కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియకు వైద్య సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ ఆదేశించారు. కోవిడ్ వాక్సినేషన్ పై కోల్డ్ చైన్ బృందాలలో గల ఫార్మసిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం శిక్షణా కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్ర నాయక్ మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ పూర్తిగా కొత్త విధానంలో పంపిణీ జరుగుతుందన్నారు. వాక్సిన్ విధి విధానాలు ప్రభుత్వం నుండి ఇంకా రావలసి ఉందని, దీనిపై అనుసరించాల్సిన అంశాలపై ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం నుండి అందిన వాక్సిన్ మానిటరింగ్ విధానానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన ఇచ్చే ప్రతి కేంద్రంలో వాక్సిన్ ఇచ్చే గదితో పాటు వేచి ఉండు గది, అబ్జర్వేషన్ గది ఉండాలని ఆయన తెలిపారు. వాక్సిన్ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు విధిగా ఉండాలని పేర్కొన్నారు. వాక్సిన్ గది లోకి ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు వేరుగా ఉండాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా తప్పులు దొర్లరాదని ఆయన స్పష్టం చేసారు.
కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నందున నిరంతరం ఇచ్చే ఇతర వాక్సినేషన్ నిలుపుదల చేయరాదని చెప్పారు. మొదటి దశలో వైద్య సిబ్బందికి, రెండవ దశలో ఫ్రంట్ లైన్ పనివారలకు, మూడవ దశలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి, 50 సంవత్సరాలు పైబడిన వారికి, అనంతరం 10 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారు, అటుపిమ్మట సాధారణ పౌరులకు వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది అద్భుతమైన సేవలు అందించారని ప్రశంసించారు. రెండవ దశ వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి గుర్తించాలని, ఐరోపా దేశాల్లో మరల లాక్ డౌన్ ప్రకటించిన విషయం విదితమేనని ఆయన అన్నారు. కరోనా అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, మానవ సంబంధాలను కూడా దెబ్బతీసిందని పేర్కొ లేకుండా దీనిని పూర్తిగా నివారించి సాధారణ సమాజం నెలకొనే వరకు ఆరోగ్య సిబ్బంది సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. వాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని, పూర్తి జాగ్రత్తలు పాటించి వాక్సినేషన్ ఇవ్వాలని ఆయన అన్నారు. వాక్సినేషన్ పై చక్కటి అవగాహన పొందాలని సూచించారు. ముందుగా నమోదు చేసుకున్న వ్యక్తికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు.
వాక్సిన్ ఇచ్చిన వ్యక్తిని నిర్దేశిత 30 నిమిషాల సమయం అబ్జర్వేషన్ గదిలో విధిగా ఉంచాలని, వెంటనే ఇంటికి వెళ్లరాదని స్పష్టం చేసారు. వాక్సిన్ ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎంత ఉష్ణోగ్రతలో ఉంచాలి, వాక్సిన్ భద్రపరచే విధానం తదితర విషయాల పట్ల అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్య రీత్యా చేపడుతున్న కార్యక్రమం అని గుర్తుపెట్టుకోవాలని, ఏ చిన్న పొరపాటు అయినా అనర్ధాలకు దారితీస్తుందని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ కు వినియోగించిన పరికరాలను సురక్షితంగా డిస్పోజ్ చేయాలని, సురక్షిత చర్యలు చేపట్టక పోతే అనర్ధాలు, దుష్ప్రభావాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని, వాక్సిన్ ఇచ్చే చోట స్పిరిట్ తో శుభ్రం చేయరాదని, స్టెరైడ్ వాటర్ తో శుభ్రం చేయాలని సూచించారు. వాక్సిన్ ఇచ్చిన చోట రుద్ద రాదని చెప్పారు.
జిల్లా టిబి నివారణ అధికారి డా.ఎన్. అనూరాధ మాట్లాడుతూ వాక్సినేషన్ బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారన్నారు. వాక్సిన్ గదిలోకి ఒక వ్యక్తిని మాత్రమే అనుమతించాలని చెప్పారు. వాక్సినేషన్ కు వచ్చే వారికి నిర్ణీత సమయాన్ని ముందుగా తెలియజేసి ఆ సమయంలో మాత్రమే రావలసినదిగా సూచించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించాలని కోరారు. వాక్సిన్ కార్యక్రమంపై మండల స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతి కుమారి దేవి, ఆర్బిఎస్కె జిల్లా సమన్వయ అధికారి డా.కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల భూ ఆక్రమణలను ప్రభుత్వం ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. అందులో విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఆక్రమించిన రుషికొండ సమీపంలోని గెడ్డ ప్రాంతం విలువైన భూమిని ఇవాళ తెల్లవారు జామున రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న ఆనందపురం మండలంలో దాదాపు 300 ఎకరాలను కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 300 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో భూ ఆక్రమణలంటే ఒంటికాలిపై లేచిన టిడిపి నేతల ఆక్రమణల విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచడంతో భూ ఆక్రమణలు వెలుగు చేస్తున్నాయి. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా వీరి చెరలో వున్న భూములను ప్రభుత్వం వెతికి వెతికి పసిగడుతోంది. దీంతో చాలా మంది టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా రెవిన్యూ అధికారులు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది..
