ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీకి లైన్ క్లియర్..


Ens Balu
140
Guntur
2022-08-30 04:49:32

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రంలో మెగా డిఎస్సీ ద్వారా భారీ సంఖ్య లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తోంది. దీనితో చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న టీచర్ ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్కసారి కూడా డిఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇటీవల 1998 డిఎస్సీ అభ్యర్ధులకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం మరిన్ని ఖాళీ ఉద్యోగాలను కూడా మెగా డిఎస్సీ ద్వారా భర్తీచేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఇంగ్లీషు మీడియం టీచర్లతోపాటు, భాషా పండితులను కూడా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాల్లో విద్యాశాఖ అధికారులను నియమించిన రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్యపైనా, ఖాళీల భర్తీపైనా, మౌళిక వసతులపైనా ద్రుష్టిసారించింది.

పదివేల మందికి పైగా పదోన్నతులు
రాష్ట్రంలోని 10వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తొలుత 98 డిఎస్సీ అభ్యర్ధుల ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆతరువాత ఎన్ని ఖాళీలు మిగిలాయో చూసుకొని..జిల్లాల వారీగా పాఠశాలల సమాచారంతోపాటు, ఉపాధ్యాయుల ఖాళీలను కూడా గుర్తించి ఒకేసారి మెగా డిఎస్సీ ప్రకటించాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి తగ్గట్టుగానే సెస్టెంబరు నెలాఖరునాటికి పదోన్నతుల ప్రక్రియ, 98 డిఎస్సీ ఉపాధ్యాయుల భర్తీపూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ 98 డిఎస్సీ అభ్యర్ధుల నుంచి అంగీకార పత్రాలను కూడా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వం స్వకరించింది కూడా. వీరి భర్తీ, పదోతన్నతుల ప్రక్రియ పూర్తయిన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ఒక లెక్క వస్తుందని అధికారులు కూడా వెయిట్ చేస్తున్నారు. దానికితోడు చాలా మంది ఉపాధ్యాయుల పదవీ విరమణలు కూడా ఉండటంతో ఈ సారి డిఎస్సీలో చాలా ఎక్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులకే పెద్దపీట..
రాష్ట్రంలోని ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వపాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ ఇంగ్లీషు బోధనపై శిక్షణలు ఇస్తోంది ప్రభుత్వం. అలా కాకుండా ఈ సారి తీయబోయే డిఎస్సీ ద్వారా ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులను ఎంపిక చేయడం ద్వారా వారితో నేరుగా విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం విద్యను బోధింప చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్సీ సిలబస్ ప్రవేశపెట్టిన ద్రుష్ట్ట్యా ఆ పాఠ్యాంశాలు చెప్పే ఇంగ్లీషుమీడియం సబ్జెక్టు అభ్యర్దులను నియమించడం ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరోసారి ఇంగ్లీషు మాద్యమ విద్యపై ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అవసరం ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. అయితే డిఎస్సీ కోసం చాలా మంది అభ్యర్ధులు చాలా సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నందున ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియం రెండిటికీ కలిపి నోటిఫికేషన్ ఇస్తుందా..లేదంటే ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులకే నోటిఫికేషన్ ఇస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.

2024నాటికి భారీ సంఖ్యలో విద్యాశాఖలో ఖాళీలు
2024నాటికి విద్యాశాఖలో ఉపాధ్యాయులతో పాటు మినిస్టీరియల్ స్టాఫ్ లాంటి ఖాళీలు కూడా భారీగా ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతో చాలా మంది ఉద్యోగ విరమణ పొందాల్సిన ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండేళ్లు అదనంగా పనిచేసే అవకాశం వచ్చింది. లేదంటే ఇప్పటికే చాలా ఖాళీలు ఏర్పడేవి. ప్రభుత్వం కూడా డిఎస్సీ ప్రకటించే ముందు ఎంతమంది రిటైర్ అవుతున్నారు..ఎన్ని పోస్టులతో డిఎస్సీ ప్రకటించాలి..ఎంతమందికి పదోన్నతులు కల్పించాలి అనే అంశాలను బేరీజు వేసుకొని ముందుగా పదోన్నతుల లైన్ క్లియర్ చేసింది. పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది. ఆతరువాత 2024 నాటికి ఇంకెన్ని ఖాళీలు ఉపాద్యాయుల ఉద్యోగ విరమణ ద్వారా క్లియర్ అవుతాయో తెలుస్తుంది. ఈ రెండిటి సంఖ్యలో నుంచి ఒక భారీ సంఖ్యను ఎంచుకొని దానికి తగ్గట్టుగా డిఎస్సీ తీయాలని ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. అయితే  ఈ డిఎస్సీ ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా.. 2023లో ప్రకటించి 2024 ఎన్నికల తరువాత భర్తీ చేస్తారా అనేవిషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి ఎన్నో ఆశలతో డిఎస్సీ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న అభ్యర్ధుల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనేది..!