1 ENS Live Breaking News

అడకత్తెరలో మహిళా పోలీసుల భవితవ్యం..?!

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల భవితవ్యం మళ్లీ అడకత్తెరలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.. వీరి నియామకాలు ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరగని కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరంటూ కోర్టులో కేసులు పడ్డాయి. దానితో గత వైఎ స్సార్సీపీ ప్రభుత్వం వీరంతా పోలీసుశాఖకు సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసి వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకుండా గాల్లోనే పెట్టి మళ్లీ పోలీసుశాఖ సేవలే చేయించింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనైనా ఫలితం వుంటుందా అంటే.. ఏదో ఒకటి చేసి వీరికి న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చేసిన హోం మంత్రి ప్రకటనపై ప్రభుత్వానికి కూడా దారీ తెన్నూ కనిపించడం లేదు.. వీరిని పీఎస్పీఆర్బీ పరీక్ష రాయించి పోలీసుశాఖ శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకోవాలా..? లేదంటే గ్రామ, వార్డు సచివాలయ విభాగా ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి స్లైడింగ్ ఇచ్చి సర్దుబాటు చేయాలా.. అదీ కాదంటే పోలీసుశాఖలోనే మినిస్టీరియల్ స్టాఫ్ గా కొనసాగిం చాలా అనే విషయంలో ప్రభుత్వం నిర్ఱయం తీసుకోలేకపోతున్నది.. మరోవైపు తమకు పోలీసుశాఖ వద్దని, యూనిఫారం అసలే వద్దని.. మహిళా పోలీసు ల్లోనే కొందరు అటు, ఇటు గెంతులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలీక బుర్రలు పీక్కుంటున్నది. ప్రస్తుతం వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. కానీ వీరికంటూ ఏ ప్రభుత్వ శాఖ కేటాయించలేదని గత ప్రభుత్వం హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసింది. అలాగని వీరిని పోలీసులుగా అనడానికి ఇదే పోలీసుశాఖలో హోంగార్డు నుంచి ఎస్సై వరకూ వీరిని పోలీసులని అనడానికి ఇష్ట పడటం లేదు. కానీ.. పోలీసుశాఖకు చెందిన అన్ని పనులూ వీరితోనేచేయిస్తున్నారు. అవి కాకుండా రెవిన్యూ విభాగానికి చెందిన బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్), సంక్షేమ శాఖకు చెందిన పథకాలు పంపిణీ, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చెందిన బిల్ కలెక్టర్ సేవలు, విద్యాశాఖకు చెందిన ఎన్యుమరేషణ్, జియో ట్యాగింగ్, ఏశాఖలోనైనా సిబ్బంది తక్కువగా ఉంటే వారి పనులు, ఇతర కార్యాలయ పనులూ అన్నీ వీరే చేస్తున్నారు.

 ప్రస్తుతానికి వీరి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేకపోయినా భవిష్యత్తులో మాత్రం చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది. కారణం వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకపోవడమే. అలాగని ప్రభుత్వం కోర్టుకి సమర్పించిన అఫడవిట్ కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరు కనుక.. పోలీసుశాఖకు చెందిన సర్వీసు నిబంధనలు, పదోన్నతులు కూడా వీరికి వర్తించవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరు కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలకి ఎక్కువ.. రెగ్యులర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలకు తక్కువ అన్నట్టుగా తయారైంది వీరి పరిస్థితి.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 విభాగాల్లో చాలా శాఖల్లో సిబ్బంది కొరత అధికంగా వుంది. ముఖ్యంగా వార్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యార్శిలు, గ్రామ సచివాయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువగా వుంది. ఇక్కడ సిబ్బంది లేక ఉన్నవారిలోనే ఎవరో ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలకు, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లమో విద్యార్హతలుగా ఉన్నాయి. పేస్కేలు కూడా ఒకే విధంగా వుంటుంది. ఒక్క కార్యదర్శిలకు వీరికి రూ.850 మాత్రమే వ్యత్యాహం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తే.. ప్రస్తుతం అత్యవసరంగా ఉన్న .. ఎక్కువగా ఖాళీలున్న పంచాయతీలకు, వార్డు సెక్రటరీలకు స్టైడింగ్ ఇస్తే పరిపాలన కూడా సజావుగా సాగడానికి ఆస్కారం వుంటుంది. 

మరికొన్ని చోట్ల వెల్పేర్ అసిస్టెంట్లు, కొన్ని చోట్ల అగ్రికల్చర్, హర్టీకల్చర్, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టులు లేక ప్రజలకు సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీసులకు న్యాయం చేయాలన్నా, వారికి ప్రభుత్వశాఖ కేటాయించాలన్నా వారినికి డిపార్ట్ మెంటల్ స్లైడింగ్ ఇవ్వడమే సబబని..ఆ కోణంలోనే సలహాలు కూడా వెళుతున్నట్టు సమాచారం అందుతుంది.  

మరోప్రక్క రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13500కి పైగా ఉన్న మహిళా పోలీసుల వలన పోలీసుశాఖకు స్టేషన్లు వారీగా  కీలకమైన సమాచారం అందుతుంది. అత్యవసర పనులకు వీరినే వినియోగిస్తున్నారు. పైగా పోలీసుశాఖలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగని మహిళా పోలీసులను పీఎస్పీఆర్బీ ద్వారా మళ్లీ పరీక్ష రాయించి వారికి శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం మహిళా పోలీసులుగా ఉన్నవారిలో కొందరు  ఈ శాఖ నుంచి తమను వేరే శాఖకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు కాఖీ చొక్కా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకా ఎక్కువగా ఖాళీలు ఉన్న ఐసీడిఎస్ లో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 కొందరు మాత్రం పీఎస్పీఆర్బీ ద్వారా తమను పోలీసులుగా మార్చాలని కోరుతున్నారు. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వంలోని సర్వీసు నిబంధనలు సహకరిస్తాయా..? లేదంటే వీరికోసం ఉన్న సర్వీసు నిబంధనలను సవరిస్తారా..? ప్రత్యేక ఆర్డినెన్సులు చేస్తారా..? అనేదానిపై కూడా క్లారిటీ లేదు.  మహిళా పోలీసులను గాల్లోనే ఉంచి గత ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు కాలం గడిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి వంగలపూడి అనిత విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా పరిష్కార మార్గం చూపించడానికి పోలీసుశాఖలో దారులు కనిపించకపోవడంతో మేథోమధనం ప్రారంభించారు. 

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఇపుడు వారి సర్వీసు మొత్తం కోల్పోవాల్సి వస్తున్నది. వారితోపాటు విధుల్లోకి చేసిన ఇతర ప్రభుత్వశాఖల సిబ్బందికి పదోన్నతులు లభిస్తుంటే.. వీరికి ప్రస్తుతం ప్రభుత్వశాఖ కూడా ఏర్పాటు కాలేదు.  ఏశాఖలోకి పంపుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే శాఖలో ఉంచడానికి కోర్టుకేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అలాగని గత ప్రభుత్వం ఇచ్చిన జీఓలు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించానికి వీరు పోలీసుశాఖకి చెందిన వారు కాదు. పైగా పోలీసుశాఖలోని సిబ్బందే వీరిని తమశాఖ ఉద్యోగులుగా అంగీకరించడం లేదు. కోర్టుకేసులపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అఫడవిట్ ఇవ్వడంతో వీరు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఏంటనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి.. వీరిని ఖాళీగా ఉన్న శాఖల్లోకి స్లైడింగ్ అయినా ఇవ్వాలి..? లేదంటే కోర్టు కేసులు క్లియర్ చేసి..వీరికి మళ్లీ నూతనంగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అయినా ఏర్పాటు చేయాలి..? అదీ కూడదంటే పోలీస్ రిక్రూట్ మెంట్ ద్వారా ప్రత్యే కంగా పరీక్ష పెట్టి మళ్లీ వీరిని పోలీసులుగా అయినా తీసుకోవాలి..? వీటిలో ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు జీవితాంతం ఏ ప్రభుత్వశాఖకు చెందని ఉద్యోగులుగా ఉంటూ.. పనిచేస్తూ.. ఎలాంటి పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజ నాలకు నోచుకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వశాఖల మంత్రుల ద్వారా సూచనలు, సలహాలు స్వీకరి స్తున్న హోం మంత్రి అనిత మహిళా పోలీసుల విషయంలో ఏం పరిష్కార నిర్ణయం తీసుకుంటారనే దానిపై  మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు..?!

visakhapatnam

2024-11-20 07:32:17

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే చీదరింపులు..!

ఈ గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ఏం  పనీపాటా లేదు.. సంవత్సరం పొడవునా ఏదో ఒక సర్వే పేరుతో ప్రతీ ఇంటికీ వచ్చేస్తు న్నారు.. ? మాకు ఏ ప్రభుత్వ పథకాలూ రావు.. మేం ట్యాక్సులు కడుతున్నాం.. ఏ ప్రభుత్వ పథకమూ తీసుకోని మా వివరాలతో మీరేం చేసుకుంటారు.. ఇది మా మాటగా మీ అధికారులకు చెప్పండి.. ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్లిపోండి.. అంటూ సచివాలయ ఉద్యోగులపై మొహంపై తలుపులేస్తున్నారు.. కొన్ని అపార్ట్ మెంట్లలో అయితే ఏకంగా గేటు కూడా దాటనీయకుండా సెక్యూరిటీ గార్డులే పొమ్మని కసురు కుంటు న్నారు.. కక్కలేక మింగలేక సచివాలయ ఉద్యోగులు చీదరింపులు పడుతున్నారు.. మరో వైపు 2వ శనివారాలు, ఆదివారాలు కూడా విధులకు రావాల్సిందేనంటూ అధికారులు వెంట పడుతున్నారు. రానివారికి ఆరోజు ఆఫ్ సెంట్ వేస్తున్నారు.. మరికొందరికీ షోకాజ్ నోటీసులు పంపిస్తున్నారు.. ఎవరైనా ఉద్యోగులు సెలవుపై వెళ్లినా.. వాళ్లు అక్కడ కూడా ఏదో ఒక సమాచారం అంటూ పనిచేయాల్సి వస్తున్నది. సంప న్న వర్గాల నుంచి ఎదురౌతున్న చీదరింపులు, చీత్కారాలతో సచివాలయ ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా బాధలు అధికా రులకు తెలియవు.. వారికి కావాల్సిందల్లా అనుకున్న టార్గెట్ పూర్తవడమేనంటూ వాపోతున్నారు.. వైఎస్సార్సీపీలో పాలనలోనే అను కుంటే కూటమి పరిపాలనో మరింతగా ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నాు.. ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజ నాల ఊసెత్తకుండా ఊపిరి సలపకుండా ఒక్క ప్రభుత్వశాఖ కాకుండా అన్ని శాఖల పనులూ మాకే చెబుతున్నారంటూ గొల్లుమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న జియో ట్యాగింగ్, సర్వేలను ఉన్నతశ్రేణి కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంటింటా సర్వే, ట్యాటింగ్ ప్రభుత్వమే చేయమని సిబ్బందిని పురమాయించినా.. వాటిని నమోదు చేయడానికి అపార్ట్ మెంట్లకు వెళుతున్న సిబ్బందికి చీదరింపులు, చీత్కారాలు ఎదురువుతున్నాయి. దానితో ఇంట్లో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎదుర్కొని మాటలన్నీ వారి నుంచి పడాల్సి వస్తున్నది. ఏకంగా కొన్ని అపార్ట్ మెంట్లు, ప్రత్యేక ఇళ్ల వద్ద సిబ్బందిని దొంగలను చూసినట్టుగానే చూస్తున్నారు. అక్కడుండే వాచ్ మెన్ లతోనే చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా.. అదంతా మాకు అనవసరం క్లస్టర్ల వారీగా ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలు జియో ట్యాగింగ్ పూర్తికావాల్సేందేనని మీరు ఏంచేస్తారో.. ఎలా చేస్తారో.. ఎవరిని బ్రతిమిలాడుకుంటారో తెలీదు.. ఇచ్చిన టార్గెట్లు పూర్తిచేయకపోతే షోకాజ్ నోటీసులు అందుకుని సమాధానం చెప్పాల్సి వుంటుందని హుకుం జారీ చేస్తున్నారు.

 తీరా ఇంటింటీకి తిరిగి జియో ట్యాగింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఉద్యోగులు విధిని సమయం ఉదయం ఐదు గంటల నుంచి సాయం త్రం ఐదుగంటల మధ్య కాకుండా ఆ తరువాత యాప్ పనిచేయడం మొదలు పెడుతున్నది. ఆ సమయంలో ఇళ్లకి వెళ్లి జియోట్యా గింగ్ చేయడానికి గృహస్తులను వెళ్లి బ్రతిమిలాడినా.. అమ్మా మీకు వేలా పాలా లేదా రాత్రి సమయంలోనూ ఇంటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు ఎవరమ్మా మిమ్మల్ని పంపిందంటూ సిబ్బందిపై ఒంటికాలపై లేస్తున్నారు స్థానికులు. మరికొన్ని చోట్ల  అపార్ట్ మెంట్ వాసులు.. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమం పథకాలూ రావు మా వివరాలు, జియో ట్యాగింగ్ చేయడానికి వీల్లేదు వెళ్లిపోండంటూ సిబ్బంది మొహంపై డోర్లు వేస్తున్నారు. మరికొందరు జియో ట్యాగింగ్ కి ఒప్పకున్నా.. ఆ సమయంలో యాప్ పనిచేయడం లేదు. దీనితో ముందుకి వెళితే నుయ్యి.. వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది సిబ్బంది పరిస్థితి. 

