1 ENS Live Breaking News

టీటీడీ కళాశాలల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు.  మే 17 నుండి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

          విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే " Student Manual in English" or "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన  క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు,  తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి.  తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న  గ్రూప్ లు ,  వాటి లోని సీట్లు, వాటిలో ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.  

విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో  కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు  రద్దు అవుతుంది.  విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, క‌ళాశాల‌ ప్రాస్పెక్ట‌స్‌ను పూర్తిగా చదివి ఆన్ లైన్ లో జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ కోరుతోంది.

         విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు,  నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా  నివృత్తి చేసుకోవచ్చు.  admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.  

Tirupati

2023-05-17 16:32:32

అటానమస్ దిశగా ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల

శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రయత్నంలోనే న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ సాధించి ఆ ఉత్సాహంతోనే అటానమస్ దిశగా అడుగులు వేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి కోరారు. తిరుపతిలోని ఎస్జీఎస్ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించడం సంతోషకరమన్నారు. కోవిడ్ తర్వాత న్యాక్  బృందం కళాశాలను సందర్శించిందని, ఇక్కడి మౌలిక వసతులను గుర్తించి ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు అందించిందని చెప్పారు. ఇందుకు కృషి చేసిన డిఈవో , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు

        కళాశాలలో ఆలయ శిల్పకళ, ఆలయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించినట్టు తెలిపారు. ఆత్మీయ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ పాల్గొని అధ్యాపకులను అభినందించడం సంతోషకరమన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులైన డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, పిఆర్వో డా. టి.రవి తదితరులు కలిసి కళాశాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈవో డా.ఎం.భాస్కర్ రెడ్డి, ఎస్జీఎస్ కళాశాల ప్రిన్సిపల్  వేణుగోపాల్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు  ప్రభాకర్ రెడ్డితోపాటు టీటీడీలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Tirupati

2023-04-25 11:13:47

గురువులే మార్గదర్శకులు..సిఏఓ శేషశైలేంద్ర

జీవితంలో ఉన్నతస్థాయికి చేరడానికి గురువులను మార్గదర్శకులుగా భావించాలని టీటీడీ చీఫ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌  శేషశైలేంద్ర కోరారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో 2022- 23 విద్యాసంవత్సరానికి గాను స్టూడెంట్‌ కౌన్సిల్‌ ప్రారంభోత్సవం గురువారం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఏవో మాట్లాడుతూ,  మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి లోపాలు సరిదిద్ది సమాజానికి పరిచయం చేసేవారు గురువులన్నారు. అధ్యాపకులు చెప్పిన విషయాలను చక్కగా విని జీవితాన్ని సరిదిద్దుకోవాలని కోరారు. భగవద్గీత ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. సహజ లక్షణాలైన ఆకలి, భయం, నిద్ర, కోరికలను నియంత్రించుకుని, మనిషి అభద్రతాభావాన్ని విడనాడాలని తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డిఈవో డా.ఎం.భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ,  ఈ కళాశాల నాక్‌ ఎప్లస్‌ గ్రేడ్‌ సాధించి దేశంలోనే ఉత్తమ కళాశాలగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

        కళాశాల ప్రిన్సిపల్‌ డా.కె.మహదేవమ్మ మాట్లాడుతూ,  ఎస్వీ యూనివర్సిటీ మార్కుల మెరిట్‌ ఆధారంగా విద్యార్థి సంఘ సభ్యులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థినులందరూ క్రమశిక్షణతో నడుచుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థినులందరూ కళాశాలలోని ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, స్పోర్ట్స్‌లో తమకిష్టమైన వాటిలో  పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా 606 మంది విద్యార్థినులు ప్రవేశం పొందారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఇన్‌చార్జి డా. భువనేశ్వరిదేవి, విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా. ప్రేమావతి, ఐఐసి కో ఆర్డినేటర్‌ డా.ఉమారాణి, వార్డెన్‌ డా.విద్యుల్లత ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-23 12:22:25

డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలో 10 మంది డీబార్

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలో మొత్తం 10535 మంది విద్యార్దులు గాను 9310 మంది విద్యార్దులు హాజరు అయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి డా.ఆర్.ప్రభాకర్ తెలియజేశారు. ఈ పరిక్షలకు 1225 మంది విద్యార్దులు గైర్హాజరు కాగా పరీక్ష కేంద్రం  జగన్స్ డిగ్రీ కళాశాల, నెల్లూరు నందు ఇద్దరు విద్యార్థులు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,నాయుడుపేటలో  ముగ్గురు విద్యార్దులు మరియు PRR & VS గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్సు డిగ్రీ కళాశాల,విడవలూలో ఐదుగురు విద్యార్ధులు  డీబార్ అయ్యారని పేర్కొన్నారు. ప్రతి పరిక్షా కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశిoచిన ప్రకారం కోవిడ్ –19 నిబంధనలను పాటిస్తూ విద్యార్దులను  పరీక్షా కేంద్రం లోనికి అనుమతించామన్న ఆయన ప్రతి పరీక్షా కేంద్రంలో మాస్కులు ను తప్పనిసరి చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు.


Nellore

2023-02-20 14:32:20

ఇండియన్ మిలటరీ కాలేజీలో అడ్మిషన్లుకు ప్రకటన

ఇండియన మిలటరీ కాలేజీలో చేరాలనుకునేవారికి సదరు సంస్థ గుడ్ న్యూస్ చెప్పంది. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ పరీక్ష ద్వారా విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్ధినీ, విద్యార్ధులు 01-01-2024 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడో తరగతి ఉత్తీర్ణులు/చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తుకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ తో పాటు మరిన్ని వివరాలు rimc.gov.in వెబ్ సైట్ లో ఇండియన్ మిలటరీ కాలేజీలో పొందు పరిచింది. మిలటరీ కాలేజిలో చదువు అభ్యసించాలనుకునేవారికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు..

Dehradun

2023-02-18 11:11:47

విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి..కలెక్టర్

విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారించి  సైన్స్, సాంకేతికరంగాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  శుక్రవారం   డా. డి.వి.ఎం.ఎం. పాఠశాల నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరు ప్రారంభించారు.  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలో సైన్స్, సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని, జిజ్ఞాసను పెంచుతాయని తెలిపారు. తాను కూడా  హైస్కూలు చదువుకొనేటప్పుడు జిల్లాస్థాయిలో మొదటి స్థానం, జోధ్ పూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొని 4వ స్థానం పొందినట్లు తెలిపారు.  తక్కువ ఖర్చుతో వస్తువుల ఉత్పత్తి చేయుట గూర్చి పరిశోదనలు చేయాలని విద్యార్థులకు సూచించారు.

 పర్యావరణహిత వస్తువులు తయారుచేసేటప్పుడు ప్రస్తుతం అందుబాటులో గల వస్తువుల కంటే తక్కువ ధరకు అందించినపుడే  ప్రోజెక్టు విజయవంతమవుతుందని తెలిపారు.  ప్రోజెక్టు తయారు చేసేటప్పుడు వాటిలో వాడే వస్తువులగూర్చి పూర్తి విషయ సేకరణ చేయాలన్నారు.  ఇటువంటి ప్రదర్శనలలో పాల్గొని ప్రోజెక్టును వివరించుట ద్వారా విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ది చెందుతాయన్నారు. నేటిరోజులలో ఉద్యోగ రంగంలో రాణించుటకు   చదువుతో పాటు వివిధరంగాలలో నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలన్నారు.   నేడు విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, సాంకేతికత అందుబాటులోనికి వచ్చిందని,   యాప్ ద్వారా నూతన విద్యాబోధన అందజేయుటకు  ఎనిమిదవ తరగతి నుండే  టాబ్ లు అందజేస్తున్నట్లు తెలిపారు.  ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి  సైంటిస్టులుగా ఎదగాలని,  జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను వారు రూపొందించిన ప్రోజెక్టులు గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో అయిదు అంశాలపై వైజ్ఞానిక ప్రదర్శన పెట్టగా జిల్లాలో గల 15 మండలాల నుండి    పర్యావరణహిత వస్తువులు తయారీపై 14 ప్రోజెక్టులు,   ఆరోగ్యం మరియు పరిశుభ్రత అంశాలపై 14 ప్రోజెక్టులు,  సాంకేతికత మరియు యాప్ లు అంశంపై 12 ప్రోజెక్టులు,  పర్యావరణ మార్పులపై 14 ప్రోజెక్టులు,  మోడలింగు  మాధమెటిక్స్ పై 14 ప్రోజెక్టులు విద్యార్థులు తయారుచేసారు.  ఈ కార్యక్రమలో  జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.డి.వి.రమణ, ఉప జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మజీరావు, ఉపాద్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-02-17 07:26:28

