా ఉదయం 8గంటలకే టీకా కేంద్రాలకు చేరుకొని సాయంత్రం ఆరు దాటేవరకూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇంతలా ప్రజల కోసం సర్వీసు చేస్తున్నా అధికారులు గుర్తించకపోగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకి రాకపోతే దానికి తామెలా బాధ్యత వహిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ మీరేం చేస్తారో తెలీదు ఎప్పుడు ఎన్ని టీకాలు ఇచ్చినా ఆ లక్ష్యం పూర్తిచేసే బాధ్యత మీదేననే భారం సచివాలయ ఉద్యోగులపై వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు ఉన్నా వారు సమయానికి వచ్చి టీకా వేసి వెళ్లిపోతున్నారు తప్పితే ప్రజలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే భారం సచివాలయ ఉద్యోగులపైనే పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే మీరు ఇంకా ప్రొభిషన్ పీరియడ్ లోనే ఉన్నారని, ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకపోతే మీ ఉద్యోగాలు మధ్యలో తీసేసినా తీసేస్తారని కొన్ని మండలాల్లో అధికారులు బెదిరింపులకు దిగడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వం ప్రజల ప్రాణాల కోసం కష్టపడుతున్న సమయంలో తాము అధనంగా చేస్తున్న పనిగంటలు, పడుతున్న శ్రమను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వేక్సిన్ వేసే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయాలి తప్పితే భారం మొత్తం మాపై వేస్తే తాము ఎలా విధులు నిర్వహించగలని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల పాటు పనిగంటలు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నా తమకు మాత్రం అమలు చేయలేదన్నారు. అలాంటి సమయంలో విధులు నిర్వహించినా ఇపుడు భారం బెదిరింపులు, అధనపు పనిగంటల ఉద్యోగం చేయాల్సి వస్తుందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేక వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.