1 ENS Live Breaking News

పూరీ జగన్నాథ్ ప్రభు భోగ్‌లో వంటకాల చరిత్ర తెలుసా?

పూరీ జగన్నాథ స్వామివారి ఆలయం ఈ పేరు చెబితే గుర్తొచ్చేది ఒడిసాలోని పూరీ..అంతేకాదు ఈ స్వామివారి ఆలయం, ఇక్కడ స్వామివారి రూపం..శ్రీవారికి నివేదించే ప్రసాదం కూడా అందే విశేష ప్రాచుర్యం పొందింది. అన్ని రకాలు ప్రసాదాలు స్వామివారి నిత్యం తయారు చేసి సమర్పిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 రకాల ప్రసాదాలు ప్రతినిత్యం నైవేధ్యంగా పెట్టడం ఇక్కడి ఆలయంలోని ప్రత్యేకత. అంతకంటే మరింతగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే..ఈ మొత్తం ప్రసాదాలన్నీ కుండలోనే తయ తయారు చేస్తారు. ప్రతీరోజూ కొత్తవాటిలోనే తయారు చేస్తారు. ఒడిసా బాషలోని వివిధ రకాల పేర్లను కూడా స్వామివారి నైవేద్యానికి ఉంటాయి. స్వామివారికి పెట్టే నైవేధ్యాన్ని భోగ్ అని పిలుస్తారు. స్వామివారి చరిత్రకి ఎంత ప్రాముఖ్యత వుంటుందో అదే విధంగా స్వామి స్వీకరించినట్టుగా చెప్పే ఈ 56 రకాల నైవేద్యాలు(ప్రసాదాలు)కి అంతే చరిత్ర వుంది. ఇందులో కొన్ని పేర్లు మనకి తెలిసినట్టుగా కూడా ఉంటాయి. ఒక్కో ప్రసాదానికి ఒక్కో విశిష్టత ఉంది.

1) భక్త (అన్నం), 2) సూప్ (పప్పు), 3) ప్రలేహ్ (చట్నీ), 4) సాదికా (కూర), 5) దధిషకాజా (పెరుగు కూర), 6) సిఖరిణి (సిఖ్రాన్), 7) అవలేహ్ (షర్బత్) ),8) బాల్కా (బాటి), 9) ఇక్షు ఖేరిని (మురబ్బా (చెరకు ఖేరిని)), 10) త్రికోనా (చక్కెరతో కూడినది), 11) బటక్ (వడ), 12) మధు సిరిపాక్  (మఠారి), 13) ఫెనికా (ఫెని), 14) పరిష్టరచ్ (పూరి), 15) శతపత్ర (ఖజాల), 16) సధిద్రక్ (ఘేవర్), 17) చక్రం (మల్పువా), 18) చిల్దికా (చోళ), 19) సుధాకుండలికా (జలేబి), 20) ధృతపూర్ (మేసు), 21) వాయుపూర్ ( రస్గుల్లా) 22) చంద్రకళ, 23) దధి (మహారాయత), 24) స్థూలి (తులి) 25) కర్పూర్నది (లుంగ్‌పురి), 26) ఖండ్ మండల్ (ఖుర్మా), 27) గోధూమ్ (గంజి), 28) పరిఖా, 29) సుఫ్లధయ ( సోంపు కలిగిన), 30) దధీరూప్ (బిల్సారు), 31) మోదక్ (లడ్డూలు), 32) శాక్ (సాగ్) 33) సౌధన్ (అధానౌ ఊరగాయ), 34) మందక (మోత్), 35) పాయస్ (ఖీర్), 36) పెరుగు , 37) గోగృత్, 38) హయాంగ్‌పీనం (వెన్న), 39) మలై, 40) కుపిక 41) పర్పట్ (పాపాడ్), 42) శక్తిక (సిరా), 43) లసిక (లస్సీ), 44) సువత, 45) సంఘయ (మోహన్), 46) సుపారీ, 47) సీత (యాలకలతో చేసిన), 48) పండు, 49) తాంబూలం, 50) మోహన్ భోగ్, 51) 
లవణ, 52) కషాయం , 53) మధుర్(తీపు) , 54) తీక్ట్ (చేదు), 55) కటువు(పులుపు), 56) ఆమ్లా(వగరు).
 
పూరీ జగన్నాథస్వామివారి దగ్గరకు వచ్చి ఆయనను దర్శించుకున్న భక్తులు ఈ యొక్క ప్రసాదాల జాబితాను నోట్ చేసుకొని చాలా వరకూ ఇందులోని రకాలను తయారు చేసి స్వామివారికి వారి వారి ప్రాంతాల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తుంటారట. అంతేకాకుండా స్వామికి కోరిక కోర్కెలు తీరితే ఈరకంగా నైవేద్యం సమర్పిస్తామని కూడా అత్యధిక మంది భక్తులు మొక్కులు మొక్కుకుంటారనే విధానం కూడా ప్రాచుర్యలంలో ఉంది. ఇక్కడ పూరిజగన్నాథస్వామివారు విష్ణుమూర్తి అవకతారంగా చెబుతారు. దేశంలోని విష్ణు ఆలయాల్లో కెల్లా పూరీ జగన్నాథస్వామివారి రూపం, ప్రసాదంగా చెప్పబడే నైవేద్యం రెండూ ఎంతో ప్రాచుర్యం పొందాయి..!

Puri

2023-06-18 10:31:47

శబరిమల అయ్యప్ప ఆలయ 18 మెట్లు వెనుక రహస్యం

అయ్యప్ప అంటే ఠక్కున గుర్తుకువచ్చేది శబరిమలలోని స్వామివారి ఆలయంలోని 18 మెట్లు అయితే అయ్యప్ప దీక్ష తీసుకున్నది మొదలు ఇరుముడి దేవుడికి సమర్పించేవరకు చేసే ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. మండల దీక్షలు చేసి స్వామివారికి ఇరుముడులు సమర్పిస్తారు. అలా సమర్పించే సమయంలో మాలధారణ చేసిన ప్రతీ భక్తుడూ 18 మెట్లూ ఎక్కి స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప మాల ధారణకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా స్వామి పదునెట్టాంబడికి కూడా అంతే విశేష ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విశేషమైన శమరిమల 18మెట్ల విశిష్టత ప్రతీ భక్తుడూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్టశక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని పేర్కొంటారు.

18 మెట్ల గురించిన విషయాలు మీకు తెలుసా..?
ఆ మెట్లలో ఒక్కో మెట్టు మనకు ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది.  కామం – 1వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “గీతా మాత”.ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు. క్రోధం – 2వ మెట్టు
..ఈ మెట్టుకు అధి దేవత “గంగా దేవి”. ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. “తన కోపమే తన శత్రువు”. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. లోభం – 3వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “గాయత్రీ మాత”. ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి. అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు. మోహం – 4వ మెట్టు..
ఈ మెట్టుకు అధి దేవత “సీతా దేవి”. ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక. ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబంధం భావనకు ఈ మెట్టును గుర్తుగా విశ్వసిస్తారు.

మదం – 5వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “సత్యవతీ మాత”. ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి. మాత్స్యర్యం – 6వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “సరస్వాతీ దేవి”. ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది. ఇతరుల సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ ఓర్వలేని బుద్ధి ఇది.దంబం – 7వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “బ్రహ్మవిద్యా దేవి”. ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కలగదు. అహంకారం – 8వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “బ్రహ్మవల్లీ దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి. నేత్రములు – 9వ మెట్టు..
ఈ మెట్టుకు 

అధి దేవత “త్రిసంధ్యా దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది.

 చెవులు – 10వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “ముక్తిగేహినే దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది. నాసిక – 11వ మెట్టు..
ఈ మెట్టుకు అధి దేవత “అర్ధమాత్రా దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు. జిహ్వ – 12వ మెట్టు.. మెట్టుకు అధి దేవత “చిదానందా దేవి”. ఈ 
మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠోరంగా మాట్లాడడానికి ఉపయోగించకూడదు.

స్పర్శ – 13వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “భవఘ్నీ దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి.స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ. సత్వం – 14వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “భయనాశినీ దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి. తామసం – 15వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “వేదత్రయూ దేవి”. ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి. రాజసం – 16వ మెట్టు..
ఈ మెట్టుకు అధి దేవత “పరాదేవి”. ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి. విద్య – 17వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “అనంతాదేవి”. ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి. అవిద్య – 18వ మెట్టు..ఈ మెట్టుకు అధి దేవత “జ్ఞానమంజరీదేవి”. ఈ మెట్టు సర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి. అయ్యప్ప మాలధారణ చేసిన ప్రతీ భక్తుడికీ ఈ విషయాలను పడిపూజ జరిగే సమయంలో గురుస్వాములు తెలియజేస్తారు. ఆ తరువాత భక్తులు శబరిమాల యాత్ర ముగించుకొని వచ్చిన తరువాత. ఇంట్లోని వ్యక్తులకు, భక్తులకు ఆ విషయాలను తెలియజేస్తారు. అయ్యప్ప దేవాలయంలోని పదునెట్టాంబడి విషయాలు తెలుసుకున్నా..వాటిని ఇతరులకు తెలియజేసినా మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. స్వామియే శరణం అయ్యప్ప..!

Sabarimala

2023-06-16 05:27:55

అల్లూరి చరిత్రపై ఈఎన్ఎస్ లైవ్ లో చారిత్రక ఆధారాలు

భారదేశానికి స్వాతంత్ర్య సిద్ధింపజేసేందుకు బ్రిటీషు సేనలను ఎదిరించి పోరాడిన అల్లూరి చరిత్రపై ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ఇకపై చారిత్రక ఆధారాలతో ఫోటో ఫీచర్  ఇన్ఫర్మేషన్ లైన్స్ తో న్యూస్ కార్డ్ ప్రచురించబోతున్నాం. ప్రతీ రోజూ ఒక ఆధారాన్ని చూపించి పాఠకలకు అల్లూరి చరిత్రను వివరించనున్నాం.

