1 ENS Live Breaking News

వివాహాలకు మండల స్ధాయిలో అనుమతులు..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో వివాహ వేడుకలకు మండల స్ధాయిలో అనుమతులు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. వివాహాలు నిర్వహించుకనే వారు కనీసం ఐదు రోజులు ముందు సంబంధిత మండల తహశీల్దారుకు, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కు వివరాలు అందించాలని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ అనుమతులకు మించి బంధు మిత్రులను ఆహ్వానించరాదని కలెక్టర్ అన్నారు. అనుమతులు తీసుకున్నప్పటికి కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని, వ్యక్తుల మధ్యదూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తోగాని తరచూ శుభ్రపరచుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Srikakulam

2020-07-29 19:02:02

కోవిడ్ కేర్ సెంటర్ లో నాణ్యమైన భోజన సదుపాయాలు..

కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్లకు  నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ – ౩ గోవిందరావు తెలిపారు. బుధవారం నాడు   జాయింట్ కలెక్టరు , ఆర్ డి ఓ, పి.కిశోర్ తో  కలిసి మారికవలసలోని  గిరిజన  బాలికల కళాశాల భవనంలో   ఏర్పాటు చేసిన వంటశాలను  ఆకస్మికంగా  తనిఖీ చేసారు.  ప్రభుత్వ మానసిక వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా.నాగరాజు, డిప్యూటీ తాహశీల్దార్  రవి కుమార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ నరసింహ మూర్తి కోవిడ్ కేర్ సెంటర్ లోని రోగుల ఆరోగ్య పరిస్థితిని, భోజన , వసతి వివరాలను వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు  మాట్లాడుతూ విశాఖనగరంలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో   ఉంచి ,  24గంటలు  వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.  మొత్తం 12 మంది డాక్టర్లు, 6 మంది నర్సులు, వున్నారని , మూడు  భవనాలలో ప్రతి షిప్టులోను 1 డాక్టరు, 1  నర్సు  ఉంటారని తెలిపారు.  ఎవరికైనా  అనారోగ్య పరిస్ధితి తలెత్తితే తక్షణమే  అంబులెన్స్ లో  కోవిడ్ ఆసుపత్రికి  తరలిస్తారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భోజన , వసతి సౌకర్యాలను  పరిశీలించామని తెలిపారు. శ్రీ చైతన్య  కాలేజీ భవనాల లో మూడు బ్లాకులు ఉన్నాయని,  అందులో అబ్దుల్ కలామ్  భవనంలో ఇప్పటి వరకు 379 మంది ఎడ్మిట్ కాగా 164 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారని, 71 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 9 మందిని  కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసామని తెలిపారు. ప్రస్తుతం 135 మంది మహిళా పేషెంట్లు ఉన్నారని ఈ భవనాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారని తెలిపారు.ఈ భవనంలో మొత్తం 390 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  భగీరద బ్లాక్ లో  180 రూమ్ లు , 500 బెడ్స్ ఉన్నాయని, ఇప్పటివరకు 293 మంది ఎడ్మిట్ కాగా, 13 మంది డిశ్చార్జి  అయ్యారని, 20 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 8 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు.  ప్రస్తుతం 252 మంది పేషంట్లు ఉన్నారని తెలిపారు.   వాల్మీకి బ్లాక్ లో 160 రూమ్ లు,  480 బెడ్స్ ఉన్నాయని తెలిపారు.  ఇప్పటి వరకు 516 మంది ఎడ్మిట్ కాగా, ఒకరు డిశ్చార్జి  అయ్యారని, 241 మంది హోం ఐసోలేషన్ లో వున్నారని, 14 మందిని కోవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం  260 మంది  పేషంట్లు ఉన్నారని  అందులో  155 మంది పురుషులు, 105 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.  వీరికి  ఉదయం 7గంటలకు రాగి జావ, పాలు ఇస్తున్నారని, ఉదయం 8.30 గంటలకు అల్పాహారంగా ఇడ్లీ, వడ , పూరి, చపాతి, టీ, కాఫీలు ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనంలో రోటి, రైస్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర, పప్పు,  సాంబారు, పెరుగు, అరటిపండు ఇస్తున్నారని తెలిపారు. సాయంత్రం 4గంటలకు  టీ, కాఫీ ఇస్తున్నారని తెలిపారు.  రాత్రి 7.30 గంటలకు  భోజనంలో రోటి, రైస్, గుడ్డు, వెజిటెబుల్ కర్రీ, ఆకుకూర,  పప్పు, సాంబారు, పెరుగు, అరటి పండు ఇస్తున్నారని తెలిపారు.  

