1 ENS Live Breaking News

ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 14న అప్పన్న చందనోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి, ఈఓ సూర్యకళ, ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ ప్రభావం, దేశంలో పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలమేరకు చందనోత్సవం  ఏకాంతంగానే నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజను నిజరూప స్వామి ఎదురుగా నిర్వహించాలని నిర్ణయించారు. సంప్రదాయం ప్రకారం శ్రీ స్వామివారి చందనోత్సవం రోజున అంటే (14-05-21), వైశాఖ పౌర్ణమిరోజున, జ్యేష్ఠ పౌర్ణమిరోజున, ఆషాడ పౌర్ణమి రోజున మొత్తం నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. ఈ చందన సమర్పణలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్  11257208642, IFCS code SBIN 0002795కు గాని భక్తులు విరాళాలు పంపించవచ్చని అధికారులు తెలియజేశారు. అర కేజీ చందనం సమర్పణకోసం రూ. 10,116 (పదివేల నూటపదహార్లు), కేజీ  చందన సమర్పణకోసం రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు)    భక్తులు పై అకౌంట్ కు పంపించవచ్చునన్నారు. చందన సమర్పణకోసం డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ , ఫొటో తీసి ,  అడ్రస్ పంపాలని అధికారులు కోరారు. అరకేజీ చందనం సమర్పించేవారికి చందనం ముక్కలను ప్రసాదంగా పంపిస్తామని తెలిపారు.  కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116)అదనంగా  స్వామివారి శేషవస్త్రం ముక్క కూడా పోస్టు ద్వారా పంపించనున్నట్టు వివరించారు. భక్తులు తమ విరాళాలను 13-05-21 (గురువారం) లోగా పంపించాలన్న అధికారులు ఎంత చందనాన్నైనా భక్తులు స్వామివారికి సమర్పించ వచ్చునని చెప్పారు.  స్వామివారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియజేశారు.

  విరాళములు రూ.1116 (వెయ్యి నూటపదహార్లు)  శ్రీస్వామివారి చందనోత్సవ ప్రత్యేక పూజకు పంపిచే భక్తులు  గోత్రనామములతో పూజలు జరపించబడును. ఈ విరాళాలు సర్పించిన వారు సైతం స్క్రీన్ షాట్, ఫొటో తీసి, అడ్రస్, గోత్రనామాలు పంపించాల్సి ఉంటుంది.  భక్తులు ఈ అరుదైన, స్వామివారికి  అత్యంత ప్రీతిపాత్రమైన  చందనోత్సవంలో భాగస్వాములై, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అధికారులు  విజ్ఞప్తి చేస్తున్నారు.

సింహాచలం

2021-05-03 14:48:11

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం..

తిరుమలలోని ఎస్వీబీసీ ట్రస్టుకి ఆదివారం రూ.కోటి విరాళం అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సం‌స్థ ప్ర‌తినిధులు ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై దాత విరాళం డిడిని అద‌న‌పు ఈవో,  ఎస్వీబీసీ ఎండి ఏ.వి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి కార్యక్రమాలు ఎస్వీబీసీ ద్వారా అన్ని భాషల్లోనూ భక్తులకు చేరేలా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దాతలు, టిటిడి సిబ్బంది డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తిరుమల

2021-05-02 07:47:40

BSNLసీఎండీ డికెపర్వాన్ త్వరగా కోలుకోవాలి..