Visakhapatnam

2022-11-05 10:12:37

చారిత్రక భవనంగా పాత హుజూర్ భవనాలు

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న టీటీడీ పాత హుజూర్ ఆఫీసు భవనాలను చారిత్రక కట్టడాలు గా పరిగణించాల్సిన అవసరం ఉందని టీటీడీ జెఈవో సదా భార్గవి అన్నారు. శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వెనుక వైపున గల పాత హుజూర్ ఆఫీసుతో పాటు, మ్యూజియం ను గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పాత హుజూర్ ఆఫీసు భవనాలను సంరక్షించి సంగీత, నృత్య కళాశాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  అలాగే మ్యూజియం భవనంలో శిల్ప కళాశాలకు చెందిన పురాతన శిల్పాలు, ఇతర చారిత్రక శిల్పాలు ఉంచేందుకు అవసరమైన విధంగా మరమ్మతులు చేయాలన్నారు.
          
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆడిట్ ఆఫీసర్  శేష శైలేంద్ర, డిఈవో  గోవింద రాజన్, విద్యుత్ విభాగం  ఎస్ ఈ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఎఈవో  మునిరత్నం, సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్  సుధాకర్  ఇతర అధికారులు పాల్గొన్నారు.

2022-10-13 16:31:47

నూతక్కి రాజకీయ పాఠశాలలు @ 50

సరిగ్గా యాభై ఏళ్ల క్రితం .. అంటే 1972 మే నెలలో.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూ డెంలో..గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలో అతి పెద్ద రాజకీయ పాఠశాలలు జరిగాయి..! భారతకమ్యూనిస్టు పార్టీ వాటిని ఏర్పాటు చేసింది. సైద్ధాంతిక ,రాజకీయశిక్షణ  అనేది కమ్యూనిస్టుపార్టీల  జీవితంలో ఒక కీలక అంతర్భాగం. మనరాష్ట్రంలో తొలిదశలో జరిగిన  మంతెనవారిపాలెం , కొత్త పట్నం పాఠశాలలు చారిత్రాత్మకమైనవి. 60 వదశకం  చివరిలో  నరసరావుపేట , మారెళ్ళగుంటపాలెం , సరూర్  నగర్ , కానూరు, కేంద్రాల్లో జరిగిన రాజకీయ పాఠశాలల గురించి పెద్దలు చెబుతుంటే  మేం వింటూ ఉండేవాళ్ళం. 1971 లో మంగళాపురంలో   జరిగిన  రాష్ట్రస్థాయి విద్యార్థి, యువజనపాఠశాలకు రికార్డుస్థాయిలో 424  మంది హాజరయ్యారని  ఆరోజుల్లో అబ్బురంగా  చెప్పుకునేవారు! ఆతర్వాత 1972 మే నెలలో తాడేపల్లిగూడెంలో రాష్ట్ర యువజన రాజకీయపాఠశాల , నూతక్కిలో రాష్ట్ర విద్యార్థి రాజకీయ పాఠశాల జరిగాయి. 1972 మే నెల  8 నుండి 18 వరకూ తాడేపల్లిగూడెంలో  పదిరోజుల  పాటు  జరిగిన యువజన రాజకీయ పాఠశాలకు  850 మందికి  పైగా హాజరయ్యారు. 1972 మే 25 నుండి జూన్ 1 వరకూ నూతక్కిలో   జరిగిన విద్యార్థి పాఠశాలకి  కూడా  దాదాపు  525 మంది హాజరయ్యారు. ఈ పాఠశాలలు జరిగి 2022 మే నెలకు సరిగ్గా  యాభైయేళ్ళు  పూర్తి అయ్యింది. 1972 మార్చ్  లో పదోతరగతి   పరీక్షలురాసిన  నేను 15వ ఏట  తాడేపల్లిగూడెం యువజన పాఠశాలకు , నూతక్కి  విద్యార్థి పాఠశాలకు కూడా హాజరయ్యాను! ఇప్పటికి యాభైఏళ్లు  గడిచినా ఆనాటి ఘటనలు నిన్ననో  మొన్ననో  జరిగాయన్నంత   స్పష్టంగా  నాకు గుర్తున్నాయి! బాల్యంలో పడ్డ ముద్రలు గాఢంగా ఉంటాయనేది నిజమే కదా.

  చలసాని నగర్ నిర్మాణం..
తాడేపల్లిగూడెం పట్టణానికి  రెండున్నర  కిలోమీటర్లదూరంలో విమానాశ్రయం  ఉంది. అది ఉపయోగంలో లేదు. దానికి 2 కిలోమీటర్ల పటిష్టమైన రన్ వే  కూడా ఉంది. రన్ వేకి ఎడా పెడా  ప్రైవేటు పొలాలు తోటలు ఉన్నాయి. వాటిలో  తాడేపల్లిగూడెం పట్టణప్రముఖులు  ఎలిసెట్టి నారాయణమూర్తి గారి తోటఒకటి. ఆతోటకి   రన్ వే కి మధ్యఉన్న విశాలమైన  ఖాళీస్థలంలో రాష్ట్ర యువజన రాజకీయ పాఠశాలను నిర్వహించారు. అందులో "చలసాని వెంకటరత్నం నగర్"  పేరుతో ఒక చిన్నపాటి తాత్కాలిక  గ్రామాన్ని నిర్మించారు. కలప , వెదురుగెడలు  , తాటిఆకు వినియోగించి ఒకేసారి  వెయ్యిమంది కూర్చోవడానికి వీలుగా తరగతులకోసం  పెద్దపాక నిర్మించారు.  200 మంది భోజనం  చేయడానికి   వీలుగా  భోజనశాల నిర్మించారు. వంటశాల  , స్టోర్ గది  , ప్రిన్సిపాల్ కు ఒకటి ,ఆహ్వానసంఘం ఆఫీస్ గా మరొకటి తాటాకు షెడ్లు నిర్మించారు. విద్యార్థులు నిద్రించడానికి వేరుగా మరోమూడు పాకలువేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఒకవేదికను నిర్మించారు. ఆవరణచుట్టూ దడికట్టి గేట్లుపెట్టారు. చలసానినగర్  ప్రధానద్వారానికి   దగ్గరలోనే  భూపతిరాజు వెంకటపతిరాజుగారి  తోటమకాం   ఉండేది. ఆ మకాంలోని  పెంకుటింటిలో యువమహిళలకు వసతి ఏర్పాటు చేశారు. నాడు హాజరైన నలభైమంది యువ మహిళల్లో  చండ్ర  రాజకుమారి  , కిలారు విజయలక్ష్మి  ,  కనపర్తి జ్యోత్స్న , సమత  , ఏ. వనజ  , సంకు మనోరమ , సుజాత ,  నిర్మల  ,లత , కమల  , లాంటి పేర్లు మాత్రం నాకు  గుర్తున్నాయి. యువమహిళల బసదగ్గర , చలసాని నగర్ దగ్గర నిర్వాహకులు  రెండు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.  బైటివారు ప్రవేశించకుండా 24 గంటల సెక్యూరిటీ కోసం గేట్లదగ్గర  రెడ్ గార్డ్ లను ఏర్పాటు చేశారు. ఎలిసెట్టి  నారాయణమూర్తి  గారి తోటలో  బోరింగు దగ్గరి టాంక్ నుండి ఐదడుగుల ఎత్తున   పైపులైన్ వేసి ఒకేసారి వందమంది స్నానం చేయడానికి వీలుగా   పంపులు బిగించారు. వాడకంనీరు ఎలిసెట్టి నారాయణ మూర్తి గారి కొబ్బరితోటలోకి  పోయేటట్లు నీటిబోదెలు ఏర్పాటు చేశారు.  విద్యుత్ మోటారుకు తోడుగా , జనరేటర్లు కూడా పెట్టారు. 

ఆవరణలో , పాకల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఆవరణకు కొద్దిపాటి దూరంలో  ఒక యాభైవరకూ  తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. నాటి ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి  , పార్టీ రాష్ట్ర  కార్యదర్శివర్గ  సభ్యుడు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు  ఎం.వి.ఎన్.కపర్ధి గారు అధ్యక్షుడు  గా ,సి.పి.ఐ.జిల్లా  సహాయకార్యదర్శి  ఇందుకూరి  సుబ్బరాజు గారు ప్రధాన కార్యదర్శిగా ఆహ్వాననసంఘం   ఏర్పడింది. పార్టీ జిల్లాకార్యదర్శి , ఆనాటి పెనుగొండ  శాసనసభ్యుడు వంక  సత్యనారాయణ ,జిల్లాపార్టీలో  దిగ్గజాలు  మాజీ ఎమ్మెల్సీ  సంకు అప్పారావు , భూపతిరాజు మణ్యం , కలిదిండి భీమరాజు , మారెళ్ళ నరసింహారావు , మాజీ ఎమ్మెల్యే  అత్తలూరి సర్వేశ్వరరావు  , మాజీ ఎంపి కోండ్రు సుబ్బారావు , పులవర్తి  విజయ  సారథి , డి.వి.వి.ఎస్.వర్మ , ఐ.ఎస్. రాజు , జల్లేపల్లి వెంకటరాజు , చేకూరి భద్రిరాజు , కంచనకాశీ  విశ్వనాథరావు , పూడి అప్పలస్వామి , బోడపాటి వెంకటరెడ్డి నాయుడు  , ఇందుకూరి  సుబ్బరాజు  (జూనియర్ )  ఆహ్వానసంఘం సభ్యులుగా  ఉన్నారు. మొత్తం క్యాంపు నిర్వహణా సమన్వయబాధ్యత సంకు అప్పారావు గారు చూసారు. వంక సత్యనారాయణ ప్రిన్సిపాల్ గా , డి వి.వి.ఎస్. వర్మ వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. వంటల  బాధ్యతలు పార్టీ సీనియర్ నేత  యాళ్ళబండి  పోలిశెట్టి చూసుకున్నారు. తాడేపల్లిగూడెంలో పేరుపొందిన అతిపెద్దహోటల్   మోడరన్ కేఫ్ యజమాని ,  పార్టీ అభిమాని పైబోయిన సోమయ్య గారు వంటమనుషులను  ఏర్పాటుచేసి  రోజూవచ్చి  పర్యవేక్షణ చేసారు. ఆనాటి మహిళాసంఘం  నేతలు మందలపర్తిశేషమ్మ  , దూసనపూడి  సుబ్బాయమ్మ , యాళ్ళబండి పుణ్యవతి , కాళ్ళధనలక్ష్మి  , మద్ది  సీతమ్మ  , గాదంసెట్టి సత్తెమ్మ  , కాకర్ల అనసూయమ్మ ,  వంటివారు పాఠశాల కోసం  ఆవకాయ పచ్చడి పట్టడం  మాఅందరి  ఇళ్ళలో ఒక గట్టిజ్ఞాపకం!
ఆ పదిరోజులూ వాళ్ళు క్యాంపు దగ్గరికి   వచ్చి వంటల తీరు తెన్నులను గమనించి సూచనలు చేస్తూ ఉండేవారు. తాలూకా పార్టీ సీనియర్ నేత  మద్ది శేషయ్య   స్టోర్స్ బాధ్యతలు చేపట్టి  సరఫరాలను  చూసుకున్నారు.పార్టీ స్థానికనేతలు  దూసనపూడి విరాటరాజు  , యాళ్ళబండి రంగనాయకులు  , పిచ్చా  వెంకటరత్నం  , కాకర్ల సూర్య  ప్రకాశరావు  , సుంకవల్లి  రాజగోపాలరావు   ,  కోరాడగోపాలం   , జాన లక్ష్మణరావు  , పాబోలు  పాపారావు  , దూలం  కృష్ణారావు  , కాళ్ళ  చంద్రరావు , ప్రత్తి బ్రహ్మన్న , దింటకుర్తి మాలకొండయ్య , బత్తుల కృష్ణ , సోమరాజు  లాంటివారు వివిధపనుల్లో  ఆహ్వానసంఘానికి తోడ్పడ్డారు.

