ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆత్మహత్యల గ్రహణం పట్టుకున్నట్టుంది. ఒకే ఏడాదిలో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఇద్దరు ఉద్యోగుల విశాఖపట్నంలో ఆత్మహత్యచేసుకోగా..మరో సచివాలయ ఉద్యోగి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ మూడు ఆత్మహత్యలకు విధి నిర్వహణలోని పని ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. ఆశలు నెరవేరి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఉన్న రోజులు కూడా నిండకుండానే మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. అధికారుల వేధింపులు ఓ ప్రక్క.. పని ఒత్తిడి మరోప్రక్క వెరసీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆత్మహత్యలు చేసుకునే సమయంలో తమ ఛావుకి పని ఒత్తిడే కారణమని సూసైడ్ నోట్ లో రాసి మరీ చనిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికారుల పర్యవేక్షణ లోపం, పని ఒత్తిడి, చదివిన చదువుకి అటు అటెండరు, ఇటు జూనియర్ అసిస్టెంట్ కాని క్యాడర్, అన్ని ప్రభుత్వశాఖల్లో కెల్లా అతి తక్కువ జీతం.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకంటే అత్యధిక పనిభారం ఈ ఆత్మహత్యలకు కారణం అవుతూ, కన్నవారికి కన్నీరుని
మిగులుస్తున్నాయి.
ఫ్యాషనైన పదం..నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను అధికారులు ఏ స్థాయిలో బెదిరిస్తున్నారంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసిపారేస్తా(ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో నుంచి తీసేసే హక్క ఆ ప్రభుత్వానికి కూడా ఉండదు, తప్పిదారి దేశ ద్రోహం చేస్తే తప్పా.. ఆ విషయం తెలిసీ కూడా మండల, జిల్లా అధికారులు ఈ విధమైన బెదిరింపులు
ఎలా చేస్తున్నారో వారికే తెలియాలి).. ఈ నెల నువ్వు జీతాలు ఎలా అందుకుంటావో చూస్తాను.. ఇక నుంచి ఉద్యోగాలు ఎలా చేస్తారో అదీ చూద్దాం.. నాకేం సంబంధం లేదు.. సచివాలయంలో నేనున్నా సెలవు కావాలంటే ఎంపీడీఓని అడగండి.. లేదంటే మీ మండల, జిల్లా అధికారి నుంచి అనుమతి పత్రం, డ్యూటీ
సర్టిఫికేట్, సెలవు చీటీలు తీసుకురండి(వాళ్ల దగ్గర నుంచి, వీళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకొస్తే సచివాలయంలో ఉన్న కార్యదర్శి ఎందుకో జిల్లా అధికారులకే తెలియాలి).. అంటూ ఫ్యాషన్ గా బెదిరించడం అలవాటు చేసుకున్నారు. పంచాయతీలోని కార్యదర్శి దగ్గర నుంచి మండల కేంద్రంలో ఎంపీడీఓ, జిల్లాశాఖల
వరకూ ఇదే వరస. ఎక్కడ చూసినా సచివాలయ ఉద్యోగులను బెదిరించడానికే వీరికి సమయం సరిపోవడం లేదు. ప్రైవేటు ఉద్యోగం కంటే దారుణంగా టార్గెట్లు విధించడం సచివాలయశాఖలో షరా మామూలు అయిపోయింది. ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వడం, సమావేశంలో అందరి ముందు నిలబెట్టి తిట్టడం, మీపై జిల్లా అధికారులకు రిపోర్టు చేస్తానని చెప్పడం ఇలా మండల అధికారులకు ఏ విధంగా తోస్తే ఆవిధంగా చేస్తూ సచివాలయ ఉద్యోగులపై తీవ్ పని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ఆఖరికి ఉద్యోగి సెలవుపై వెళ్లినా ఆ సమయంలో కూడా తీవ్ర స్థాయిలో స్కూలు, కాలేజి విద్యార్ధులను బెదిరించినట్టు ఒత్తిడితో కూడిన బెదిరింపులకు దిగుతున్నారు మండల, జిల్లా అధికారులు.