బీఎస్ఎన్ఎన్ఎల్ సీఎండీ డి.కెపర్వాన్ కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకొని, విధులకు హాజరు కావాలని భారతీయ టెలీకాం ఎంప్లాయిస్ యూనియన్(బీఎస్ఎన్ఎల్), భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) జాతీయ అధ్యక్షులు వివిఎస్.సత్యన్నారాయణ ఆకాంక్షించారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, బిఎస్ఎన్ఎల్ లో చాలా మంది ఫీల్డు ఉద్యోగులు నేడు కోవిడ్ పాజిటివ్ తో బాధ పడుతున్నారన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తక్షణ సదుపాయక కలుగజేయడానికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. అలా చేయడం ద్వారా ఉద్యోగులకు భరోసా ఏర్పడుతుందన్నారు. చాలా మంది ఫీల్డు సిబ్బంది కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా మిగిలిన ఉద్యోగులతో కలిసి పనిచేయడం ఇబ్బంది కరంగా మారుతుందని, దీనిని యాజమాన్యం, ప్రభుత్వం ద్రుష్టిలో ఉంచుకొని బీఎస్ఎన్ఎల్ లో విధులు నిర్వహిస్తున్నవారికి ఎవరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం తక్షణమే అందించాలన్నారు. సీఎండీ త్వరగా కోలుకోవడం ద్వారా ఉద్యోగులకు, సిబ్బందికి విధి నిర్వహణలో  చురుకుగా పాల్గొనడానికి, ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని వివిఎస్. సత్యన్నారాయణ తెలియజేశారు.

2021-04-28 15:03:05

శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం..

తిరుమల శ్రీవారికి ఆదివారం టయోటా ఇన్నోవా కారు విరాళంగా అందింది. హర్ష టయోటా సంస్థ తరఫున టిటిడి బోర్డు మాజీ సభ్యులు  భానుప్రకాష్ రెడ్డి  దాదాపు రూ.20 లక్షల విలువైన కారును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ  హరీంద్రనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమల

2021-04-25 13:24:22

శ్రీవారి సేవలు నిలుపుదల..

దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు శ్రీవారి సేవకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు ప్రకటన విడుదల చేసింది. తదుపరి శ్రీవారి సేవ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది ముందుగానే తెలియజేయగలము. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో శ్రీవారి సేవకు రాదలచిన భక్తులు ఈ మార్పు గమనించి తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల టిటిడి అధికారులు కోరుతున్నారు.

తిరుమల

2021-04-20 17:46:21

ఆ విధానంతో ఎవరి ఓటు వారే వేస్తారు..

కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓటర్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్‌సభలో బుధవారం సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.మరోవైపు తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు పెరుగుతూనే వస్తున్నారు. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించడంలో విఫలం అవుతూనే వస్తుంది. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది.

New Delhi

2021-03-17 21:56:11

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు..

కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ముందుగా పీఎఫ్ రాష్ట్ర అదనపు కమిషనర్, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సెక్రటరీ కృష్ణచౌదరి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగక ముందు 2013లో హైదరాబాదులో ఈపీఎఫ్ సమావేశం జరిగిందన్నారు. ఎనిమిదేళ్ల తరవాత ప్రాంతీయ సమావేశం జరుగుతోందన్నారు. ప్రావిడెంట్ ఫండ్ వివరాలతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన వివరించారు. పీఎఫ్ పొందే సమయంలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాలను తెలిపారు. రాష్ఠ్ర విభజన తరవాత విజయవాడకు ఈపీఎఫ్ జోనల్ కార్యాలయం తరలొచ్చిందని, గుంటూరు, కడప, రాజమండ్రి, విశాఖపట్నం నగరాల్లో రీజనల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని పీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. కొవిడ్ కాలంలో అత్యవసర విభాగం కింద  కార్యకలాపాలను కొనసాగించామన్నారు. ఈపీఎఫ్ విధానంలో ఉన్న ప్రయోజనాలను అధికారులు కమిటీకి వివరించారు. రాష్ట్ర విభజన తరవాత కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం నిర్వహించడంపై ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి ఆనందం వ్యక్తంచేశారు. కార్మికుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడంతో వారికి కార్మిక భవిష్యనిధి ప్రయోజనాలు అందజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన భవిష్యనిధి ప్రయోజనాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. భవిష్యనిధి రుణాలు, పింఛన్లు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఛైర్ పర్సన్ ఉదయలక్ష్మి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఆర్ధికశాఖ సంయుక్త కార్యదర్శి కె.ఆదినారాయణ, కార్మికశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ, నాలుగు జోన్ల రీజనల్ కమిషనర్లు కుందన్ అలోక్, టి.ఇందిర, సునీల్ కుమార్ దేబ్, వెంకట సుబ్బయ్య ,ఉద్యోగ, కార్మిక, వ్యాపార యాజమాన్య సంఘాల ప్రతినిధులు భాస్కరరావు, పార్ధ సారధి, రాజశేఖర్, గణపతి రెడ్డి, ముత్యాలు, సతీష్ మాదున్యా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2021-03-17 21:51:10

