విశాఖజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 20 వ తేదీ నాటికి ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాలు, వ్యవసాయం , డీ ఆర్ డీ ఏ, ఐ టి డి ఎ, డీ సీ సీ బి, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్న చిన్న కార రైతుల ఆర్థిక స్వావలంబన కు ప్రత్యేక దృష్టి పెట్టి వారు పండించిన పంటలకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతులు పండించే ఏ పంట నైనా సరే తిరస్కరించకుండా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతు భరోసా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చ ర్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలన్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలకు తెలిసే విధంగా ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాయిశ్చర్ మీటర్లను అమర్చడంతో పాటు, అవసరమైన మెటీరియల్ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏఏ గ్రామాలలో పంట కోతలు మొదలు అవుతాయి అన్న విషయాలను ఆయా రైతులతో మాట్లాడాల్సిందిగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కు ఆదేశించారు. అదే విధంగా సంబంధిత డేటా ను సిద్ధం చేయాలన్నారు. కోతలు పూర్తయ్యే సమయానికి ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాల వద్ద గన్నీలను సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్టేషన్ తో సిద్ధంగా ఉండాలన్నారు. డి ఎస్ ఓ లు సెంటర్ల మ్యాపింగ్ లను తయారు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లా లో మొత్తం 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో డీ ఆర్ డీ ఏ , వెలుగు ద్వారా ఐటీడీఏ పరిధిలో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి విశ్వేశ్వరరావు,మార్కెటింగ్ శాఖ ఏడి కాళేశ్వర రావు, పాడేరు డి పి ఎం సత్య నాయుడు, డిసిసిబి డీజీఎం శ్రీనివాసరావు, డీఎస్ఓ రూరల్ శివ ప్రసాద్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరన్న చౌదరి తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఫైనాన్స్ డైరెక్టర్ గా డి.చంద్రం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 ఐ.ఆర్.ఎ.ఎస్ బ్యాచ్ కి చెందిన ఈయన సౌత్ ఈస్ట్రన్ రైల్వే, కోల్ కతాలోని డిప్యూటీ ఫైనాన్సియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా, రాంచీ(జార్ఖండ్)లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ గా వివిధ హోదాలలో పనిచేశారు. చంద్రం స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సావరకోట మండలం చీడిపూడి. ఎస్.ఎం.పుర్ం ఏపి రెసిడెన్సియల్ స్కూలులో ప్రాధమిక విధ్య, విశాఖలో మెకానికల్ లో పాలిటెక్నిక్, అనంతరం ఐఐటి కాన్పూర్ నుంచి ఎంటెక్ పూర్తిచేశారు. బాధ్యతలు స్వీకరించిన చంద్రంకు సంస్థ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.రాజబాపయ్య, డైరక్టర్ (ఆపరేషన్స్) బి.రమేష్ ప్రసాద్, సీ జీ ఎం లు, వివిధ్ యూనియన్, అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.
విశాఖలో జూపార్కు రేపటి(17.11.20202) నుంచి తెరుకుంటోంది...కరోనా, లాక్ డౌన్ తరువాత జూపార్కును రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు రేపు తెరుస్తున్నారు అధికారులు. అయితే జూకి వచ్చేవారంతా టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా పొందాల్సి వుంటుంది. దానికి కోసంwww.vizagzoo.com ద్వారా లాగిన్ అయి టిక్కెట్లు తీసుకున్న తరువాత జూ రావాలని జూ అధికారులు కోరుతున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ప్రవేశాలు ఉంటాయని జూ అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు, జంతు ప్రేమికులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకుని వాటిని ప్రింట్ అవుట్ ద్వారా తీసుకొని రావాలని కోరుతున్నారు. అంతేకాకుండా టపాసులు, బయట నుంచి తెచ్చే ఆహార పదార్ధాలు లోనికి అనుమతించేది లేదని కూడా తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అన్నీ తెలుసుకున్న తరువాత మాత్రమే జూకి టిక్కెట్లు తీసుకోవాలని కూడా విశాఖ జూ అధికారులు సూచిస్తున్నారు.