Visakhapatnam

2020-07-29 18:59:49

వి ఎస్ ఎస్ భూములకు అటవీ హక్కుపత్రాలు..రంజిత్ భాషా

 గిరిజన రైతులు వనసంరక్షణ సమితీల్లో సాగుచేస్తున్న అటవీ భూములకు అటవీ హక్కుపత్రాలు అందిస్తామని గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు రంజిత్ భాషా పేర్కొన్నారు. బుధవారం పాడేరు మండలం గుర్రగరువు,మోదాపల్లి గ్రామాల పరిధిలోని వన సంరక్షణ సమితీల్లో సాగుచేసిన కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీతోటల్లో గిరిజన రైతులతో ముచ్చటించారు. ఎన్ని ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు ? గత ఏడాది కాఫీ పంట,మిరియాలు పంటలపై వచ్చిన ఆదాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోదాపల్లి గ్రామంలో కాఫీ రైతులతో సమావేశ మయ్యారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతీ గిరిజన రైతులకు వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున అటవీ హక్కుపత్రాలు మంజూరు చేస్తామన్నారు. అటవీ హక్కుపత్రాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అన్నారు. బ్యాంకుల రుణాలు పొంద వచ్చని చెప్పారు. అటవీ హక్కులు పొందిన గిరిజన రైతులకు 150 రోజులు ఉపాధి పని కల్పిస్తామని, ఉపాధిహామీలో ఆయా భూములను అభివృధ్ది చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు కాఫీ కల్లాలు, తార్పాలిన్లు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి పధకాలను మంజూరు చేయాలన్నారు. మోదాపల్లిలో 49 క్లైములు, గుర్రగరువులో 22 క్లైములు వచ్చాయని రెవెన్యూ అధికారులు వివరించారు. అనంతరం సంగోడి ఎపి ఎఫ్ డిసి కాఫీ తోటలు పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో అటవీశాఖ,రెవెన్యూ అధికారులతో సమావేశమై అటవీ హక్కుపత్రాలు జారీ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల,డి ఎఫ్ ఓ వినోద్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. చినబాబు , కాఫీ ఎడి రాధాకృష్ణ, తాహశీల్దార్ ప్రకాశరావు, సబ్ అసిస్టెంట్ అప్పలనాయుడు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.

Paderu

2020-07-29 18:48:15

కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్..ప్రభుత్వ ఆదేశాలు

బక్రీద్ పండగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మసీదులు, ఈద్గాలలో చేసుకోవచ్చని జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి ఎం.అన్నపూర్ణమ్మ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆగష్టు 1వ తేదీన బక్రీద్ పండగ ఉందని, బక్రీద్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అనుసరించి నిర్వహించుకోవాలని ఆమె స్పష్టం చేసారు. 65 సం.లు పైబడిన వారు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, హృద్రోగ సమస్యలు, ఇతర దీర్ఘకాల సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించరాదని ఆమె అన్నారు. మసీదుల వద్ద జరుగు ప్రార్ధనలలో ఒకసారి 50 మంది ముజల్లీ కి మాత్రమే అనుమతించడం జరిగిందని అన్నపూర్ణమ్మ చెప్పరు. వ్యక్తుల మధ్య విధిగా రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని అన్నారు. మసీదులు, ఈద్గాలను పూర్తిగా శానిటైజర్ తో శుభ్రపరచాలని ఆమె సూచించారు. చరవాణిలలో "ఆరోగ్యసేతు యాప్' ను డౌన్ లోడ్  చేసుకోవాలని అన్నారు. ప్రార్ధనకు ఎవరి తివాచీ వారు తీసుకు రావాలని సూచించారు. మత పెద్దలు, కమిటీ నిర్వహకులు తగు శ్రద్ద తీసుకొని కరోనా మహమ్మారి భారీన పడకుండా మైకు ద్వారా రక్షణాత్మ సూచనలు చేయాలని, మసీదులు, ఈద్గాల వద్ద కరోనాపై అవగాహన కలుగుటకు ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రార్ధనలలో విధిగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, చేతికి గ్లోవ్స్ ధరించాలని, చేతులను తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని ఆమె చెప్పారు.  మసీదు, ఈద్గాల పరిసరాలలో ఉమ్మి వేయరాదని ఆమె పేర్కొన్నారు. ముస్లిం సోదరులు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలు చేయరాదని అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎవరికి వారే రక్షణ చర్యలు చేపట్టాలని, మీరు మీ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండాలని పేర్కొంటూ సురక్షిత జీవనంలో అందరూ భాగస్వామ్యం వహించుటకు ప్రార్ధనలు చేయాలని కోరారు. కరీనాకి నువ్వు ఒక ప్రాణం మాత్రమే, కానీ కుటుంబానికి నువ్వొక అమూల్యమైన మనిషివి - మన భద్రత మనమే తీసుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు.