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీఈఎంజేఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రకాశం జిల్లా ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి స్టాఫ్ రిపోర్టర్ కె.వి. సురేష్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్సులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్ లు హాజరయ్యారు. నూతన కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ కుమార్ రెడ్డిని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్, శేషసాయి, ఏపీఈఎంజేఏ జిల్లా అధ్యక్షుడు టీవీ రావు, ఎంసీఏ అధ్యక్షుడు ఇఫ్తికర్, జిల్లాలోని వివిధ ఛానళ్ల స్టాఫ్ రిపోర్టర్లు కె.శ్రీనివాసరావు, జయరాం, మురళి, మండవ ప్రసాద్, బొడ్డు శ్రీను తదితరులు అభినందించారు.
రాష్ట్రకార్యవిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు తరలించిన మీదట అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని రాజ్యసభసభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి జర్నలిస్టుల ప్రతినిధి బృందానికి స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం లోకల్ న్యూస్ పేపర్స్ అసోషియేయన్( ఎల్‌ఎన్‌ఏ) ప్రతినిధి బృందం ఆయనను కలిసి జర్నలిస్టులకు డిసెంబర్ 25నాటికి బిపిఎల్ వారితో పాటు 200 చదరపు గజాల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్‌జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలోనూ, ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఇళ్లస్థలాల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టులకు, ఎంఎల్‌ఏలకు ఇళ్లస్థలాలు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారని డిసెంబర్ 25నాటికి సాధ్యం కాదని తెలిపారు. రాజధాని తరలింపు తరువాతే ఇళ్లస్థలాలు ఇస్తారన్నారు. అంతకంటే ముందు జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందాలని, వాటిలో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఆయనను కలిసిన జర్నలిస్టుబృందంలో ఎల్‌ఎన్‌ఏ అధ్యక్షకార్యదర్శులు పి.సత్యనారాయణ,దవిళేశ్వరపు రవికుమార్, సీనియర్ జర్నలిస్టులు నిట్టల శ్రీనివాస్, బి.శివప్రసాద్, ఎస్.సన్యాసిరావు, ప్రతినిధులు పట్టెపు నాగేశ్వరరావు, బి.నారాయణరావు, పరశురామ్, ఎం.శ్రీహరి, రామ్‌మోహన్ రావు, చక్రి,తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. దీనిలో భాగంగా ఆదివారం స్థానిక గుంకలాం లేఅవుట్ ను కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో, విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జిసి కిశోర్‌కుమార్, డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పరీశీలించారు. ముఖ్యమంత్రి లేండ్ అయ్యే హెలీపాడ్ స్థలాన్ని, పైలాన్ నిర్మించే చోటును, బహిరంగ సభా వేదికను, ఆర్చ్‌లను ఏర్పాటు చేసే స్థలాలపై చర్చించారు. మ్యాప్‌లను పరిశీలించారు. ఆయా స్థలాలను పరిశీలించి ఖరారు చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీని, గృహనిర్మాణాల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు.