కార్తీకమాసంలో మహిళలు ఒకపూట ఉపవాసం ఉండి పనులన్నీ చేస్తుంటారు. అదే సమయంలో ఈ సర్వే కార్యక్రమం వచ్చినా సిబ్బంది పనిచేయడానికి సిద్దంగా ఉన్నా.. ప్రజల నుంచి మాత్రం స్పందన చాలా తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ పథకాలు పొందేవారు తప్పా.. మిగిలిన వారు వారి వివరాలను, జియో ట్యాగింగ్ చేయడానికి మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. చచ్చీ చెడి చేద్దామంటే ప్రభుత్వం కనీసం సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్యాకేజీలు కూడా ఇవ్వడం లేదు. దాని భారం మొత్తం ఉద్యోగులపైనే పడుతున్నది. ఒక్కోసారి అధికారులు సమా వేశాలు పెట్టి సిబ్బందిని చెడా మడా తిడుతుంటే అవి జీర్ణించుకోలేనివారు చేతిలో ఉన్న ఫోన్లను నేలకేసి కొట్టి వారి కోపాన్ని చల్లార్చు కుంటున్నారు. ఈ  విధంగా కూడా సిబ్బందే సెల్ ఫోన్లు నష్టపోవాల్సి వస్తున్నది. అన్ని ఒత్తిడిలు, వేధింపులు, బెదిరింపులు తట్టుకొని పనిచేస్తున్నా.. మీకు జీతాలు ఇవ్వడమే దండగంటూ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఉద్యోగులను మానసింకగా కృంగదీస్తున్నాయి. 

ఫలితంగా ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకత అధికమవుతున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే అధికంగా సర్వేలు, వివరాలంటూ సచివా లయ సిబ్బందితో అన్ని రకాల పనులు చేయిస్తున్న ప్రభుత్వంపై సిబ్బంది కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి పరిపాలన కోస మేనా ఓట్లు వేసి గెలిపించుకున్నదీ అంటూ బహిరంగంగానే తిట్ల దండకం మొదలెడుతున్నారు. రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పడం లేదంటూ తిట్టుకుంటున్నారు. అంతేకాదు ఒక వర్గం ఉద్యోగులు అపుడే కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నయమనే ప్రచారం కూడా మొదలు పెట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేరసుకోవచ్చు.

 వాస్తవానికి ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి ఒక పెద్ద నెట్వర్క్ గానే చెప్పాలి. అసలే గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగించేసిన ప్రభుత్వం వారికిచ్చిన 50 ఇళ్లను  కూడా సచివాలయంలోని సిబ్బందికి అనుసంధానం చేసేసింది. ఇపుడు అన్ని పథకాలు వీళ్లే ఇంటింటికీ వెళ్లి అందించాల్సి వుంటుంది. అలాంటి సమయంలో అధికారులు సిబ్బందిని వేధించి, వెంటాడి మరీ పనులు చేయించి వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను తొక్కిపెట్టడంపైనా సిబ్బంది మండిపడుతున్నారు. సిబ్బంది కడుపు మంట ప్రజల వరకూ వెళ్లిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరు నెలలు తిరగ ముందే తారా స్థాయికి చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదు..?!

visakhapatnam

2024-11-18 14:59:07

వారందరికీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా పోస్టింగులు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పంచాయతీ కార్యాలయాలు, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల్లో విధానంలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెం ట్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారందరనీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమిస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ జీఓఎంఎస్ నెం-65 ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఈ సిబ్బంది నియమాకాలు, పదోన్నతుల పై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాలు ప్రచురిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినా.. పని మాత్రం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను స్వీకరించడంతో అది ఉత్తర్వులు జారీ అయ్యేవారకూ వచ్చింది. 

అయితే వీరికి గ్రేడ్ 2 లేదా, గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శిలుగా పదోన్నతి కల్పించి నియమాకాలు చేపట్టాల్సి ఉండగా.. సర్వీసు నిబంధనలు అడ్డురావడంతో వారికి ఎలాగైనా ఉద్యోగాలివ్వాలని సంకల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. దీనితో లైన్ క్లియర్ అయి వారందరికీ గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనితో ఉన్న పంచాయతీ కార్యదర్శిలకే రెండు మూడు పంచాయతీలు అప్పగించి కాలం నెట్టుకు వచ్చేసింది గత ప్రభుత్వం.

 గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలంటే గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శిలు ఉండాలని భావించిన డిప్యూటీ సీఎం ఆలోచనకు అనుగుణంగా ఎన్నాళ్ల నుంచో సర్వీసులు రెగ్యులర్ అవుతాయని ఎదురు చూస్తున్నవారికి తీపి కబురు అందిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయాల రాకతో నిర్వీర్యం కాకుడదని.. ప్రజలు ఇంటి ముంగిటే పూర్తిస్థాయిలో సేవలు అందించాలని భావించి డిప్యూటీ సీఎం ఆలోచనలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాల్చడం చూస్తుంటే..రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయనే చర్చకు బలం చేకూరుతుంది. తాజాగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలుగా నియమితులైన వారిని ప్రస్తుతం ఖాళీలు ఉన్న చోట నియమిస్తే చాలా వరకూ గ్రామ పంచాయతీలకు ఇన్చార్జిల బెడద తగ్గనున్నది.

visakhapatnm

2024-11-16 10:59:00

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు మహర్ధశ..?!

ఏ ప్రభుత్వ శాఖకు నోచుకోకుండా  గాల్లోనే ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందిం చింది. వీరి సమస్యలు, ఇబ్బందులు, జీఓలు, కోర్టుకేసులు, అదనపు విధుల నిర్వహణపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన ప్రత్యేక కథనా లపై  హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రస్తావించారు..2019 లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యో గుల సమస్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు.. నాటి నుంచి నేటి వరకూ వీరి సమస్యలను  ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ శాఖకు చట్టబద్ధత తేకుండా.. కనీసం మాతృశాఖలోని సర్వీసు నిబంధనలకు వీరికి అమలు చేయకుండా ప్రత్యేకంగా వారికోసం రూపొందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. దానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో ఉద్యోగులు వారి సర్వీసును, ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. సామాజిక బాధ్యతతో సచివాలయ ఉద్యోగుల సమస్యలను బుజాన వేసుకున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి వార్తల రూపంలో తీసు కెళ్లడంతో కూటమి ప్రభుత్వం స్పందించి.. అసెంబ్లీ సాక్షిగా వీరి సమస్యలను పరిష్కరించేందుకు చర్చకు తెరలేపింది. దీనితో ఏశాఖ లే కుండా గాల్లో ఉన్న మహిళా పోలీసులకి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది..!


గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శలు విధులు, జాబ్ చార్టులపై త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. దీని కోసం ఎమ్మేల్యే తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.  గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల విధుల గురించి క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి కోరారు. వారి ప్రశ్నలకు అసెంబ్లీలో హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో యాక్టులు కూడా చదవకుండా జీవోలు ఎడా పెడా ఇచ్చేసిందన్నారు. 2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా ఎలాంటి ట్రైనింగ్, డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేకుండా చేశారన్నారు. సుమారు 15 వేల మందిని రిక్రూట్ చేసుకుంటే.. అందులో 13,815 మంది పనిచేస్తున్నారని.. మరో 1,189 ఖాళీలు ఉన్నాయని సభకు తెలిపారు. 2021లో మరో జీవో తెచ్చి.. వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చారన్నారు.

 వీరికి సుమారు 6 ప్రభుత్వ శాఖలతో కలిపి.. జాబ్ చార్ట్ ఇచ్చారని తెలిపారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. ఇది జగన్ ప్రభుత్వం యొక్క అవివేకానికి నిదర్శనమన్నారు దుయ్యబట్టారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలతో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందని.. కానీ వీరికి కేవలం 2 వారాల ట్రైనింగ్ తో పోలీసులుగా మార్చే ప్రయత్నం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇదంతా కేవలం పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెప్పుకొనేందుకు చేసిన వృథా ప్రయత్నమన్నారు. దీంతో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఇష్టం లేకుండానే పోలీస్ యూనిఫామ్ వేయించాలానే ప్రయత్నం చేశారన్నారు. యూనిఫామ్స్, జాబ్ ఛార్టులపై కోర్టుల్లో 7 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయన్నారు. గత ప్రభుత్వానికి జాబ్ చార్టులపైనా, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛార్ట్ లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. 

అందుకే మహిళా సంరక్షణ కార్యదర్శులు రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి, అడ్మిన్ రైట్స్ పోలీస్ శాఖలు, జీతాలు, సెలవులు ఇచ్చేది ఎంపీడీవోలు వెళ్లిందన్నారు. ఇన్ని శాఖల సంబంధం వల్ల మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు వారి పనులు వారు చేసుకుంటే వీరు మాత్రం అన్ని శాఖల పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వీరిని గత ప్రభుత్వం ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉపయోగించు కుంద న్నారు. గత ప్రభుత్వ అవివేకం వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో పెద్ద చర్చ జరగాలన్నారు. వారి ని ఏ శాఖకు కేటాయించాలి అన్న అంశంపై ఎమ్మెల్యేలు  తమ సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరారు. సంబం ధిత శాఖలతో చర్చ జరిపి అతి త్వరలోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై శాశ్వత నిర్ణయం తీసుకుంటామన్నారు.

-  హోం మంత్రి ప్రకటనతో మహిళా పోలీసుల హర్షం
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని మహిళా పోలీసుల సమస్యలను, వారి జాబ్ చార్ట్, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, ఇతర శాఖల పనులు చేయిస్తున్న విధానంపై నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించడంపై మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వంలో మా సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి హోం మంత్రి తీసుకెళ్లగలిగారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖ లోనైనా ఆ శాఖ పనులు మాత్రమే వాళ్లు చేస్తారని.. కానీ తాము అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.. తమ సమస్య గత ప్రభుత్వంలో ఎంత మంది ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. కానీ హోం మంత్రి అనిత అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు తమకు న్యాయం చేసే దిశగా తొలి అడుగు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మొదటి నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక కథనాల రూపంతో తీసుకెళ్లడంపై కూడా మహిళా పోలీసులు మీడియా కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. హోం మినిస్టర్ లాంటి డైనమిక్ మంత్రులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

visakhapatnam

2024-11-13 15:17:17

పరుగో పరుగు.. అయ్యబాబోయ్ సోషల్ మీడియా..?!

సూడు సెగరెట్రీ  పెన్నట్టుకున్న పెతోడూ ఇలేకరీ అయిపోడు.. ఇలేకరంటే సమాజంపై కుసింత అవగాహనుండాల.. పెజిల సమస్యలు సమాచారంగా మీడియాలో వార్తలు రాయడం వచ్చుండాల.. ముందు అది తెలుసుకో.. ప్రెస్ అనగనే ఓ.. ఎగేసుకొని వచ్చినోడిని వచ్చినట్టు లోనకంపేయడం కాదు..కాదు.. అసలు వొచ్చినోడెవడు..? ఏ పేపరు.. మరేటివి..? కనుక్కొని మరీ లోనకంపాల.. అంటాడు సినిమాల్లో రావుగోపాలరావు.. ఇది ఒకప్పటి మాట.. ఆ రోజుల్లో మీడియా అంటే విలువలుండేవి.. ఇంటర్నెట్ పుణ్యమాని  ఇపుడు ట్రెండ్ మారిపోయింది.. మీడియా రాను రాను తగ్గిపోతున్నది.. సోషల్ మీడియానే  పాపులర్ అవుతోంది అంటూ జి మెయిల్ అకౌంట్ ఉన్న ప్రతోడు యూట్యూబ్ ఛానల్, బ్లాగ్ స్పాట్ సైట్ పెట్టుకొని.. దానికొక పేరెట్టేసుకొని.. సోషల్ మీడియాగా చెలామణి అయిపోతున్నాడు.. అసలు మీడియాలో పనిచేసేవాడిని ప్రక్కన బెట్టి.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా  సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ వస్తుందంటూ వారినే ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా మీడియా పక్కకి పోవాల్సి వస్తున్నది.. ఇలా ఉంటే కష్టమనుకున్న అసలు మీడియా.. తమని డామినేట్ చేస్తున్న సోషల్ మీడియాపై యుద్ధం ప్రకటించింది.. పనిగట్టుకొని జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడం మొదలెట్టింది..  అది విషయం కూడా ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నది. జర్నలిస్టులుగా ఫిర్యాదు చేసిన వారెవరూ వారి పత్రికల్లో ఈ విషయాన్ని రాయడం లేదు..?!

ఆంధ్రప్రదేశ్ లో మీడియా కంటే సోషల్ మీడియానే బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నది. దానిని అసరాగా చేసుకొని మీడియా కాని మీడియా..అసలు మీడియాకి డూపుగా సోషల్ మీడియా తయారై.. మీడియాని పక్కకి నెట్టేస్తున్నది. చేసేది లేక మీడియా ప్రభుత్వం వద్దకు వెళ్లి బాబూ మేము మీడియా వాళ్లం.. ఆ సోషల్ మీడియా సంగతేంటో కాస్త చూద్దురూ అంటూ ఎడా పెడా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసులకు ఫిర్యాదులివ్వడం మొదలు పెట్టింది. వాస్తవానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మీడియా స్థానాన్ని పూర్తిగా తొక్కేసింది. దానితో అసలు మీడియా కిందకి పోయి.. పెసలు మీడియా ముద్రవేసుకున్న సోషల్ మీడియా హల్ చల్ చేయడం మొదలు పెట్టింది. కనీసం ఒక రెండు లైన్లు వార్త రాయడం రాని వాడు కూడా నేనూ జర్నలిస్టునే అంటూ అసలు జర్నలిస్టులను డామినేట్ చేసేస్తున్నాడు. 