పశ్చిమగోదావరి   జిల్లానుండి క్లాసుల్లో  పాల్గొన్నవారిలో  అప్పటికి   యువజన , విద్యార్థి నాయకులుగా  ఉన్న  మందలపర్తి శ్రీపతి  , వైట్ల  వెంకటనారాయణ  , దుగ్గిరాల  గోపాలకృష్ణ  , వడ్డీ వెంకట్రావు , ఆత్కూరి రాయుడు , నెక్కంటి  సుబ్బారావు  , గంధం  ధనంజయ  , బి. కరుణకుమార్ , ఎస్ .సంజీవరావు  , కార్టూనిస్ట్  మోహన్  , పాములపాటి  మాధవరెడ్డి , కొనగళ్ళ రామారావు , ఆకుల  సత్యనారాయణ , గెడా విప్లవరావు,  ఎస్. సూర్యకుమార్  ,  మాదాసు  పుల్లారావు , పొట్టి సూర్యనారాయణ , అబ్బాస్  ,అల్లు కృష్ణారెడ్డి , జి.ఎన్.ఆర్. శంకర్  , యాళ్ళబండి రాజేంద్రప్రసాద్ , మద్దాల  వెంకటరెడ్డి  , గగారిన్   , మద్ది తమ్మారావు  ,  సోమేశ్వరరావు , సత్యారావు ,  నాసర్లరాజా  , కంచుస్తంభం  సత్యన్నారాయణ  , గోగులమండ  స్టాలిన్  , కాళ్ళ  నారాయణరావు  ,  మందలపర్తి జగన్ మోహన్   లాంటి  పేర్లు నాకు గుర్తున్నాయి. అప్పటికి బొత్తిగా  హైస్కూల్  కుర్ర  బ్యాచ్ గా ఉన్న మందలపర్తి  కిషోర్ , కాకర్ల చంద్రశేఖర్  , వంకా  మోహన్ , మాకంటే  ఇంకా  బాగా  చిన్నవాడైన పదకొండేళ్ల   వంక  రవి  కూడా మాతోపాటు  ఈ క్లాసుల్లో  పాల్గొన్నారు. కవి , సీనియర్ పాత్రికేయుడు  మందలపర్తి కిషోర్ కీ నాకూ  స్నేహం కుదిరింది తాడేపల్లిగూడెం క్లాసుల్లోనే!
ఓ పదేళ్ల తర్వాత  మా చెల్లి వాణీదేవి తో కిషోర్ వివాహం జరగడంతో మాకు బంధుత్వం కుదిరినా దానికంటే  మా  స్నేహమే బలమైనదని చెప్పాలి.

  1972 మే 8 న ప్రారంభం !
7వ తేదీ రాత్రికి , 8 వ తేదీ  ఉదయానికే  సుమారు 500 మంది ప్రతినిధులు తాడేపల్లిగూడెం చేరుకున్నారు. 8 వ తేదీ రోజంతా  ప్రతినిధుల ప్రవాహం కొనసాగింది. సాయంత్రానికి సంఖ్య 600 దాటింది. ప్రతినిధులకు వసతి సరిపోదని ఆ రాత్రికి రాత్రి మరో 250 మందికి సరిపడా ఒక పెద్ద తాటాకు షెడ్ ను ఆహ్వానసంఘం నిర్మించింది. "ఆ పాకల   నిర్మాణానికి గెడలెత్తిన  కూలీల్లో"  నేనూ ఒకణ్ణి. పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ ఒక తాటాకుచాప ,అల్యూమినియం ప్లేటు ,గ్లాసు , తాటాకు విసనకర్ర ఇచ్చారు. క్లాసులు అయిపోయాక  ఇంటికి తీసుకుపోవచ్చని  ఇచ్చేటప్పుడే   చెప్పి వాటిని జాగ్రత్త పెట్టుకోవాలని  ఆహ్వానసంఘం వారు కోరారు. ప్రతినిధులకు ఒక నోటు బుక్కును , పెన్నును  ఇచ్చారు. జిల్లాల వారీగా  బసను కేటాయించి ఆ మేరకు బోర్డులు  ఏర్పాటు చేశారు. 9 వ తేదీకి మొత్తం  ప్రతినిధుల  సంఖ్య  750 దాటిపోయింది. రాష్ట్ర యువజనసమాఖ్య  నాయకులతో స్కూల్ నిర్వహణా  కమిటీని  ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఆకమిటీలో  యువజనసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు  నల్లూరి వెంకటేశ్వర్లు  ,ప్రధాన కార్యదర్శి  కే. ప్రతాపరెడ్డి  , కార్యదర్శి ఏ.పుల్లారెడ్డి , బి.స్టాలిన్ బాబు , డి.వి.వి.ఎస్.వర్మ , ఎం.కాళిదాసు , సి.మాలకొండయ్య , వై. బీ.శంకర రావు , బి. కరుణకుమార్  , ఎస్. నాగేశ్వరరావు ,  బాపురెడ్డి , జిడ్డు సూర్యనారాయణ  , టి.నారాయణ ,  మణ్యం , చండ్ర రాజకుమారి , కే. జ్యోత్స్న  ఉన్నారు. ఇంకా కొన్ని ఉపసంఘాలు కూడా ఏర్పాటు చేశారు. 8 వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా పార్టీ సీనియర్ నేత  ఇందుకూరి సుబ్బరాజు అరుణపతాకాన్ని  ఎగురవేయడంతో   క్లాసులు  ప్రారంభం  అయ్యాయి. 

వక్తలను వైస్ ప్రిన్సిపాల్  డి.వి.వి.ఎస్.వర్మ వేదికపైకి ఆహ్వానించగా   ప్రిన్సిపాల్ వంక సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఆహ్వానసంఘం  అధ్యక్షుడు ఎం.వి.ఎన్. కపర్ధి స్వాగతం పలికారు. రాష్ట్రపార్టీ కార్యదర్శి   తమ్మారెడ్డి సత్యనారాయణ పాఠశాలను ప్రారంభించారు. క్లాసులు జరిగే విధానం టైమ్ టేబుల్ వంటి వివరాలను యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రతాపరెడ్డి తెలియచేశారు. క్లాసులనిర్వహణకు ఏర్పాటు చేసిన  కమిటీనీ , వేర్వేరు  బాధ్యతల  కోసం వేసిన  ఉపసంఘాలనూ ప్రతాపరెడ్డి ప్రకటించారు. మర్నాటి నుండి క్లాసులు మొదలయ్యాయి. "మార్క్సిస్టు తత్వశాస్త్రం , జాతీయ విముక్తి పోరాటాలు" అంశాన్ని ఈడ్పుగంటి నాగేశ్వరరావు , "రాజకీయ అర్థశాస్త్రం" అంశాన్ని వై.విజయ్ కుమార్ , "ప్రపంచ విప్లవోద్యమ చరిత్ర" అంశాన్ని తమ్మారెడ్డి సత్యనారాయణ , "భారత స్వాతంత్ర్య పోరాటచరిత్ర" అంశాన్ని వేములపల్లి శ్రీకృష్ణ , "మావోయిజం , నక్సలిజం , భారత కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమం" అంశాన్ని నీలం రాజశేఖరరెడ్డి , "కమ్యూనిస్టుపార్టీ చీలిక ,మార్క్సిస్ట్ పార్టీ పంథా"  అంశంపై నల్లమల గిరిప్రసాద్ , "జనసంఘ్ - అభివృద్ధి నిరోధకపంథా"  అంశాన్ని కే.ఎల్.మహేంద్ర , "వ్యవసాయరంగ  సమస్యలు" అంశాన్ని వై.వి.కృష్ణారావు , "తెలంగాణా సాయుధపోరాట చరిత్ర" అంశాన్ని డా.రాజ్ బహదూర్ గౌడ్ , "కమ్యూనిస్టుపార్టీ నిర్మాణం" అంశాన్ని ఎం.వి.ఎన్.కపర్ధి , "యువజన సమాఖ్య కార్యక్రమం" అంశాన్ని సురవరం సుధాకరరెడ్డి బోధించారు. పాఠశాల జరిగే  సమయానికి  వియత్నాం విముక్తియుద్ధం  కీలకదశకు  చేరుకున్నది. ఒక రేవుపట్టణం విముక్తి సైన్యం చేతికి చిక్కినట్లు ఒకరోజు పాఠశాలకు  వార్త వచ్చింది. దాంతో తరగతుల్లో ఉత్సాహం పెల్లుబికింది. "వియత్నాం కీ భాయియోం హమ్ తుమారే సాత్  హై"  నినాదాలు మారుమోగాయి.