రూ.1860 కోట్ల ఈఎస్ఐ ఆసుపత్రి..

రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఆపరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాకు మరో కేంద్ర పథకం ప్రాజెక్టు మంజూరయింది. రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి  సంతోష్ కుమార్ గంగ్వార్ ను కలిసి ఈ మేరకు ప్రాజెక్టును మంజూరు చేయించారు. ఈ మేరకు గోపాలపురం నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ మంజూరు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి ఎంపీ మార్గాని భరత్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. రాజమహేంద్రి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారికి సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ పరిధిలో కూడా పలు క్వారీలు  పరిశ్రమలు ఉండటం, పట్టణ గ్రామీణ ప్రజలు, కార్మికులు అధికశాతం ఉన్న నేపథ్యంలో  గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కృషి చేయడంతో కేంద్ర మంత్రివర్యులు గాంగ్వర్ కు విజ్ఞప్తి చేయడంతో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరైనట్టు ఎంపీ భరత్ రామ్ వివరించారు. సుమారు రు. 1860 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతున్న  కొవ్వూరు గుండుగొలను జాతీయ రహదారి పరీవాహ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఎంతో మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఆసుపత్రి వల్ల వైద్య సదుపాయాలు అందుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  నిత్యం విపరీతమైన ట్రాఫిక్ రద్దీ తో ఉండే ఈ ప్రాంతంలో ఈ ఆసుపత్రి నిర్మాణం ఎంతో అందుబాటులో ఉంటుందని ఎంపీ వివరించారు. ఇటు కొవ్వూరు, అటు గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని కార్మిక రంగానికి ఈ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండగలదని తెలిపారు. ఈ నేపధ్యంలో కొవ్వూరు నుంచి గోపాలపురం మధ్యలో జాతీయ రహదారిని ఆనుకొని ఈ వంద పడకల ఇఎస్ఐ ఆస్పత్రిని నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. కేంద్ర మంత్రి సంతోష్ కుమార్  ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో ఇఎస్ ఐ ప్రత్యేక డ్రైవ్  ఈ మేరకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధి లోని కార్మికులు,  సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరు  ఇఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కార్మికుల ఇఎస్ఐ నమోదు ప్రక్రియను త్వరలో ప్రత్యేకంగా చేపట్టనున్నట్టు ఎంపీ భరత్ రామ్ తెలియజేశారు. ఈ మేరకు సంస్థలు, కంపెనీలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు  కార్మికుల ఈఎస్ఐ నమోదు కృషి చేయాలని ఎంపీ భరత్ రామ్ తెలిపారు.

New Delhi

2021-03-16 21:37:59

ఎప్పుడో ఆ నోట్ల ముద్రణ ఆపేశాం..

భారతదేశంలో రూ.2వేల నోట్లను ఎప్పుడో ముద్రణ నిలిపివేసినట్టు కేంద్రప్రభుత్వం సోమవారం లోక్ సభ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించింది. 2016లో నోట్ల ర‌ద్దు త‌ర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ‌త రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించ‌డం నిలిపివేశామని  ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత‌పూర్వకంగా స‌మాధానం కూడా ఇచ్చారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవ‌రి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు త‌గ్గింద‌ని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేర‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంద‌ని మంత్రి తెలిపారు. కాగా, న‌ల్లధ‌నానికి అడ్డుక‌ట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ర‌ద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చింది..