ఇంటి పెద్దను కోల్పుతున్న కుటుంబాలు
బలవంతంగా సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం వలన ఆ కుటుంబాన్ని అంతటినీ పోషించే పెద్దదిక్కును కోల్పోతున్నారు. ఎంతో కొంత జీతం వచ్చి నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయనుకుంటున్న తరుణంలో సచివాలయ ఉద్యోగులు యుక్త వయస్సులో ఆత్మహత్యలకు పాల్పడటం రాష్ట్రస్థాయిలో
చర్చనీయాంశం అవుతున్నది. తమ పుత్రుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, తమ కష్టాలు తీరుతాయనుకునే లోపే సదరు ఉద్యోగులు పని ఒత్తిడి, అధికారుల బెదిరింపుల నేపథ్యంలో మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. దీనితో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలుతోంది. దానికితోడు ప్రస్తుతం సచివాలయ ఉద్యోగాలు
చేస్తున్నావారిలో 70శాతానికి పైగా నిరుపేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినవారే కావడంతో ఆ కుటుంబాలు చెట్టంత కొడుకుని కోల్పోయి మళ్లీ రోడ్డున పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం వచ్చిందనే దైర్యంతో పెళ్లిళ్లు చేసుకొని మధ్యలోనే ఆత్మహత్యలకు పాల్పడి ఇటు కట్టుకున్న భార్యకి, అటు కన్నవారికీ దూరమైపోతున్నారు. కేవలం అధికారులు ప్రభుత్వం అప్పగించిన పనిని పూర్తిచేయాలనే నెపంతో ఉద్యోగులపై తీవ్రమైన పనిఒత్తిడికి గురిచేస్తూ.. బెదిరింపులతో ఉద్యోగులు ఆత్మహత్యులు చేసుకోవడానికి కారణం అవుతున్నారు.
పేరుకే ఒక శాఖ ఉద్యోగం..అన్నీశాఖల పనులూ చేయాలి..
‘‘ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు’’ అన్నట్టు తయారైంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విధినిర్వహణ. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలో అయినా సదరు ప్రభుత్వ శాఖకి చెందిన పనులు మాత్రమే చేయాల్సి వుంటుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖలో వారి మాతృశాఖతో పాటు అన్నిశాఖల ప్రభుత్వ
ఉద్యోగాలను, విధులను చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గానీ, జిల్లాశాఖల అధికారులు గానీ నోరు మెదపకపోవడంతో అన్నశాఖల మండల అధికారుల పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులపై పడుతున్నది. సమయానికి వచ్చి బయో మెట్రిక్ వేయకపోతే జీతాల్లో కోత విధించాలని సిఫార్సు చేస్తున్న మండల అధికారులు, అదే ఉద్యోగులు రాత్రి 8 గంటల వరకూ విధులు నిర్వహించినపుడు మాత్రం అదనంగా చేసిన పనిగంటలను, అదనపు బాధ్యతల విషయాన్ని జిల్లా అధికారుల వద్ద కనీసం నోరువిప్పి చెప్పడంలేదు. పైగా సచివాలయ ఉద్యోగులు పడిన కష్టం, చేసిన పనంతా తామే చేసేసినట్టు జిల్లా అధికారులు వద్ద ఇచ్చే
కలరింగ్ కి సినిమా సీన్లను మించిపోతున్నది. ఈ తరుణంలో కనీసం ప్రభుత్వం అయినా అసలు సచివాలయ ఉద్యోగులు తక్కువ సమయంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించడంలేదు.
సచివాలయ ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగాలకు
జీవితంలో స్థిరపడిపోవచ్చునని ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగాలల్లోకి వచ్చిన వారంతా ఇపుడు వేరే ఉద్యోగాలవైపు చూస్తున్నారు. మరికొందరు వేరేశాఖలో ఉద్యోగం వస్తే దీనిని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు ఉద్యోగాలను శాస్వతంగా వదిలి వెళ్లి పోతున్నారు. గత మూడేళ్లలో
సచివాలయం ఉద్యోగం వచ్చి వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయినవారు, వేరే ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500కి పైగానే ఉంటుంది. బ్యాంకు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఇదే శాఖలో గ్రేడ్4 కార్యదర్శిలు, ఇలా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు.
ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగాలతో పోల్చుకుంటే ఒక్క సచివాలయశాఖలోని ఉద్యోగులకే అత్యంత తక్కువ జీతాలు ఉండటం, పని ఒత్తిడి ఇతర ప్రభుత్వశాఖల కంటే అత్యధికంగాఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో జరుగుతున్న వరుస
ఆత్మహత్యలపై విచారణ కమిటీ వేయకపోతే ఈ మరణమృదంగం కొనసాగే అవకాశాలే చాలా అధికంగా కనిపిస్తున్నాయి..!