శ్రీకాకుళం జిల్లాలో 9వ విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమం పూర్తి అయినట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తెలుపు రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ చేయడం జరిగిందని జె.సి. తెలిపారు. అదే విధంగా రేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి కూడా రేషన్ సరకులను ఇవ్వనున్నామని తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు ను తెలుపు రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యాన్ని, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసామని తెలిపారు. అదే విధంగా కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేసిన్నట్లు తెలిపారు. తెలుపు రేషన్ కార్డుదారులందరికీ ½ కిలో రూ. 17/- లకు పంచదారను అందించామన్నారు. . జిల్లాలో వున్న 8 లక్షల 29 వేల 69 తెలుపు రేషన్ కార్డుదారులందరికీ రేషన్ సరకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 15,237 మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరకులను అందచేయడం జరిగిందన్నారు.
శ్రీకాకుళంలో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ గురు వారం పరిశీలించారు. ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించడం రుగుతుందని ఆయన చెప్పారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధులను, కరోనా నుండి కోలుకున్న వృద్ధులు, గర్భిణీ స్త్రీలు తదితర వర్గాలకు సత్కారాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలీసు పెరేడ్ తోపాటు వివిధ శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాలు, ప్రదర్శన శాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ చెప్పారు. మైదానంలో పారిశుధ్యం, తాగు నీటి ఏర్పాట్లు చూడాలని నగర పాలక సంస్ధ కమీషనర్ ను ఆదేశించారు. వేదిక నిర్మాణం, అతిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అధికారులు, సత్కార గ్రహీతలు తదితరులు కూర్చునే ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమం సాధారణంగా, చక్కగా ఉండాలని కలెక్టర్ అన్నారు. సంబంధిత శాఖల అధికారులు శకటాల తయారీని పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టాలని, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలకు కఠినంగా శిక్షించాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం విశాఖలో జీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట వరుస ప్రమాదాలపై సిఐటియు, ఎఐటియుసి, ఐ.ఎన్.టి.యు.సి., ఐఎఫ్‌టియు, ఎఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్ధేశించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగిన తరువాత కార్మికులకు నష్టపరిహారాలు ప్రకటించి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయని విమర్శించారు. వరుసుగా ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలు కోసం నోరుమెదపడం లేదన్నారు. పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించకుండా సంబంధిత శాఖలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అదే విధానాన్ని కొనసాగించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవడంలో తీవ్ర వైఫల్యం ప్రదర్శిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో విశాఖ కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమిస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు ఆర్.కె.ఎస్.వి.కుమార్, పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌మంగళం, ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్రరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, కొండయ్య, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి జి.వామనమూర్తి, ఎఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి గణేష్‌పాండా, సిఐటియు నాయకులు ఎం.సుబ్బారావు, వి.కృష్ణారావు, ఆర్పీ రాజు, అప్పలరాజు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 పై పోరులో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని, మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువ ఉండే విధంగా కృషిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. గురువారం నాడు డిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ఆయన టెస్టింగు ల్యాబ్ ల సామర్ద్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని, ఫలితాలు జాప్యం లేకుండా వెల్లడించాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది కోవిడ్ బారిన పడే అవకాశాలను తగ్గించాలని తెలిపారు. వారికి ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తపడాలని, పి.పి.ఇ. కిట్ల వినియోగం, డిస్పోజల్ పై అవగాహన పెంచాలని, వారు హాట్ స్పాట్ ప్రాంతాలలో నివసిస్తుంటే మరింత శ్రద్ద వహించాలని తెలిపారు. గుర్తించిన పాజిటివ్ కేసులను సత్వరమే అంబులెన్స్ లద్వారా ఆసుపత్రులకు, కేర్ సెంటర్లకు తరలించాలని తెలిపారు. రోగులు ఆసుపత్రికి రాగానే త్వరగా బెడ్ కేటాయించి చికిత్స ప్రారంభించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ హోం ఐసోలేషన్ లో ఉండే పాజిటివ్ రోగుల వలన వారి కుటుంబాలకు కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, వారిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పొరపాటున జాగ్రత్తలు పాటించకుండా బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని తెలిపారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా మారుమూల ప్రాంతాలలో కూడా కాంటాక్టు ట్రేసింగు ను సమర్దవంతంగా చేయగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యదికంగా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో బెడ్ల కేటాయింపును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్త్తున్నట్లు తెలిపారు. కొత్తగా 1088 అంబులెన్స్ లను ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వస్తున్న విదేశీ ప్రయాణీకులను నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉంచుతున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో కొత్తగా 42 పి.