చేతిలో యూట్యూబ్ గొట్టం, సెల్ లో ఫ్రీగా వచ్చిన బ్లాగ్ స్పాట్ ను చూపిస్తూ... ఇదిగో మీ వార్త అంటూ మీడియా కంటే ముందుగా వెళ్లిపోతున్నాడు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ సోషల్ మీడియాదే హవా. ఆ పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ఒకప్పుడు ప్రెస్ మీట్ కి వెళితే కేవలం మీడియా మాత్రమే వచ్చేది. ఇపుడు మీడియాలోని జర్నలిస్టులు పది శాతం హాజరైతే సోషల్ మీడియా 70శాతం హాజరువుతుంది. అక్కడ జర్నలిస్టులకు కాస్త మర్యాద చేయడానికి ఇచ్చే మంచినీళ్లు, టీ, కాఫీ అల్ఫాహారం కూడా పెట్టడం మానేస్తున్నారు నిర్వాహకులు. లేదంటే సోషల్ మీడియాకి తెలియకుండా గుట్టు చప్పుడుగా కాకుండా ప్రెస్ మీట్లు నిర్వహించుకుంటున్నారు. ఆ విధంగా చేస్తున్నా.. ఆఖరు నిమిషంలో మూకుమ్మడిగా సోషల్ మీడియా సదరు కార్యక్రమాల్లో చటుక్కున మెరుస్తున్నది.

ఈ బాధనలు తట్టుకోలేక సోషల్ మీడియాపై మీడియా యుద్దం ప్రకటించింది. బాబోయ్ ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ప్రభుత్వానికి స్పందన, మీకోసం కార్యక్రమాల్లో జర్నలిస్టులు గుంపులు గుంపులుగా వెళ్లి అర్జీలు పెడుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ ఫిర్యాదులు మరీ ఎక్కువయ్యాయి. మీడియలో అయితే కొద్ది మందికే సమాచారం చేరుతుందని.. అదే సోషల్ మీడియా అయితే చాలా ఎక్కువమందికి విషయం తెలుస్తుందని భావిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాని ప్రోత్సహిస్తుండటంతో అసలు మీడియాకి చెందిన జర్నలిస్టులు తెగ ఫీలైపోతున్నారు. దానితో పరుగులు పెడుతూ అయ్యబాబోయ్ సోషల్ మీడియా వచ్చేస్తుందంటూ లగెత్తుతున్నారు. ఇంతకీ విశేషం ఏంటంటే చాలా జర్నలిస్టుల సంఘాల్లో సభ్యులుగా ఉన్నది సోషల్ మీడియా ప్రతినిధులే. అసలు మీడియా జర్నలిస్టులు ఒక 40శాతం ఉంటే 60శాతం సోషల్ మీడియా వాళ్లే ఉండటం విశేషం.

 ఇపుడు ఆ అధిక శాతం సోషల్ మీడియాలోని వారే మీడియాగా చెప్పుకుంటూ పోలీసులకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేస్తున్నారనే ప్రచారం కూడా గుప్పు మంటున్నది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి.. అందులో పనిచేసేవారికి కనీస విద్యార్హత, జర్నలిస్టుగా పనిచేసే సామర్ధ్యం లేకపోయినా వారు జర్నలిస్టులేనని యాజమాన్యాలు వారికి ఐటెంటీ కార్దులు ఇచ్చేస్తుండటంతో ఇబ్బడి ముబ్బడిగా  విలేఖరులు తయారైపోతున్నారు. కొంత కాలం మీడియాలో పనిచేసి.. సంస్థల ఆర్ధిక భారాన్ని మోయలేక రక రకాల పేర్లతో యూట్యబూ ఛానళ్లు, న్యూస్ బ్లాగ్ స్పాట్లు పెట్టి మీడియాగానే చలా మణీ అయిపోతున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కూడా వేడుక చూస్తున్నది తప్పితే వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదు.

చాలా వరకూ మీడియాలో నేను విలేఖరి అని చెప్పుకుంటూ తిరిగేవాళ్లలో కేవలం 60శాతం మందికి మాత్రమే కనీసం వార్తలు రాయడంపై అవగాహన వుంటుంది. మిగిలిన 40శాతం మంది కూడా వారు వారి పేపర్లు, టివీలకు, న్యూస్ ఏజెన్సీలకు పంపే వార్తలన్నీ కూడా కాపీ పేస్టు వార్తలే. అన్నీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే కాపీ చేసి వాటికి డేట్ లైన్ తగిలించి మరీ పంపించేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పనిచేసేవారైతే మరీ దారుణం. వారిలో కనీసం 30శాతం మందికి వార్తలు రాయడం వస్తే మిగిలిన 60శాతం మంది.. అదే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మేమే రాసామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు వాట్సప్పుల్లో పంపేసి మరీ విలేఖరులుగా చలా మణీ అయిపోతున్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రాలు ఇలా ఎక్కడ చూసినా మీడియా కంటే సోషల్ మీడియాదే హవా.  ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాల్లో కూడా అసలు మీడియా వేయని ప్రశ్నలు కేవలం సోషల్ మీడియావాళ్లే వేస్తూ.. అక్కడ వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. 

మీడియా కంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కాస్త ముందుగా వస్తుండటంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియానే ప్రోత్సహిస్తున్నారు. అంతెందుకు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభులతోపాటు రాజకీయపార్టీలు కూడా ఒక ప్రత్యేక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో అసలు మీడియాకి మెంటలొచ్చేసి.. సోషల్ మీడియాను చూసి పరుగో పరుగు అంటూ లగెత్తుతున్నారు. ఇపుడు ఆ పరుగులు ఆపేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియాని నియంత్రించాలని. చూడాలి.. ఇప్పటికైనా ప్రభుత్వం అనధికార, నకిలీ, సోషల్ మీడియాని నియంత్రిస్తుందా..? లేదంటే మీడియాకంటే వీళ్లే బాగా పనిచేస్తూ పబ్లిసిటీ కల్పిస్తున్నారని ప్రోత్సహిస్తుందా.. అనేది..?!

visakhapatnam

2024-11-11 19:13:35

కూటమిలోనూ నాటి ప్రభుత్వ పరిపాలనే..?!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అపుడే కూటమి ప్రభుత్వంలోని పరిపాలనపై పెదవి విరుపులు మొదలు పెట్టారు.. పరిపాలనా ధక్షుడు ముఖ్యమంత్రిగా వస్తే పాలన బాగుంటుందనుకుంటే.. మళ్లీ అదే పాత ప్రభుత్వ విధానాలు.. రెండవ శనివారాలు, ఆదివారాల్లోనే ఉద్యోగులకు ప్రత్యేక విధులు, జూమ్ మీటింగులు.. బిఎల్వో విధులకి సొంత ఖర్చులతోనే వైట్ పేపర్లు కొనుక్కోమని చెప్పడం.. ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ శాఖల యాప్ ల నిర్వహణ.. ఇంటర్నెట్ కి, స్టేషనరీకి చేతి చమురు వదిలిపోవడం.. వారంతంలో కనీసం బట్టలు ఉతుక్కోవడానికి.. నెరిసిన గెడ్డం గీక్కోడానికి.. పిల్లలతో ఓ పూట గడపడానికి కూడా లేదా..? నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇది కానే కాదు.. కానీ నాటి ప్రభుత్వంలోని రాష్ట్ర అధికారులే ఈ ప్రభుత్వంలోనూ ఉన్నారు కదా.. ఇంకా గత ప్రభుత్వ పరిపాలన నుంచి రాష్ట్ర అధికారులు బయటకు రాలేకపోతున్నారు..  ప్రభుత్వం కూటమిదే అయినా.. ఇంకా గత ప్రభుత్వ విధానాలనే రాష్ట్ర, జిల్లా అధికారులు అవలంభిస్తూ చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు పెదవి విరిచేలా చేస్తున్నారు.. ఇదేదో కావాలని బుదర జల్లుతున్న మాటలు కాదు.. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చల సారాంశం మాత్రమే ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనం రూపంలో మీ ముందుకి తీసుకు వస్తున్నది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాల్గవ తరగతి ఉద్యోగులకి జీతంలో సుమారు నెలకి 2 వేల నుంచి  మూడు వేల రూపాయల వరకూ ప్రభుత్వ విధుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తున్నది. అవును మీరు చదువుతున్నది నిజం. ప్రభుత్వం ఉద్యోగులకి అప్పగిస్తున్న అదనపు విధులకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా గత ప్రభుత్వ విధానాలనే కూటమి ప్రభుత్వంలోనూ అవలంభిస్తున్నది. రెవిన్యూ, పోలీసు, సచివాలయ ఉద్యోగులకు అదనంగా అప్పగిస్తున్న బిఎల్వో, ఇంటింటా సర్వే, ప్రభుత్వ యాప్ ల నిర్వహణ, కార్యాలయాల్లోని స్టేషనరీకి సైతం ఉద్యోగులే వారి జీతంలో నుంచి ఖర్చులు చేయాల్సి వస్తుంది.

 ఇంత చేస్తున్నా.. కనీసం ఆదివారాలు, పండుగ సమయాలు, రెండవ శనివారాల్లోకూ ఉద్యోగులను ఖాళీ ఉంచకుండా ప్రత్యేక విధులు అప్పగిస్తుండటంతో ఉద్యోగులు రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పడం లేదని నెత్తీ నోరూ కొట్టుకుంటూ ప్రభుత్వ పరిపాలనపై తమ నిరసనను సామాజిక మాద్యమాల వేదిక ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ.. ఆవేదన చెందుతున్నారు. అచ్చుగుద్దినట్టు గత ప్రభుత్వ విధానాలే కూటమి ప్రభుత్వంలో కూడా రాష్ట్ర, జిల్లా అధికారులు అమలు చేసి.. వారాంతంలో ఒక్కపూట కూడా ఇచ్చిన సెలవు సద్వినియోగం చేసుకోకుండా ప్రత్యేక విధులు అప్పగించడం పట్ల కూటమి ప్రభుత్వంపైనా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ప్రజలకు పూర్తి సేవలు అందించడం ఒక్కటే ఉంటుందనుకున్నాం.. కానీ గత ప్రభుత్వంలోని అధికారులే ఇప్పడుకూడా ఉండటంతో ఆ పాత పరిపాలనే చేపట్టి సీఎం విజన్ కి వ్యతిరేకంగా చేస్తున్నారంటూ ఉద్యోగులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలోని నాలుగేళ్లుగా చెల్లించని బిఎల్వో విధుల గౌరవ వేతనం కోసం కూటమి ప్రభుత్వంలో కూడా అధికారలు మాట్లాడకపోగా.. ఇపుడు మళ్లీ కొత్తగా విధులు అప్పగించి.. దానికి సరిపడా స్టేషనరీ, సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ కూడా ఉద్యోగులే భరించి.. సెలవుదినాలు, రెండివ శనివారాలు, ఆదివారాల్లో పనులు చేయాలని పురమాయించడంతో ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి ప్రభుత్వ విధులు చేయాల్సి వస్తున్నది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వస్తున్నదే తక్కువ జీతం అందులోనూ ప్రభుత్వం ప్రత్యేకంగా అప్పగిస్తున్న విధులతో అందులో నుంచే స్టేషనరీ, మొబైల్ ఇంటర్నెట్ లకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. జిల్లా అధికారుల నుంచి ఇష్టం వచ్చిన తిట్లు తినకుండా ఉండేదుకు సొంత డబ్బులు ఖర్చుచేస్తున్నా.. కనీసం దానిని కూడా గుర్తించి ప్రభుత్వమే ఇవ్వాల్సిన అదనపు పనికి గౌరవ వేతనం ఇవ్వకపోగా.. కనీసం వారాంతంలో ప్రశాంతంగా కుటుంబాలతో గపడనీయకుండా చేస్తున్నారని ఉద్యోగులు వారిలో వారే చెప్పుకొచి మదన పడుతున్నారు. ఇంతచేస్తున్నా ప్రభుత్వం సర్వీసు ఆధారంగా ఇవ్వాల్సిన పదోన్నతులు కూడా ఇవ్వడం లేదని.. అసలు ఆ దస్త్రాలను ఆయా శాఖల కమిషనర్లు ముందుకి కదపడం లేదని మండిపడిపోతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల వ్యతిరేకత ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే ప్రభావం ఉంటుందని కూడా సమాచారం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులను గత ప్రభుత్వంలో ఇష్టానుసారం వాడేస్తే.. ఓటుతోనే కుటుంబం మొత్తం సమాధానం చెప్పామని.. ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధానాలు అమలు చేస్తే మళ్లీ అదే ఓటు అస్త్రాన్ని వినియోగిం చాల్సి వస్తుందనే చర్చకు తెరలేపడం ఇపుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నది. అంతేకాకుండా ప్రభుత్వ పరిపాలనకు సంబం ధించి త్వరగా జరగాల్సిన పనులను కూడా ప్రభుత్వం అదనంగా ఖర్చుతో కూడిన పనులను అప్పగిస్తున్నందునే అదే సాకు చూపి.. జాగు చేయాలని కూడా అధికారులు, సిబ్బంది ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. 