Srikakulam

2020-07-29 14:59:53

ఆన్ లైన్ లో జాతీయ స్ధాయి సెమినార్లు..బీఆర్ యు విసి

కోవిడ్ 19 మహమ్మారితో విద్యాలయాల పరిస్ధితి, విద్యార్ధుల భవిత ప్రశ్నార్ధకం కాగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోగల డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళుతోంది. కోవిడ్ 19 మహమ్మారి ఒక వైపు నుండి ప్రజలను కదలనీయని స్ధితిలోకి నెట్టడంతో విద్యార్ధులు తరగతి గదుల్లో బోధనలు కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో విశ్వవిద్యాలయం జూన్ నెల నుండి ఆన్ లైన్ లో వివిధ సెమినార్లను నిర్వహిస్తూ విద్యార్ధులు, ఆచార్యులు తమ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఇతరులతో పంచుకోవడం జరిగింది. తాజాగా ఉన్నత పాఠశాల విద్యార్ధుల నుండి పోస్టు గ్రాడ్యుయేట్ స్ధాయి వరకు తమలో నిఘూడంగా దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి విశ్వవిద్యాలయం ఒక మంచి ప్రయత్నం ప్రారంభించింది. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ రిసెర్చ్ డెవలప్ మెంటు కార్పొరేషన్, లారస్ లాబ్ ల సౌజన్యంతో విద్యార్ధుల సృజనాత్మక శక్తులను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగష్టు 8వ తేదీ వరకు విద్యార్ధుల నుండి వివిధ అంశాలపై మోడల్స్, పత్రాలు స్వీకరిస్తుంది. సమర్పంచిన మోడల్స్, పత్రాల్లో అత్యుత్తమ అంశాలను ఎంపిక చేసి బహుమతులను కూడా భారీగా అందజేయుటకు నిర్ణయించింది. మూడు  మొదటి బహుమతులుగా లక్ష రూపాయలు చొప్పున, మూడు ద్వితీయ బహుమతులకు రూ.50 వేలు చొప్పున, మూడు తృతీయ బహుమతులుగా రూ.25 వేలు చొప్పున అందించనున్నారు.         విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పొఫెసర్ కె.రఘుబాబు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విద్యార్ధులకు తరగతులు నిర్వహించే పరిస్ధితి లేదన్నారు. ఈ తరుణంలో విద్యార్ధుల తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయుటకు సెమినార్లను ఉద్దేశించామని చెప్పారు. హైస్కూల్ నుండి పి.జి స్ధాయి విద్యార్ధులు ఇందులో పాల్గొనుటకు అవకాశం కల్పించామని, ప్రతి బృందంలో 5 గురు వరకు విద్యార్ధులు, ఒక మెంటార్ ఉండవచ్చని ఆయన చెప్పారు. ఆగష్టు 8వ తేదీ నాటికి విద్యార్ధులు తమ వ్యాస పత్రాలు, మోడల్స్ సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలు, మోడల్స్ ను ఆగష్టు 9 నుండి 14వ తేదీ మధ్య ఆన్ లైన్ లో విద్యార్ధులు ప్రదర్శించాలని చెప్పారు. వాటిలో  అత్యుత్తమ మోడల్స్ ఎంపిక చేసి ఆగష్టు 15వ తేదీన తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని రఘు పేర్కొన్నారు. దేశం నలుమూలల నుండి విద్యార్ధులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర గణనీయంగా ఉందని, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి సూచనలు సలహాలు అందించాలని కోరారు. ఆన్ లైన సెమినార్లపై విద్యార్ధులకు, మెంటార్లకు అవసరమగు సమాచారం కోసం ప్రొఫెసర్ కె.రఘుబాబు, 9440114243 లేదా drraghualways@yahoo.co.in కు సంప్రదించవచ్చని చెప్పారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.brau.edu.in ను కూడా సంప్రదించవచ్చని ఆయన వివరించారు.

