కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంధ్రా శబరిమల మకర జ్యోతి దర్శనానికి సిద్దమైంది. ఈ నెల 15 తేదీన మకర సంక్రాంతి పండుగ రోజున అయ్యప్న కొలువైన ఈ దేవాలయంలో మకర జ్యోతి దర్శన భాగ్యం భక్తులకు కలుగనుంది. శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీ శివారు సిద్ధివారిపాలెం వ్యవసాయ పొలాల దివ్య క్షేత్రంలో ఆంధ్రాశబరి అయ్యప్పస్వామి ఆలయం నిత్యం భక్తుల సందర్శనతో విరాజిల్లుతోంది. ఈ ఆలయం ప్రాంగణ సమీపంలో ఎత్తైన కొండలు ప్రాంతంలో సాయం సంధ్యవేళలో 6.18 గంటల సమయంలో సాక్షాత్తూ అయ్యప్పస్వామి ప్రతిరూపమైన మకరజ్యోతి దర్శనం భాగ్యం కలుగుతుంది. ఈ మేరకు హాజరయ్యే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, భూపతి బిరుదాంకితులు, గౌరవ డాక్టరేట్ పురస్కార గ్రహీత, గురుస్వామి కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు విస్తృతంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ రోజు వేలాది మంది భక్తులు సాక్షాత్తూ స్వామి అయ్యప్ప మూల విరాఠ్ స్వరూప ప్రతిరూప మకరజ్యోతి దర్శనం చేసుకుంటారు. ఇక్కడి మకరజ్యోతి దర్శనంతో భక్తుల జన్మ ధన్యమౌతుందని అనాది వస్తున్న నమ్మిక. ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధి గాంచిన ఈ అయ్యప్ప ఆలయ ప్రాంగణం పరిసరాల్లో దర్శనమిచ్చే మకర జ్యోతికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది.
ఆలయం సమీపంలోని ఎత్తైన పర్వత శ్రేణులపై రాత్రి సమయంలో అయ్యప్ప అఖండ మకర జ్యోతి దర్శన భాగ్యం వేయి జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. అయ్యప్ప మకరజ్యోతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఉదయాన్నే శబరిమలకు చేరుకుంటారు. సరిగ్గా 12 గంటలకు స్వామివారికి దివ్యాభరణాలను ధరింపజేసే 'తిరువాభరణ' ఘట్టం పేరుతో ఆలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో అయ్యప్పను ఘనంగా ఊరేగిస్తారు. స్వామిని పలు ఆభరణాలతో అలంకరించి కర్పూర హారతి ఇచ్చే సమయంలోనే ఏటేటా మకర సంక్రాంతి రోజునే ప్రత్యక్షం అయ్యే అయ్యప్ప మకర జ్యోతి ఈ ఆలయానికి చుట్టూ ఉండే తూర్పు కనుమల శ్రేణిలోని తూర్పు దిశలో ఉండే పర్వతాలపై దర్శనం లభిస్తుంది. అఖండ మకర జ్యోతి దర్శన భాగ్యంతో భక్తులు తరిస్తారు. భక్తి పారవశ్య తన్మయత్వంతో ఓలలాడతారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తుల నోట వెలువడిన నామ సంకీర్తనతో శబరిగిరులు ఒక్క సారిగా మార్మోగుతాయి. ఇక్కడి శ్రీస్వామి అయ్యప్పను ఏటేటా భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుంటూ వస్తున్నారు.
స్వామి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలు మూలల నుంచి మాల ధారణ చేసిన స్వాములు, సాధారణ భక్తులు, స్వామి వారి మండల పూజలు పూర్తి చేసుకున్న భక్త స్వాములు ఈ ఆంధ్రా శబరిమలకు దండు కడతారు. పరుగులు పెడతారు. ఈ మకర సంక్రాంతిన అయ్యప్ప మకరజ్యోతి దర్శనం సంధర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు దైవ తీర్ధ ప్రసాదంతోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాలను (అన్నదానం) ఏర్పాటు చేయడం ఓ సత్సంప్రదాయం. ఈ మేరకు వివరాలను ఆలయం వ్యవస్థాపక ధర్మకర్త, డాక్టర్ గురుస్వామి కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు వెల్లడించారు.
77 ఏళ్ల తర్వాత మకర సంక్రాంతికి అరుదైన యోగం..!
హిందూ మతంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు స్నానం చేయడం, దానం చేయడానికి ఎంతో విశిష్టత కలిగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు సూర్యుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత రాశిచక్రాలను మారుస్తాడు. అటువంటి పరిస్థితిలో దీనిని సంక్రాంతి అంటారు. 2024 జనవరి 15 న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ సంవత్సరం మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 77 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం రవితో వరియన్ యోగం ఏర్పడుతోంది. దీంతో 5 ఏళ్ల తర్వాత సోమవారానికి ఊరట లభిస్తోంది. కొన్ని రాశుల వారు మకర సంక్రాంతి రోజున ఇటువంటి యోగాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా విశేష ప్రయోజనాలను పొందవచ్చు.