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ః ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా గుంకలాం లేఅవుట్‌లో సుమారు 15,500 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇది నిరంతర కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష టిడిపి ఎన్నో కుయుక్తులు పన్నినప్పటికీ, ముఖ్యమంత్రి ధృడ సంకల్పంతో ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఈనెల 25న ప్రారంభం అవుతుందని చెప్పారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాలో 30వ తేదీన జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని కోలగట్ల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, తాశీల్దార్ ప్రభాకరరావు, ఎంపిడిఓ చైనులు, సిఐ టిఎస్ మంగవేణి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కెవి సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములనాయుడు, జి.ఈశ్వర్ కౌషిక్, ఆశపువేణు, బంగారునాయుడు తదతరులు పాల్గొన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు ఏఎస్ఆర్ నగర్ లో టిడ్కో గృహ సముదాయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి సమన్వయకర్త కె కె రాజు వినతిపత్రం అందచేశారు. ఉత్తర నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల జీవనోపాధి దృష్ట్యా, టిడ్కో గృహ సముదాయం, నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుని కోరారు. అంతేకాకుండా నియోజకవర్గానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలన్నారు. తమ ప్రాంతంలో ప్రజలు ప్రతీ చిన్న రోగానికి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ప్రజల ఆరోగ్య కష్టాలు తీరాలంటే పీహెచ్సీ నిర్మాణం జరగాల్సి వుందని ఎంపీని కోరారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం సామాజిక భవనాల నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం డాబాగార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ గ్రామ , వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా నెరవేరిందని అన్నారు. భారతదేశంలో ప్రజల ఇంటిముంగటే సేవలు చేసే ఒక మహత్తరమైన వ్యవస్థను సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి గ్రామ ,వార్డ్ సచివాలయం ఉద్యోగుల ఫెడరేషన్ కు తనను గౌరవ అధ్యక్షులు గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా ఉద్యోగుల భవిష్యత్ కు మేలు జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి , దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
సజీవ దహనమైన వికలాంగ యువతి, వాలంటీర్ భువనేశ్వరి కుటుంబానికి న్యాయం చేస్తామని ఏపి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఒంగోలు ఆమె కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా చైర్ పర్శన్ మాట్లాడుతూ, ఈ ఘటన పై కూలంకుషంగా విచారణ జరపాలని జిల్లా పోలీసు అధికారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. అంతేకాకుండా విచారణ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకు వెళతామని భువనేశ్వరి కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తామని వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు. పాక్షికంగా వికలాంగురాలైన భువనేశ్వరి అక్క కు పూర్తి మెరుగైన వైద్యం అందే విధంగా చూస్తామని, ఈమేరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను కోరనున్నట్టు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్న ఆమె ఈ తరహా సంఘటనలు మరోసా జరగకుండా చర్యులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2021-22 సంవత్సరానికి జర్నలిస్ట్ లకు క్రొత్త అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ కొరకు గతంలో ఆన్ లైన్లో సమర్పించిన ధరఖాస్తులలో సవరణలు, పేరు మార్పులు, చేర్పులు నమోదు చేసేందకు, అప్ లోడ్ చేయని అర్హత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ సమాచార శాఖ అక్రిడిటేషన్ల వెబ్ సైట్ http://ipr.ap.gov.in/login జర్నలిస్ట్ లాగిన్, రిజిష్ట్రేషన్ లను మరో మారు ఓపెన్ చేయడం జరిగిందని ఆ శాఖ డిప్యూటి డైరక్టర్(ఐ/సి) ఎల్.