Srikakulam

2020-07-29 14:56:44

ఎం.ఎస్.ఎం.ఇలు ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమలు(ఎం.ఎస్.ఎం.ఇలు) ఉద్యం రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని  జిల్లా పరిశ్రమల కేంద్రం  జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ  బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్.ఎం.ఇలను తరగతి వారీగా నమోదు చేయు విధానాన్ని సరళీకృతం చేసి  జూలై 1వ తేదీ నుండి ఉద్యం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇలు ఇప్పటి వరకు ఉద్యోగ్ ఆధార్ మెమోరాండమ్(యు.ఎ.ఎం)లో నమోదు చేసే వారని ఇకపై ఉద్యం రిజిస్ట్రేషన్ లోనే నమోదు చేయాలని సూచించారు. యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి కోటి రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 5 కోట్లు వరకు ఉన్న పరిశ్రమలను సూక్ష్మ తరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 10 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 50 కోట్లు వరకు ఉన్న  చిన్నతరహా పరిశ్రమలుగాను., యంత్ర సామగ్రి, పరికరాల మీద పెట్టుబడి 50 కోట్ల రూపాయల వరకు ఉండి, అమ్మకం టర్నోవర్ రూ 250 కోట్లు వరకు ఉన్న మధ్యతరహా పరిశ్రమలుగాను కేంద్ర ప్రభుత్వం విభజించిందని వివరించారు. ఈ విభజన ప్రకారం ఉత్పత్తి ప్రారంభించిన  పరిశ్రమలు, సంబంధించిన పారిశ్రామిక వేత్తలు http://udyamregistration.gov.in లో వివరాలు నమోదు చేసుకొని ఉద్యం రిజిస్టేషన్ ను పొందవచ్చని చెప్పారు. గతంలో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, పార్ట్- రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు, తీసుకోనివారు, ఉద్యోగ ఆధార్ తీసుకున్న వారు, తీసుకోనివారుతో సహా ఇంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోని పాత వారు, కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన వారు అందరూ కూడా తప్పనిసరిగా ఉద్యమం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన స్పష్టం చేసారు. రిజిస్ట్రేషన్ పొందని ఎం.ఎస్.ఎం.ఇలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏటువంటి సహాయం ఉండదని ఆయన వివరించారు.  ఈ విషయాన్ని ఎం.ఎస్.ఎం.ఇ రంగంలోని వారు వెంటనే ఉద్యం రిజిస్ట్రేషన్ పొందాలని ఆయనసూచించారు.

Srikakulam

2020-07-29 14:53:00

శంఖవరం మండలంలో 47కి చేరిన కరోనా కేసులు..

శంఖవరం మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ ల సంఖ్య 47కి చేరుకుందని పీహెచ్సీ వైద్యాధికారి ఆర్వీవి సత్యన్నారాయణ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శంఖవరంలో 22, మండపంలో 4, పి.చామవరం1, స్రుంగవరం9, బంగారయ్యపేట1, గిడిజాం1, రౌతులపూడిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. పాజిటివ్  వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు చేయనున్నట్టు చెప్పారు. వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు అత్యవసర సమయాల్లో తప్పా బయటకు రాకూడదన్నారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు, తరచుగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు. పాజిటివ్ వచ్చినవారందరికీ హోమ్ ఐసోలేషన్ ద్వారా చికత్స అందిస్తున్నట్టు డాక్టర్ వివరించారు. మరోవైపు కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది..

Sankhavaram

2020-07-29 14:24:13

ఏపీలో మనం అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్నాం..సీఎం

రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజుకు 50వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే అని ముఖ్యమంత్రి అన్నారు. 90శాతం పరీక్షలు కొవిడ్‌ క్లస్టర్లలో చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని,  కొవిడ్‌ వస్తుంది.. పోతుంది.. కొవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 85శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, డిఎంహెచ్ఓ ఎం.చెంచయ్య, డిఇ ఓ కె.చంద్రకళ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-07-28 20:20:03

కరోనా నియంత్రణకు అన్నిశాఖలు సమన్వయం కావాలి...

విశాఖలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తో పాటు గ్రామ సచివాలయం నుండి జిల్లా సచివాలయం వరకు అధికారులందరూ  అప్రమత్తంగా ఉంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని మపర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు అధికారులను అదేశించారు. ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, తీసుకోవాల్సిన  జాగ్రత్తలు, నిరోధక చర్యలు, నియంత్రణపై తగిన సూచనలు ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయి వైద్య ఆరోగ్య సిబ్బందికి, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు, ఎస్.హెచ్.జి.ల మహిళలకు, విద్యార్థులకు ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహనను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో  తప్ప బయటకు రాకూడదన్నారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని తెలియజేశారు.  భీమిలిలో   అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మం త్రి  అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో పంచాయతీ రాజ్‌  తదితర అభివృద్ధి పనులపై భీమిలి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రోడ్లు భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి నిర్మించే క్రమంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు.  ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నందున మంజురైన అభివృద్ధి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్లు, తాగునీటి పనులు, భవనాలు ఎన్ని మంజూరు అయ్యాయో, వాటిలో పూర్తి అయినవి, వివిధ దశల్లో ఉన్న నిర్మాణ పనుల వివరాలు, సమస్యలపై చర్చించారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలను వెంటనే పూర్తి చేయాలనన్నారు. మనబడి, నాడు-నేడు పథకాల  కింద మండలాలలో ఈ ఏడాది మొత్తం 28 స్కూల్ బిల్డింగ్ లకు పనులు నిర్వహిస్తామన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చారని తెలిపారు. పాఠశాలల ప్రహరీ గోడల వరకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని, ప్రహరీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి  అధికారులను ఆదేశించారు. అలాగే గ‌త కొన్ని నెలలుగా మూత ప‌డిన చిట్టి వ‌ల‌స జ్యూట్ మిల్ కార్మికుల స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది..కానీ కరోనా మహమ్మారి నేపథ్యంలో విశాఖపట్నం అక్కయ పాలెం లేబర్ ఆఫీస్ లో జెసిఎల్ , డీసీయెల్ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ గడువు దాటి పోయింది, వెంటనే అగ్రిమెంట్ ని పునరుద్ధరణ చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు జ్యూట్ మిల్ కార్మికుల‌కు వివరించారు..ఈ సమావేశంలోమండల అధికారులు, జీవీఎంసీ జోనల్ కమీషనర్లు, నాయకులూ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-07-28 20:05:11

విశాఖలో సెంచరీకి చేరువలో కరోనా వైరస్ మరణాలు..

విశాఖజిల్లాలో కరోనా వైరస్ ద్వారా సోకిన మరణాలు వందకు చేరువలో రావడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం నాటికి 71 మరణాలు జిల్లాలో సంభవించాయి. అధికారిక లెక్కల ప్రకారం 5103 మంది కోవిడ్ 19కి వివిధ క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా, 2676 మంది వ్యాధి నుంచి కోల్కొని ఇంటికి చేరుకున్నారని కోవిడ్ 19 మూడు జిల్లాల ప్రత్యేక అధికారి డా.పీవీ సుధాకర్ తెలియజేశారు. 116 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 274 సాధారణ క్లస్టర్లు, 275 డోర్మాన్ట్ లు, 39 డిటోటిఫైగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే వుందని చెప్పిన ఆయన ప్రజలు వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. మాస్కు లేకుండా బయటకు రాకూడదని, అత్యవసర సమాయాల్లో తప్పా అంతా ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయక చర్యలు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పర్యవేక్షణలో జరుగుతున్నాయన్నారు.

2020-07-28 15:52:02

విశాఖ కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటండి..

విశాఖ మహానగరాన్ని కాలుష్యాన్ని రక్షించేందుకు ప్రతీ ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ప్రముఖ సమాజసేవకులు సానా రాధ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖ మహానగరంలో రోజు రోజుకూ కాలుష్యం పెరుగుతోందన్నారు. దీనిని నియంత్రించడానికి ప్రతీ ఇంట్లో, ప్రతీ ఒక్కరూ తమ పేరుతో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారే తీసుకోవాలన్నారు. మొక్కలు నాటే సమయంలో ఫలసాయం, నీడను ఇచ్చే మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా బాదం మొక్కలు, సిల్వర్ ఓక్ మొక్కలు, టేకు మొక్కలు, పనస, మామిడి, జామ తదితర మొక్కలను నాటడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వాటిని పెంచే ఆశక్తి కూడా కలుగుతుందన్నారు. నగరంలో పచ్చదనం ఎంత ఎక్కువైతే అంత కాలుష్య నియంత్రణ జరుగుతుందని రాధా ఆశాభావం వ్యక్తం చేశారు.

Visakhapatnam

2020-07-27 22:38:20

కరోనా ఫలితాల్లో ఐఎంఏ సేవలు చాలా అవసరం...కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ చికిత్సలో మంచి ఫలితాలు సాధించుటకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం బాగుందని, వైద్యులు చక్కటి సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎక్కువ మంది వైద్యుల సేవలు అవసరం అందుకు వైద్యులను సమకూర్చాలని ఆయన కోరారు. రోజుకు 5 వందల వరకు కేసులు వస్తున్నాయని చెప్పారు. పరీక్షల సామర్ధ్యంను పెంపుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో మరో విఆర్డిఎల్ లాబ్ ను పీపుల్స్ లాబ్ గా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ లాబ్ వలన రోజుకు అదనంగా 2 వేల పరీక్షలు చేయవచ్చని చెప్పారు. కరోనా చికిత్సకు పల్మనాలజిస్ట్ సేవలు అవసరం ఎక్కువగా ఉందని కలెక్టర్ చెప్పారు. స్పెషలిస్ట్ వైద్యులకు వేతనంగా లక్షా 50 వేల రూపాయలను ప్రభుత్వం నిర్ణయించిందని, ఎంబిబిఎస్ వైద్యులకు 75 వేల రూపాయల వరకు చెల్లించుటకు నిర్ణయించిందని ఈ మేరకు జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బంది వ్యవహారాల పర్యవేక్షకులు హెచ్. కూర్మారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.జగన్నాథ రావు,  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కె.అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-07-27 22:20:44

అర్హత కలిగిన గిరిజనులకి అటవీహక్కులు మంజూరు..

