జూలై 30నుంచి ఆగస్టు1 వరకూ శ్రీవారి పవిత్రోత్సవాలు..
Ens Balu
2
Tirumala
2020-07-27 18:22:02
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. జూలై 29న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు. జూలై 30న పవిత్ర ప్రతిష్ట, జూలై 31న పవిత్ర సమర్పణ, ఆగస్టు 1న పూర్ణాహుతి నిర్వహిస్తారు. కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.