స్వర్ణలత ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున తూర్పు గోదావరి జిల్లాలోని మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులు తమ సవరణలు, మార్పులు, చేర్పులు, గతంలో అప్ లోడ్ చేయని అర్హత డాక్యుమెంట్లను ఈ నెల 24వ తేదీలోపున తప్పని సరిగా నమోదు చేసుకోవాలని ఆమె తెలిజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ 24వ తేదీ వరకూ అందిన ధరఖాస్తులపై పరిశీలన జరిపి జనవరి 1 తేదీ నాటికి క్రొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. అక్రిడిటేషన్ జారీకి అవసరమైన కనీస అర్హతలు, సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, అక్రిడిటేషన్ జిఓ నెం.142 వివరాలు వెబ్ సైట్ లాగిన్ పేజీలో అందుబాటులో ఉన్నాయని, వాటిని క్షణ్ణంగా తెలుసుకుని అవసరమైన వ్యక్తిగత, సంస్థ సమాచారాన్ని ఆన్ లైన్ ఫారమ్ లో పొందుపరిచి, నిర్థేశిత డాక్టుమెంట్లన్నిటినీ విధిగా పిడిఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుదని తెలిపారు. పూర్తి సమాచారం, పిడిఎఫ్ ఫార్మట్ లో అన్ని నిర్థేశిత డాక్యుమెంట్లు సమర్పించని ధరఖాస్తులను పెండింగ్ లో ఉంచడం లేదా తిరస్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున గతంలో ఆన్ లైన్లో ధరఖాస్తు చేసిన జర్నలిస్ట్ లు అందరూ తమ లాగిన్ ద్వారా వెబ్ సైట్ లో తాము నమోదు చేసిన సమాచారాన్ని, పిడిఎఫ్ డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలని, ఇదివరకూ సమర్పించని సమాచారం,డాక్యుమెంట్లను నమోదు చేసి వాటి హార్డు కాపీలను 24వ తేదీలోపున కాకినాడలోని తమ కార్యాలయంలో సమర్పించాలని తెలియజేశారు. అలాగే మీడియా సంస్థలు గతంలో ఇచ్చిన తమ ప్రతినిధుల జాబితాలలో పేరు మార్పులు, చేర్పులు చేయదలిస్తే, ఎవరి స్థానంలో, ఎవరి పేర ఈ మార్పులు, చేర్పులు జరిపారో స్పష్టంగా తెలిజేస్తూ లెటర్ హెడ్ పై సవివరమైన జాబితాను ఈ నెల 24వ తేదీ లోపున అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ మార్పులు, చేర్పులు జాబితాలలో క్రొత్తగా ప్రతిపాదించిన జర్నలిస్ట్లులు 24వ తేదీ లోపునే ఆన్ లైన్లో సమాచారం, డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి హార్డు కాపీలు అందజేయాలని తెలిపారు. ఏబిసి, ఆర్ఎన్ఐ సర్క్యులేషన్ లేని దినపత్రికలు చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ తో పాటు గత 2 సంవత్సరాల జిఎస్టి రిటర్ను, న్యూస్ ప్రింట్ పర్చేజి ఫ్రూఫ్ జిఎస్టి రిటర్నులు సమర్పించాలని, కేవలం జిఎస్టి రిజిష్టేషన్ పత్రం సమర్పిస్తే చాలదని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సాటిలైట్ ఛానళ్లు ఐ అండ్ బి పర్మిషన్ పత్రం, ఐ అండ్ బి కి సమర్పించిన తాజా యాన్యువల్ రిటర్న్ కాపీలను విధిగా సమర్పించాల్సి ఉందన్నారు. అలాగే కేబుల్ టివిలు 24.12.2020 నాటికి వాలిడిటీ ఉన్న పోస్టల్ లైసెన్స్ కాపీ, సొంత రన్నింగ్ కేబుల్ లేని కేబుల్ టివిలు యంఎస్ఓతో అగ్రిమెంటు కాపీని, తమ నెట్ వర్క్ లో ప్రసారం చేస్తున్నట్లు యంఎస్ఓ జారీ చేసిన ట్రాన్స్ మిషన్ సర్టిఫికేటు, గడచిన నెలలో ప్రసారం చేసిన న్యూస్ టెలికాస్ట్ సిడి విధిగా సమర్పించాలన్నారు. న్యూస్ ఎజెన్సీలు ఇతర అర్హత డాక్యుమెంట్లతో పాటు సిఎ జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్, గత రెండేళ్లకు జిఎస్టి, ఇన్ కమ్ టాక్స్ రిటర్నులు తప్పని సరిగా సమర్పిచాలని తెలిపారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ లు 12 తాజా బైలైన్ క్లిప్పింగులు, 10ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ప్రూఫ్ లను, వెటరన్, రిటైర్డు జర్నలిస్టులు డేటా ఆఫ్ బర్త్ ప్రూవ్, 20 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ప్రూఫ్ లను సమర్పించవలసి ఉందని డిప్యూటీ డైరక్టరు స్వర్ణలత తెలియజేశారు. జిల్లాలోని మీడియా సంస్థలు, జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
స్నేక్ సేవర్ సొసైటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్నేక్ సేవర్ సొసైటీ అధ్యక్షలు స్నేక్ కిరణ్ కోరుతున్నారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ నగరపరిధిలో ఎక్కడ పాములు కనిపించినా తమకు ఈనెంబరు ద్వారా 9849140500 తెలియజేస్తే తక్షణమే సదరు ప్రాంతానికి వచ్చి, రెస్క్యూ చేసి సర్పాలను, తద్వారా ప్రజలను రక్షిస్తామని చెప్పారు. విశాఖలో చాలా ప్రాంతాల్లో అరుదైన సర్పజాతులు ఉన్నాయని వాటిని మనం కాపాడుకోవాలన్నారు. పాములు కనిపించిన వెంటనే చంపకుండా తమకు తెలియజేయడం ద్వారా వాటిని పట్టుకొని సురక్షితంగా అడవులలోకి విడిచిపెడతామని వివరించారు. పాములను రక్షించడానికి, ప్రత్యేకంగా స్నేక్ సేవర్ సొసైటీ హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. కనిపించిన పాములను చంపడం ద్వారా చాలా విషపూరిత కీటకాల దాడి నుంచి మనకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. చాలా కీటకాలను పాములు జనావాసాల్లోకి రాకుండా అడ్డుకుంటాయని, వాటిని తినడం ద్వారా మనము చాలా రక్షణ సర్పాల ద్వారానే పొందుతామని చెప్పారు. దానికోసం ఎప్పుడు, ఎక్కడ పాములు కనిపించా తక్షణమే సమాచారం అందించి సర్పాల పరిరక్షణలో స్నేక్ సేవర్ సొసైటీతో భాగస్వాములు కావాలని స్నేక్ సేవర్ కిరణ్ కోరారు.