అర్హత కలిగిన గిరిజన రైతులకు అటవీహక్కు పత్రాలు మంజూరు చేయాలని ఇంచార్జి సబ్ కలెక్టర్ ,సమీకృత గిరిజనాభివృద్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వేంకటేశ్వర్ సలిజామల పేర్కొన్నారు. 2005కు మందు అటవీభూములు, రిజర్వుఫారెస్ట్ భూముల్లో వ్యవసాయం,కాఫీసాగు చేస్తున్న రైతులకు అటవీ హక్కుపత్రాలు మంజూరు చేసి న్యాయం చేయాలని స్పష్టం చేసారు. సోమవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో ఎస్ డి ఎల్ సి కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వి ఎస్ ఎస్ భూములకు హక్కపత్రాలు మంజూరు చేయాలని వచ్చిన దరఖాస్తులను బృందాలుగా ఏర్పడిపరిశీలించారు. ఈసందర్భంగా పి ఓ మాట్లాడుతూ గిరిజన రైతులకు రైతు భరోసా అందించి లబ్ది చేకూర్చాలని ప్రభుత్వ ఆశయ సాధనకు అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి గిరిజన రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు. కాఫీ రైతులసాగు చేస్తున్న భూములకు హక్కుపత్రాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డి ఎఫ్ ఓలు వినోద్ కుమార్, విఘ్నేష్, ఫారెస్ రేంజ్ అధికారులు, 11 మండలాల తహాశీల్దార్దులు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ డి టి ఈశ్వరరావు , ఆర్ ఐలు , బీటు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

2020-07-27 19:01:01

ఇక కరోనా పరీక్షల ఫలితాలు 24గంటల్లోనే..జిల్లా కలెక్టర్

ప్రజలు కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు.  సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రజలనుద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లాలో 4,687 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రాంతాలనుండి కేసులు వస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనించి జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నమూనాల పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడం జరిగిందని ఆయన అన్నారు. సోమ వారం (జూలై 27) నుండి రోజుకి నాలుగు వేల నమూనాలు పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాకు  7 వేల రాపిడ్ కిట్లు కూడా సోమ వారం వస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ప్రజలు అందించిన విరాళాల సహకారంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపుల్స్ ల్యాబ్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ లాబ్ వల్ల అదనంగా 2 వేలు పరీక్షలు నిర్వహించగలమని స్పష్టం చేశారు. గతంలో నమూనాలు తీసిన తర్వాత ఫలితాలకు కొంత సమయం పట్టేదని ఇకపై 24 గంటల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  నమూనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఫలితాలు వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. ఫలితాలు వచ్చే వరకు ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. ఒక వ్యక్తి ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా విధిగా ఐసోలేషన్ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు బయటకు తిరగరాదని తద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని గ్రహించాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి కేసులు పెరుగుతున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వివాహాలు, వేడుకలు ఎవరూ నిర్వహించరాదని ఆయన కోరారు. ప్రజలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు, బంధువుల వద్దకు రాకపోకలు సాగించ వద్దని తద్వారా కరోనా భారీన పడే అవకాశం ఉందని గ్రహించాలని చెప్పారు. కంటైన్మెంటు జోన్ లో ఉన్న కుటుంబాలు కూడా బయటకు రాకపోకలు చేయవద్దని ఆయన సూచించారు.  కంటైన్మెంటు జోన్ లో ఉన్న కుటుంబాలను పరీక్షించిన అనంతరం 60 శాతం మందికి పాజిటివ్ నిర్ధారణ జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే వచ్చి ఆసుపత్రుల్లో చేరాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో వచ్చి చికిత్స పొంది ఇంటికి వెళ్ళేటప్పుడు ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు రూ.2 వేల రూపాయలను అందిస్తామని అన్నారు. సప్త వార ప్రక్రియలో భాగంగా ఆరోగ్య బృందాలు ఇంటింటి సర్వేకు వచ్చినప్పుడు పక్కా సమాచారం అందించాలని కోరారు. లక్షణాలు ఉన్నప్పటికి దాచి పెట్టరాదని ఆయన కోరారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో స్వచ్చందంగా పరీక్షలకు వచ్చే వారికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రోజుకు 150 మందికి పరీక్షించుటకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.   తహశీల్దారు అధీనంలో అంబులెన్సు : ప్రతి తహశీల్దారు అధీనంలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ నివాస్ చెప్పారు. మండల పరిధిలో ఎక్కడైనా కేసులు సమాచారం అందితే వెంటనే ఆసుపత్రులకు, కోవిడ్ కేర్  సెంటర్లకు అంబులెన్సులో తరలించడం జరుగుతుందని ఆయన చెప్పారు.  అదేవిధంగా ఆస్పత్రిలో సేవలు ఎక్కువ చేయుటకు సిబ్బందిని నిర్మిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.  పేషెంటు సేవలు మెరుగుకు చర్యలు  : ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మరింత మెరుగైన వైద్య చికిత్సను అందించుటకు, పర్యవేక్షణకు వైద్యులను, సిబ్బందిని నియమిస్తున్నామని, నోటిఫికేషన్లు జారీ చేసామని, కొన్ని పోస్టులకు భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యాయని కలెక్టర్ చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకోవడానికి జెమ్స్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని అన్నారు.  జెమ్స్ లో కంట్రోల్ రూమ్ 1800 425 6625 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని అన్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల సమస్యలను తెలియజేయుటకు జిల్లా కంట్రోల్ రూమ్ నంబరు 08942 240605, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి సమస్యలకు కంట్రోల్ రూమ్ 08942 240615 ను ఏర్పాటు చేసామని కలెక్టర్ చెప్పారు. వీటితోపాటు జిల్లాలో 104 కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వివక్ష చూపే వారిపై కేసులు  : కరోనా కారణంగా వివక్ష చూపే వారిపై ఎపిడమిక్ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కరోనా ఎవరికైనా సోకవచ్చని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన అన్నారు.

