చంద్రబాబుకి అర్జెంటుగా అధికారం తెచ్చేసుకోవాలనే యావతో పెట్టే సభలు, సమావేశాలు ప్రజల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని మండి పడ్డారు. గుంటూరులో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయిన ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా, వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను మంత్రి విడదల రజిని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జరిగిన రెండు సభలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నా చంద్రబాబుకి ఏమీ పట్టడం లేదన్నారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్ ప్రచారం చేశారని, వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణం జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.