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్ 2020ని ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. విశాఖలోని పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా గమనించి, పరీక్ష సమర్ధవంతంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఏపిసెట్ ప్రవేశ పరీక్షకు 35,862 మంది దరఖాస్తు చేయగా 26,525 మంది హాజరవగా 9337 మంది గైర్హాజరు అయ్యారు. ఏపిసెట్ ప్రవేశ పరీక్షకు 73.96 శాతం హాజరు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాల ఉదయం 9.30 నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పరీక్ష నిర్వహణ జరిపినట్లు ఏపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు తెలిపారు.
విజయనగరం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. వెక్టర్ బోర్న్ డిసీజెస్ పై జిల్లాస్థాయి వైద్యాధికారులతో శనివారం తన ఛాంబర్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణం మారిన నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. దోమల వ్యాప్తి చెందకుండా మురుగు కుంటలను శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా ప్రకటించి.. వ్యాధులపై సచివాలయ, వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే పాఠశాలలో, వసతి గృహాల్లో దోమతెరలు ఏర్పాటు చేయించాలని చెప్పారు. గ్రామాల్లో దోమతెరలు పంపిణీ చేయాలని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయలని సూచించారు. వైద్య అధికారులు మిగతా శాఖల అధికారులతో సమన్వయంగా వ్యవహరించి దోమలు వ్యాప్తి చెందకుండా, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటింటికీ ఏ.ఎన్.ఎం.లు, వైద్య సిబ్బంది వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో డి.ఎం.& హెచ్.వో. ఎస్.వి.రమణ కుమారి, డి.సి.హెచ్.ఎస్. నాగభూషణ రావు, అదనపు డి.ఎం.&హెచ్.వో.లు రామ్ మోహన్, రవికుమార్, డిప్యూటీ డి.ఎం.&హెచ్.వో.లు చామంతి, రవికుమార్ రెడ్డి, డి.ఎం.వో. తులసీ, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన దృష్ట్యా ఆయా శాఖల జిల్లా అధికారులంతా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి పండగ వాతావారణంలో సి.ఎం. కార్యక్రమం జరిగేలా ఇప్పటి నుండే అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు. జిల్లాలోని విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఈనెల 30న వస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ అధికారులతో కలెక్టర్ శనివారం సమావేశమయ్యారు. పర్యటన ఏర్పాట్లకు తగినంత సమయం వున్నందున ఇప్పటినుండే సిద్ధం కావాలన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించే వేదిక ప్రాంతాన్ని చదును చేయడం, ముళ్ల పొదలను తొలగించడం, సర్వే రాళ్లు వేయించడం తదితర పనులు పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ కు సూచించారు. కొందరు సమర్ధులైన రెవిన్యూ ఉద్యోగులను గుర్తించి బ్లాకుల వారీగా వారికి ఆయా ప్రాంతాన్ని పరిశుభ్రంగా రూపొందించే బాధ్యతలు అప్పగించాలన్నారు.