Srikakulam

2020-07-27 18:40:24

ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా వైద్యసేవలు...కలెక్టర్

విశాఖపట్నం  జిల్లాలో  కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాధి వ్యాప్తి అరి కట్టేందుకు సమగ్ర, వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించడానికి  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేసారు.  పట్టణ ప్రాంతాలలో  జి.వియం.సి.కమిషనర్, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపల్ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించవలసి ఉంటుందని తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ట్రేసింగ్ చేయడానికి వార్డు సచివాలయం “ప్రైమరీ హెల్త్, సర్వైలెన్సు టీమ్” (పి.హెచ్ .ఎస్ టి ) గా వ్యవహరిస్తుందని తెలిపారు.  సెకండరీ స్థాయిలో టెస్టింగ్ చేయడానికి జి.వి.యం .సి.లో ఒక వార్డు, మునిసిపాలిటీలలో 3 వార్డులు “సెకండరీ హెల్త్ , సర్వైలెన్సు టీమ్” గా వ్యవహరిస్తుందని తెలిపారు.  టెర్షరీ స్థాయిలో ట్రీట్ మెంట్ చేయడానికి కార్పోరేషన్, మునిసిపాలిటి “టెర్షరీ హెల్త్, సర్త్వెలెన్సు టీమ్” గా వ్యవహరిస్తారని తెలిపారు.  జి.వి.యం.సి. కమీషనర్, మున్సిపల్ కమీషనర్లు  ప్రతి స్థాయిలోను సమావేశాలు జరిపి, సంబందిత అధికారులకు శిక్షణ ఇప్పించి, అవగాహన కల్పించాలని తెలిపారు.  ట్రేసింగ్ స్థాయిలో వార్డు  పరిపాలనా కార్యదర్శి ఆధ్వర్యంలో కంటైన్మంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్ లను  నెలకొల్పుతారు.  వార్డు ఆరోగ్య కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, ఎ.ఎన్.ఎం, ఆశా కార్యకర్త, సంబంధిత వాలంటీర్, యుసిడి, మెప్మా రిసోర్స్ పర్సన్ లు  కంటైన్మంట్ జోన్లలో ఎన్హన్స్డ్ యాక్టివ్ సర్త్వెలెన్సు (ESA)   కార్యక్రమం క్రింద, హై రిస్క్ వ్యక్తులు(HRP) గా గుర్తించబడిన  60 సంవత్సరములు దాటిన  వ్యక్తులకు, 40 సం.ల పై బడి బి.పి, డయాబెటిక్, ఆస్తమా, టి.బి, కాన్సర్, లివర్, కిడ్ని వ్యాధులు, సి.ఓ.పి.డి,  ఆవయవాలు మార్పిడి చేయించుకున్న వ్యక్తులు, హెచ్.ఐ.వి., ఎయిడ్స్ లకు చికిత్స పొందుతున్న వ్యక్తులు, గర్బిణీ స్త్రీలు, 10 సంవత్సరాలలోపు పిల్లలు, జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  పడుతున్న వ్యక్తులను ఇంటింటికి తిరిగి గుర్తించాలి.  కాంటాక్ట్ ట్రేసింగ్ లో పాజిటివ్ వ్యక్తులుగా గుర్తించబడిన వ్యక్తుల ప్రాధమిక, సెకండరి కాంటాక్టులను  వి.ఆర్.ఓ, మహిళా పోలిస్, వాలంటీర్ లు గుర్తించాలి . డేటాను ఎప్పటికపుడు వార్డు ఎడ్యుకేషన్  డేటా ప్రొసెసింగ్ కార్యదర్శి యం.ఎస్.ఎస్. మరియు సి.ఎం.ఎస్. పోర్టల్ లకు అప్ లోడ్ చేయించాలి . వార్డు శానిటేషన్ కార్యదర్శి హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ  చేయించడంతో  పాటు, శానిటేషన్ పై బాధ్యత వహించాలి.  