కార్తీక మాసంలో భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కలిగించనున్నట్లు ప్రజారవాణా శాఖ డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి తెలిపారు. సోమవారం ప్రజారావాణా శాఖ కార్యాలయంలో, డివిజనల్ మేనేజరు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట శైవ క్షేత్రాలైన పంచారామాల సందర్శనకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగిందన్నారు. కార్తీక మాసంలోని ఆదివారం సాయంత్రం 4 గం.లకు బస్సు బయలుదేరుతుందని, మంగళవారం వేకువఝామున సురక్షితంగా తిరిగి చేర్చడం జరుగుతుందని తెలిపారు. సూపర్ డీలక్స్, అల్ట్రా డీలక్స్ , పుష్ బ్యాక్, డీలక్స్, ఎక్స్ ప్రెస్ లతో పాటు పల్లె వెలుగు బస్సులను కూడా వేస్తున్నట్లు తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు పెద్దలకు రూ.2,100లు, పిల్లలకు రూ.1575 లు, అల్ట్రా డీలక్స్ బస్సులకు పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 1960 లు, పిల్లలకు రూ.1470 లు, ఛార్జీలు వుంటాయన్నారు. రిజర్వేషన్ ఛార్జీలు అదనంగా వుంటాయన్నారు. మరిన్ని వివరాలకు 9959225608, 7382921647, 7382919694 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. అదే విధంగా శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం, రావివలస, శ్రీచక్రపురం వెళ్ళదలచుకున్న వారికి కూడా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. శబరిమలై వెళ్ళే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీతో బస్సులను ఏర్పాటు చేస్తామని, ఈ నెల 20వ తేదీ నుండి తుగభద్ర పుష్కరాల సందర్భంగా బస్సులను ఏర్పాటు చేయడానికి సిధ్ధంగా వున్నామని తెలిపారు. భక్తులు, బృందాలుగా వచ్చి బుక్ చేసుకోవాలని కోరారు. అనంతరం కార్తీక మాస ప్రత్యేక ప్యాకేజీల ఫాంప్లెట్ ను విడుదల చేసారు. కోవిడ్ సంబర్భంగా బస్సులలో థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 1 వ డిపో మేనేజరు వి.ప్రవీణ, అసిస్టెంట్ మేనేజరు వి.రమేష్, ఆర్.సి.జి.ఎ.ఎన్.ఎస్. శ్రీనివాస్, ఎస్.టి.ఐ. ఆర్ వెంకటేష్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో అన్నిరకాల క్రీడలకు నిలయంగా విజ్జీ స్టేడియంను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మంత్రి విజ్జి స్టేడియంలో జరుగుతున్న పనులను తనిఖీ చేసారు. క్రికెట్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్ రింగ్, ఖేలో ఇండియా కింద చేపడుతున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులపై ఆరా తీసారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేయాల్సిన పనులు, అవసరమైన నిధులు, తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని, సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి పనులు జరిగేలా చూస్తానని అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నవి వేగంగా జరగాలని, డి.పి.ఆర్. ప్రకారం నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని ఆయా ఇంజనీర్లను ఆదేశించారు. ఖేలో ఇండియా క్రింద రూ.6 కోట్లుతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు జరుగు తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని, 60 శాతం పనులు పూర్తయ్యాయని శాప్ సహాయ సంచాలకులు రమణ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.3 కోట్లు నిధులు వచ్చాయని, రూ2.5 కోట్లు విఎంఆర్డిఎ, 25 లక్షలు మున్సిపల్, 25 లక్షలు ఎం.పి. ల్యాడ్స్ నుండి రావలసి ఉందని ఎడి రమణ తెలిపారు. విఎంఆర్డిఎ కమిషనర్ తో టెలిఫోన్ ద్వారా నిధుల కోసం మంత్రి మాట్లాడారు. విజ్జి స్టేడియం పనులు తనిఖీచేసి నిధులను విడుదల చేయాలని కమిషనర్ కోటేశ్వరరావును కోరారు . జిల్లాలో గతంలో మంజూరైన వై.ఎస్.ఆర్. క్రీడా వికాస కేంద్రాల పనులను కూడా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాజీవ్ క్రీడా మైదానాన్ని కూడా తనిఖీ చేసి అక్కడ కూడా క్రీడాకారులకు అనువుగా వుండేలా అభివృద్ది చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎ.పి. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రోజక్ట్ రూ.20 కోట్లతో చేపట్టడం జరిగిందని, క్రీడా సౌకర్యాలు, అకామడేషన్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లను నిర్మించడం జరుగుతోందని, పనులు పురోగతిలో నున్నాయని రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు జె. వెంకటరావు, ఆర్డిఓ భవానిశంకర్, సెట్విజ్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి మండలం రేబాక పాలిటెక్నిక్ కళాశాలను ఆనుకొని రూ.45 కోట్లతో స్కిల్ డెవలెప్ మెంట్ కళాశాల నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ ప్రకటించారు. ఆదివారం శంకరం, రేబాక గ్రామాల్లో మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో ప్రజలలో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాది, ఉద్యోగాలు లక్ష్యంగా ఈ స్కిల్ డెవలెప్ మెంట్ కళాశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. అదేవిధంగా రూ. 