పకడ్బందీగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 26 నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  డిఆర్ ఓ శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని  ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్షలు జరుగు రోజులలో విద్యుత్ కి అంతరాయం లేకుండా చూడాలని ఏపిఈపీడిసిఎల్ అధికారులకు తెలిపారు . ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లు ఏర్పాటుకు వైద్యాధికారులకు ఆదేశించారు . మంచినీటి సదుపాయం, శానిటేషన్ పనులు జీవీఎంసీ అధికారులకు ఆదేశించారు. అందరు  అధికారులు  సమన్వయంతో పనిచేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు.

        రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఉమా రాణి మాట్లాడుతూ ఈ నెల తేది 26-02-2023 నుండి 07-03-2023  వరకు ఇంటర్మీడియట్ జనరల్ కోర్సెస్,  తేది. 20-02-2023 నుండి 07-03-2023 వరకు ఉదయం 9:00 AM నుండి 12:00 PM వరకు, మధ్యాహ్నం 2:00  PM నుండి 5:00 P M వరకు ఒకేషనల్  కోర్సెస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష 15.02.23 ( బుధవారం) 10:00 AM నుండి 1:00 PM వరకు , ఎన్విరాన్మెంటల్  ఎడ్యుకేషన్  పరీక్ష  17.02.23 ( శుక్రవారం) 10:00 AM నుండి 1:00 PM వరకు జరుగునని మొత్తం 126 సెంటర్స్ లో నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు సహాయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో డి ఐ ఈ ఓ లు, జీవీఎంసీ, వైద్య, ఆర్టీసీ , ఏపీఈపిడిసిఇఎల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-14 10:45:51

TDD విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలకు సమష్టికృషి

టీటీడీ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సమష్టి కృషి చేయాలని జేఈవో  సదా భార్గవి పిలుపునిచ్చారు. తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం టీటీడీ విద్యాసంస్థల పై ఆమె సమీక్ష జరిపారు.  ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ,  టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషియాలని ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో మౌళిక వసతులు అభివృద్ధి చేయాలని చెప్పారు. తద్వారా విద్యార్థుల నుంచి మరింత ఉత్తమ ఫలితాలు ఆశించవచ్చునని ఆమె అధికారులకు సూచించారు. జియో సహకారంతో  రూపొందించిన విద్యార్థుల సాఫ్ట్వేర్ అన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని, ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు.

 ఇందుకోసం పాఠశాలలు, కళాశాలవారీగా చదువులో వెనుకబడిన వారిని గుర్తించి, వారి ఉన్నతికి  తీసుకోబోతున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవో ను ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఇక మూడు నెలలే సమయం ఉన్నప్పటికీ, విద్యార్థులకు మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులు నిర్వహించాలన్నారు. ఇందుకోసం నిష్ణాతులైన శిక్షకులను ఉపయోగించుకోవాలని జేఈవో చెప్పారు. శిల్పకళాశాలలో ఏడాదికి కనీసం మూడు సార్లు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  తద్వారా విద్యార్థుల నైపుణ్యం మరింత మెరుగు పరచడానికి ఊతమిచ్చినట్లు అవుతుందని ఆమె అన్నారు. అలాగే తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలోని పుస్తకాలుతెప్పించి వాటిని తెలుగులోకి అనువాదం చేసి బోధించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

 శిల్ప కళాశాల కాంపౌండ్ వాల్, ఆర్చి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్వీ సంగీత, నృత్య, నాదస్వర కళాశాలలో వాగ్గేయకారుల  జయంతి, వర్ధంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఉన్న స్టేజిని అవసరాలకుఅనుగుణంగా అభివృద్ధి చేయడంతో పాటు మరుగుదొడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనిచెప్పారు. విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్ళను ఆదేశించారు.ఎస్పీ డబ్ల్యు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ అందించి, వారికి మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలా చేయడానికి వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవాలన్నారు. అన్ని కళాశాలల్లో సాఫ్ట్ స్కిల్స్ ను మెరుగుపరిచేలా శిక్షణ అందించాలని డీఈఓ ఆదేశించారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు బధిర,  మ్యూజిక్ కళాశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆడిట్ అబ్జెక్షన్లపై సమీక్షించారు

 టీటీడీలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించి న్యూస్ లెటర్ తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.  దీనివల్ల విద్యార్థుల నైపుణ్యం వెలికి తీసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధ్యాపకులు, సిబ్బంది కృషి చేయాలని ఆమె కోరారు. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి,  ఎలక్ట్రికల్ ఎస్ఈ  వెంకటేశ్వర్లు,ఈఈ , మనోహర్, ఎలక్ట్రికల్ డిఈ  సరస్వతి తో పాటు వివిధ కళాశాల ప్రిన్సిపాళ్ళు, ఆడిట్ అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-09 12:16:15

విద్యార్థులను మనస్తత్వాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి

ఎస్ఈఆర్టీ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంట్రెప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు సృజనాత్మక నైపుణ్యం తో పాటు సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవాలని ఈఎండిపి జోనల్ మేనేజర్ ఓ.అగ్ని హోత్ర శర్మ విద్యార్థులకు సూచించారు శుక్రవారం మధనాపురం ఏపీ మోడల్ స్కూల్ ను జిల్లా మేనేజర్ కె.నరేష్ తో కలిసి సందర్శించిన ఆయన పాఠశాలలో జరుగుతున్న ఈఎండిపి ప్రోగ్రాం ను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఫెసిలిటేటర్ అయిన పాఠశాల ఉపాధ్యాయులు వి.మధుసూధనరావు విద్యార్థిని,విద్యార్థులకు 16వ సెషన్ లో భాగంగా సమస్య పరిష్కార పరిశోధన అనే అంశంపై బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రామకృష్ణ రావు గారు మాట్లాడుతూ ఈఎండిపి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం మరియు మార్చ్ నెలలో జరగబోయే ప్రాజెక్ట్ ఎక్స్పో గురించి విద్యార్థులకు వివరించారు.

Vizianagaram

2023-02-03 12:45:51

డిప్లొమా విద్యార్థులకు మంచి భవిష్యత్తు

పాలిటెక్నిక్ డిప్లమా చేసినవారికి దేశ విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్ వారిదేనని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు సి.నాగరాణి అన్నారు. పార్వతీపురం ఐటీడీఏలో పాలిటెక్నికల్ విద్య ప్రాముఖ్యతపై స్వీయ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 84 ప్రభుత్వ, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని, అయితే  విద్యార్థులలో అవగాహన లేక డిప్లొమాలో చేరికలు తక్కువగా ఉన్నాయని వాటి సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో కోచింగ్ ఏర్పాటుకు ఆలోచించాలని అన్నారు. 10వ తరగతి తరువాత మంచి భవిష్యత్తు కు పునాది వేయవలసిన బాధ్యత ఉందని ఆమె అన్నారు.  ఈ కార్యక్రమంలో ఐటీడిఏ పిఓ సి.విష్ణుచరన్, గుమ్మ లక్ష్మీ పురం పొలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ టీ. జగదీష్ బాబు, మండల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

పార్వతీపురం

2023-01-28 09:55:12

తెలంగాణ ఇంటర్ లో కొత్తకోర్సు సీఈఏ

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏ పేరుతో సరికొత్త గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటర్ తరువాత నేరుగా సీఏ కోర్సులు చదువుకునేందుకు వీలుగా ఈ గ్రూపును రూపొందించారు. ఈ గ్రూపులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రూపును ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలోనే  విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ గ్రూపును రూపొందిస్తున్నామని బోర్డు అధికారులు చెబుతున్నారు. తద్వారా సీఏ కోర్సుకి పోటీ పెరుగుతుంది.

Hyderabad

2023-01-25 05:54:14

ఫిభ్రవరి 5న జాతీయ ఉపకారవేతనం ప్రవేశ పరీక్ష

జాతీయ ఉపకారవేతనం ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 5న జరగనుందని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఒక ప్రటకనలో తెలియజేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు www.bsc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసి అందజేయాలని జిల్లాలోని పాఠశాలల ఉపాద్యాయులకు సూచించింది. దీనికోసం పాఠశాల ఉపాధ్యాయులు UDISE కోడ్ ను వినియోగించి లాగిన్ కావాల్సి వుంటుందని తెలియజేశారు. అనంతరం విద్యార్ధులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసి అందజేసి పరీక్ష రాయించాలని ఆ ప్రకటనలో సూచించారు.