New Delhi

2021-03-15 20:14:45

ఇక నోటా పేరు చెబితే వారికి హడలే..

అవును నిజమే ఇకపై ఓటరు నోటా అని చెబితే ఎన్నికల బరిలో నిలబడ్డ రాజకీయనాయకుడికి తడిచి పోవాల్సిందే. ఏంటీ ఈ నోటాకున్న ప్రత్యేకత అనుకుంటున్నారా. అయితే మీరు ముందు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఒక్కసారి చదివితే మీరే ముక్కున వేలేసుకుంటారు. ఏదైనా ఎన్నికల్లో అత్యధికంగా నోటాకి ఓట్లు పోలైతే ఆ ఎన్నిక రద్దు చేసి మళ్లీ ఎన్నిక జరిపించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ విధంగా సంచలన తీర్పునివ్వడం ఇపుడు దేశంలోనే హాట్ టాపిగ్ గా మారింది. ఇకపై ప్రజలకు ఏ రాజకీయనాయకుడపైన అయినా ఇష్టం లేకపోతే..ఆయన ప్రజలకు పనిచేయడని భావించిన తరుణంలో ప్రజలు అత్యధికంగా నోటాకి ఓటు వేస్తే ఇక ఆ ఎన్నిక రద్దైనట్టే. అంటే ఈ లెక్కన ఎన్నికల బరిలో నిలబడే నేతలంతా ఎంత జాగ్రత్తగా మసలుకుంటారనేది చాలా స్పష్టంగా కనిపించినట్టు అవుతోంది. అంతేకాకుండా ఈ సారి చేసిన హామీలు అమలు చేయని నేతలను కూడా నోటాకి ఓటు వేసి ఎన్నికలు అయిన వెంటనే దించేయడానికి కూడా సుప్రీంకోర్టు తీర్పు చాలా ఉపయోగ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ

2021-03-15 20:12:38

శ్రీవారి ఆశీస్సులు పొందడం అద్రుష్టం..

 తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శనివారం ఉదయం మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం దేవస్థానం వెలుపల మీడియాతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మాట్లా డుతూ వెంకటేశ్వర స్వామి వారు తన ఆశీర్వాదం తీసుకోవడానికి నాకు మరొకసారి అవకాశాన్ని  కల్పించారని.. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం అదృష్టము గా భావిస్తున్నానని తెలిపారు..  130 కోట్ల మంది భారతీ యులను కోవిడ్ నుండి కాపాడుటకు దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పోరాడారని తెలిపారు.. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మన దేశం ఎవరి మీద ఆధారపడకుండా   స్వశక్తితో కోవిడ్ వ్యాక్సిన్ ను  తయారు చేశామని, 150 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేసే సామర్థ్యం కలదని..అందు లో భాగంగా 75 దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ద్వారా వస్తువుల రవాణా అత్యధిక శాతం చేయడం జరిగిందని ,కోవిడ్ నిబంధనలను సవరించడం వల్ల ప్రయాణికుల సంఖ్య 80 శాతం పెరిగిందని తెలి పారు.అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసర మైన అన్ని మెరుగైన వస తుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని, తిరు పతి రైల్వే స్టేషన్ లో విస్తరణ పనులు ముమ్మరంగా సాగు తున్నాయని తద్వారా ఎక్కువ రైళ్ల రాక పోకలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంట రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో  జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-03-13 16:19:09

దాతల సహకారంతో చిన్నపిల్లల ఆసుపత్రి..