 కర్రసాములోనూ  శిక్షణ !

పాఠశాల జరిగిన పదిరోజులూ ప్రతీ   సాయంత్రం 5 గంటలకు కవాతు , కర్రసాములో శిక్షణ ఇచ్చారు. జిల్లాలవారీగా  ప్రతినిధులను  విభజించి  ఒక్కొక్క  బృందానికి  ఒక్కో  ఇన్ స్ట్రక్టర్  ను ఏర్పాటు చేశారు. టి.నారాయణ , స్టాలిన్ బాబు , ప్రతాపరెడ్డి , చింతలపూడి రాములు , రామారావు , సత్యపాల్ రెడ్డి , వి.చంద్రం , సి. యాదిరెడ్డి , సమత ,  కమాండర్ లుగా వ్యవహరించారు.
పశ్చిమగోదావరి జిల్లా బృందానికి ఇందుకూరి సుబ్బరాజు  నేతృత్వంలో  నెక్కంటి  సుబ్బారావు , గంధం ధనంజయ , కరుణకుమార్ లాంటి వారు ఇన్ స్త్రక్టర్లు గా వ్యవహరించారు. సాయంత్రం అయ్యేసరికి  విమానాశ్రయం రన్ వే మీద వందలాదిమంది యువతీ యువకులు కవాతు , కర్రసాము , నేర్చుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని  చూడ్డానికి తాడేపల్లిగూడెం పట్టణం నుండి  ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. కవాతు చేసేటప్పుడు అందరూ గొంతెత్తి మార్చింగ్ సాంగ్ పాడేవారు. "జై జై జై అరుణపతాకకుజై.. వేగరావోయ్  కార్మికా.. వేగరావోయ్  కర్షకా.. ఎత్తినజెండా  దించకోయ్  , అరుణపతాకకు జై .. కత్తులు దూసుకుపోయినా .. నెత్తురు టేరులు  పారినా.. బాంబుల వర్షం కురిసినా .. బారు ఫిరంగులు మ్రోగినా  ... ఎత్తినజెండా దించకోయ్ ...
అరుణపతాకకు  జై  అనే మార్చింగ్ సాంగ్  ఆ పదిరోజులూ  విమానాశ్రయం మీద  మారుమ్రోగిపోయింది. బృందాలవారీగా మార్చింగ్ చేస్తూ రన్ వే మీద అటూ ఇటూ కదం తొక్కుతుంటే ఆర్మీ కాలమ్స్ కదులుతున్నట్లు ఉండేది. విజిళ్ళు  , బూట్లచప్పుడు  , లాఠీ  సౌండ్లు  కమాండర్ల   అరుపులతో   అక్కడ  నిజంగానే   ఆర్మీట్రైనింగ్  జరిగిపోతున్నట్లుగా    ప్రజలు భావించేవారు!
లెఫ్ట్  రైట్  లెఫ్ట్  అంటూ కవాతు నేర్పుతూ   కమాండర్లు    అప్పట్లో కొన్ని చిత్రమైన  నినాదాలు ఇచ్చేవారు. వాటిల్లో   రెండు  నినాదాలు నాకు  బాగా గుర్తున్నాయి. సి.ఆర్., ఎన్.ఆర్., తమ్మారెడ్డి  ,ఎస్. ఏ. డాంగే  జిందాబాద్ , జిందాబాద్. ఎం.ఎన్., టి.వి., అచ్యుత మీనన్  , ఎస్. ఏ. డాంగే , జిందాబాద్ జిందాబాద్. తేరానామ్   మేరానామ్   వియత్నామ్  .. వియత్నామ్.. రెండుగంటల  లాఠీశిక్షణ  తర్వాత మొత్తం విద్యార్థులంతా  క్యాంపు లోకిచేరి స్నానాలు ముగించేవారు. కాస్సేపు ఆరోజు జరిగిన పాఠ్యాంశం పై జిల్లాలవారీ చర్చలు జరిగేవి. ఆ తర్వాత సాంస్కృతిక వేదిక దగ్గర చేరేవారు. భోజనాలు ఓపక్కన నడుస్తూ ఉండేవి. మరోపక్కన సాంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతూ ఉండేవి.

   సాంస్కృతిక ప్రదర్శనలు
ప్రతిరాత్రి పాటలు , నృత్యాలు , బుర్రకథలు , గొల్లసుద్దులు  , నాటికలు , నాటకాలు , కవితా పఠనం , ఏక పాత్రలు , స్కిట్లు ,  వేసేవారు. అప్పట్లో ప్రకాశంజిల్లా  నుండి అన్న నల్లూరితో  వచ్చిన బృందంలో  సినీ  నటుడు   ఈశ్వరరావు ,మాదాల రంగారావు , టి.కృష్ణ వంటివాళ్ళు ఉన్నారు. సంభవామి యుగే యుగే , రాజీనామా , నాటికలు వాళ్ళువేయడం గుర్తుంది. ఏటుకూరి ప్రసాద్ గారి ఎర్ర జెండేరా తమ్ముడా , ఎర్ర జెండేరా లాంటి పాటలు క్యాంపులో ప్రతిధ్వనించేవి. వరంగల్ నుండి వచ్చిన జి.వై.గిరి కంజర వాయిస్తూ  "రిక్షావాలా.. ఓహో రిక్షావాలా" అంటూ హృదయం ద్రవించే పాటఒకటి పాడేవాడు. అందరూ ఆయన్ని అడిగి మరీ పాటలు పాడించుకునే వారు. "మళ్ళీ ఇంకోసారి  నేను  మంత్రినయ్యాను .. ఆవుదూడ బొమ్మ  అడ్డు పెట్టుకొని  గెలిచాను"
అంటూ అదృష్టదీపక్  పాడేపాట  అప్పట్లో పెద్ద హిట్. "కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు" పాటని కూడా అదృష్ట  దీపక్  బాగా పాడేవారు. "సోవియట్ల దేశమా ...సమతా సందేశమా .. ఆంధ్రజాతి విప్లవాభి  వందనాలు ... అందుకో"  అనే పాట ఒకటి ప్రతిరోజూ వినపడేది. "ఎవరిదీ ఎక్కువ కులమూ ,ఎవరిదీ తక్కువ కులమూ" ,అనే పాట , "లాగరో హైలెస్సా" అనే రోడ్ రోలరు పాట, ఎవరో ఒకరు పాడేవారు. ఒక యువమహిళా కామ్రేడ్ " అంతే నాకు చాలు ,తమలపాకు తోడిమే పదివేలు" అంటూ ఒక జానపద గేయం పాడటం కూడా  గుర్తుంది. జర్నలిస్ట్ జి. వీరా ఏక పాత్రాభినయం చేయడం , జర్నలిస్టు , కవీ  కే.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో యువకవి సమ్మేళనం జరగడం కూడా నాకు గుర్తున్నాయి. గొల్లసుద్దులు  కళారూపాన్ని  నేను తొలిసారిగా  అప్పుడేచూసాను. సభలో జనం మధ్యకూచున్న కళాకారులు ఒకర్ని ఒకరు గొంతెత్తి  పిలుస్తూ లేచివెళ్ళి  వేదికఎక్కడం  చూసి అప్పట్లో థ్రిల్ అయిపోయాను. ఆబృందం  22 రకాల   స్టెప్స్  వేయడాన్ని  లెక్కపెట్టి  కిషోర్ , నేనూ  ఆశ్చర్యపోయాం. ఒకాయన  మహాప్రస్థానం  కవితలకు బాణీలుకట్టి పాడుతూ ఉండేవారు. 


రాత్రి  ఒంటిగంట  వరకూ ప్రదర్శనలు   కొనసాగుతూనే  ఉండేవి. పాఠశాల నిర్వాహకులు  ఇక చాలు  ముగించండి అంటూ విజిల్స్ ఊదేవారు. అయినా వినకుండా  కళాకారులు రెండింటివరకూ  ప్రదర్శనలు కొనసాగించేవారు. తెల్లవారు ఝామున ఏ నాలుగింటికో  మళ్ళీ కోలాహలం మొదలయ్యేది. ఉదయం కొందరు  కసరత్తులు  , సాముగరిడీలు   చేసేవారు. కొందరు కబడీ , వాలీబాల్ , బ్యాడ్మింటన్ ఆడేవారు. ఆ పదిరోజులూ అది ఒక "మరో ప్రపంచం" అని చెప్పాలి. పాఠశాల ముగింపు సందర్భంగా మే 17 వ తేదీ సాయంత్రం తాడేపల్లిగూడెంలో  భారీర్యాలీ  జరిగింది. పాఠశాల విద్యార్థులు పదిరోజులూ నేర్చుకున్న  కవాతుచేస్తూ కొన్ని సెంటర్లలో లాఠీవిన్యాసాలు ప్రదర్శించారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ పాల్గొన్నారు. మునిసిపల్ టౌన్ హాల్ ఎదుటి  ఖాళీస్థలంలో  జరిగిన బహిరంగసభ  లో సి.పి.ఐ. ప్రధానకార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు గారు ప్రధానవక్తగా  పాల్గొన్నారు. సభకు  నాలుగువేలమంది  హాజరయ్యారు. రాష్ట్ర రైతుసంఘం  ఉపాధ్యక్షుడు  సంకుఅప్పారావు  అధ్యక్షత  వహించారు. సభలో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు  నీలం రాజశేఖరరెడ్డి ,జిల్లాకార్యదర్శి  వంక సత్యనారాయణ ,సహాయ కార్యదర్శి  ఇందుకూరి సుబ్బరాజు , ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎన్ కపర్థి , రాష్ట్ర యువజనసమాఖ్య  ప్రధానకార్యదర్శి  కే. ప్రతాపరెడ్డి ప్రసంగించారు. 17 వ తేదీ ఉదయమే  చండ్ర రాజేశ్వరరావు గారు రాజకీయ పాఠశాలను సందర్శించారు. 850 మంది పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వియత్నాం పోరాట  తాజా  విజయాలు , బంగ్లాదేశ్  విముక్తి , సోవియెట్  తో  భారత్ సంబంధాలు   , కేరళలో   అచ్యుత మీనన్  ప్రభుత్వ  ప్రజాసంక్షేమ చర్యలు  ,  మణిపూర్ , బీహార్  , పంజాబ్  రాష్ట్రాలలో    పార్టీ చేస్తున్న  పోరాటాలను   ప్రస్తావిస్తూ  ఆయన  సందేశం  ఇచ్చారు. పాఠశాలలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికి రాజేశ్వరరావు గారి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఆహ్వాన సంఘం పెద్దలకు యువజన సమాఖ్య తరపున అరుణ పతాకాలను బహూకరించారు.