20లక్షలతో శంకరంలో సిసిరోడ్డు కూడా నిర్మించనున్నట్టు వివరించారు. టిడిపి పార్టీ ప్రాంతం అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాను సారం అనకాపల్లి నియోజకవర్గంలో పూర్తిస్తాయి అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడతున్నట్టు వివరించారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపా పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో , యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ నోట్ల శేఖర్, పార్టీ జిల్లా కార్యదర్శి పల్లెల శివ, మాజీ వైస్ సర్పంచ్లు బంటు ఏడుకొండలు, గుడాల మణిబాబు, నాయకులు కోట సత్తిబాబు, మంత్రి సత్యనారాయణ అధిక సంఖ్యలో మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2020-21 ఆర్ధిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 122, ను ఈ నెల 01.10.2020 న ఉత్తర్వులు జారీ చేసినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు తెలియజేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు కలిగి (1 అక్టోబరు నెల నుంచి డిసెంబర్ 31 2020) వరకు రెన్యూవల్ చేయించుకున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం క్రింద 30.11.2020 తేది లోపు ప్రీమియం పైకం రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి 31.03.2021 వరకు లబ్ధి పొందాలని శ్రీనుబాబు కోరారు. Head of Account: 8342-00-120-01-03-001-001 , DDO Code: 2703-0802-003 లో ప్రీమియం చెల్లించిన జర్నలీస్టులు ఒరిజనల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీలను విశాఖలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. అత్యవసర సమయంలో జర్నలిస్టులకు ఆపద్భాందవిగా హెల్త్ కార్డు పనిచేస్తుందనే విషయాన్ని జర్నలిస్టులు గుర్తించుకోవాలన్నారు.
బాలలకు సేవ చేస్తే అది మాధవుడికి సేవచేనట్టేనని మధురవాడ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు నక్కా శ్రీధర్, అచ్యుతరావు లు పేర్కొన్నారు. ఆదివారం మిథిలాపురి ఉడా కాలనీలో.. బాలల దినోత్సవం సందర్బంగా సన్ ఫ్లవర్ దివ్యాంగ బాలల కేంద్రానికి నిత్యవసర వస్తువులు, దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అనాధశరణాలయంలో పెరుగుతున్న బాలలకు నా అనేవారు లేరనే బాధను తొలగించాలంటే మనసున్న దాతలు ముందుకి వచ్చి వారికి తమవంతు సహకారం అందించాలన్నారు. పిల్లలు దేవుడితో సమానమని, అందులోనూ దివ్యాంగులను సేవచేస్తే అది మాధవుడికే చెందుతుందని అన్నారు. మధురవాడ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేష్ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ అసోసియేషన్ ద్వారా కొంత చేయూత అందించినట్టు చెప్పారు. ప్రతీఏటా తమ అసోసియేషన్ తరుపుతన సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని ఉపాధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పోతిన శివ, లొడగల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వారోత్సవాలు ఈ నెల14 నుండి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పాలవలస విక్రాంత్ బ్యాంక్ అవరణలో శనివారం సహకార బ్యాంక్ పతాకన్ని ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ పాలవలస విక్రంత్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్మ నిర్బర్ భారత్ ను ప్రకటించారని చెప్పారు. సహకార సంస్దలు ఈ అంశం పై దేశ స్దాయిలో చర్చలు జరపాలని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ లో స్వయం ప్రతిపత్తిగల దేశంగా, స్వయం సమృద్దిగల దేశంగా , ప్రపంచ ఆర్దిక వ్యవస్దలో భారత దేశాన్ని గొప్పగా చుాపడమే మన ప్రధాన మంత్రి ఉద్దేశ్యం అని అయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పాల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సహకార సంస్ద అయిన ఆముాల్ తమ వంతు సహకారాన్ని అందించారని చెప్పారు. సహకార రంగం మరింత బలోపేతం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి కె.ఎం.మురళి క్రిష్ణా రావు, డివిజనల్ సహకార అధికారి రమణ మూర్తి, డిసిసిబి జనరల్ మేనేజర్ పి. జ్యోతిర్మయి, డి జి ఎం లు ఎస్వి.సత్యనారాయణ, ఎస్ వి ఎస్.జగదీష్, ఎస్ రమేష్, జి శ్రీనివాసరావు. ఎస్.విజయ్ కుమార్, కె మురళీకృష్ణ. తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 109 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు ఆదివారం 109 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