తిరుపతిలో అత్యాధునిక‌ ప్రమాణాలతో ముంబాయికి చెందిన దాత ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్టెక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ (యు.ఐ.సి) ఆధ్వ‌ర్యంలో రూ.300 కోట్ల‌తో చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ‌హాస్పిటల్ నిర్మించనుందని టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బ‌రెడ్డి  తెలిపారు. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్రవారం ఉదయం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గారు, యు.ఐ.సి.సంస్థ సిఈవో , మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజ‌య్ కె. సింగ్‌‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై టిటిడి ఛైర్మ‌న్  స‌మ‌క్షంలో ‌సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌  మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న అనంర‌తం ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యేకంగా చిన్న పిల్ల‌లకు ఉన్న‌త‌ వైద్య సేవ‌లు అందించేందుకు తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంల‌లో చిన్న పిల్లల ఆసుప‌త్రులు నిర్మించాల‌ని రాష్ట్ర ముఖ్య‌‌మంత్రి  వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారు సంక‌ల్పించిన‌ట్లు తెలిపారు. ముఖ్య‌‌మంత్రి ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి పాదాల చెంత తొలిసారి‌గా తిరుప‌తిలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింద‌న్నారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ముంబాయికి చెందిన యు.ఐ.సి. సంస్థ అధినేత రూ.300 కోట్ల విరాళంతో చిన్న పిల్లల ఆసుప‌త్రి ఏర్పాటు చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం యు.ఐ.సి. సంస్థ, టిటిడితో ఎమ్‌వోయు కుదుర్చుకున్న‌ట్లు వివ‌రించారు.  అనంత‌రం ఈవో మాట్లాడుతూ ఇప్ప‌టికే విద్య‌, వైద్య రంగాల‌లో టిటిడి విశేష సేవ‌లు అందిస్తున్న‌ద‌న్నారు. తిరుప‌తిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయ‌నున్న చిన్న పిల్ల‌ల ఆసుప‌‌త్రి స్వీమ్స్‌కు అనుబంధంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. దాత శ్రీ సంజ‌య్‌ సింగ్‌ ఆసుప‌త్రి నిర్మాణంతో పాటు కొన్ని సంవ‌త్స‌రాల పాటు నిర్వ‌హ‌ణ భాధ్య‌త‌లు కూడా చూసుకోనున్న‌ట్లు వివ‌రించారు. త్వ‌ర‌లో ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్వేగ్‌‌ ఇన్‌ఫ్రాస్టెక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్‌ సిఈవో మ‌రియు మేనేజింగ్‌ డైరెక్టర్‌  సంజ‌య్ కె. సింగ్‌‌‌ మాట్లాడుతూ, తిరుపతిలో చిన్న పిల్ల‌ల‌ ఆస్పత్రి నిర్మించేందుకు శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత హైంద‌వ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్ల‌ల‌కు వైద్య సేవలందించేందుకు గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకారం అందించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ, టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సీఏవో  బాలాజీ, సిఇ ర‌మేష్‌రెడ్డి, డిఎల్‌వో రెడ్డ‌ప్ప‌రెడ్డి, సిఎమ్‌వో డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-03-12 20:38:28

12 న కేంద్ర రైల్వేశాఖ మంత్రి రాక ..

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పర్యటన లో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ నెల 12 న సా. 6.35 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.  అనంతరం సా. 7 గం. లకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకుని పూజలు నిర్వహించి రా. 9 గం.లకు తిరుమల చేరుకుంటారని తెలిపారు. 13 వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఉ.9.15 గం. లకు తిరుమల నుంచి బయల్దేరి ఉ.10.15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఆపై ఉ. 10.50 లకు ఢిల్లీ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. 

Tirupati

2021-03-11 18:27:23

జాతీయ అవార్డు విజయనగరం జిల్లాకే గర్వకారణం..