 పెనుగాలుల  బీభత్సం  !

17 వ తేదీ రాత్రి బహిరంగసభ ముగిసిన అనంతరం  చాలామంది టౌన్ నుండే నేరుగా  తమతమ స్వస్థలాలకు  తిరుగుప్రయాణం అయ్యారు. మిగిలినవారు తిరిగి చలసాని నగర్ కు చేరుకున్నారు. ఆరాత్రి  పెనుగాలులతో  భారీవర్షం   కురవడంతో  పాఠశాలకోసం   వేసిన భారీపాకలు  ఒరిగిపోయాయి. కొన్ని కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరాత్రి పెట్రోమాక్స్ లైట్లను తెచ్చి భోజనాలు వడ్డించారు. చీకటిలో  ,వర్షంలో  అలాగే బిక్కు బిక్కుమంటూ గడిపాం. విద్యార్థులకు పంపిణీ చేయడానికి తెచ్చిన సాహిత్యం తడిసిపోకుండా  టార్పాలిన్ కప్పి జాగ్రత్తచేశాం. తడిసిన పుస్తకాలను  మర్నాడు ఎండలో ఆరబెట్టాం. వైస్  ప్రిన్సిపాల్   వర్మగారు దగ్గర  ఉండి   మొత్తం పుస్తకాలను పంపిణీ చేయించారు.

  కొన్ని విశేషాలు !

అనుకున్న దానికంటే ప్రతినిధుల సంఖ్య పెరిగిపోవడంతో తాడేపల్లిగూడెం రాజకీయపాఠశాల  ప్రవేశానికి  గడువు ముగిసిందనీ , ఎవరువచ్చినా ప్రవేశం ఉండదని    ప్రిన్సిపాల్ వంక సత్యనారాయణ మే 9 న  ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆరోజుల్లో విశాలాంధ్ర మొదటిపేజీలో దాన్ని వేశారు.  1972 లో  కొండేపి నియోజకవర్గం నుండి సి.పి.ఐ. తరపున  ఎమ్మెల్యేగా  ఎన్నికైన యువజనసమాఖ్య నాయకుడు  దివి శంకరయ్య గారు పాఠశాలకు ఒకరోజు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యానికి బహిరంగ క్షమాపణ చెప్పాకనే ఆయన్ని  క్లాసులోకి  రానిచ్చారు.  పాఠశాలలో పారిశుద్ధ్యం - ఆరోగ్యం పరిరక్షణ కోసం ఒక ఉపసంఘం పనిచేసింది. దాని కన్వీనర్ మాలకొండయ్య గారు ప్రతిరోజూ ప్రాంగణాన్ని శుభ్రం  చేయడానికి  కార్యకర్తల సహాయంతో మంచి కృషి చేశారు!
స్థానికులుగా ఆ పనికి మేం సాయం చేస్తుండే వాళ్ళం.  పొద్దున్నే  చలసానినగర్లో  ప్రతిరోజూ  విశాలాంధ్ర  దినపత్రికను అమ్మడానికి నేనూ , కిషోర్ , వంక రవి పోటీపడేవాళ్ళం. అప్పట్లో విశాలాంధ్ర  దినపత్రిక   ఖరీదు 15 పైసలు. మేం రోజూ  ఆరురూపాయల  నుండి ఎనిమిది రూపాయలు  అమ్మేవాళ్ళం.  తెలుపునిక్కరు  ,తెలుపు  టీషర్ట్  ధరించిన  కే.ప్రతాపరెడ్డి గారు   మెడలో  కెమెరాతో  తిరుగుతూ కనిపించేవారు. వివిధబృందాలు  ఆయన్ని అడిగి ఫోటోలు  తీయించుకుంటూ ఉండేవి. 

 నూతక్కి విద్యార్థి పాఠశాల !

మే 25 నుండి జూన్ 1 వరకూ ఎనిమిది రోజులపాటు విద్యార్థి రాజకీయ పాఠశాల గుంటూరు జిల్లా నూతక్కిలో జరిగింది. దానికి 525మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రారంభసభకు    సి.పి.ఐ. కేంద్ర   కార్యదర్శివర్గసభ్యుడు   ఎన్.కే. కృష్ణన్  హాజరయ్యారు. సురవరం సుధాకరరెడ్డి గారు  ప్రిన్సిపాల్ గా , ఆలా నాగేశ్వరరావు గారు  వైస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. "విప్లవ తత్వశాస్త్ర ఆవశ్యకత" అంశంపై రాంభట్ల కృష్ణమూర్తి , "భారతదేశం  ఎందుకు పేద దేశం అయ్యింది , సమస్యలు పరిష్కారాలు" అంశంపై తమ్మారెడ్డి సత్యనారాయణ , "స్వాతంత్ర్య పోరాటం" అంశంపై సురవరం సుధాకరరెడ్డి , "ఆచరణలో సోషలిజం, సోవియెట్ వాస్తవికత" అంశంపై వై.విజయకుమార్ , "ప్రస్తుత రాజకీయ పరిస్థితి  - కాంగ్రెస్ పాలన స్వభావం" అంశంపై , "నక్సలైట్లు - ఆచరణ" అంశంపై నీలం రాజశేఖరరెడ్డి , "సిపిఎం పంథా" అంశంపై ," పెట్టుబడిదారీ  శిబిరం - సోషలిస్టు శిబిరం" అంశంపై వేములపల్లి శ్రీకృష్ణ , "విప్లవం అంటే ఏమిటి ? ఫ్రెంచ్ ,అమెరికా , సోవియట్ ,చైనా , క్యూబా విప్లవాలు " అంశంపై , "మార్క్స్ ,ఎంగెల్స్ , లెనిన్ , డిమిట్రావ్ విప్లవకారుల జీవితం" అంశంపై  ఈడ్పుగంటి  నాగేశ్వరరావు , "తెలంగాణా సాయుధపోరాటం" అంశంపై డా.రాజ్ బహదూర్  గౌడ్  , "భూసంస్కరణలు , వ్యవసాయం" అంశంపై ," కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటి , దాని స్వభావం  ఏమిటి" అంశంపై గుజ్జుల  యల్లమందారెడ్డి ,  "విద్యార్థి ఉద్యమసమస్యలు" అంశంపై సురవరం సుధాకరరెడ్డి బోధించారు. విద్యార్థులకు నూతక్కి హైస్కూల్ గదుల్లో  బస ఏర్పాటు చేశారు. హైస్కూల్ ఆవరణలో క్లాసులు జరపడానికి 500 మందికి సరిపడా ఒకటే  పెద్దతాటాకుపందిరి వేశారు. రోహిణీకార్తె  ఎండలకి   ఇబ్బందిగా  ఉండేది. దాంతో ఉదయం , సాయంత్రం బుంగలతో నీళ్ళు తెచ్చి  పందిరిపై చల్లి ఉపశమనం కలిగించేవారు!
ప్రతిరోజూ ఉదయం కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ హిందీ  పాట పాడటంతో క్లాసుమొదలయ్యేది. "ఉఠ్  జాగ్ ఓ భూకే  బందీ   అబ్ ఖీంచ్ లాల్ తల్వార్ కబ్ తక్ సహోగీ భాయీ  
జాలీమ్  కా అత్యాచార్ " అంటూసాగే  ఆపాటని  500 మంది ఒకేసారి  గొంతెత్తి   పాడుతుంటే  ఉద్వేగంగానూ, ఉత్తేజంగానూ  ఉండేది. యాభైఏళ్లు  గడిచినా ఆ బృందగానం ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే   ఉంది. అక్కడకూడా ఎనిమిదిరోజులూ కవాతు ,కర్రసాము నేర్పారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా  ఉర్రూతలూగించాయి. తాడేపల్లిగూడెం నుండి యాళ్ళబండి రాజేంద్రప్రసాద్ , యాళ్లబండి రామకృష్ణ   పరమహంస , జాన ప్రసాదరావు ,  నేనూ , హాజరయ్యాం.

నూతక్కిపాఠశాలలో  మాకు బాగా గుర్తున్న  విషయం  వై.చెంచయ్య గారి వివాహం. గాయకుడు గని  వెలుగులోకి వచ్చింది కూడా అక్కడే. నూతక్కి క్లాసుల ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ఖమ్మంజిల్లా నుండి శాసనసభ్యుడు మహమ్మద్ రజబ్ ఆలి , శాసనసభ్యుడు  వేములపల్లి శ్రీకృష్ణ వక్తలుగా హాజరయ్యారు. నూతక్కి పాఠశాల తర్వాత కూడా రాష్ట్రస్థాయి పాఠశాలల పరంపర  కొనసాగింది. 1974 ,75 ,76 సంవత్సరాలలో తెనాలి, రేవేంద్రపాడు,  రాజమండ్రి పెనుగంచిప్రోలు వంటిచొట్ల విద్యార్థి యువజన కార్యకర్తలకు పెద్ద స్థాయిలోనే పాఠశాలలు జరిగాయి. వాటికి కూడా ఐదారు  వందలమంది తగ్గకుండా హాజరు అయ్యారు. పార్టీకి అప్పట్లో సమీకరణ సామర్థ్యం గట్టిగా ఉంది. భారీస్థాయిలో పాఠశాల  నిర్వహణకు ఆర్ధికవనరుల సమీకరణ ఒకఎత్తు అయితే పదిరోజులపాటు వందలాది మంది కోసం  క్యాంపు నిర్వహించడానికి కార్యకర్తలను  సమీకరించడం  మరోఎత్తు. తాడేపల్లిగూడెం పాఠశాలకు నమోదైన  ప్రతినిధులు  750 మందే  అయినా , స్థానికులు మరో  వందమంది ఆసక్తిగావచ్చి  క్లాసుల్లో  కూర్చునేవారు. వారికి  వివిధరకాల  సేవలు అందించడానికి  దాదాపు 150 మంది వాలంటీర్లు కూడా  నెలరోజులు  పనిచేశారు. ఆరోజుల్లో పార్టీకిఉన్న సమీకరణ శక్తికి  ఈపాఠశాలలు ఒకరుజువు. నిర్మాణదక్షత  , నిర్వహణా సామర్ధ్యం పుష్కలంగా ఉండటం కారణంగానే ఇంత భారీపాఠశాలలు నిర్వహించగలిగారు. తర్వాత పరిస్థితుల్లో సహజంగానే మార్పులు వచ్చాయి. 