Visakhapatnam

2023-01-24 11:53:28

స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుని మాయాజాలం అదుర్స్

ఆంధ్రప్రదేశ్ లోనే స్పోకెన్ ఇంగ్లీషుకి అత్యుత్తమ శిక్షణ ఇచ్చే మనోహర్ స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు వింటే పొలా నికి వెళ్లే రైతు సైతం అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తాడు. వినడానికి మీకు వింతగా ఉన్నా స్పోకెన్ ఇంగ్లీషు మాంత్రికుని క్లాసులు, శిక్షణ ఆ రేంజ్ లో ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూడగలిగితే మీరే 40శాతం ఇంగ్లీ షులో మాట్లాడేస్తారు. కావాలంటే ఒక్కసారి ట్రైచేయండి..పైసా ఖర్చులేకుండా ఇంట్లోనే స్పోకెన్ ఇంగ్లీషు నేర్చు కోండి. క్లాసులు విన్న తరువాత మీరే అంటారు నిజంగా అదుర్స్ అని .!

Visakhapatnam

2023-01-12 01:45:50

నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

2023-24 విద్యా సంవత్సరానికి సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ యం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన జారీచేశారు. నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైట్: https://navodaya.gov.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ తరగతులు పూర్తి విద్యాసంవత్సరాలు చదివి.. ప్రస్తుతం 2022-23 విద్యా సంవత్సరాంలో 5వ తరగతి చదువుతున్నవారై ఉండాలని తెలిపారు. 

అభ్యర్థులు 1-5-2011 నుంచి 30-4-2013 మధ్యలో జన్మించినవారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు అప్ లోడ్ చేసినపుడు సంబంధిత సర్టిఫికేట్లను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని, ఏప్రిల్ 29న్ ప్రవేశ పరీక్ష  నిర్వహిస్తారనిని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలనుకున్నవారు సంబధిత హెడ్ మాస్టర్ సంతకంతో ధ్రువీకరించిన సర్టిఫికేట్ ను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలెనన్నారు.  జిల్లాలోని అర్హులైన విద్యార్థులందరూ గమనించి, నోటిఫికేషన్ లోని అన్ని విషయములను పూర్తిగా చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని,ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2023-01-06 14:18:06

విద్యాప్రమాణాలు మరింతగా మెరుగుపరచాలి

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యాప్రమాణాలు మరింతగా పెంచాలని బాపట్ల జిల్లా కలెక్టరు కె.విజయకృష్ణన్ ఆదేశించారు.  పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై సంబంధిత ప్రధానాచార్యులతో గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యార్థులు చక్కగా చదువుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురుకుల పాఠశాలల్లో కల్పించాలని కలెక్టరు చెప్పారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. వారి నైపుణ్యాలకు మెరుగులుదిద్దాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో డ్రాపౌట్స్ నియంత్రించాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా పరిధిలో రెండు బాలుర, ఆరు బాలికల గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. అందులో 4321 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.

 నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యాబోధన అందించాలన్నారు. డ్రాపౌట్స్ కారణాలపై సర్వే నిర్వహించి నివేదిక పంపాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యం సాధించడానికి అధ్యయన తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలను సమర్థంగా నడపాలని కలెక్టరు చెప్పారు. వివిధ పాఠశాలల్లో మురుగునీటి సమస్య, వంటగ్యాస్ సమస్య పరిష్కరించాలని ప్రధానాచార్యులు కలెక్టరు దృష్టికి తెచ్చారు. మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకోసం ప్రణాళికలు రూపొందించాలని కలెక్టరు ఆదేశించారు. రేపల్లె, యద్దనపూడి, అద్దంకి పాఠశాలల్లో ఆర్వోప్లాంట్ల ఏర్పాటు, మరమ్మతులకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య రానివ్వరాదని ఆమె సూచించారు.  

  గురుకుల పాఠశాలల్లో విద్యాకుసుమాలు వికసించేలా విద్యాబోధన ఉండాలని కలెక్టరు విజయకృష్ణన్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు ప్రతి గురువారం తనిఖీ చేసే సమయాలలో సిబ్బంది సహకరించాలన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పర్యావరణం, సామాజిక బాధ్యతపై విద్యార్థులలో అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగే వేదికగా పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆమె పలు సూచనలు చేశారు. నరసాయపాలెం పాఠశాలలో సౌర విద్యుత్ వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల ద్వారా పరిపాలన వ్యవస్థ కుంటుపడకుండా మానవవన రులను సమకూర్చుకోవాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్ సి. శాంతివిశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

 

Bapatla

2023-01-05 12:38:39