శ్రీకాకుళంజిల్లా ఐ.టి.ఐలలో రెండవ విడత అడ్మిషన్లకు ఈనెల 18వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపాల్ మరియు కన్వీనర్ రాడా కైలాస రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ 2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రయివేటు ఐ.టి.ఐ లలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లు భర్తీ చేయుటకు ఉపాధి మరియు శిక్షణ శాఖ కమీషనర్ ఆదేశాల జారీ చేశారని ఆయన తెలిపారు. అభ్యర్థులు www.iti.nic.in వెబ్సైటులో ఆన్ లైన్ లో 18వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐలో చేరుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19వ తేదీన, ప్రయివేటు ఐ.టి.ఐలో చేరుటకు ఈ నెల 20వ తేదీన ఆయా ఐ.టి.ఐ వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నకలుతో హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరములకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు ఐ.టి.ఐ లలో సంప్రదించవచ్చని ఆయన వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తిలోనే ఉందని, కార్తీక మాసం దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. సోమవారం నుండి కార్తీక మాసం ప్రారంభం ప్రారంభం కానుండటంతో భక్తులకు పలు సూచనలు జారీ చేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీక మాసం పేరుతో ఆలయాల వద్ద అధిక రద్దీ ఉండకుండా చూడాలని కోరారు. అధిక రద్దీ ప్రదేశాల వద్ద కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ ఉంటుందని గుర్తించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గర పూజలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని చేసుకునే పూజలు వలన కుటుంబం కరోనా భారీనా పడే అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. చలి కాలంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని, రెండవ దశ వ్యాప్తి జరుగుతుందని ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్న సూచనలు అందరూ అవగాహన చేసుకుని ఉంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటి దృష్ట్యా సురక్షితంగా ఉండే విధంగా కార్తీక మాసం పూజలు నిర్వహించు కోవాలని కోరుతూ ఆలయాలకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్కు ధారణ మరచిపోవద్దని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. దీపాలు వెలిగించే ముందు చేతులకు శానిటైజర్ పూయరాదని ఆయన సూచించారు. సురక్షిత చర్యలు చేపట్టి కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ కోరారు.
జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వీలుగా ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్టులకు ఈనెల 17వ తేదీన ( మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 00 గంట వరకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులు అందరూ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రారంభ సమావేశంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొంటారని తెలిపారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ ప్రారంభోపన్యాసం చేస్తారని, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కూడా పాల్గొంటారని వివరించారు. నెల్లూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ తరగతుల్లో ' వార్తలు సేకరించడంలో మెలకువలు, వార్తల్ని పసిగట్టడం ఎలా' అనే అంశంపై జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ పత్రిక మాజీ ప్రధాన సంపాదకులు జి.వల్లీశ్వర్, రచన స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్ గా, అధ్యాపకులుగా వందల మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఉమామహేశ్వరరావు ' వార్తల రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు' అనే అంశంపై ఉపన్యసిస్తారని వివరించారు. శిక్షణ తరగతుల సందర్భంగా జర్నలిస్టులు ఆన్ లైన్ లోనే తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ లింక్ అనంతపురం జిల్లాలోని జర్నలిస్టులందరికీ 16వ తేదీన సాయంత్రమే పంపుతామని తెలిపారు.