శిక్షణా కార్యక్రమాల పద్దతి మారింది. జిల్లాస్థాయిలో మూడు, నాలుగురోజుల  పాఠశాలలు వచ్చాయి. అందులో అంశాలపై  ప్రాథమిక పరిచయం మాత్రమే ఉంటున్నది. తర్వాతిస్థాయిలో   పదిరోజుల  శిక్షణ వచ్చింది. వాటిల్లో అంశాలపై లోతయిన వివరణ ఉండేది. ఆ తర్వాత  విద్యార్థులకు 20 నుండి 25 రోజులు , పార్టీ కార్యకర్తలకు 40 రోజుల  శిక్షణ వచ్చింది.  అందులో అధ్యయనానికి  చర్చకు ప్రాముఖ్యం ఉండేది. అవి హైదరాబాద్ లోని మఖ్దూం భవన్ లో జరిగేవి. పైనుండి  కిందవరకూ   సైద్ధాంతిక  శిక్షణాకార్యక్రమాలకోసం సంస్థాగతంగా ఏర్పాట్లుచేసిన  ఘనత నీలం  రాజశేఖరరెడ్డి  గారికి దక్కుతుందనీ , ఆయన పట్టువదలని  విక్రమార్కుడిలా  కృషిచేశారనీ  , జాతీయస్థాయిలో  గంగాధర అధికారి , భవానీసేన్ , మోహిత్ సేన్ ,వంటి వారు సైద్ధాంతిక శిక్షణకు బాధ్యత వహించారని పెద్దలు ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడిన సందర్భంలో చెప్పారు. తాడేపల్లిగూడెం , నూతక్కి రాజకీయ పాఠశాలలు నిర్వహించి 50 సంవత్సరాలు పూర్తిఅయిన  సందర్భంగా  ఆనాటిస్ఫూర్తిని  గుర్తు చేసుకున్నాను. ఆ పాఠశాలలకు హాజరైన  స్నేహితులతో పంచుకున్నాను. ఈడ్పుగంటి నాగేశ్వరరావు గారు, వర్మగారు  , ఐ.ఎస్.రాజు గారు , ప్రతాపరెడ్డి గారు , నల్లూరి అన్న,  డా.కే.నారాయణగారు , నానీ గారు , వనజ , లాంటి పార్టీ నేతలతో   మాట్లాడాను. వారుకూడా  తమజ్ఞాపకాలను  గుర్తు చేసుకుని  ఎంతోసంతోషం వ్యక్తం చేశారు. నాటి పాఠశాల  నిర్వహణలో  క్రియాశీలపాత్ర   పోషించి ఇప్పటికీ మనమధ్యనే  ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న   ఐ.ఎస్.రాజు గారికి , డి.వి.వి.ఎస్. వర్మగారికీ అభినందనలు. అది స్వర్ణయుగం ,ఇప్పుడేమీ లేదు అనేవారు ఉంటారు. అది ఒక అభిప్రాయం మాత్రమే. కమ్యూనిస్టులు ప్రతిపాదించిన అనేక భావనలకు సామాజిక ,రాజకీయ ఆమోదం లభించింది అనేది ఒక వాస్తవం. వారి ప్రత్యక్ష ,పరోక్ష ప్రభావంతోనే  అవి అమలు జరుగుతున్నాయి. అలాగే ప్రతికూల భావజాలం కూడా బలోపేతం అయిన మాట కూడా నిజమే. అయితే ఆనాటి సాధనాలు ,పద్దతులు  మారాయి. సైద్ధాంతికపోరాటం మాత్రం కొత్త కొత్త రూపాలలో  కొనసాగుతూనే  ఉంది..!
 
గత అనుభవం, స్వీయరచన..
డి.సోమసుందర్ ,
సీనియర్ పాత్రికేయుడు.
తాడేపల్లి గూడెం.

Nutakki

2022-05-25 09:08:22

నోరూరించే కాకినాడ కాజా ఒక్కసారి తింటే..

తూర్పుగోదావరి జిల్లాలో మీది ఏఊరు అని అడిగేవారంతా కాకినాడ అని అవతలివారు చెప్పే సమాధానం కోసం ఆశగా ఎదురుచూస్తారు. ఎందుకు తెలుసా అది వ్యక్తుల కోసం కాదు..అక్కడ బాగా ఫేమస్ అయిన కాకినాడ కాజా కోసం..వస్తూ వస్తూ మాకో కేజీ కాకినాడ కాజీ తేవచ్చు కదా అని లొట్టలేసుకుంటూ అడగటానికి అంతలా కాకినాడ కాజా ఫేమస్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కాజా అంటే కాకినాడ, కాకినాడ అంటే కాజా అన్నంత పేరు సంపాదించుకుందంటే ఈ కాజా కధ కమామిషు అంతా ఇంతా కాదు. ఈ కాజాని స్రుష్టించిన  కోటయ్య అనే పేరగల వ్యక్తి మొదట్లో అంతా కోటయ్యకాజా కోటయ్యకాజా అనేవారు. అదికాస్తా కాలక్రమంలో కాకినాడ కాజాగా రూపాంతరం చెందినది. కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ శుభకార్యాలు జరిగినా ఈకాజాలేని తీపి ఉండదంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా కాజా అంటే మడతలు చుట్టి వుంటుంది. కానీ కాకినాడ కాజా మాత్రం గుండ్రంగా నున్నగా వుంటుంది. లోపల దాని పొట్టనిండా తియ్యని పాకం నిండివుంటుంది. ఇదీ ప్రత్యేకత. ఈ టేస్టుకోసమే మిఠాయిప్రియులందరూ కాకినాడలోకి అడుగు పెట్టగానే నోరూరే రుచిని తీపి చేసుకోవడానికి ఒక గుటకలో కాకినాడ కాజాని కొరికిపడేస్తారు. ప్రస్తుతం ఈ కాజాలు అన్ని దేశవ్యాప్తంగా దొరుకుతున్నా ఎక్కడి వెళ్లినా కాకినాడ కాజా అంటేనే దీనిని ఇస్తారు అంతలా మంచి పేరుపొందిందీ ఈకాజా. ఇంత స్టోరీ చదివిన తరువాత లేదా విన్న తరువాత మీకూ కాకినాడ కాజా రుచిచూడాలని వుంది కదా. కాకినాడ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడి కాజాని రుచిచూడకుండా మాత్రం వెనుతిరగకండి.

Kakinada

2021-09-26 08:08:59

అల్లూరి వీరచరిత్రను మసక బార్చారు..!

తెలుగు జాతి గర్వించదగిన రోజుని మార్చి ఏమార్చారు.. తెల్లవాడు దొంగ దెబ్బ తీసినా.. వాడే నేటీకి గుర్తుపెట్టుకొని భయపడిన క్షణాన్ని.. భారతీయులంతా గర్వంగా తలచుకునే ఆ రోజుని భావితరాలకు గుర్తులేకుండా చేశారు.. భరతమాత దాశ్య శృంఖలాలను తెంచడం కోసం త్రుణపాయంగా వదిలిన ప్రాణాలకు విలువ లేకుండా చేశారు.. వెరసీ ఆ మహానుబావుడిని వీర చరిత్రను శాస్వతంగా మసకబార్చారు. మీరు చదువుతున్నది అక్షర సత్యం.. గుండెలవిసేటంత బాధకలిగినా.. ధారలా కారుతున్న కన్నీటి ప్రవాహాన్ని ఆపుకొని మరీ రాస్తున్న క్షమాపన చెప్పే మాటలివి.. అల్లూరి చరిత్ర పరిశోధకుడిగా, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా అల్లూరి శ్రీరామరాజు(వాడుకబాషలో అల్లూరి సీతారామరాజు) వీర చరిత్రను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పాల్సిన నేను ఆ మహానుభావుని విషయంలో జరిగిన ఘోర తప్పిదాన్ని విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేటలో కేంద్ర ఆర్ధిక మంత్రి పర్యటన రోజున గుర్తుచేస్తున్నందుకు ఎంతో చింతిస్తున్నాను.. ఆ ఘటన  భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడం కోసం బ్రీటీషు వాడి వెన్నులో చలిపుట్టించేంత పోరాటం చేసిన యోధుడు అల్లూరి శ్రీరామరాజు(సీతారామరాజు).. అంతటి మహానుభావుడికి ఎదరురెళ్లి యుద్దం చేయలేని పిరికి పందలు..  కొయ్యూరు మండలం మంప ఘాట్ వద్ద వద్ద ఒక చెరువులో శరీరానికి తగిలిన గాయాలను కడుక్కుంటున్న సమయంలో.. అల్లూరిని వెనుకనుంచి దొంగ దెబ్బతీశారు చేవలేని..చేతకాని బ్రిటీష్ ముష్కరులు... 