కంటైన్మంట్ పరిధిలోని షాపులు, సంస్థల మూసివేత, రాకపోకల నియంత్రణను  వార్డు పరిపాలన కార్యదర్శి పర్యవేక్షిస్తారు. వార్డు సంక్షేమ, అభివృద్ది కార్యదర్శి కంటైన్మంట్ క్లస్టర్ లలో మొబైల్ వ్యాన్,  ఆటోరిక్షా ద్వారా నివారణ చర్యలు, జాగ్రత్తలపై ప్రచారం చేయించాలి . పాజిటివ్ కేసును గుర్తించిన 2 గంటలలో కోవిడ్ కేర్ సెంటర్,  ఐసోలేషన్ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు.  సెకండరి కాంటాక్టులను  హోమ్ క్వారంటైన్ లో ఉంచి, ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని వార్డు ఆరోగ్య కార్యదర్శి, ఆశా కార్యకర్తలు నమోదు చేయాలి . కంటైన్మంట్ క్లస్టర్ల  లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ను ఫీవర్ క్లీనిక్ గా  నిర్వహిస్తారు.  లేదా క్లస్టర్ లోని ప్రవేట్ క్లినిక్, ఆసుపత్రిలో  శ్యాంపిల్ లను సేకరిస్తారు. ఈ సౌకర్యాలు లేని సందర్భంలో 104 వాహనాలను కూడా  ఫీవర్ క్లీనిక్ లుగా ఉపయోగిస్తారు.  పాజిటివ్ కేసును గుర్తించిన 12 నుంచి 16 గంటలలోగా మొదటి రౌండ్ సర్త్వెలెన్స్ ప్రారంభించి 48 గంటలలోగా పూర్తి చేయాలని తెలిపారు. రెండు రోజుల తర్వాత రెండవ రౌండ్  సర్త్వె లెన్స్  నిర్వహిస్తారు . పల్స్ ఆక్సీమీటర్లు, క్లినికల్ ఇన్ ఫ్రారెడ్ ధర్మామీటర్లు ఉపయోగించి హైరిస్క్ వ్యక్తులను  స్క్రీనింగ్ చేయాలి . సెకండరీ స్థాయిలో ఎన్.హెచ్.ఎస్.టి.లు హై రిస్క్ వ్యక్తులను  శత శాతం పరీక్షలు నిర్వహించాలి. జి.వి.ఎం.సి. పరిధిలో ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్లు ద్వారా లేదా ట్రూనాట్  టెస్టింగ్ చేయించాలి . పాజిటివ్ ఫలితం వచ్చిన  ఎసిమ్టామేటిక్ వ్యక్తికి, ఇతర వ్యాధులు లేనట్లయితే హోం  ఐసోలేషన్ కు అనుమతిస్తారు.  అత్యవసర సమయంలో సంప్రదించడానికి  జి.వి.ఎం.సి. కంట్రోలు రూము, టెలీ మెడిసిన్ సౌకర్యం, 104 వాహన ఫోన్ నెంబర్లను వారికి అందజేయాలి.  పాజిటివ్ ఫలితం వచ్చిన 60 సంవత్సరముల పై బడిన, ఇతర వ్యాధులున్న వ్యక్తులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలి. తక్కువ వ్యాధి తీవ్రత కలిగిన వ్యక్తులను కోవిడ్ కేర్ సెంటర్ లకు తరలించాలి.  ఎస్.హెచ్.ఎస్.టి. బృందం పాజిటివ్ వ్యక్తుల ప్రాధమిక కాంటాక్టులను క్వారంటైన్ సెంటర్ కు తరలించాలి.  టెర్షరీ స్థాయిలో టి.హెచ్ ఎస్ టి , ప్రాధమిక, సెకండరీ స్థాయి బృందాల పని తీరును పర్యవేక్షిస్తారు.  ఈ  టీమ్ లో కమీషనర్, ఛీఫ్ మెడికల్ ఆఫీసర్, నియోజక వర్గ ప్రత్యేక అధికారి సభ్యులుగా ఉంటారు. 24 గంటలు పని చేసేలా కంట్రోలు రూం ను నిర్వహించాలి.    గ్రామీణ ప్రాంతంలో పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ (సచివాలయాలు - అభివృద్ది ) ఆధ్వర్యంలో  డి.ఎం.హెచ్.ఓ కార్యాలయంలో కంట్రోలు రూమును నిర్వహిస్తారు.  ప్రాధమిక స్థాయిలో ట్రేసింగ్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం  పి.హెచ్.ఎస్.టి.గా వ్యవహరిస్తుంది. సెకండరీ స్థాయిలో టెస్టింగ్ చేయడానికి యం.పి.డి.ఓ, పోలీస్, వైద్యాధికారులు ఎస్.హెచ్.ఎస్.టి.గా  వ్యవహరిస్తారు. టెర్షరీ స్థాయిలో  ఆర్డీవో, సబ్ కలెక్టర్, నియోజక వర్గ ప్రత్యేక అధికారి, డివిజనల్ పంచాయితీ అధికారి  టి .హెచ్.ఎస్.టిగా వ్యవహరిస్తారు.

Visakhapatnam

2020-07-27 18:35:11