శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం
Ens Balu
2
Tirumala
2020-07-29 18:52:29
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహించారు. శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. ఇందులోభాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆలయంలోని రంగనాయక మండపంలో వేంచేపు చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.