14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ


Ens Balu
6
పార్వీపురం
2022-07-12 13:04:36

అగ్ని వీర్ క్రింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (పురుషులు) విశాఖపట్నంలో ఆగస్టు 14 నుండి 31 వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు.  విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొంటకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 30వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ,  అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్ని వీరు స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు  పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని చెప్పారు. అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 

ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్వతీపురం మన్యం జిల్లాతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్.టి.ఆర్, యానాం జిల్లాల అభ్యర్థులు పాల్గొన వచ్చని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7వ తేదీ తరువాత అడ్మిట్ కార్డు జారీ చేయటం జరుగుతుందని, వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అగ్ని పథ్ పథకం క్రింద దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారు నాలుగు సంవత్సరాలకు నియామకం పొందుతారని, ఎటువంటి పింఛను, గ్రాట్యుటీ సౌకర్యాలు ఉండవని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగిందని చెప్పారు. ప్రతి బ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 శాతం మంది అభ్యర్థులను రెగ్యులర్ నియామకంలో తీసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. నియామకం పొందిన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, రెండవ సంవత్సరం రూ.33 వేలు, మూడవ సంవత్సరం రూ.36,500, నాలుగవ సంవత్సరం రూ.40 వేలుతో పాటు అర్హత మేరకు ఇతర అలవెన్స్ లు లభిస్తాయని చెప్పారు. నాలుగు సంవత్సరాల అనంతరం సేవా నిధి క్రింద రూ.10.04 లక్షలతో పాటు దానిపై వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జీవిత బీమా రూ.48 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఆగ్నివీర్ లకు నాలుగు సంవత్సరాల అనంతరం నైపుణ్య ధృవీకరణ పత్రం, 12వ తరగతితో సమానమైన సర్టిఫికెట్ ను అందజేయటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ధృవ పత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిటనెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయని, అభ్యర్థులు వారికి తెలియజేసిన తేదీల్లో ఉదయం 3 గంటల నాటికి ర్యాలీ ప్రదేశానికి హాజరు కావాలని ఆయన చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు అగ్నివీర్ కు విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం విడుదల చేసిన విపులమైన నోటిఫికేషన్ ను చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.