అందునా మహిళా ఉద్యోగులైతే ప్రభుత్వానికి బయటకు చెప్పుకోలేని సమస్యలను, ఇబ్బందులను వారాంతంలో ఇచ్చే సెలవులను ప్రశాంతం గా పనులు చేసుకోవడానికి కూడా లేదని.. వారమంతా వేసుకున్న మాసిన బట్టలే.. ఉతుక్కోవడానికి కూడా కాళీ లేకపోవడంతో మళ్లీ విధులకు పాత బట్టలమీదే సెంటు కొట్టుకొని వెళ్లాలా చేస్తున్నారంటూ మండిపడిపోతున్నారు. వారానికి ఒకసారి వచ్చే సెలవుల్లో కుటుంబం లోని శుభకార్యాలు, ఇంటిపనులు చూసుకోవడానికి కూడా వీలులేకుండా వారాంతంలో అప్పగించే పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులతో మొదలైన వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజలకు పాకుతుందడనంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి ఈ అదనపు విధులకి ప్రభుత్వం చర్యలు ఏవిధంగా ఉంటాయనేది..?!

visakhapatnam

2024-11-08 19:50:31

జర్నలిస్టు సంఘాల తేడాలపై కార్మికశాఖ కన్నెర్ర..?!

బాహ్య ప్రపంచంలోని సమాచారాన్ని ఒడిసి పట్టేది జర్నలిస్టులు.. సమాజాన్ని తమ వార్తలతో మేల్కొలిపేది జర్నలిస్టులు.. అవినీతిని ఎండ గట్టేది జర్నలిస్టులు.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేది జర్నలిస్టు.. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా, జర్నలిస్టులు అంటే అన్ని వర్గాల వారికి అమిత గౌరవం. ప్రజలను, సమాజాన్ని చైతన్య పరచాల్సిన జర్నలిస్టుతే తప్పుదారి పడితే.. జర్నలిస్టుల సంఘాల పేరుతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి తలా తోకా లేని సంఘాలు ఏర్పాటు చేసి..  ఒక జర్నలిస్టు సం ఘంలో ఉన్నవారు మిగిలిన  సంఘాల్లోనూ సభ్యులుగా ఉంటే ఏమవుతుంది..? బాహ్యప్రపంచంలోని సమస్త సమాచారాన్ని వార్తలుగా రాసే జర్నలిస్టులే వార్త అయిపోతారు.. ఇపుడు కూడా అదే జరిగింది. వీధికో సంఘం.. వాడకో అసోసియేషన్.. మండలానికో జర్నలిస్టు ట్రస్టు ఇలా వంద సంఖ్యలో వెలస్తూ తమ సభ్యుల వివరాలు చెప్పని జర్నలిస్టుల సంఘాలపై కార్మికశాఖ కన్నెర్ర జేసింది. అసలు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు..? మీ లెక్కలేంటి..? మీ సభ్యులెవరు..? మీ సంఘం ట్రేడ్ యూనియన్ లైసెన్స్ ఎంతవరకూ ఉందో చెప్పాలంటూ నోటీసులు పంపింది.. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన  తేడా జర్నలిస్టుల సంఘాలు కార్మికశాఖ నోటీసులకు తేలుకుట్టిన దొంగల్లా బిక్కు బిక్కు మంటున్నాయి..?!

ఆంధ్రప్రదేశ్ లోని కార్మికశాఖ పనిచేయని జర్నలిస్టుల సంఘాలను నియంత్రించడానికి కంకణం కట్టుకుంది. ఒకే సభ్యుడు ఎన్ని యూనియన్లలో సభ్యుడిగా ఉంటాడు.. ఒక యూనియన్ నాయకుడు మరెన్ని యూనియన్లలో నాయకులుగా ఉంటారు.. అసలు కార్మికశాఖ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలియజేసేందుకు నడుంబిగించింది. దీనితో సంఘం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లతో దందాలు చేపట్టే జర్నలిస్టుల సంఘాలు గప్ చుప్ మని కూర్చుండిపోతున్నాయి. మరికొన్ని రాష్ట్ర సంఘాలు తమ సభ్యులు వీరు, తమ సంఘం సభ్యత్వం ఇంత, మా సంఘం క్రమం తప్పకుండా ట్రేడ్ యూనియన్ లైసెన్సులు రెవిన్యువల్ చేయిస్తున్నాయి, మా సంఘం ఐటి రిటర్న్స్ ఇవీ, ఈ ఫైలింగ్ లు ఆ విధంగా ఉన్నాయంటూ లెక్కలు చూపిస్తుంటే.. కేవలం జర్నలిస్టుల సంక్షేమం పేరుతో అడ్డదారిలో కలెక్షన్లు చేపట్టే సంఘాలు మాత్రం కార్మికశాఖ  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. 

తామేదో ఐక్యత కోసం సంఘం పెట్టుకున్నాము తప్పితే ఇవన్నీ మాకు తెలియదంటూ కాళ్లా వేళ్లా పడుతున్నాయట. తప్పుచేయనేల.. మోకరిళ్లాల్సిన పని ఏలా అన్నట్టు ఎవరికో సంఘం ఉందని చెప్పి అదే పేర వచ్చేలా సంఘాలను రిజిస్ట్రేషన్లు చేసి కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుంటే ఎట్టకేలకు ప్రభుత్వం వాటిని నియంత్రించేందుకు  రంగంలోకి దిగింది. అందున జనవరి లేదా మార్చిలో జర్నలిస్టులకు ఇచ్చే ప్రభుత్వ గుర్తింపు( ప్రెస్ అక్రిడిటేషన్) సమావేశం కోసం ఏ జర్నలిస్టు సంఘం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నది.. ఏ సంఘం కేవలం కాగితాల మీదే వ్యవహారం నడిపిస్తున్నదీ తెలుసుకోవడానికి కార్మికశాఖ జర్నలిస్టుల సంఘాలకు నోటీసులు జారీచేసింది. అలా జారీ చేసిన సమయంలో కొన్ని పెద్ద జర్నలిస్టుల సంఘాలకు కూడా ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా రెవిన్యువల్ లేనట్టుగా బయట పడ్డాయి. చాలా సంఘాల్లో ఉన్న సభ్యులే అన్ని సంఘాల్లోనూ ఉన్నట్టు లెక్క తేలింది. 

ఒక సంఘంలో జర్నలిస్టులు ఉన్నారని చెప్పడానికి సంఘం సభ్యత్వాలు కట్టి మమ అనిపించేసే సంఘాల్లో ఉన్నవారు నిజంగా జర్నలిస్టులా.. లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడంతో గల్లీ గల్లీలో ఉన్న జర్నలిస్టుల సంఘాలన్నీ వారి సంఘంలోని సభ్యులందరూ మీడియాలో పనిచేస్తున్నవారేనని కార్మికశాఖకు దృవీకరణ చూపించే ప్రయత్నం చేస్తున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా సంఘాలు నోటీసులు తీసుకొని కార్మిక చట్టాలను ఉల్లంఘించి పనిచేస్తున్నట్టు గుర్తిస్తే అలాంటి సంఘాలను నోటీసుబోర్డులో పెట్టడానికి లేబర్ డిపార్ట్ మెంట్ స్టేట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.

-ఇకపై జర్నలిస్టుల సంఘాలు నిబంధనలు అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టుల  సంఘాలు కార్మిక శాఖ చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏ జర్నలిస్టు అయినా ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటే మరో సంఘంలో సభ్యత్వం స్వీకరించకూడదు. ఇకపై సభ్యుడు ఏ సంఘంలో ఉంటున్నారో ఆ సంఘం సభ్యత్వం తీసుకునే సమయంలో సమర్పించే ఆధార్ కార్డు నెంబరు మరో సంఘంలోని సభ్యత్వంతో రూఢీ అయితే సదరు సంఘాన్ని బ్లాక్ లిస్టులో పెడతారు. ఖచ్చితంగా జర్నలిస్టు ట్రేడ్ యూనియన్లు ప్రతీ ఏడాది సంఘం రెవిన్యువల్ తోపాటు, జనరల్ బాడీ సమావేశాలు కూడా నిర్వహించాలి. సభ్యత్వాలు పక్కాగా వసూలు చేసి నమోదు చేయాలి. సంఘం సభ్యత్వాలు, ఖర్చులు, ఆదాయం, వ్యయాలపై బ్యాలెన్స్ షీట్, ఇన్ కం టాక్స్ రిటర్న్స్, ఈఫైలింగ్ చేయించాలి. ఒక జర్నలిస్టు పదుల సంఖ్యలో సంఘాల్లో సభ్యుడిగా ఉన్నట్టు తేలితే సదరు సంఘం, జర్నలిస్టుని మరే ఇతర సంఘంలోనూ సభ్యత్వం తీసుకోకుండా నోటీసులు జారీచేస్తారు. 

అలా కార్మిక చట్టాలు ఉల్లంఘించిన సంఘాల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తారు. నిర్వాహకులను మోసపూరిత సంఘాలు రిజిస్ట్రేషన్ చేసి నిర్వహణ చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తద్వారా నిజంగా జర్నలిస్టులు వారి సంక్షేమం, ఐక్యత కోసం ఏర్పాటైన సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని కార్మికశాఖ యోచిస్తున్నదట. గతంలో జర్నలిస్టుల సంఘాలుకి సంబంధించిన సొసైటీ రెవన్యువల్ చేస్తే లైవ్ లో ఉన్నట్టుగా కార్మికశాఖ రిపోర్టులు ఇచ్చేది. ఇకపై జర్నలిస్టుల సంఘాల సభ్యత్వాలు కూడా ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా తనిఖీలు చేయాలని నిర్ణయించిందని సమాచారం. చూడాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎక్కడ పడితే అక్కడ జర్నలిస్టుల సంఘాలను ఏర్పాటు చేసేసి ఊళ్లపై కలెక్షన్ దందాలకు పాల్పడే వారిపై నిజంగా చెక్ పెడుతుందా. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ సంఘాల్లో సభ్యుడిగా ఉంటే అలాంటివారిపై చర్యలు తీసుకుంటుందా.. అనేది..?!

visakhapatnam

2024-11-07 18:54:28

నిజమైన ఈరోజు-ఈఎన్ఎస్ కథనాలు.. ఆయుష్ కమిషనర్ కి స్థానచలనం. ?!

నేను మోనార్క్ ని.. నన్ను ఎవరూ ఏం చేయలేరు.. మీరంతా పందులు.. కుక్కలు.. నేను చెప్పిందే మీరు చేయాలి.. ఏ పేపర్ లో న్యూస్ వ చ్చినా.. ఏ కమిషన్ ను ఉద్యోగులు, వైద్యులు కలిసినా..నాకు సీఎం తెలుసు(వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో).. ఇపుడు నాకు మంత్రి నారాలో కేష్ తెలుసు.. ఉద్యోగులు, వైద్యులు ఎంతమంది దగ్గరకి తిరిగినా మీ టైమ్ దండగ..నేను చేసిందే చట్టం..నేను ఇచ్చిందే జీఓ.. చెప్పినట్టు పని చేయకపోతే రోడ్డుకీడుస్తా.. మీకు ప్రమోషన్లు ఎలా వస్తాయో చూస్తా.. సర్వీసులు ఏవిధంగా రెగ్యులర్ అవుతాయో అదీ చూస్తా.. నాపైనే మీడి యాలో కథనాలు రాయిస్తారా.. ఇవీ ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి వైద్యులను, ఉద్యోగులను బెదిరించి.. మానసి కంగా హింసించిన తీరు... కట్ చేస్తే ఈరోజు-ఈఎన్ఎస్ లో ప్రచురితమైన వరుస కథనాలు.. ఉద్యోగుల ఫిర్యాదులు, మహిళా ఉద్యోగుల వేధిం పులు, ఎస్సీ ఎష్టీ కమిషన్ కి అర్జీలు, వెరసీ రాష్ట్ర గవర్నర్ కలుగజేసుకునేవరకూ వచ్చింది..  దీనిపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయుష్  కమిషనర్ ను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు..!

ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులు, వైద్యులు నేడు నిజమైన దీపావళి సంబురాలు చేసుకుంటున్నామంటూ ఈరోజు-ఈఎన్ఎస్ కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. నరకాసుర వధతో ప్రజలకు దీపావళి పండుగ వస్తే.. మా విషయంలో రాష్ట్రం లో కూటమిప్రభుత్వం తమను వేధించి, వెంటాడి, మానసి క్షోభకు గురిచేసిన కమిషనర్ ను రాష్ట్రప్రభుత్వం జీఏడికి అటాచ్ చేయడం ఎంతో ఆనందం కలిగిస్తుందంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి  అకృత్యాలు, అవినీతికి పాల్పడినా.. ప్రభుత్వంలో పెద్దలు తనకి తెలుసునంటూ బెదిరిస్తూ.. ఉద్యోగులను, వైద్యులను నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారాలపై ఈరోజు-ఈఎన్ఎస్ వరుస  కథనాలు ప్రచురించింది.  సదరు ఆధాలతో తమ గోడును వెల్లబోసుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యావత్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు, వైద్యులు ఎంత ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.

 కానీ ఎట్టకేలకు పాపం పండి, కమిషనర్ చేసిన వ్యవహారాలన్నీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి ని ఆయుష్ పోస్టు నుంచి తప్పించింది.. ఆపై జిఏడికి రిపోర్టు చేయాలంటూ ప్రత్యేక జీఓతో ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఇలా ఉత్తర్వులు జారీచేసిందో లేదో ఉద్యోగులు వైద్యులు పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు. వైఎస్సార్సీ ప్రభుత్వంలో తమ గోడు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం రాలేదని కూటమి ప్రభుత్వంలో మాత్రం మాకు న్యాయం జరిగిందంటూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ ను కీర్తిస్తూ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. 