హెచ్.సి.లను ప్రారంభిస్తున్నట్లు, వీటికి సిబ్బందిని నియామకం చేస్తున్నట్లు తెలిపారు. 54 పాత అంబులెన్స్ లకు కూడా మరమ్మత్తులు చేయించి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లారెవిన్యూ అధికారి ఎం. శ్రీదేవి, ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎంపికైన అభ్యర్దుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ త్వరలో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఏపిపిఎస్సీ నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైన పంచాయతీ కార్యదర్శుల అభ్యర్ధుల జాబితాను ఏపిపిఎస్సీ జిల్లాకు పంపించిందన్నారు. అభ్యర్ధుల విద్యార్హతలు, ఇతర అర్హతల సర్టిఫికేట్లను పరిశీలించాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. త్వరలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఏర్పాటు చేసి పూర్తి చేస్తామని ఆ ప్రకటనలో ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేది తేదీలను ప్రకటిస్తామన్న కలెక్టర్ కలెక్టర్ వెరిఫికేషన్ కు అన్ని రకాల విద్యార్హతలతోపాటు ఒక సెట్ జెరాక్సు కాపీలు, పాస్ సైజు ఫోటోలతో మెరిట్ అభ్యర్ధులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత ప్రారంభించే పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రారంభించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని వాటి పర్యవేక్షణకు గాను జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలక్టరు తెలిపారు. ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తరువాత పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు. ఈ కమిటీ లో చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ (ఎ అండ్ డబ్ల్యు), డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆప్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, రీజనల్ ఆఫీసర్, ఎపిపిసిబి. డిప్యూటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అదికారి మెంబర్లు గాను, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం , మెంబర్ కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. ఆయా పరిశ్రమలు తాము పాటించవలసిన చట్టాలు, నియమాల ప్రకారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదికను సమర్పించాలి. ఈ కమిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, ఎన్విరాన్ మెంటల్ ప్రమాణాలు పరిశీలించాలని తెలిపారు. మొదటి విడతగా కెమికల్, కెమికల్ నిల్వ, తయారీ, పేలుడు పదార్దాల తయారీ, పెట్రోలియం పరిశ్రమలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి నెలవారీగా నివేదికలు అందజేస్తాయని తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల సమయంలో తక్షణ స్పందన నిమిత్తం పరిశ్రమల యాజమాన్యం, కార్మికయూనియన్లు, టెక్నికల్ నిపుణులు, హెల్త్ డిపార్టుమెంటు, తక్షణ స్పందన బృందాలతో జిల్లా స్థాయి సంక్షోభ నివారణ గ్రూపు ఏర్పాటుచేసి దానికి జిల్లా కమిటీ నేతృత్వం వహిస్తుందన్నారు. ఈ కమిటీ ముఖ్య విషయాలను జిల్లా కలెక్టరు దృష్టికి ఎప్పటి కప్పుడు తీసుకువస్తుందని, అదే విధంగా పరిశ్రమల భదత్రపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తుందని జిల్లా కలెక్టరు తెలిపారు.
గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల హెచ్చరించారు. బుధవారం తాహశీల్దారులు, ఇంజనీరింగ్ అధికారులతో మన బడి నాడు నేడు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, ఉపాధిహామీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అరకువేలీ మండలం లోతేరు సచివాలయం భవన నిర్మాణం ప్రారంభించలేదని తాహశీల్దారిని, ఆర్ ఐ, వి ఆర్ ఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే సోమవారం నాటికి పనులు ప్రారంభించక పోతే చార్జిమెమో జారీ చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. నాడు నేడు పనులు వేగం పెంచాలని ఆదేశించారు. నాడు నేడు పనులు 33 శాతం పురోగతి సాధించారని ఈనెల 17 తేదీ నాటికి 66 శాతం ప్రగతి సాధించాలన్నారు. ఇసుక, సిమ్మెంటు సమస్యలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల పనులు రూఫ్ స్దాయికి రావాలని, ఎలక్ట్రికల్ పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహా పధకం పనులపై సమీక్షిస్తూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ లబ్దిదారులు 70 వేల కుటుంబాలు ఉన్నాయని వారందరికి 150 రోజులు పని కల్పించాలని స్పష్టం చేసారు. రూ.350 కోట్ల ఉపాధిహామీ పనులు చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, రూ.197 కోట్ల పనులు మాత్రమే చేసారని నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని అన్నారు. కాఫీ తోటల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కె వి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, కాఫీ ఎడి రాధాకృష్ట, ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఎపిడి సి.హెచ్. లచ్చన్న, గిరిజన సంక్షేమశాఖ డి. ఇ అనుదీప్ , ఎటిడబ్ల్యూ ఓ రజని తదితరులు పాల్గొన్నారు.
