ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉన్న 17 యూనివర్శిటీల్లో ఏం జరుగుతుందో నేటికీ విద్యార్ధులకు సరైన సమాచారం లేదు..సరైన మీడియా ద్వారా చేరడం లేదు.. అన్ని యూనివర్శిటీలకు వెబ్ సైట్లు వున్న సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందులో ఏర్పాటు చేకపోవడం ఉన్నత విద్యాశాఖ తప్పుల్లో ప్రధానంగా కనిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చుచేసి మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపిస్తుంది తప్పితే అదే మొత్తంతో పీఆర్వోల(మీడియా సెల్) ను యూనివర్శిటీల్లో ఏర్పాటు చేసి సమాచారం సకాలంలో మీడియా ద్వారా అందించే ఏర్పాటు చేయడానికి మొత్రం అటు ప్రభుత్వం, ఇటు వైస్ చాన్సలర్లు తెగ నొప్పులు పడిపోతున్నారు. కేవలం ఒకటి రెండు యూనివర్శిటీల్లో మాత్రం జర్నలిజం విభాగ అధిపతులు మీడియా ద్వారా ప్రెస్ రిలీజ్ లు ఇస్తే తప్పా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు యూనివర్శిటీల సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ యూనివర్శిటీల్లో పీఆర్వో విభాగాలుండాలి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయడంతో ఏపీని 17 యూనివర్శిటీల్లో పీఆర్వో పోస్టులు భర్తీకాకుండా మిగిలిపోయాయి. యూనివర్శిటీ వైస్ చాన్సలర్స్ కి వున్న అధికారాలతో ఔట్ సోర్సింగ్ లేదా, కాంట్రాక్టు విధానంలో పీఆర్వోలను నియమించుకునే అవకాశం వున్నప్పటికీ ఆ కీలకమై పోస్టులను భర్తీచేయకుండా వదిలేశారు. దీనితో యూనివర్శిటీల్లో ఏం జరుగుతుందో(విద్య, వసతులు, కోర్సులు, పరీక్షలు, ఫలితాలు) విద్యార్ధులకు తల్లిదండ్రులకు తెలియకుండా పోతుంది. ఈ విషయంలో ఉన్నతవిద్యా శాఖ అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోతుంది. ఇటు యూనివర్శిటీ విసిల నియామకాలు కూడా ప్రభుత్వంలోని రాజకీయనాయకులతో ముడిపడి వుండటంతో తమ పోస్టుల నియమాకాల కోసమే చూస్తున్నారు తప్పితే యూనివర్శిటీలో ఏం జరుగుతుందో విద్యార్ధులకు తెలియజేయడంలో వైస్ చాన్సలర్లు కూడా తీవ్రస్థాయిలో విఫలం చెందుతున్నారు. ఒకటిరెండు యూనివర్శిటీల్లో మాత్రం వీసిలు ప్రైవేటుగా పీఆర్వోలను ఏర్పాటు చేసి అడపా దడపా మీడియాకి సమాచారం అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పోస్టుల అనుమతి, జీతాల విడుదలకు ఇబ్బందులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇటు విసీలు కూడా తమ సీటు కదలకుండా ఉండేందుకు ఆరాటపడుతున్నారు తప్పితే ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దైర్యం మాత్రం చేయడంలేదు. ఇదిలా వుంటే ప్రైవేటు యూనివర్శిటీలు మాత్రం విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి యూనివర్శిటీల్లో జరిగే సమస్త సమాచారాన్ని న్యూస్ ఛానళ్లు, పత్రికలు, లోకల్ కేబుల్ టీవీలు, మొబైల్ న్యూస్ యాప్ లకు ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేసుకొని విద్యావ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మలచుకుంటున్నారు. ఈ విషయాన్ని విసిలు సైతం ఉన్నత విద్యాశాఖ ద్రుష్టికి తీసుకెళ్లి తమ తమ యూనివర్శిటీల్లో మీడియా సెల్ ఏర్పాటుకి మాత్రం దైర్యం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అద్యాపకులు లేని ప్రభుత్వ యూనివర్శిటీల్లో చేరేందుకు విద్యార్ధులు మొగ్గు చూపడం లేదు. రేపు యూనివర్శిటీ సమాచారం తెలియజేసే ఏర్పాటు చేయకపోతే ఉన్న ఆ విద్యార్ధులకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.