అంతేకాకుండా ఆయుష్ కమిషన్ హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన అవినీతి వ్యవహారాలన్నింటినీ కమిషనరేట్ దగ్గర నుంచి డిస్పెర్సీ ఉద్యోగి వరకూ బయటపెట్టడానికి సిద్దపడుతున్నారని సమాచారం అందుతుంది. అదే విషయాన్ని ఉద్యోగులంతా మీడియాకి సమాచారం ఇస్తున్నారు. పైగా సదరు కమిషనర్ హయాంలో జరిగిన పనులు, జారీ చేసిన జీఓలు, ఉద్యోగుల వేధించిన తీరు, నకిలీ బిల్లులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల దుర్వినియోగం తదితర వాటిపై కూడా ప్రభుత్వం విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-ఆయుష్ ఆర్డీడీలకు గొంతులో వెలక్కాయ్ అడ్డుపడింది.
ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలోని కొన్ని జోన్ల ఆర్డీడీలు వైద్యులను నెలవారీ మామూళ్ల కోసం వేధించారు. విశాఖలో ఆర్డీడి అయితే నేరుగా వైద్యాధికారుల నుంచి అప్పులే తీసుకొని ఎగ్గొట్టారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు-ఈఎన్ఎస్ సాక్ష్యాల( ఫోన్ పే స్క్రీన్ షాట్, బ్యాంకు స్టేట్ మెంట్ ల ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఉత్తరాంధ్రాలో ఒక మహిళా ఉద్యోగి సర్వీసును రెగ్యులర్ చేయడానికి  ఏకంగా రూ.15 లక్షలు తీసుకొని తన అవసరాలకు తీసుకొని కమిషనర్ ఉన్నంత కాలం వారిని అలా కమిషనరేట్ చుట్టూ తిప్పిన వ్యవహారం కూడా ఇపుడే బయటకు వచ్చింది. ఈ విషయంలో కమిషనర్ ను జిఏడీకి అటాచ్ చేస్తూ.. వచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో బయటకు రావడం కూడా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. 

ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి  కాలంలో ఏఏ ఆర్డీడిలు అవినీతికి పాల్పడ్డారు? ఎవరి నుంచి ఎంతెంత వసూలు చేశారు..? ఏ నిధులు నకిలీ బిల్లులతో బొక్కేశారు..? ప్రభుత్వ పథకాలు నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు..? తదితర వ్యవహారాల్లో, కమిషనరేట్  నుంచి వైద్యఆరోగ్యశాఖలో కొందరు పెద్ద అధికారులకు కార్లు కొనిచ్చినట్టుగా జరిగిన ప్రచారంపైనా కూడా ఇపుడు విచారణ జరిగే అవకాశాలున్నాయి. ప్రజలకు వైద్యసేవలు అందించే వైద్యులను మరీ చులకనగా చూసే అధికారుల తీరు మారాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అఖిలభారత స్థాయి అధికారుల్లో సైతం చర్చ మొదలైంది. ఏదైనా పాపం పండే వరకే.. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించడం మొదలెడితే అవినీతి అరోపణలు ఎదుర్కొంటూ ఉద్యోగులను, వైద్యులను వేధించే కమిషనర్లను సైతం ప్రక్కన పెట్టేస్తుందని ఆయుష్ కమిషనర్ బిఎస్.రాజేంద్ర కుమార్ లెగిన్ శెట్టి వ్యవహారంలో మరోసారి రుజువైంది. సత్యమేవ జయతే..!

visakhapatnam

2024-11-06 16:41:08

ఆదాయం తెండి..ప్రయోజనాలు అడక్కండి..?! గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై అధికారుల హుకుం..

సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరగండి.. ఇంటి పనులు 70శాతం వసూలు చేయండి.. లేదంటే  మీ ఉద్యోగాలు తీసేస్తాం.. మీరు హౌస్ టాక్స్ కలెక్షన్ చేసిన దానిని బట్టే మీ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయో తేలిపోంది.. మున్సిపాలిటీలో కమిషనర్లు చేసే హెచ్చరిక.. చెప్పినంతా పన్నులు వసూలు కాకపోయినా.. మీ జేబుల్లోనుంచైనా కట్టేయాలి.. వారి దగ్గర నుంచి మీరు తరువాత వసూలు చేసుకోవాలి.. ఇది గ్రామాల్లో మండల అధికారులు చేస్తున్న హెచ్చరిక.. ఏం చేస్తారో తెలీదు.. ఎలా చేస్తారో తెలీదు.. అన్ని పనులు మానేసైనా.. ప్రతీ రోజూ ఇంటింటికీ తిరిగేసి పన్నులు వసూలు చేయాలి..ఇది ముఖ్యమంత్రి ఆర్డర్.. అంటూ మండలాల్లో ఎంపీడీఓల హుకుం.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేసేది ఒక శాఖలోనే అయినా.. వీరు చేసే పనులు మాత్రం 20శాఖలపైనే ఉంటున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనే ఇపుడు కూటమి సర్కారు కూడా చేస్తుంది.. గత ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించడానికైనా ఒకటి రెండు శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. కూటమి ప్రభుత్వం అలా చేయడం లేదు సరికదా.. ఉద్యోగులను తాటతీసే పనులకి ఉపక్రమిం చింది.  దీనితో రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదంటూ సచివాయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇంతచేసినా.. వీరికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు, పదోన్నతులూ అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటూ ప్రభుత్వం తెగ సిరాకులు పడిపోతుందని వాపోతున్నారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇపుడు అర్జెంటుగా ఆదాయం కావాలి. ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలన్నింటికీ ఒకేసారి టార్గెట్లు ఇచ్చేసింది. దాని తో రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు ఇస్తే.. వాళ్లు సచివాలయ ఉద్యోగుల పీకపై కత్తి పెట్టి మరీ వారిని అదిరించి బెదిరిం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా  రోడ్డెక్కితే పోలీసులు ఫైన్లు మీద ఫైన్లు హోంగార్డులతో సహా ఫోటోలు తీసి వేసేస్తున్నారు. ఇటు సచివాల యాల్లో ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రజలను పన్నుల కోసం వెంటాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు తిరక్కముందే ఆదాయం కోసం ఉద్యోగులను వేధించి మరీ ప్రజలను ముక్కు పిండి వసూలు చేయడానికి కార్యాచరణ సిద్దం చేసింది. అనుకు న్నదే తడవుగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసి మరీ పన్నుల వసూలకి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నారు. 

ప్రజల వద్ద డబ్బుల ఉన్నా.. లేకపోయినా.. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న పాపానికి వారి జేబుల్లోనుంచైనా కట్టి టార్గెట్లు పూర్తిచేయాలని ఆదేశిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో సచివాలయ ఉద్యోగులు గత వైఎస్సార్సీపీ చేసిన పాపం ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ తమను వెంటాడు తోందని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి అప్పజెప్పగలం.. కానీ ప్రతీరోజూ అడుక్కునే వారి మాదిరిగా .. ఇంటికి వెళ్లి మరీ పన్నుల కోసం వెంట పడుతుంటే అమ్మనా బూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుక్కునే వారికి ఇంట్లో సరుకులు నిండుకున్నాయని సున్నితంగానైనా చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల మొహం మీదే ప్రజలు చాలా చిరాకులు ప్రదర్శిస్తున్నారంటూ తమ ఇబ్బందులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఆదాయం కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటాడి మరీ పన్నుల వసూలకి క్షణాల్లో ఆర్డరు వేస్తున్న అధికారులు.. అదే సచివాల ఉద్యోగుల సమస్యలు.. వారికి రావాల్సిన ప్రయోజనాలను అమలు చేయాలంటే మాత్రం నోరు మెదపడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వం ఊరకనే మీకు జీతాలు ఇచ్చేస్తుందని.. వారి జేబులో నుంచి జీతాలు ఇచ్చినట్టుగా అధికారులు తెగ ఫీలై పోతున్నారు. మీటింగులు పెట్టి  తీవ్రంగా భయపెడుతున్నారు.. వార్డులు, మండలాలు, పంచాయతీల వారీగా ఇచ్చిన  టార్గెట్ లు పూర్తిచేయ కపోతే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను వెంటాడి మరీ ప్రభుత్వానికి కావాల్సినట్టుగా ఒక ప్రకభుత్వ శాఖ ఉద్యోగు లతో 20 ప్రభుత్వశాఖల పనులు చేయిస్తూ..ఉద్యోగుల జేబులకి కన్నం పెడుతున్న ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన ప్రయోజాలను మాత్రం అడగొద్దని తెగేసి చెబుతోంది. పైగా మీ శాఖను రేపు ఎత్తేస్తాం.. మాపు ఎత్తేస్తాం.. మీ ఉద్యోగాలన్నీ గాల్లోనే ఉంటాయని అధికారులతో తేడా బెదిరింపులకి దిగుతోంది.. 

(ఒకసారి ప్రభుత్వం ఉద్యోగంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కరినీ నేరుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించేయడం దేశంలోని ఏ ప్రభుత్వ తరమూ కాదు.. దానికి సర్వీసు నిబంధనలు కూడా ఓప్పుకోవు.. పనిగట్టుకొని తొలగించేయాలనుకుంటే..  రాజ్యాంగంలోని చట్టాలు, ఆర్టికల్స్, క్లాజులను ఆధారంగా చేసుకొని మాత్రమే చేపట్టాలి. లేదంటే రాజ్యంగంలోని ఆర్టికల్స్ గట్టిగా అడ్డుతగులుతాయి.. అయినా స్కూల్లో పిల్లాడిని బెదిరించినట్టుగా సచివాలయ ఉద్యోగులను మీ ఉద్యోగాలను తొలగించేస్తామని జిల్లా అధికారులు నోటి మాటగా  బెదిరిస్తున్నారంటే.. రాష్ట్రప్రభుత్వం..జిల్లా అధికారులు... రాజ్యాంగంలోని 14వ భాగంలోని 308 నుంచి 323 వరకూ అనగా ఆర్టికల్ 315 ద్వారా సర్వీస్ కమిషన్లు ఏర్పాటు..  311వ అధికరణ ద్వారా  ఉద్యోగుల సర్వీసు రూల్స్.. ఉద్యోగుల భద్రత, రక్షణ అంశాలను  ఉద్యోగుల సేవలని ఉల్లంఘిస్తున్నట్టే లెక్క)

-ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎగవేసిన ప్రయోజనాలివీ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనల ప్రకారం వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అయిన వెంటనే ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. 74 ప్రభుత్వశాఖలకు అమలు చేసిన పూర్తిస్థాయి పీఆర్సీ.. దానిపై ఇవ్వాల్సిన అరియర్సుపై కనీసం ప్రకటన చేయలేదు. సచివాలయ శాఖకు చట్టబద్ధత తీసుకురాలేదు. గత ప్రభుత్వం చేయని చట్టబద్దత లోపాన్ని అడ్డుపెట్టుకొని ఇంకా నాలుగైదు శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు.. ఇదే శాఖలోని మిగులు ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఖాళీల్లో ఉన్న ఉద్యోగుల పనులు ఉన్నవారితోనే చేయిస్తున్నది. సచివాలయశాఖ ఉద్యోగంతోటు సుమారు ప్రతినిత్యం 8శాఖల పనులను చేయిస్తున్నది. 

బిఎల్వో విధులు అప్పగించి కనీసం స్టేషనరీ కూడా ఇవ్వకుండా దానికయ్యే ఖర్చు మొత్తం ఉద్యోగులనే పెట్టిస్తున్నది. బిఎల్వో విధులు చేసినందుకు ఇవ్వాల్సి అదనపు గౌరవ వేతరం కూడా నాలుగేళ్లు ఇవ్వడం మానేసింది. మొక్కుబడిగా ఒకటి రెండు శాఖల్లో పదోన్నతులు కల్పించి.. మిగిలిన శాఖల ఉద్యోగులను గాలికొదిలేసింది. పదోన్నతులు ఇస్తే మరో ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుందని.. తద్వారా ప్రభుత్వం భారం పడుతుందని ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఏడాదికొకసారి ఇచ్చే ఇంక్రిమెంటుని సైతం అధికారులు లంచాలు తీసుకుండా బిల్లులు పెట్టడం లేదు. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ గానీ, ఇన్ సర్వీసు గానీ సచివాలయ ఉద్యోగులకు వర్తింప చేయడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎగ్గొట్టిన ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

 ఇన్ని ఉన్నా వాటిపై నోరు మెదపని ప్రభుత్వం.. ఆదాయం కోసం వీరిని వెంటాడి మాత్రం అన్ని పనులు చేయిస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వలన ఇబ్బందులు పడిన తాము కూటమి ప్రభుత్వాన్ని నిలబెడితే.. గత ప్రభుత్వం కంటే దారుణంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉద్యోగులను వేధించి మరీ పనులు చేయిస్తున్న అధికారులు.. వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు, పదోన్నతులు ఇస్తే ప్రభుత్వం చెప్పిన అన్నిపనులూ చేస్తామంటున్నారు ఉద్యోగులు. చూడాలి.. ఆదాయమే కాదు.. ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వం చూడటం ఎప్పటి నుంచి మొదలు పెడుతుందనేది..?!

visakhapatnam

2024-10-30 17:11:03

వ్యవసాయ శాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్ మొదలు పెట్టింది..ఏళ్లతరబడి సర్వీసు చేస్తున్న అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను(ఏఈఓ)లను తిరిగి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా వున్న గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలో పంపబోతున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్న ఈ రివర్స్ ఎక్స్ టెన్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈఓలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హేతు బద్దీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ తిరకాసు వ్యవహారంపై మండి పడుతున్నారు. ఏళ్ల తరబడి సర్వీసు చేస్తున్నా కనీస పదోన్నతులకు నోచుకోని ఈఏఓల కోసం సర్వీసు నిబంధనలను సడలించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ వ్యవసాయ సహాయకులకు ఏఈఓలుగా పదోన్నతులు ప్రారంభించిన ప్రభుత్వం సర్వీసు నిబంధనలు సడలించకపోతే ప్రస్తుతం 26 జిల్లాలోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే గ్రామాల్లోనే విధులు నిర్వహించి రిటైర్ కాక తప్పదు..!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తమ సర్వీసులో పదోన్నతులు చూస్తామని ఆశపడిన అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ ఆఫీసర్లకు చుక్కెదురైంది. పదోన్నతుల మాట దేవుడెరుగు ఉన్న క్యాడర్ ని. సీనియారిటీ పరిపాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు ఉన్న విఏఏ(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు) స్థానాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్న విధానం ఏఈఓలకు మింగుడు పడటం లేదు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ప్రస్తుతం మండ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నవారిని గ్రామాల్లో ఉన్న ఖాళీల్లో సర్ధుబాటు చేయడానికి చక చకా పనులు చేసేస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినపుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో నియామకాలు చేయలేదు.

