విశాఖపట్నం జిల్లాలో పర్యాటక రంగాన్ని అన్ని వర్గాల వారికీ చేరువ చేయాలనే సంకల్పంతో.. విశిష్టతలను, విశేషాలను విద్యార్థులకు తెలియ జేయాలనే ఉద్దేశంతో మూడు సెక్టార్లలో ఎడ్యుకేషనల్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తద్వారా విద్యార్థులకు వినోదం, విజ్ఞానం లభిస్తాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. విద్యా పర్యాటకం ద్వారా విద్యార్థులకు చారిత్రక ప్రదేశాల విశేషాలు, విశిష్టతలు తెలుస్తాయని అన్నారు. ఎడ్యుకేషనల్ టూరిజంలో భాగంగా ప్రవేశ పెట్టిన నూతన విధానానికి జిల్లా కలెక్టర్ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గాయత్రీ విద్యాపరిషత్, అగనంపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో స్థానిక కలెక్టరేట్ నుంచి బయలుదేరిన విద్యా పర్యాటక ఐటెనరరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక, విద్యా, ఫారెస్ట్, మత్స్యశాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ టూరిజంలో భాగంగా విద్యార్థుల సౌలభ్యం నిమిత్తం జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాలను అనుసంధానం చేశామని, వాటిల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి ఉచితంగా, ప్రయివేటు విద్యా సంస్థల వారికి రూ.10 కనీస రుసంతో ప్రవేశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మెరైన్ మ్యూజియం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా సాగరతీరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిం చవచ్చన్నారు. సీ హారియర్ మ్యూజియం, టీయూ-167, ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్, మారిటైమ్ మ్యూజియంలను విద్యార్థులు సందర్శించవచ్చని గైడ్ లు విశేషాలను తెలుపుతారని వివరించారు. టైడ్ పూలింగ్కు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీని ద్వారా భూమి, జీవావరణ శాస్త్రంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
జీవ వైవిధ్య పర్యటనలో భాగంగా పర్యావరణంలోని జీవరాశుల అధ్యయనాన్ని చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇందిరా గాంధీ జులాజీకర్ పార్క్, కావులుప్పాడ సమీపంలోని బయోడైవర్సిటీ పార్కును సందర్శించవచ్చని, కంబాలకొండ అభయారణ్యంలో కొన్ని ట్రెక్కింగ్ అనుభవాలను కూడా విద్యార్థులు సొంతం చేసుకోవచ్చని సూచించారు.
తీర పర్యావరణ వ్యవస్థ యాత్రలో భాగంగా ఏయూలోని జీవశాస్త్ర ప్రయోగశాలని విద్యార్థులు సందర్శించవచ్చని, మడ అడవుల పరిశోధన కేంద్రం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం చూసే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా పర్యావరణ పరిక్షణకు ఆయా జీవులు ఏ విధంగా దోహదపడతాయో, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే అంశాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా తీర ప్రాంత పరిశోధనలకు సంబంధించి మెరైన్ లైవ్ వాక్ కూడా అనుసంధానం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారిణి జ్ఞానవేణి, డీఈవో చంద్రకళ, మారిటైం బోర్డు అధికారి సుబ్బిరెడ్డి, ఫారెస్ట్, మత్స్య శాఖల అధికారులు, టూరిజం కౌన్సిల్ సభ్యులు, విద్యార్థులు, టూరిజం శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.