ఏడు యంత్రాల సహాయంతో నేల చదును చేసే పనులు, ముళ్ల పొదలు తొలగించే పనులు చేపడుతున్నామని, రెండు రోజుల్లో ఆ ప్రాంతాన్ని చదును చేయడం పూర్తిచేస్తామని జె.సి. తెలిపారు. గుంకలాం లే అవుట్ మొత్తం మళ్లీ కొలతలు వేసి సర్వే రాళ్లు వేయించే పనులు చేపడతామని రెవిన్యూ డివిజనల్ అధికారి బిహెచ్.భవానీ శంకర్ చెప్పారు. వై.ఎస్.ఆర్.గృహనిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించే ఇళ్ల నమూనాలు ప్రదర్శించేందుకు రెండు మోడల్ ఇళ్లను నిర్మిస్తామని గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.వి.రమణమూర్తి చెప్పారు. ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్‌ను కూడా సిద్ధం చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లోగోతో ఒక స్వాగత ద్వారం(ఆర్చి) నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. మోడల్ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచినట్లయితే భద్రత అధికారుల సూచనల మేరకు ఎక్కడ నిర్మించాలో తెలియజేస్తామన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని డి.పి.ఆర్.ఓ.రమేష్ కు కలెక్టర్ ఆదేశించారు. హరిత విజయనగరం కార్యక్రమాలకు సంబంధించిన వేదిక ప్రాంతంలో స్పష్టంగా కనిపించేలా లోగోను ప్రదర్శించడంతోపాటు చెరువుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను తెలియజెప్పేలా ఏర్పాట్లు చేయాలని మునిసిపల్ కమిషనర్ వర్మకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్ విధులతో పాటు ఆహ్వానపత్రాల తయారీ, పంపిణీ, ముఖ్యమంత్రి పర్యటన విధుల కేటాయింపు వంటి పనులు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించడంతోపాటు, గుంకలాం లే అవుట్ నమూనాను ఆకర్షణీయంగా, సులువుగా అర్ధమయ్యే రీతిలో రూపొందించి ప్రదర్శించాలని ముఖ్య ప్రణాళిక అధికారి విజయలక్ష్మికి సూచించారు. సభకు ఏయే ప్రాంతాల నుండి ఎంతమంది హాజరు అవుతారనే విషయాన్ని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) వెంకటరావుకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా,ఆర్.మహేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకెరాజు కార్యకర్తలను కోరారు. శనివారం ఈ మేరకు విశాఖలోని తన కార్యాలయంలో రక్తదాన శిభిరానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం ద్వారా నలుగురు ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినట్టు వివరించారు. రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగు పడటంతోపాటు, ఆపద సమయంలో వున్నవారి ప్రాణాలను కాపాడటానికి వీలుపడుతుందన్నారు. రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా యువత ముందుకి రావాలని కెకెరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు, కార్పోరేటర్ అభ్యర్ధులు నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద జరుపుతున్న రీ సర్వే కార్యక్రమంపై ముందుగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు సర్వే వలన కలిగే లాభాలను గురించి అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్( రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ )నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా డివిజన్ ,మండల స్థాయి అధికారులు ,మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న అన్ని లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి పట్టాల పంపిణీ కొరకు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఒక గ్రామం ఎంపిక చేసి అందులో రీ సర్వే పై గ్రామ సభ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మొదటి విడతగా చేపట్టిన 311 గ్రామాల్లో గ్రామ సర్వేయర్ , వాలం టీర్లు, విలేజి సర్వేయర్లు, మండల సర్వేయర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ , డిప్యూటీ తాసిల్దార్ , తాసిల్దారుల ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న రీ సర్వే పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 249 గ్రామాల్లో అవగాహన సదస్సులు పూర్తయ్యాయని మిగిలిన 62 గ్రామాలలో సోమవారం నాటికి సంబంధిత తాసిల్దార్ లు గ్రామ సభ లు పూర్తిచేయాలని తెలిపారు.
ముఖ్యంగా మొదటి విడతలో ఎంపికైన 311 గ్రామాల్లో "ఎఫ్" లైన్ లో పట్టా సబ్ డివిజన్లు, స్పందన అర్జీ లు మరియు సీఎంఓ ఆర్జీలన్నివెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ పొలాల్లో గట్లకు సున్నం వేయడం మరియు సర్వే రాళ్లకు వైట్ వాష్ చేయడం మరియు విలేజ్ సైట్లలో ప్రతి ఇంటికి సున్నం మార్క్ ను పంచాయతీ సెక్రటరీ ద్వారా గుర్తించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీలలో వార్డు ప్రణాళిక కార్యదర్శులు, విఆర్వోలు సున్నం మార్కులు ప్రతి ఇంటికి వేయాల్సి ఉంటుందన్నారు. మొదటి విడతలో ఎంపికచేసిన గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు గ్రామం లో రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని , మన జిల్లాలో ఈ నెల 22న పెనుకొండ డివిజన్ సోమందే పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అందువల్ల రెవెన్యూ, సర్వే వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే కార్యక్రమంలో పోలీసు శాఖ కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గాయత్రీదేవి, ఓ ఎస్ డి ఆర్ కే ప్రసాద్ ,ఏడి సర్వే అండ్ ల్యాండ్ మచ్చింద్ర ,హౌసింగ్ పిడి వెంకటేశ్వర రెడ్డి, జడ్పీ సీఈవో శోభ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.