 దానితో అనుబంధ శాఖలుగా వున్న హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరీ కల్చర్ అసిస్టెంట్లతో గత ప్రభుత్వం పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నట్టుగా చూపించి మమ అనిపించేసింది.  కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ శాఖ ఉద్యోగులను ఆశాఖలోనే ఉంచాలని.. ఒక శాఖ ఉద్యోగులను మరోశాఖ సిబ్బందిగా చూపించకూడదని నిర్ణయించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ఖాళీలు బయట పడ్డాయి. దీనితో ఆ ఖాళీల్లో మండల కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్ ల్యాబుల్లోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తిరిగి సదరు ఖాళీల్లోకి భర్తీచేస్తే.. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నట్టుగా ఉంటుందని..కొత్తగా ప్రభుత్వంపై ఉద్యోగాలు తీసే భారం కూడా పడదనే ఆలోచనకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పనులను చకచకా చేసుకు పోతున్నది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈఓలకు పదోన్నతులు కల్పించడం కోసం ఏఈఓలు ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ను ఏర్పాటు చేసి వారికి పదోన్నతులు ఇవ్వాలని ఆలోచన చేసింది. అయితే దానిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఓలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయాధికారులు  కూడా సహకరించడంతో దానిని కార్యారూపంలోకి రానీయకుండా చేశారు. దానితో ఆ ఆలోచనన ప్రభుత్వం కూడా విరమించుకుంది. వీరిలోనే మరికొందరిని ఇన్ సర్వీసు కి పంపి ఏఓలుగా పదోన్నతులు కల్పించింది. అలా కల్పించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిలో కొందరు ఇన్ సర్వీసులో పదోన్నతులు పొంది వెళ్లిపోయారు. తరువాత చాలా మంది ఏఈఓలకు వయస్సు పెరిగిపోవడంతో ఇన్ సర్వీసులో ఏజీబిఎస్సీ చేసే అవకాశం కల్పోయారు. అలా మిగిలిన వారంతా పదోన్నతులకు నోచుకోకుండా సర్వీసులోనే  మిగిలిపోయారు.

 ఏఈఓల సర్వీసుని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం నూతన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ సమయంలో ఏఈఓలుగా ఉన్నవారినే ఖాళీల్లోకి పంపించాల్సి వుంటుంది. అలా పంపించడం ద్వారా  కొద్దిమేరకైనా ఖాళీలను భర్తీచేసినట్టు వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన. అదే సమయంలో ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసిన సమయం కూడా పూర్తవడంలో వీరిలోనే మరికొందరు ఉద్యోగులు రిటైర్ కానున్నారు. అలా రిటైర్ అవగా మిగిలిన వారిని గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలోకి పంపితే మిగులు ఖాళీలు భర్తీ జరుగుతుందనేది ప్రభుత్వ బావన. అంతేకాదు వారికి పదోన్నతులు ఇచ్చే విషయం కూడా పక్కదారి పట్టించడానికే ఇపుడు వారిని రివర్స్ ఎక్స్ టెన్షన్ విధానంతో వెనక్కి పంపాలని ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

ఏఈఓలకు పదోన్నతులు కల్పించాలంటే ఖచ్చితంగా ఏఈఓలు, ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ని ప్రభుత్వం  ఏర్పాటుచేయాల్సిన అవసరం వుంది. అలా చేయాలంటే ప్రస్తుతం వీరికున్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కొత్తగా రూపొందించాల్సి వుంటుంది. లేకపోతే ఉన్న నిబంధనలను అదనపు అంశాలతో నవీకరణ చేయాలి. అలా చేయడం వలన ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం ఏమీ పడదు కారణం ఇప్పటికే చాలా మంది ఏఈఓలు ఏఓ పే స్కేల్ ని కూడా దాటేశారు. ఈ సమయంలో ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వడానికి నిబంధనలు సడలించడమో.. లేదంటే సర్వీస్ రూల్స్ అమైండ్ మెంట్ చేయడమో చేయాలి. అలా చేయకపోతే ప్రస్తుతం ఉన్న ఏఈఓలకు వారి సర్వీసు కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఉండదు. 

అంతేకాదు.. వారి స్థానంలో పదోన్నతులపై వచ్చే గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే అదే పంచాయతీల్లోనే  మగ్గిపోవాల్సి వుంటుంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆలోచించే సమయాన్ని ఏఈఓలకు పదోన్నతులు కల్పించడానికి ఆలోచించడం ద్వారా ప్రస్తుతం ఏఈఓలకు, తరువాత గ్రామీణ వ్యవసాయ సహాయకులకు పదోన్నతులు కల్పించడానికి వీలుపడుతుంది. పరిపాలనా సౌలభ్యం, ఖాళీల్లో సిబ్బంది సర్ధుబాటు కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది ప్రభుత్వం. ఈ తరుణంలో ఏఈఓలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తుందా.. వాళ్ల సంగతి ఆలోచించడం ద్వారా టైమ్ వేస్ట్ అని విఏఏ ఖాళీల్లోకే ఖచ్చితంగా వెనక్కి పంపి రివర్స్ ఎక్స్ టెన్సన్ మాత్రమే చేస్తుందా...? అనేది తేలాల్సి వుంది..! 

visakhapatnam

2024-10-28 14:14:52

డిప్యూటీ సీఎం పవన్ తలచుకుంటే.. సచివాలయ ఉద్యోగుల విలీనం అయిపోయినట్టే..?!

కొన్ని సార్లు రావడం ఆలస్యం అయితే అవొచ్చు కానీ.. రావడమైతే పక్కా అంటాడు పవన్ కళ్యాణ్  సినిమాలో.. కానీ ఇపుడు ఇపుడు అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం.. కట్ చేస్తే సరిగ్గా ఇపుడు అదే డైలాగుని అధికారికంగా చెబితే బాగుండునని  మూడు ప్రభుత్వశాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వెయిట్ చేస్తున్నారు.. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ సచివా లయ సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఒక్క మాట చెబితే ఒకేసారి నాలుగు విభాగల సచివాలయ సిబ్బం ది పంచాయతీరాజ్ శాఖలో విలీనం అయిపోతారు. ఇపుడు ఒక విభాగం విలీనమైనా దానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత రాలేదు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు క్యాబినెట్ సమావేశం అయిన కొద్ది రోజుల్లోనే మత్స్యశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలతో ప్రత్యేక సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి తమ సిబ్బందిని తమకి అప్పగించేయాలని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు కమిషనర్ రాసిన లేఖ ఇపుడు మిగిలిన శాఖలు కదిలిస్తోంది. దానికితోడు ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు కూడా 19 ప్రభుత్వశాఖలను చైతన్యం చేస్తున్నాయి. సత్వరమే సచివాలయంలోని 19శాఖల సిబ్బందిని మాతృశాఖల్లో విలీనం చేసేస్తే వారికి ఒక నిర్ధిష్ట ప్రభుత్వశాఖ ఏర్పడుతుందనేది ప్రభుత్వఆలోచన..! 

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపించేందుకు రాష్ట్ర అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. వందలాదిగా రిటైర్ అవుతున్న ఖాళీలను ఒకేసారి భర్తీచేయాలంటే ప్రభుత్వం ముందున్న ఏకైన అవకాశం సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు పంపడమే తద్వారా తక్షణం ఖాళీల భర్తీతోపాటు, ఉద్యోగులకు ఒక చిరస్థాయి ప్రభుత్వశాఖ కేటాయింపు కూడా చేయవచ్చుననేది ప్రభుత్వం ముందున్న ఆలోచన. దానికోసం ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అందునా మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా మిగిలిన ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధికారుల బదిలీల నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యం అయినా.. సంక్రాంతి నాటికి సిబ్బందిని మాతృశాఖల్లోకి పంపే ప్రక్రియ దాదాపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే ఒకేసారి మూడు  ప్రభుత్వశాఖల్లోని నాలుగు విభాగాల ఉద్యోగులు వారి మాతృశాఖల్లోకి వెళ్లిపోవడానికి ఆస్కారం వుంటుంది. మత్స్యశాఖ కమిషనర్ రాసిన లేఖ ఆధారంగా మిగిలిన శాఖలు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..! శీర్షికన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం వెంటనే స్పదించింది. ఆపై క్యాబినెట్ లో చర్చించి వారిని మాతృశాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ ఆదేశాలను తక్షణం అమలు చేసిన మత్స్యశాఖ తమ సిబ్బందిని తమశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనితో మిగిలిన శాఖల్లోనూ చలనం మొదలైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని నిర్ణయించి.. ఇన్చార్జిలతో నడుస్తున్న గ్రామ పంచాయతీల్లో కార్యదర్శిలను నియమిస్తే ఫలితం వస్తుందని బావించారు. దానికి అనుగుణంగానే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను బదిలీల పేరుతో చిన్న పంచాయతీలకు బదిలీలు చేశారు. తద్వారా ఇన్చార్జిలతో నడుస్తున్న చాలా పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలు నియామకాలు జరిగాయి. ఇంకా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 13వేల 326 గ్రామ పంచాయతీల్లో చాలా వరకూ ఇన్చార్జి పాలనే నడుస్తున్నది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యధికంగా మేజర్ పంచాయతీల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఇండివిడ్యువల్ పంచాయతీలకు బదిలీల్లోనే వెళ్లిపోయారు. ఒక రకంగా పంచాయతీ రాజ్ శాఖ ఒక విభాగం గా పంచాయతీ కార్యదర్శిలు అనధికారికంగా విభజన జరిగిపోయినట్టే. 

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జి కార్యదర్శిలతో నడుస్తున్న పంచాయతీల్లో కూడా మేజర్ పంచాయతీల్లో ఉన్న కార్యదర్శిలను బదిలీచేసి పూర్తిస్థాయి కార్యదర్శిలు ఉండే విధంగా చేయొచ్చు.  ఇంకా మిగిలివున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు), ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,  వెల్పేర్ అసిస్టెంట్లకు కూడా స్థానచలనం వచ్చే అవకాశలుంటాయి. ప్రస్తుతం మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడుతో జరిగిన ప్రత్యేక సమావేశ వివరాలను, ఇతర ఇబ్బందులను ఉంటకిస్తూ రాసిన లేఖ ఇపుడు పంచాయతీరాజ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. డిప్యూటీ సీఎం ఆదేశం కోసమే అధికారులు వేచి చూస్తున్నారట. ఒక్క ఆదేశం వస్తే 70శాతం పంచాయతీలకు ఇన్చార్జిల వ్యవస్థ తప్పిపోతుంది. అంతేకాకుండా నాలుగు విభాగాల సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖలో విలీనం కూడా అయిపోతారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ లు సంయుక్తంగా ఈ శాఖలో జరిగే అన్ని రకాల వ్యవహారాలపైనా ప్రత్యేక కథనాలు ప్రచురించడం కూడా ప్రభుత్వంలోని కదలికలకు కారణం అవుతున్నది. 

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి తలా తోకా లేకుండా.. కనీసం ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్ధత లేకుండా.. ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేసింది. ఫలితంగా మహిళా పోలీసుల పోస్టులపై కోర్టుల్లో కేసులు పడి .. ఇపుడు వారు ఏ ప్రభుత్వశాఖకీ చెందని వారుగా ఉండిపోయారు. వారిని పోలీసుశాఖలోనే ఉంచేస్తారా..? లేదటే అర్హతలను బట్టి సైబర్ క్రైమ్ విభాగానికి పంపిస్తారా..? లేదంటే భారీగా రిటైర్ అవుతున్న పంచాయతీ కార్యదర్శిల ఖాళీల్లో భర్తీచేస్తారా..? లేదంటే దేనికీ చెందకుండా గాల్లోనే ఉంచేస్తారా..? అనే విషయంలో మాత్రం చిన్న క్లారిటీ కూడా రాలేదు. ఈ విషయంలో హోం మంత్రి అనిత నిర్ణయం తీసుకొని డిజిపీతో మాట్లాడి ఒక దారి చూపించాల్సి వుంది. కానీ అక్కడ కూడా పనిజరగలేదు. అన్నిశాఖల మంత్రులు ఒకేలా ఆలోచించగలిగితే వ్యవహారం ఇట్టే తేలిపోతుంది. 