ఆఖరి శ్వాస వరకూ భరతమాతకోసం, అమాయక గిరిజనుల కోసం పోరాడి.. తన నెత్తుటి దారతో భరతమాతకు తిలకం దిద్దిన చరిత్ర చారిత్రక నేపథ్యం.. ఆరోజు 07-05-1924 తెల్లవాడిపై విశాఖ మన్యంలో జరిగిన భీకర పోరుకి ఆ రోజు ఆఖరైంది. భారతదేశ చరిత్రలోనే ఇదొక వీరోచిత ఘట్టం. బావి భారత యువత గుర్తుంచుకోదగిన అంశం.. కానీ ఆ చరిత్రను పూర్తిగా తిరగరాసేశారు ప్రభుత్వ అధికారులు.. ఆతప్పును చూసిన ప్రజాప్రతినిధులు కూడా దానిని సరిదిద్దే ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా అభివ్రుద్ది పేరుతో చేసిన తప్పు.. నేడు అల్లూరి సీతారామరాజు వీరోచిత మరణాన్ని, ఆ రోజును జాతి మొత్తం తప్పుగా గుర్తుంచుకోవాల్సి వస్తున్నది. కారణం ఆ రోజుని ఆయన పార్దీవశరీరం ఖననం చేసిన ఏజెన్సీ లక్ష్మీపురం (క్రిష్ణదేవిపేటగా పిలుస్తారు)లోని అల్లూరి థీమ్ పార్కులోని సమాధిపై తప్పుడుగా లిఖించారు. తేది (12-05-24) ఆ మహానుభావుడు పుణ్యభూమిపై వదిలిన ప్రాణం తేదినీ తప్పుగా రాశారనుకుంటే.. ఆ మహాను భావుడి జనన తేదిని కూడా తప్పుగానే అదే సమాధిపై (05-07-1897)గానే రాశారు. వాస్తవానికి అల్లూరి శ్రీరామరాజు జననం 04-07-1897 కాగా, మరణం 07-05-1924)గా నమోదు చేయాల్సి వుంది. 27ఏళ్ల ప్రాయంలో దేశం కోసం తన ప్రాణాన్ని వదిలిన మహా వీరుడికి భారతీయులుగా మనం ఇచ్చే గౌరవం ఇదేనా.. అన్న విషయం తలచుకుంటే నిజంగా తలదించుకునేటంత సిగ్గుగా వుంటుంది. అల్లూరి పార్ధీవ శరీరం కాలి భూడిదైన ఆ పుణ్యప్రదేశాన్ని సందర్శించిన వారందరూ ఆయన జనన, మరణ తేదీలను ఎందుకు తప్పుగా లిఖించారు.. వాటిని ప్రజాప్రతినిధులు సైతం ఎందుకు సరిచేయించలేకపోయారని.. మాటలు కోటలు దాటేలా మాట్లాడే నేతల చేతలు.. అల్లూరి మీద ఉండే గౌరవమంటూ ఓ నాలుగు తిట్లు తిట్టుకొని.. ఆ తప్పుడు తేదీలను చూసి మనసులోనే బాధపడి శోకతప్త హ్రుదాయాలతో వెను తిరుగుతూనే ఉన్నారు.. 

ఆ పరంపరలోనే 08-08-2021న కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం కేబిట్ మంత్రి, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రిష్ణదేవీపేట సందర్శిస్తున్న వేళ ప్రభుత్వాలు, పాలకులు చేసిన తప్పులను ఆమె సాక్షిగానే ఒక్కసారి గుర్తుచేసే ప్రయత్నం చేసింది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారిక  మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net .. వాస్తవానికి తప్పుని తప్పుగా ఎత్తిచూపడం కూడా తప్పుగానే ఉన్న ఈరోజుల్లో.. ఆ మహానుభావుడి చరిత్రకు చెదలు పడుతుంటే తట్టుకోలేక.. చూసి ఓర్వలేక ఎంతో భాధపడుతూ రాసిన ఈ కధనం చూసైనా పాలకుల్లో మార్పు వస్తుందని మాత్రమే చిన్న ఆశ.. లేదంటే అల్లూరి సమాధుల ప్రాంతాన్ని చూసి కేంద్రమంత్రి ముక్కున వేలేసుకున్నప్పుడైనా అధికారులు, ప్రజాప్రతినిధులు అల్లూరి విషయంలో చూపిన నిర్లక్ష్యం గుర్తుకు వస్తుందేమోనని.. ఆ తరువాతైనా ఆయన జనన, మరణ తేదీలను సరిచేస్తారేమోననే ఎక్కడో చిన్న ఆశతోనే ఆ తప్పుని ఎండగట్టాం.. అల్లూరి వీరోచిత పోరాటం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కేంద్రమంత్రైనా అల్లూరికి విలువనిస్తూ.. ఆయన వైభవాన్ని దేశ స్థాయిలో పెరిగేలా చేస్తారో.. లేదంటే రాష్ట్ర పాలకులు, అధికారులు మాదిరిగానే అల్లూరిని, ఆయన చరిత్రను అలానే వదిలేస్తారో తెలీదు కానీ.. 

విశాఖజిల్లాకి అల్లూరి పేరుపై ప్రస్థానవ వస్తుందా..
భారతదేశంలో బ్రీటీషు సేనలకు రొమ్ము చూపించి ఒక్కడే ఎదురెళ్లి.. వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన అల్లూరి సీతారామరాజు పేరుని విశాఖజిల్లాకి పెట్టే విషయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రిష్ణదేవీపేట పర్యటన సందర్భంగానైనా మన పాలకులు గుర్తు చేసుకుంటారా.. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నేడైనా ఆమెకు గుర్తు చేస్తారా.. అల్లూరిపై నాటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం పెట్టిన కేసుల చిట్టాను, చేసిన అభియోగాలను ఇప్పటికైగా బయటకు తీయించే ఏర్పాటు చేస్తారా.. అల్లూరి వాస్తవ చరిత్రపై నేటీకీ రాష్ట్రప్రభుత్వం అధ్యయం చేయించకుండా వదిలేసినట్టుగా కేంద్రం కూడా వదిలేస్తుందా.. లేదంటే ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి ఇచ్చినంత గౌరవాన్ని అల్లూరి సీతారామరాజుకి ఇస్తారా.. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి దేశవ్యాప్తం చేస్తారా.. కనీసం బ్రిటీషు సేనల్ని మొత్తం ఒకేక్కడిగా ఎదిరించిన పుణ్యభూమి, వీరభూమి, రచ్చబండ పంచాయతీలకు పుట్టినిల్లు అయిన పాతూరు(నాటి కేడిపేటగా పిలవ బడే నేటి క్రిష్ణదేవీపేట.. వాడుకలో పాతూరు గ్రామం)ని గానీ, అల్లూరి సంచరించిన ప్రదేశాలను గానీ కేంద్ర టూరిజం ప్యాకేజీలో చేర్చుతారా.. ఏంచేస్తారో.. ఎటు చేస్తారో.. అదేదీ కాదనుకుంటే ఎప్పటిలానే కేంద్ర ఆర్ధిక మంత్రి క్రిష్ణదేవిపేట పర్యటనలో నేతలంతా హడావిడీ చేసి మీడియాల్లో ప్రచారానికే వాడుకుంటారో ఆగస్టు 8న జరిగే పర్యటనలో తేలుతుంది. 75ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో  ఎన్నో ప్రభుత్వాలు అల్లూరిని పెడచెవిన పెట్టినట్టుగానే బీజేపీ ప్రభుత్వం కూడా పర్యటనకే వాడుకుంటుందా..? అలా వాడుకున్నా.. మన్యవీరా మీరు మాత్రం ఎప్పటిలానే మీ వీరోచిత చరిత్రను అర్ధం చేసుకోలేని మా చేతగాని తనాన్ని సమాధుల్లోనే నుంచే చూస్తూ అలానే ఉండి పోండి.. ఎందుకంటే మీరు పుట్టిన భారతదేశంలోనే మేమూ పుట్టి మిమ్మల్నే మరిచిపోయామనే చెడ్డపేరు జీవితాంతం మేమూ మోయాలి కదా..జై అల్లూరి, జై జై అల్లూరి..!

Krishnadevipeta

2021-08-07 17:27:49

తెల్లవాడిని భయపెట్టిన మిరపకాయ్ టపా..