డెంకాడ మండ‌లంలోని ఇందిరా స్వ‌యం స‌హాయ‌క సంఘం జాతీయ అవార్డుకు ఎంపిక‌వ‌టం ప‌ట్ల జిల్లా కలెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆ సంఘం సాధించిన ఘ‌న‌త‌ జిల్లాకే గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అభివ‌ర్ణించారు. సంఘ స‌భ్యు‌లు చూపిన చొర‌వ‌, సాధించిన విజ‌యం జిల్లా ప్ర‌గ‌తికి త‌ల‌మాణికంగా నిలిచింద‌ని పేర్కొన్నారు. మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని‌ జాతీయ అవార్డుకు ఎంపికైన ఇందిరా గ్రూపు స‌భ్యుల‌ను సోమ‌వారం డీఆర్‌డీఏ కార్యాల‌యంలో స‌‌త్క‌రించారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ స‌భ్యులంద‌రినీ అభినందించి శాలువాల‌తో, పష్ప‌గుచ్ఛాల‌తో స‌త్క‌రించారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి అవార్డుల లిస్టును ప్ర‌క‌టించారు. జిల్లాకు చెందిన ఇందిరా గ్రూపు స‌భ్యుల బృంద చిత్రంతో పాటు, వారు సాధించిన ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను డిస్‌ప్లే చేశారు. అనంత‌రం కలెక్ట‌ర్ మాట్లాడుతూ డెంకాడ పొదు‌పు సంఘం సాధించిన విజ‌యం జిల్లాలోని ఇత‌ర మ‌హిళ‌ల్లో విశ్వాసం నింపుతుంద‌ని పేర్కొన్నారు. దీన్ని ఆద‌ర్శంగా తీసుకొని మిగ‌తా సంఘాల వారు కూడా విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. సాంస్కృతిక‌, క్రీడ‌ల న‌గ‌రంగా ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాను చ‌దువుల న‌గ‌రంగా మార్చ‌డంలో మ‌హిళా సంఘాలు కీల‌క‌పాత్ర పోషించాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు. భ‌విష్య‌త్తులో చ‌దువు లేని గ్రామం ఉండ‌కూడ‌ద‌ని తీర్మానించుకొని ముందుకు సాగాల‌ని సూచించారు. ఇన్ని అవార్డులు రావ‌డానికి కార‌ణం.. మహిళ‌లే జిల్లాకు ఇప్ప‌టి వ‌ర‌కు 16 జాతీయ అవార్డులు వ‌చ్చాయని.. ఇందిరా సంఘం సాధించిన దానితో 17 జాతీయ అవార్డులు జాబితాలో చేరాయ‌న్నారు. మ‌హిళ‌ల్లో ఉన్న ప‌ట్టుద‌ల‌కి, ఏదైనా సాధించాల‌నే త‌ప‌న‌కు ఈ అవార్డులు నిద‌ర్శ‌న‌మని అభివ‌ర్ణించారు. జిల్లాకు ఇన్ని అవార్డుల రావ‌డానికి మ‌హిళా అధికారులే కార‌ణ‌మ‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. జిల్లాలో అత్య‌ధికంగా మ‌హిళా అధికారులు, సిబ్బంది ఉన్నార‌ని చెప్పారు.  అనంత‌రం సంయ‌క్త క‌లెక్ట‌ర్ జె.వెంక‌ట‌రావు మాట్లాడారు. ఇది చాలా ఆనంద‌దాయ‌కమైన సంఘ‌ట‌న అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ అవార్డు జిల్లాకు మ‌రో క‌లికితురాయి అని పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ నాయ‌క‌త్వంలో మ‌హిళ‌లు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, ఎస్‌.కోట ఏసీ జ‌య‌శ్రీ, ఏపీడీ సావిత్ర మాట్లాడారు.  అనంత‌రం ఇందిరా స్వ‌యం స‌హాయక సంఘ స‌భ్యుల‌ను పూల‌మాలల‌తో, దుశ్సాలువాల‌తో స‌త్క‌రించారు. సంఘ స‌భ్యుల‌ను ఈ సంద‌ర్భంగా ప‌లువురు అభినందించారు. కార్య‌క్ర‌మంలో ఏపీడీ సావిత్రి, ఏసీలు జ‌య‌శ్రీ‌, స్వ‌ర్ణ‌కుమారి, ఏజీఏం, ఏపీఎంలు, సీసీలు, డీఆర్‌డీఏ, వెలుగు సిబ్బంది, వివిధ మ‌హిళా సంఘాల స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Vizianagaram

2021-03-08 16:43:25