 గత ప్రభుత్వ తేడా విధానాలే ఇపుడు కూటమి ప్రభుత్వానికి ఈ శాఖలోని సిబ్బందిని ఒక్కొక్కరుగా మాతృశాఖల్లోకి విలీనం చేసేయడానికి అవకాశాలుగా మారాయి. అన్నీ అనుకుంటే వచ్చే సంక్రాంతి నాటికి సచివాలయశాఖలోని అన్ని ప్రభుత్వాశాఖల అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసి సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేస్తాయని సమాచారం అందుతుంది. ఆపై గ్రామ, వార్డు సచివాలయశాఖను ఉంచాలా..? లేదంటే ఐదారుగురితో నడిపి గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాలుగా నడపాలా అనేదానిపై స్పష్టమైన నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి రాజున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది.


visakhapatnam

2024-10-26 14:44:32

అదనపు విధులు.. సచివాలయ సిబ్బందికి జేబులు చిల్లు..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖ 2019 అక్టోబర్ 2 ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశాఖగా ప్రారంభమైన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో విషయంలో మీడియాలో నలుగుతూనే వుంటుంది.. మంచిగా అనుకునేరు.. తేడా వ్యవహారాల్లోనే సుమీ..అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే..అసలు విషయం తెలిస్తే మీరే నోరెళ్ల బెడతారు. అంతే కాదు అయ్యో పాపం అంటూ ముక్కున కూడా వేలేసుకుంటారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా వ్యవహారాలన్నీ ఈ శాఖలోనే జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. దానికి సాక్షులు మండలాల్లో ఎంపీడీఓలు.. డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు.. పట్టణాల్లో జోనల్ కమిషనర్లు.. నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్లు.. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లు.. ఏంటి ఇంత మంది తేడాగానే ఉంటున్నారా అంటే ముమ్మాటికి ఇది నిజం. అధికారులు ఓ.. తెగఫీలపోయినా..కాదనలేని వాస్తవం.  గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బంది వారిశాఖ విధులకు బధులు, అదనంగా చేస్తున్నవిధుల విషయమై ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలోని అంశాలను సదరు శాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక ప్రభుత్వశాఖ కమిషనరే ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది వారి శాఖకు సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటే 75వ ప్రభుత్వశాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రం ప్రభుత్వశాఖల్లోని అన్ని విధులు, పనులు చేసి.. ఆఖరికి వారికొచ్చే జీతంలో నుంచి స్టేషనరీకి, వైట్ పేపర్లకు, జెరాక్స్ లకు నెలకీ కనీసం రూ.500 వరకూ ఖర్చు చేస్తున్నపరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం స్టేషనరీ కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటే నమ్ముతారా..? దానికి ఇప్పటి వరకూ సచివాలయ సిబ్బంది స్టేషనరికీ పెట్టిన ఖర్చులే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కేవలం స్టేషనరీ బిల్లులే ఒక్కో ఉద్యోగికి సుమారు ప్రభుత్వం రూ.25వేలకి పైగా ఇవ్వాలంటే నమ్ముతారా.. కానీ ఇది అక్షర సత్యం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని 1.35లక్షల మంది ఉద్యోగులు సగటుని నెలకి సుమారుగా ఒక్కొక్కరూ రూ.600 పైగా కేవలం వైట్ పేపర్లు, ఇతర స్టేషనరీలకు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరు చేసే అదనపు విధులు బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) గా చేసేటపుడు అయితే ఈ మొత్తం రూ.1000 నుంచి 2వేల వరకూ చేరేది. చేసేది అదనపు పనైనా.. స్టేషనరీ ఖర్చులు కూడా వీరితోనే పెట్టించింది గత ప్రభుత్వం. ఆ విధానం కూటమి ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అమలు చేసేస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను వారి మాతృశాఖలల్లో విలీనం(ఇన్ కార్పోరేట్) చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత.. సచివాలయ ఉద్యోగులు ఏ తరహా అదనపు విధులు నిర్వహిస్తున్నదీ రాష్ట్రమత్స్యశాఖ, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని అధికారులు చాలా చక్కగా ప్రభుత్వానికి వివరించారు. మొత్తం ఎనిమిది రకాల సర్వీసులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని.. అందునా గ్రామీణ మత్స్య సహాయకులు చేస్తున్నారని ఉటంకించారు. అందులో మొదటిది 1)కేస్ట్ సర్వే 2) పంచన్ల పంపిణీ 3)బిఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్) 4)ఇంటి పన్నుల వసూలు 5) గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆపాదించిన పనులు 6)ఇరిగేషన్ కెనాల్ డ్యూటీస్ 7) హౌస్ హోల్డ్ సర్వే  8)మిగిలిన ప్రభుత్వశాఖల పనులు చేస్తున్నారని.. తద్వారా మత్స్యశాఖ పనులు చేయడానికి ఎక్కడా వీలు పడలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా మత్స్యశాక కమిషనర్  డోలా శంకర్ రాసుకొచ్చారు. సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పివరకూ ఏ ప్రభుత్వశాఖ కమిషనర్లు గానీ, కార్యదర్శిలు గానీ.. ప్రభుత్వానికి ఈ తరహా లేఖలు రాయలేదు. వాస్తవాన్ని మొట్టమొదటి సారికి మత్స్యశాఖ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. కనీసం ఈ విధంగానై ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు సమస్యలు వెళతాయని చిన్న నమ్మకం.

ఏదైనా ప్రభుత్వశాఖలో అయితే వారి శాఖల పనులు మాత్రమే ఉద్యోగులు చేస్తుంటారు. కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం వారి మాతృశాఖల పనులు కంటే ఇతర ప్రభుత్వశాఖల పనులే అదనంగా చేయాల్సి వస్తుంది. దానికి అయ్యే ఖర్చు కూడా ఉద్యోగులే భరిస్తున్నారు. ఈ విషయంలో పంచాయతీల్లో కార్యదర్శి దగ్గర నుంచి మండలాల్లో ఎంపీడీఓ.. డివిజనల్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఉద్యోగులపైనే అదనపు భారాన్ని మోపుతూ వస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఉద్యోగులకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వలేదనే విషయం ఒక్క అధికారి కూడా దృష్టిపెట్టిన పాపాన పోలేదు. కానీ సచివాలయాలకు స్టేషనరీ పంపిణీ చేస్తున్నట్టు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు.. పట్టణాల్లో జోనల్ అధికారులు, మున్సిపల్ కార్యాలయాలు మాత్రం లక్షలకు లక్షలు బిల్లులు డ్రా చేస్తున్నారు. 

పంచాయతీల్లో అయితే పరిస్థితి మరీ దారుణం అదనపు పనులు చేస్తున్నదే కాకుండా వైట్ పేపర్లు తమ సొంత ఖర్చుతో తేలేదనే సాకుతో సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు లేకపోలేదు. ఎంత మంది అధికారులకు చెప్పినా.. ఏం సచివాలయ ఉద్యోగులంటే ఆ మాత్రం కూడా స్టేషనరీ మీ సొంత ఖర్చులతో కొనుక్కోలేరా అని అడిగేవారే తప్పితే.. ఏ ఒక్క జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సైతం ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు పట్టించుకున్న దాఖలాలు లేవు. చేసిన అదనపు బిఎల్వో పనులకు గత నాలుగేళ్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన అదనపు గౌరవ వేతనం కూడా ఎగ్గొట్టేసింది ప్రభుత్వం. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్టేషనరీ బిల్లులు చెల్లిస్తుందా..? లేదంటే గత ప్రభుత్వమే ఇవ్వకుండా వారితోనే ఖర్చు పెట్టించగా లేనిది.. తామెంకుదుకు ఇచ్చి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తామని.. అదే పాత విధానాన్ని కంటిన్యూ చేస్తుందా.. అనేది..?!

visakhapatnam

2024-10-25 19:56:43

చిన్న పత్రికల ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాం.. సమాచారశాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా హామీ

రాష్ట్రంలో చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంసు శుక్లా హామీ ఇచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(రి.నెం.312/2024)ప్రతినిధి బృందం ఆయనతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు సమస్యలతో  కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఎంప్యానల్డ్  దిన పత్రికలకు  రెగ్యులర్ గా యాడ్స్ రేటు కార్డు ప్రకారం విడుదల చేయాలని,  రేటు కార్డు పెంచాలని కోరారు.  పెండింగ్ లో ఉన్న చిన్న దినపత్రికలకు ఎంప్యానల్ మెంట్  ప్రక్రియను పూర్తి చేయాలని,కొత్తగా దరఖాస్తు చేసు కోవడానికి అవకాశం కల్పించాలని  ఆయనను కోరారు.  వార, పక్ష, మాస  పత్రికలకు యాడ్స్ విడుదల చేయాలని కోరారు. స్థానిక దినప త్రికలకు పిరియాడికల్స్  కు అక్రిడేషన్లు పెంచాలని జీ ఎస్ టీ,  ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.  

 పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్  ఎంప్యానల్డ్  దిన పత్రికలకు సమాచార శాఖ యధావిధిగా యాడ్స్ విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. అక్రిడేషన్లు పెంచుతామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న  ఎంప్యానల్ మెంట్ పైళ్లను క్లియర్ చేయాలని , కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన పాల్గొన్నారు. సమాచారశాఖ డైరెక్టర్ తో  చర్చించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  పి. సత్య నారాయణ, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్,ఎన్.కోటే శ్వరావు, కార్యదర్శి మల్లెల శ్రీనివాసరావు, కార్యనిర్వహక కార్యదర్శి టి. మారుతీ రావు, చెవుల రంగారావుతో పాటు పలు పత్రికల ఎడిటర్లు ఉన్నారు.

visakhapatnam

2024-10-24 16:11:43

గ్రామ సచివాలయ ఉద్యోగుల విభజన షురూ..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ మాతృశాఖల్లోకి వెళ్లే ప్రక్రియ మొదలైంది. సచివాలయంలో కలిపి ఉన్న మత్స్యశాఖ తమ గ్రామీణ మత్స్యసహాయకులను అప్పగించాలని కోరుతూ కమిషనర్ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. ‘సచివాలయ ఉద్యోగులు మాతృశాఖలకే’ శీర్షికన ‘ఈరోజు-ఈఎన్ఎస్’ రాసిన కథనాలు, క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో మొట్ట మొదటిసారిగా మత్స్యశాఖ స్పందించింది. దానికి సంబంధించి మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ రాసిన లేఖ మిగిలిన 18 ప్రభుత్వశాఖలను కదిలించేదిగా వుంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి మాతృశాఖ విధులకంటే అధనంగా మిగిలిన ప్రభుత్వ శాఖల విధులు నిర్వర్తించడం వలన ఉద్యోగుల ప్రభుత్వశాఖకు న్యాయం చేయలేకపోతున్న విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించు కుంటున్నది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ప్రభుత్వశాఖకు బదులు ఇతర విధులు అత్యధికంగా చేస్తున్నారనే విషయాన్ని ‘ఈరోజు-ఈఎన్ఎస్’లు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. అంతేకాకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖలు ఒకలా 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఒకలా ఉందనే విషయాన్ని ప్రత్యేక కథనాల రూపంలో అందించడంతో మత్స్యశాఖ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వాస్తవానికి మత్స్యశాఖలోని విఎఫ్ఏలకు మాతృశాఖ డ్యూటీ చార్టే చాంతాండంత వుంటుంది. అలాంటిది వారి శాఖకు కంటే ఎక్కువగా ఇతర శాఖల పనులుచేయడం, అదీ కనీసం స్టేషనరీ కూడా గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎలా ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు తొలగించాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేబినెట్ నిర్ణయం కూడా తోడవడంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులోని ప్రధాన అంశాలు, విఏఎఫ్ఏ అసోసియేషన్ ఇచ్చిన అభ్యర్ధనను కూడా పరిగణలోనికి తీసుకొని మొత్తం అంశాలను క్రోడీకరిస్తూ..లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

-మత్స్యశాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఒకే చెబితే మిగిలిన 18 శాఖలు రెడీ..?
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 ప్రభుత్వ శాఖల్లో ఒకటైన మత్స్యశాఖ తమ ఉద్యోగులకు మాతృశాఖకు అప్పగించాలని రాసిన లేఖపై ప్రభుత్వం అంగీకారం తెలిపితే మిగిలిన శాఖలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీ చేయాలనే ప్రతిపాదన ఫిషరీష్ మినిస్టర్ కె. అచ్చెన్నాయుడతో ప్రారంభం అయ్యింది. ఏ శాఖ మంత్రి ప్రతిపాదిత లేఖలతో ఉద్యోగల విభజన పూర్తవుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే అయినా ప్రక్రియ మొదలు కావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో చాలా మంది ఉద్యోగుల రెండేళ్లు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ప్రతీనెలా వందల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను వారి మాతృశాఖలు వెనక్కితీసుకోకపోతే పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అలాగని కొత్త ఉద్యోగాలకు ఇప్పుడపుడే నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతం సచివాలయాల్లో ఉన్న ప్రభుత్వశాఖలన్నీ తమ ఉద్యోగులను వారి శాఖల్లోకి తీసేసుకోవాల్సిన సమయం ఆశన్నమైంది. 

గత ప్రభుత్వం చేసిన ప్రధాన తప్పిదం వలన కూటమి ప్రభుత్వం సచివాలయాల్లోని ఉద్యోగులను మాతృశాఖలకు పంపడానికి  మార్గం సుగమం అయ్యింది. కేవలం గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత కల్పించని కారణంగానే ఉద్యోగులను వెనక్కి పంపాలంటూ మాతృశాఖలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ప్రభత్వ అనుకూల మీడియా కూడా బయట పెట్టని అంశాలు ఒక్క ‘ఈరోజు-ఈఎన్ఎస్’ మీడియా మాత్రమే బయట పెట్టింది. ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విషయంలోనూ నష్టపోకూడదనే సామాజిక బాధ్యతతో ‘ఈరోజు-ఈఎన్ఎస్’ఈ శాఖలో జరిగే ప్రతీ అంశాన్నీ ప్రభుత్వశాఖలకు తెలిసేలా ప్రత్యేక కథనాల ద్వారా బయట పెడుతున్నది. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహా సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు.. ప్రజలకు సేవలు చేసే సచివాలయ ఉద్యోగులకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా ‘ఈరోజు-ఈఎన్ఎస్’తెలియజేస్తున్నది.

-గాల్లో ఉన్న ఆ శాఖల సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదోన్నతులు
గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన తరువాత కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలేదు. దానితో వారికి సర్వీసు కాలంలో పదోన్నతులు వచ్చే అకవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ లేని మహిళా పోలీసులు, ఏఎన్ఎం(ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్స్), వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లుకి ఉద్యోగత భద్రత కూడా వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీరింతా కూడా మాతృశాఖల్లో విలీనం అయితే వారికి ప్రస్తుతం సదరు శాఖలో ఉన్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం వుంటుంది. 

 ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో కాస్త లోతుగా ఆలోచించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపిస్తున్న దనే చర్చ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. అన్ని ప్రభుత్వశాఖల కంటే ముందుగా మత్స్యశాఖ తమ ఉద్యోగులను తమశాఖలో విలీనం చేసి ప్రభుత్వ పథకాల అమలుకి సహకరించాలని లేఖరాయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా మాతృశాఖలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. చూడాలి సచివాలయంలోని మిగిలిన 18ప్రభుత్వశాఖల కూడా వారి ఉద్యోగులను వెనక్కి పంపాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తాయో.. లేదంటే సచివాలయశాఖలోనే ఉంచేసి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వ్యవహరించినట్టే వ్యవహరిస్తాయా.. అనేది..?!

visakhapatnam

2024-10-23 13:42:59

అట్లుంటది మనతోని.. జిల్లా సమాచార శాఖ బాధ్యతా రాహిత్యం..!

విశాఖజిల్లాలో సమాచారశాఖ అధికారుల బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా జిల్లాకలెక్టర్, డిస్ట్రిట్ మెజిస్ట్రేట్, జిల్లా అక్రి డిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్నే అపహాస్యం చేసేంతగా మారిపోయింది.. ఏంటి నమ్మకం లేదా.. లేదంటే మీరూ డిపీఆర్వో కార్యాలయ సిబ్బంది గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సేవలోనే తరిస్తున్నట్టుగా.. మీరూ అదే బ్రమలోనే ఉన్నారా..? జిల్లా సమాచారశాఖ అధికారుల పరిస్థితి అలానే ఉంది కాబోలు. అందుకే జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సంతకానికి బదులు, గత కలెక్టర్ డా. మల్లిఖార్జున సంతకంలో అక్రిడిటేషన్ కార్డులను ప్రింటింగ్ కి పంపించారు ఇక్కడి సిబ్బంది. అదేంటి మరీ ఇంత కళ్లుమూసుకొని పంపిస్తారా..?  అంటే.. పంపిస్తేనే కదా అసలు విషయం బయటకొచ్చింది. 

అక్టోబరు 3న విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తరువాత సమావేశంలో సభ్యులతోపాటు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమోదం తెలిపారు. ఆ తరువాత ప్రక్రియ మొత్తం జిల్లా సమాచారశాఖ కార్యాలయం చేపట్టాలి. కమిటీలో అప్రూవల్ చేసిన కార్డులను సమాచారశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసి విజయవాడ రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి ప్రింటింగ్ కి పంపించాలి. వీళ్లూ అలానే చేశారు. కాకపోతే జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బదులు.. గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సంతకాన్నే ఉంచేసి పంపించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్దం. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బందులు గత కలెక్టర్ సంతకం ఉండటంతో రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలోని అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ చేసే సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేసి విశాఖజిల్లా సమాచారశాఖ సిబ్బంది చేసిన ఘనకార్యంపై కొర్రీ వేసి వెనక్కి పంపారు.

 ఆ విషయం కాస్త మీడియాకి తెలియడంతో విషయం బగ్గుమంది. ముఖ్యంగా పెండింగ్ అక్రిడిటేషన్ల విషయంలో మీడియా జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ పై ఒత్తిడి తీసుకు రావడంతో కలెక్టర్ మంచి మనసుతో కార్డుల జారీకి అనుమతించారు. దానిని జీర్ణించుకోలేకపోతు సమాచారశాఖ సిబ్బంది అడుగడుగునా సాంకేతిక కారణాలను సాకుగా చూపి నేటి వరకూ తాత్సారం చేస్తూ.. చేసిన పనుల్లో తప్పులు చేస్తూ వస్తున్నారు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రెస్ నోట్లు రాయడం రానివారు జిల్లా సమాచారశాఖ అధికారులుగా ఉండటం.. వారి ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది మరింత బాధ్యతా రాహిత్యంగా ఉండటం.. వారి పనులు కూడా జిల్లా కలెక్టర్ కి మచ్చతెచ్చే విధంగా ఉండటం విశేషం.

-జిల్లా సమాచారశాఖ ఏం చేయాలి..? మరేం చేసింది..!
సమాచారశాఖ జిల్లా అధికారులు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం అయిన తరువాత ముఖ్యంగా ఆన్ లైన్  వెస్ వెబ్ సైట్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్ని ఎన్ఐసి అధికారుల సహకారంతో అప్లోడ్ చేయాలి. అదే పాత కలెక్టరే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గత కలెక్టర్ మల్లిఖార్జున బదిలీ అయిపోయిన తరువాత హరేంధిరప్రసాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కూడా అయ్యింది. కానీ సమాచారశాఖ సిబ్బంది మాత్రం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై కొత్త కలెక్టర్ సంతకాన్ని అప్డేట్ చేయడం మానేశారు. దీనితో పాత కలెక్టర్ సంతకమే ఉండిపోయింది.

 కనీసం అక్రిడిటేషన్ కార్డులు డౌన్ లోడ్ చేసి.. వాటిని రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి మెయిల్ చేసినపుడు కూడా జిల్లా సమాచారశాఖ అధికారులు వాటిని కనీసం పరిశీలించలేదు. దీనితో కార్డులు పాత కలెక్టర్ సంతకంతోనే విజయవాడ వెళ్లిపోయాయి. తీరా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై పాత కలెక్టర్ సంతకాన్ని గమనించిన ప్రింటింగ్ సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేశారు. ఇదే కార్డులను ప్రింటింగ్ చేస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోననే భయంతో జిల్లా సమాచారశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేసిన తప్పుని వీరికి తెలియజేశారు. దీనితో కార్డుల ప్రింటింగ్  ప్రక్రియ కాస్తా నిలిచిపోయింది.

వాస్తవానికి ఐఏఎస్ అధికారులు జిల్లాకి కలెక్టర్ గా వచ్చినపుడు ఆయన సంతకాన్ని ప్రభుత్వం ఎన్ఐసి విభాగం ద్వారా ఆన్ లైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జిల్లా సమాచారశాఖ ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది చాలా లైట్ తీసుకొని ఆయన సంతకాన్ని సమాచారశాఖ వెబ్ సైట్ లో కూడా అప్డేట్ చేయించడం మానేశారు. అలా చేయించాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాచారశాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పెట్టాల్సి వుంటుంది. 

గత కలెక్టర్ సంతం మార్పుచేసి.. ప్రస్తుతం కలెక్టర్ సంతకం సమాచారశాఖలో అప్లోడ్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని. కానీ జిల్లా కలెక్టర్ వచ్చిన తరువాత గానీ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం పూర్తయిన తరువాత గానీ సమాచారశాఖ అధికారులు ఆ పనిచేయలేదు. ఏ పనైనా టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండేండుకు అన్ని జాగ్రత్తలూ తీసుకొని మాత్రమే పనులు చేస్తుంటామని చెప్పే సమాచారశాఖ సిబ్బంది ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలోనూ, కార్డుపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ సంతకం కాకుండా గత జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఉంచేసి పంపడంపై ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం ఏంటో చెప్పాల్సి పనిలేదు.

-క్యాడర్ ఉండటంతో టెక్నికల్ సిబ్బందికి డిఐపీఆర్వోగా బాధ్యతలు
రాష్ట్రంలో 13జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసిన సమయంలో కొత్త జిల్లాలకు డిపీఆర్వోలను సమాచారశాఖలో నియమించాలటే ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దీనితో ఇదేశాఖలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నవారిని తీసుకువచ్చి జిల్లా సమాచారశాఖ అధికారులగా సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం నియమించేసింది. వాస్తవానికి ఇంజనీరింగ్ పనులు తప్పా.. వీరికి  మీడియా విభాగం పనులు చేతకావు.. కాదు కాదు చేయడం రాదు.. ఎవరై ఆ పనులు తెలిసిన వారుంటే వారితో డిపీఆర్వో హోదాలో చెప్పి చేయించుకోవడం తప్పితే. అదే సమయంలో ఏపీఆర్వోలు, సాంకేతిక సిబ్బందిని కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో కనీసం సమాచారశాఖ, కార్యాలయ వనులను తెలియని వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏపీఆర్వోలుగా నియమించారు. వీరంతా కార్యాలయానికి వస్తారు తప్పితే చేసే పనిలో అస్సలు క్లారిటీ ఉండదు. సరిగ్గా విశాఖజిల్లాలోనూ అదే జరిగింది.

 డిఐపీఆర్వోగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎస్వీరమణను తీసుకు వచ్చి డిపీఆర్వోగా నియమించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా ఇంజనీరింగ్ విభాగంతో ఉన్న ఇంద్రావతిని కూడా కొత్త జిల్లాలో డిఐపీఆర్వోలుగా నియమించారు. వాస్తవానికి వీరికి మీడియా పనులుగానీ, కార్యాలయ పనులుగానీ చేతకావు. ఉన్న సిబ్బందిని వినియోగించుకొని మాత్రమే వీరు పనులు చేయించుకోవాలి. కానీ జిల్లాల విభజన సమయంలో గత ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర సమాచారశాఖ అమలు చేస్తూ.. మీడియా, మీడియా లైజన్, ప్రెస్ అక్రిడిటేషన్, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, తెలియని వారిని నియమించడంతో వారికి తెలిసినట్టుగానే పనులు చేస్తున్నారు. దీనితో వారం రోజుల్లో కావాల్సిన పనులు నెలలైనా పూర్తి కావడం లేదు. అన్ని అర్హతలు, పనిచేయడం వచ్చినవారు పదోన్నతుల కోసం వేచిస్తున్నా.. పదోన్నతులు కూడా కల్పించకకుండా పనులు రాని వారినే జిల్లా అధికారులగా నియమిస్తున్నారు.

-విశాఖ జిల్లా కలెక్టర్ సంతకానికి మచ్చ తెచ్చిన సమాచారశాఖ
కొత్తగా విశాఖజిల్లా కలెక్టర్ గా వచ్చిన హరేంధిర ప్రసాద్ సంతకానికి జిల్లా సమాచారశాఖ మచ్చతెచ్చింది. వాస్తవానికి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్,  జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఉన్న  అధికారుల సంతకాల విషయంలో ప్రభుత్వ శాఖలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. సాంకేతిక కారణాలు, సమస్యలుంటే ముందుగా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి.. అవి పరిష్కారం అయిన తరువాత మాత్రమే మిగిలిన కార్యాచరణ చేయాలి. కానీ విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ శాఖలన్నా.. అందులోని అధుకారులన్నా.. ఆఖరుకి కలెక్టర్ అన్నా కూడా నిర్లక్ష్యమనే విషయం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో తేట తెల్లం అయిపోయింది. 

మమ్మల్ని మీడియా ప్రశ్నించకూడదు.. చేసిన తప్పులను కూడా వార్తలుగా రాయకూడదని తెగ బీరాలు పోయే సమాచారశార అధికారులు.. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకానికే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో మాయని మచ్చతెచ్చి.. అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ కాకుండా సాంకేతికంగా ఆగిపోయేలా చేశారంటే.. ఇది కావాలని చేసిందా..? బాధ్యతా రాహిత్యంగా చేసిందా..? పనిచేతకాక చేసిందా అనేవిషయం జిల్లా కలెక్టర్ హరేంధిరప్రాద్ తేల్చాల్సివుంది. మీడియా విషయంలో సమాచారశాఖ కలెక్టర్ సంతకాన్ని లైట్ తీసుకుంటే.. మిగిలిన ప్రభుత్వశాఖల విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో జిల్లా కలెక్టర్ చెప్పాల్సివుంది. చూడాల సమాచారశాఖ అధికారులు చేసిన నిర్వాకంపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారనేది.!

visakhapatnam

2024-10-21 09:00:11