అమాయక గిరిజనుల మాన, ప్రాణాలను తీస్తూ పాసవిక ఆనందాన్ని పొందే మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వాన్ని అల్లూరి సీతారామరాజు కంటే ముందుగా భయపెట్టింది మిరపకాయ్ టపా...తమకు ఎదురులేదని విర్రవీగిన తెల్లవాడికి కంటినిండా నిదుర లేకుండా చేసిన మిరపకాయ్ టపా స్రుష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఒకరకంగా చెప్పాలంటే బ్రిటీషు సైన్యం చేసిన తప్పును నీడలా వెంటాడి తెల్లవాడి ఆత్మస్తైర్యాన్ని దెబ్బకొట్టడంలో కీలకపాత్ర పోషించనది కూడా ఈ మిరపకాయ్ టపా అనే చెప్పాలి(మిరపకాయ్ టపా అంటే బాణానికి వర్తమాన కాగితం గుచ్చి దానిముందు ఎర్రగా పండిన  మిరకాయని గుచ్చి వింటి ద్వారా పంపే వర్తమానం. అల్లూరి సీతారామరాజు ఉన్నచోట నుంచి మరొక చోటుకి దీనిని సంధించే వారు. బాణం చేరుకున్న ప్రదేశం నుంచి సైన్యంలో నమ్మకమైన వ్యక్తి  మరొకరు దానిని చేరాల్సిన ప్రదేశానికి సంధించేవారు. అల్లూరి నుంచి మిరపకాయ్ టపా గమ్యం చేరుకోవడానికి  ఐదు దశలు దాటేదని చెబుతారు. ఒక్కోసారి 300 అడుల దూరంనుంచి నేరుగా అల్లూరి సీతారామరాజే ఈ మిరపకాయ్ టపాను బ్రిటీషు సేనలు ఉండే ప్రాంతానికి సంధించేవారని చరిత్ర చెబుతోంది...). విశాఖ మన్యంతోపాటు, తూర్పుగోదావరి గిరిజన గూడేల్లో అమాయక గిరిజన మహిళలను విచక్షణా రహితంగా చెరబట్టి విక్రుత చేష్టలకు పాల్పడేది బ్రిటీషు ప్రభుత్వం. అందులో మేజర్ గుడాల్ బ్రుంధం చేసే అరాచకాలు అన్నీ ఇన్నీకావు. మహిళలపై అత్యాచారాలు చేసి, వివస్త్రను చేయడంతో పాటు పండిన ఎండుమిరపకాయలను చిదిమి వాటితో మహిళల మర్మావయాలను తాకుతూ...గిరిజన మహిళలు చేసే హాహా కారాలను వింటూ సునకానందం పొందేవారు బ్రిటీషు సేనలు. ఏ ప్రాంతంలో పనులు జరుగుతుంటే ఆ ప్రాంతాలకి దినసరి కూలివచ్చే వారిపై బ్రిటీషు సైన్యం చేసే ఈ విక్రుత క్రీడ యావత్ తెల్లవాడి ప్రభుత్వానికే శాపంగా మారింది. గిరిజనుల మాన ప్రాణాలను అత్యంత దారుణంగా తీసేస్తున్న సమయంలో అల్లూరి సీతారామరాజు వారిని దేవుడిలా రక్షించే ప్రయత్నం చేశారు. ఏ తరహా విక్రుత చర్యలతో గిరిజన మహిళలపూ అత్యాచారం చేసేవారో అదే విధానాన్ని బ్రిటీషు సేనలకు తెలియచెప్పాలని నిర్ణయించుకున్న అల్లూరి తన ఉద్యమంలో మిరపకాయ్ టపాను కీలకంగా మార్చారు. తాము చేసిందే శాసనం, చెప్పిందే మాటగా రాజ్యమేలుతున్న బ్రిటీషు ప్రభుత్వానికి తొలుత హెచ్చరిక పంపినది కూడా ఈ మిరపకాయ్ టపాతోనే. అల్లూరి సీతారామరాజు మన్యం పితూరీ చేస్తున్న సమయంలో తెల్లవాడికి అల్లూరి సేన ఎదిరించే కార్యక్రమాలన్నీ ఈ మిరపకాయ్ టపాతోనే వర్తమానం పంపేవారట అల్లూరి. విశాఖ మన్యంలో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు, బ్రిటీషు సేనలకు ఎందు వర్తమానం పంపేసమయంలో పండు మిరపకాయ్ ఎందుకు పంపేవారో తొలుత అర్ధమయ్యేది కాదు. ఈ టపాపై బ్రిటీషు సేనలు అమాయక గిరిజనులను కూడా దారుణంగా హింసించి దానికి కారణం కూడా చెప్పమనేవారట. ఆ విషయం గిరిజనులకు కూడా తెలిసేది. దీంతో బ్రిటీషు సేనలు పెట్టే హింసలను అనుభివస్తూనే అల్లూరి సీతారామరాజు మన్యంపితూరికి పూర్తిస్థాయిలో సహకారం అందించేవారు అమాయక కోయ గిరిజనులు. ఈ తరుణంలోనే విశాఖజిల్లా, చింతపల్లి తాలూకా దామనాపల్లి ఘాట్ వద్ద అల్లూరిని ఎదిరించే క్రమంలో యుద్ధంలో రాటు దేలిన హైటర్, కవర్ట్ లను అల్లూరి సీతారామరాజు మట్టికరిపించారు. వీరికి బ్రిటీషు ప్రభుత్వంలోనే తిరుగులేని సైన్యకాపరిలుగా గుర్తింపు వుంది. ఆ సమాచారాన్ని కూడా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి ఈ మిరపకాయ్ టపాద్వారానే వర్తమానం పంపారు.  ఈ టపా సారాంశం ఏంటంటే నన్ను అంతమొందించడానికి పంపిన నీ సైన్యం మా తిరుగుబాటుదారుల చేతిలో కుక్కచావు చచ్చింది, మీ సైన్యం శవాలను రూ.500  సుంకం చెల్లించి  తీసుకెళ్లండి అనేది ఆ వర్తమానంలో ఉన్న అంశం. అయితే నేరుగా అల్లూరి ఉన్న ప్రాంతానికి యుద్ధం జరిగిన రోజు చేరుకోలేని తెల్ల సైన్యం మరుసటి రోజు వారి మ్రుత దేహాలను   పన్ను కట్టి హైటర్, కవర్ట్ మ్రుతదేహాలను తీసుకొచ్చి...యుద్ధంలో వీరమరణం పొందారని(1922 సెప్టెంబరు 24) సమాధులపై రాసి వారి మ్రుత దేహాలను నర్సీపట్నంలో సమాది చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నర్సీపట్నం ఆర్ అండ్ బి బిల్డింగ్( నాటి బ్రిటీషు ప్రభుత్వ కార్యాలయ సముదాయం) కి కూత వేటు దూరంలోనే వుంటుంది. బ్రిటీషు యుద్ధవీరులు అల్లూరి చేతిలో మ్రుతి చెందారంటే ఆయన అంగబలం ఏపాటిదో కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి అర్ధమైపోయింది. ఒక్కసారిగా ప్రభుత్వం తమ యుద్ధానికి కొద్ది రోజులపాటు విరామం ప్రకటించింది. అదే సమయంలో  ఈ విషయాన్ని కలెక్టర్ రూథర్ ఫర్డ్ తన విశస్వనీయ సేనాధిపతులతో చర్చించే సమయంలో అల్లూరి సీతారామరాజు సైన్యంలో కొందరు వ్యతిరేకులను లోబరుచుకొని మిరపకాయ్ టపా విషయాన్ని తెలుసుకో గలిగారు. అందులో ముఖ్యమైన విషయం మేజర్ గుడాల్ మన్యప్రాంతంలో ప్రభుత్వ పనులు, నిర్మాణాలు చేసే సమయంలో గిరిజన మహిళలను అత్యాచారం చేసి, తరువాత దారుణంగా వారిని మిరపకాయలతో హింసించేవారని తెలుసుకున్నాడు కలెక్టర్ రూథర్ ఫర్డ్... తమ సేనలు చేసింది తప్పే అయినా తాము ఏమైనా చేసేవారము, గిరిజనులు పడేవారనే అహంకారంతో మరింతగా రెచ్చిపోసాగాడు బ్రిటీషు కలెక్టర్. ఒక రకంగా తమ వేలితో తమ కంటిలోనే అల్లూరి పొడిచిన విధానం కూడా కలెక్టర్ రూథర్ ఫర్డ్ ని చాలా ఎక్కువగానే భయపట్టిందని చెబుతారు.  ఆ తరువాత ఏజెన్సీకి ప్రత్యేక కమిషనర్ హోదా కూడా రూథర్ ఫర్డ్ కి కట్టబెట్టింది బ్రిటీషు ప్రభుత్వం. ఆతరువాత అల్లూరి చేసే ప్రతీ తిరుగుబాటు కార్యక్రమానికి ముందు మిరపకాయ్ టపా పంపేవారు దీంతో తెల్లప్రభుత్వంలోని సైన్యం కూడా మిరపకాయ్ టపా అంటే హడలి చచ్చేవారు. కాలక్రమంలో మన్యంపితూరి ఉద్యమం మొత్తం అల్లూరి కంటే ముందుగానే మిరపకాయ్ టపానే బ్రిటీషు సేనలు హెచ్చరించేది. దాడి చేస్తామని చెప్పి మరీ బ్రిటీషు ప్రభుత్వంపై ఎంతో చాకచక్యంగా, విజయవంతంగా దాడి చేయడం బ్రిటీషు ప్రభుత్వానికి, మిలటరీ అధికారులకు అంతు పట్టేది కాదు. అలా మద్రాసు ప్రావిన్సు బ్రిటీషు ప్రభుత్వానికి కంటినిండా కునుపట్టనీయకుండా తెలుగువాడి పౌరుషాన్ని మిరపకాయ్ టపా రూపంలో పంపి భయపెట్టిన గెరిల్లా యుద్ధ విధ్య యోధులు అల్లూరి సీతారామరాజు. అల్లూరి  తెల్లవాడిపై చేసిన తిరుగుబాటు ఒక చరిత్ర అయితే, అయన సంధించిన మిరపకాయ్ మరో చరిత్రగా నిలిచిపోయింది..!Krishnadevipeta

2021-06-24 16:28:39

2021-06-22 02:30:01

Visakhapatnam

2021-06-15 04:37:24

భక్తుల కోసం తరలి వచ్చిన బాల బాలాజీ..

ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరి లక్షణాలతోనే మరో రెండు ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా.. వ్యయప్రయాసలకోర్చి తిరుమల వెళ్లలేని భక్తుల కోసం నేరుగా ఆ కలియుగ బాలాజీగా పిలుచుకునే వేంకటేశ్వర స్వామి ఉబయగోదావరి జిల్లాలకు తరలి వచ్చారని చరిత్ర చెబుతోంది.. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం కాగా, మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి  శ్రీ బాల బాలాజీ దేవ స్థానం..తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ తరహా ఫలితాలొస్తాయో.. అవే ఫలితాలు ఇక్కడి శ్రీవారిని దర్శించుకున్నా కలుగజేయడానికే స్వామి ఇక్కడ వెలసారనేది భక్తుల నమ్మకం.  ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదభ్యసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది. స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజ కార్యక్రమాలు, ఎంతో విశేషంగా ఉంటాయి.

ఇక ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరి కాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయస్సు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్ళలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్లుగా శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పాడు.. దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయలను దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలు పెట్టాడు. ఆ చిత్రపటం నేటికీ ఆలయంలోని ప్రత్యేక మందరిలో దర్శనమిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయానికి 1960లో బీజం పడింది.1960 నుంచి 1980 వరకూ ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

పాత ఆల యాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంతస్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 1970 మార్చి18న శంకుస్థాపన చేశారు. 1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూలవిరాట్టును ఉచితంగా అందించింది. ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్‌ తాయార్‌, గరుడాళ్వార్‌ విగ్రహాలను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి నూతన ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది.  అప్పనపల్లి కాకినాడ కు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 85 కి. మీ ల దూరంలో,  అమలాపురం కు 35 కి. మీ ల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రావులపాలెం మీదుగా (110 కి.మీ) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.

అప్పన్నపల్లి

2021-06-04 03:14:46

2021-06-03 07:19:46