ఆన్ లైన్ లో స్టడీ మెటీరియల్ :
జర్నలిస్టులకు ఉపయుక్తం గా ఉండేందుకు స్టడీమెటీరియల్ ఆన్ లైన్ ద్వారా పంపుతామని దేవిరెడ్డి శ్రీనాథ్ వెల్లడించారు. వార్త అంటే ఏమిటి, కథనాలు రాయడం ఎలా, టీవీ రిపోర్టర్ ఎలా ఉండాలి, క్రైమ్ బీట్ పై ఫోకస్, తప్పులు రాయవద్దు తదితర పది అంశాలపై రూపొందించిన బుక్ లెట్ పిడిఎఫ్ మెటీరియల్ మెయిల్ ఐడి లకు పంపుతామని వివరించారు. తరగతులకు హాజరైన జర్నలిస్టులకు అదేరోజు సాయంత్రం ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు కూడా పంపుతామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మెట్ట భూములకు కూడా సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైయస్సార్ జలకళ’ పథకంతో బీడు భూములు కూడా సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ పథకంతో సిఎం మెట్టభూముల రైతుల కన్నీళ్లు తుడిచారని కితాబిచ్చారు. కురుపాం పంచాయతీ పరిధిలోని కస్పాగదబవలస గిరిజన గ్రామంలో ఆదివారం వైయస్సార్ జలకళ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తానని, మెట్ట భూముల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని, నవరత్నాల్లో భాగమైన ఆ హామీని జలకళ పథకం ద్వారా నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలకు లోపు భూమి కలిగిన రైతులందరూ కూడా ఈ పథకంలో లబ్ది పొందడానికి అర్హులేనని వివరించారు. బోరు వేయడంతో పాటుగా దానికి అవసరమైన మోటారును, విద్యుత్ సరఫరాను కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తుందని చెప్పారు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఇతర రైతులతో కలిసి ఉమ్మడిగా బోర్లు వేయించుకోవచ్చునన్నారు. ఒకసారి బోరు విఫలమైతే మరోసారి కూడా బోరు వేయించుకొనే అవకాశం ఉంటుందని గుర్తు చేసారు. జలకళ పథకంలో బోర్లు వేయడానికి ముందు శాస్త్రీయ పరిశీలనలు చేసిన తర్వాతనే బోర్ పాయింట్ ను గుర్తించడం జరుగుతుందని, ఈ కారణంగా బోర్లు విఫలమైయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రభుత్వం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 రిగ్ లను కూడా సమకూర్చిందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గతంలో మెట్ట రైతులు తమకు ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు చేసి బోర్లు వేయించుకొనే వారని, ఆ బోర్లు విఫలమైతే అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని చెప్పారు. ఈ కష్టాలను కడతేర్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు. వైయస్సార్ జలకల పథకం ద్వారా ప్రభుత్వం చితంగా వేయించే బోర్లతో ఇప్పటి దాకా బీడువారిన లక్షలాది ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని, మెట్టభూముల రైతుల కళ్లల్లోనూ ఆనందకాంతులు నిండుతాయని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోర్లు వేయించుకోవడానికి, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి ఎవరికీ పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పదిహేడు నెలల పాలనలోనే తాను రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని, రాష్ట్రంలో ఉన్నది రైతు రాజ్యమని అందరికీ అర్థమైయ్యేలా చేసారని, రైతుల కన్నీళ్లు తుడిచారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్నికల కన్వీనర్ బొంగు సురేష్, మాజీ జడ్పీటీ పద్మా వతి,మాజీ ఎంపీటీసీ గొర్లి సుజాత, కురుపాం, జియ్యమ్మవలస వైసీపీ పార్టీ కన్వీనర్ లు ఎం. గౌరిసంకరరావు ,ఐ. గౌరిసంకరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరావు, వైస్సార్సీపీ మైనార్టీ నాయకులు షేక్ నూరుల్లా, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కె.సురేష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, ఐరుక కార్పొరేషన్ డైరెక్టర్ గవర విజయ్ చంద్ర శేఖర్, ఎంపీడీఓ మురళీకృష్ణ, ఉపాధి హామీ ఏపిడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రఖ్యాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అధికార మర్యాద చెయ్యాలంటూ దేవాదాయశాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేయడం దారుణమని జనసేన నాయకులు పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకోసం పాటు పడాల్సింది పోయి.. ఈ నెల 18 న స్వామీజీ జయంతికోసం ఏకంగా ప్రముఖ దేవలయాల్లో పూజలు, మర్యాదలు చేయాలని జీఓ జారీచేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కి సన్నిహితుడు అన్న కారణంగా ఇప్పటికే ప్రభుత్వం స్వామి ముందు సాగిలపడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి స్వామి భక్తివుంటే దానిని ప్రజలు, ఆలయాల మీదకు జీఓల ద్వారా రుద్దడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పద్దతి కాదన్నారు. స్వామీజీలకు, మఠాధిపతులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలకు పూర్తిస్థా వైద్యం అందించడంలోనూ, పీహెచ్సీల్లో అన్నిరకాల పారామెడికల్ సిబ్బందిని నియమించడంలోనూ, చదువులు చెప్పే పాఠశాలల్లో అన్ని తరగతులకు ఉపాధ్యాయులను నియంమించడానికి, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు, వివిధ ప్రభుత్వ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి వినియోగించాలని అన్నారు. అలా చేయడం ద్వారా ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నవారు అవుతారని అన్నారు. ఇప్పటికైనా హిందూ ధర్మాలకి,ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా నడిచే ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.