అన్నవరం, శ్రీ సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో 650 మంది సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇంకనూ దేవస్థానంలో పనిచేయు సిబ్బందికి 200 పైగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు. దేవస్థానంలో కేసులు అధికంగా ఉన్నందున స్వామివారి దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి స్వామివారికి ఏకాంతముగా సేవలు చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. హోమ్ క్వారంటైన్ లో వైద్యసేవలు పొందే వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందులు వాడుతూ, బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఈఓ కోరారు.
ఆశాలకు వై.ఎస్.ఆర్. చేయూత పథకానికి అనర్హులను చేయడం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోవడం దారుణమని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.అరుణ, విశాఖ నగర అధ్యక్షరాలు వి.మేరీ ఆరోపించారు. అందరి మహిళలు మాదిరిగానే ఆశ లకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై ఈ రోజు జగదాంబ జంక్షన్ వద్ద గల సిఐటియు కార్యాలయం ఆవరణలో ఆశ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, సు ర్ఘకాలం పోరాడిన తరువాత ఆశాలకు 10 వేల రూపాయల జీతం పెంచిన ప్రభుత్వం, జీతం పెరిగిందనే నేపంతో నేడు మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన వై.ఎస్.ఆర్. చేయూత పథకానికి అనర్హులుగా చేయడం అన్యాయమని అన్నారు. ఈ పథకం ఆశాలకు ఎంతో అవసరమన్న వీరు ఆశాలలో అత్యధిక మంది దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువ మంది వంటరి మహిళలుగా ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారని కూడా తెలియజేశారు. అత్యంత పేదరికంలో మగ్గుతూ 14 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చే పారితోషికానికి కట్టుబడి వైద్య రంగంలో క్రింది స్థాయిలో పనిచేశారు. జగన్ అన్న వచ్చిన తరువాత 10 వేలు రూపాయలు వేతనాన్ని నిర్ణయించారు. వై.ఎస్.ఆర్. చేయూతతో పాటు అనేక చోట్ల రేషన్‌కార్డులు, పించన్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలుపుదల చేయడాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతంలో పేదలకు 12 వేలు లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం, ఆశాలకు 10 వేలు పారితోషికం వస్తున్నా మ పథకాలకు అనర్హులను చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆశాలకు వైఎస్‌ఆర్ చేయూత, ఇతర సంక్షేమ పథకాలన్నీ ఆశాలకు వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇచ్చి ఆశాలను ఆదుకోవాలని ఆశలు కోరారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద,పార్టీ నాయకులు మీద విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బి. కాంతారావు అన్నారు. మంగళవారం వైయస్సార్ విద్యా విభాగం అధ్యక్షుడు బి. మోహన్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దళితులకు హోం మంత్రి పదవి ఇవ్వడం ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇవ్వడం డిప్యూటీ సీఎం పదవి దళిత వర్గానికి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దళితులపై చూపిస్తున్న అభిమానాన్ని వెలగపూడి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఎదుగుదల చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ని ఉద్దేశించి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ నోటికొచ్చినట్లు స్థాయిని మరచి మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. గతంలో దిష్టిబొమ్మ దహనం చేయడానికి వచ్చినప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నా నీకు దేహశుద్ధి జరిగిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కరోనాకు భయపడి హైదరాబాదులో తల దోచుకున్నారని కానీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ట్రస్ట్ పెట్టి 25 సంవత్సరాల యువకుడిలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు నీషేక్, కె.ప్రసాద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో మంది నాయకులను తయారు చేసిన రాజకీయ కురువృద్ధుడు పెనుమత్స సాంబశివరాజు మరణించడం చాలా విచారకరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో కెల్ల జంక్షన్ వద్ద ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, వైకాపా రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సాంబశివరాజుఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దివంగత నేత సాంబశివరాజు ఫోటోకు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతోమందిని పార్టీల నాయకులుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది నేతలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించిన కురువృద్ధులు సాంబశివరాజులేని లోటు తీరనిది ఆయన కన్నీరుమున్నీరయ్యారు. సహకార బ్యాంకు మాజీ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో బడి గుడి నీరు సాగునీరు తాగునీరు ఆస్పత్రులు రోడ్లు తదితర వాటిని పూర్తి చేసిన ఘనుడు సాంబశివుడు అని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా కొనియాడారు. జిల్లా వైయస్సార్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రేగానశ్రీనివాసురావు మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన మహనీయుడు ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేనఅధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ,,ఈ ప్రాంతంలో రాజకీయ గురువుగా సాంబశివ రాజుని కొలుస్తారని ఆయన అన్నారు. మహనీయుడు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి పార్టీ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మండల వైయస్ఆర్ పార్టీ నాయకులు పల్లి.కృష్ణ , మంత్రి వెంకటరమణ , అట్టాడ లక్ష్మీనాయుడు నాయుడు చందక బంగారు నాయుడు, రమణ గిడిజల శ్రీను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రాజు, తెట్టింగి మాజీ సర్పంచ్ జమ్ము స్వామినాయుడు, సంఛాన రమేష్ సుంకరినారాయణరావు తెట్టంగి, రాగోలు, గుజ్జంగివలస, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జగనన్న ఇళ్ళ స్థలాల ఎంపిక ప్రక్రియలో ఎవరైనా చేతివాటాన్ని చూపితే సహించేది లేదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ హెచ్చరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థలం కోసం ఎంపికైన లబ్దిదారులు 21 రూపాయలు మాత్రమే చెల్లించి వార్డు సిబ్బంది నుండి రశీదు పొందాలన్న ఆమె అదనంగా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే జీఎంసీ కాల్ సెంటర్ 0863-2345103 / 104 / 105 నెంబర్లలో పూర్తి సమాచారంతో ఫిర్యాదు చేయాలని చెప్పారు. గుంటూరు నగరంలోని 207 వార్డు సచివాలయాల పరిథిలో 62,025 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిస్తే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో పారామెడికల్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టు జాబితాను కెజిహెచ్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు సూపరింటెండెంట్ డా.పివి.సుధాకర్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్ధులు వారి మెరిట్ జాబితాను http://www.kghvisakhapatnam.org లో చూసుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు 12వ తేది నుంచి 13వ తేది సాయంత్రం 5 గంటలకు మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్ధులకు ఈనెల 14 నుంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌన్సిలింగ్ కి వచ్చే అభ్యర్ధులు, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాటికి సంబంధించిన జెరాక్సు కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటోలను రెడీచేసుకోవాలని ఆయన వివరించారు.
ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇస్తోన్న ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను పక్కదారి పట్టిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి కఠిన చర్యలు తీసుకున్నారు. కాకినాడ కార్పోరేషన్ పరిధిలో కిట్లు పక్కదారి పట్టినట్టు అధికారులు గుర్తించి కలెక్టర్ కు నివేధించడంతో మెడికల్ ఆఫీసర్ కరీముల్లా ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మరో హెల్త్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ ను మాతృసంస్థకు బదిలీ చేశారు. కోవిడ్ కిట్ల మాయాజాలంపై పూర్తి స్థాయి విచారణ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలకి కలెక్టర్ ఆదేశించడంతో.. జీజీహెచ్ ఆర్ఎంఓ సంతకం ఫోర్జరీ చేసి 300 కిట్లు తీసుకుని వెళ్లినట్టుడిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనతో ఎంఎన్ఓ బాషాకి లింకులున్నట్టు గుర్తించడంతో బాషా ప్రస్తుతం పరారీలో ఉన్నారు..
శ్రీక్రిష్ణ పరమాత్ముడు కృపతోనే జీవకోటి మనుగడ సాధ్యపడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. విశాఖలోని సాగర్ నగర్ ఇస్కాన్ దేవాలయంలో మంగళవారం శ్రీ కృష్ణుడి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల సతీసమేతంగా క్రిష్ణభగవానుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, మానవ సమాజం మనుగడ శ్రీక్రిష్ణుడి లీలతోనే నడుస్తుందన్నారు. కరోనావైరస్ నుంచి కాపాడాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు స్వామిని పూజించి క్రిష్ణుడి క్రుపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంవీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.