నిరుద్యోగులకు APPSC శుభవార్త..!


Ens Balu
9
Guntur
2022-08-02 10:09:28

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2వ వారం లేదా 3వ వారంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈమేరకు ఏపీపీఎస్సీ చైర్మన్  గౌతమ్ సవాంగ్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు.  ఆగస్టు నెలలో 110 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. వీటితో పాటు మరో  13 జాబ్ నోటిఫికేషన్లను కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఫలితంగా మరో 2000 ఉద్యోగాలను  భర్తీకానున్నాయి. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలలను గుర్తించే పనిలో పడింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాలు, ప్రభుత్వశాఖల జాబితా ఆధారంగా నోటిఫికేషన్లు వెలువడే అశకాశాలున్నాయి.. దీనితో ఎప్పటి నుంచో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ ప్రకటనల కోసం చూస్తున్నవారికి ఏపీపీఎస్సీ ముందుగానే పండుగను తీసుకువచ్చింది. అంతేకాకుండా ప్రకటన విడుదల, ఆపై పరీక్ష, ఉద్యోగాల భర్తీ కూడా వెంట వెంటనే చేయడం ద్వారా తరువాత నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

కొత్త జిల్లాల్లో అధికారులు, సిబ్బంది కొరత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26జిల్లాలుగా మార్చిన తరువాత జిల్లాశాఖల అధికారులు, సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఏర్పడింది. దీనితో చాలా చోట్ల ఇన్చార్జిలుగా డివిజనల్ కేడర్ అధికారులను డిస్ట్రిక్ట్ క్యాడర్ అధికారులుగా కొత్త జిల్లాలకు బదిలీ చేసి పరిపాలన కొనసాగిస్తున్నది ప్రభుత్వం. త్వరలో భర్తీచేయబోయే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల ద్వారా ఖాళీలు ఉన్న కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులుగా గ్రూప్-1 అధికారులను, డివిజనల్ స్థాయిలో గ్రూప్-2 అధికారులను నియమించాలని యోచిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల జాబితాను సిద్దం చేస్తున్నది. కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేయడం ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని చూస్తున్నది ప్రభుత్వం. 

కొన్ని ఉద్యోగాలను ప్రమోషన్ ద్వారా భర్తీ..
ప్రస్తుతం డివిజనల్ అధికారులుగా ఉన్న చాలా మంది అధికారులను పదోన్నతులు కల్పించి జిల్లా అధికారులుగా భర్తీచేసిన తరువాత మిగులు ఉద్యోగాలను గ్రూప్-1 లో ఉద్యోగాలు సాధించిన వారిని నియమించడం ద్వారా పరిపాలన సక్రమంగా సాగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. గ్రామ,వార్డుసచివాలయాల్లో ఏ విధంగా అయితే అన్ని శాఖల సిబ్బందిని నియమించిందో..అదేవిధంగా జిల్లా శాఖల్లో కూడా అధికారులను, సిబ్బందిని నియమించడం ద్వారా నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిచేసినట్టు అవుతుందని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా వుంటుంది.

వయస్సుపై మరో కీలక నిర్ణయం
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారిలో చాలా మందికి వయస్సు మీదన పడుతుంది. అయినా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎక్కడో చిన్న ఆశ. అలాంటి వారికోసం ప్రభుత్వం వయస్సు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వయస్సు మీద పడిన వారికి కూడా ఉద్యోగ అవవకాశాలు వచ్చే అవకాశం వుంటుంది. అయితే ఇప్పటికే ఈ విషయమై పలు నిరుద్యోగ సంఘాలు ఏపీపీపీఎస్సీకి, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీనితో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నవారంతా ఇక పూర్తిస్థాయి ప్రిపరేషన్ లో పడిపోతే కొత్తగా తీయబోయే ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు.