నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు


Ens Balu
68
2022-10-13 16:41:35

నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దుకాణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ఏ. చైత్రవర్షిని అధికారులకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్టోబరు 24వ తేదీన జరుపుకోనున్నా దీపావళి పండుగను పురష్కరించుకొని బాణ సంచా దుకాణాలు ధరఖాస్తులు చేసుకొనే విధానం, లైసెన్సులు తదితర నిబంధనలపై  పట్టణ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఇతర  అనుబంధ శాఖలతో అర్డీవో  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో  మాట్లాడుతూ దీపావళి పండుగ వేడుకల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగకు సంబందించి బాణ సంచా సామాగ్రి ఏర్పాటు చేసే దుకాణాలు వద్ద అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు ఒక్కోక్క షాపు వద్ద 20 లీటర్ల నీరు, 12 ఇసుకబస్తాలు, ఫైర్ ఎగ్జిష్టర్స్ ను సిద్దంగా ఉంచాలని, లైసెన్సు దుకాణదారులకు సూచించాలన్నారు. 

దుకాణాలు ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిన లేదా ప్రమాదాలు సంభవించిన సంబంధిత అధికారులే భాద్యత వహించాల్సి వస్తుందని అన్నారు. బాణ సంచా దుకాణాలు ఏర్పాటుకు చేసిన దరఖాస్తులను స్థానిక తాహశీల్దారు, అగ్నిమాపక అధికారులు పరిశీలించి ధృవీకరించిన తదుపరి డివిజనల్ రెవెన్యూ అధికారి ఆయా షాపులకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. బాణా సంచా లైసెన్సు పొందిన వారు మాత్రమే విక్రయాలు నిర్వహించాలని, ఇందుకు విరుద్ధంగా విక్రయాలు జరిగితే నేరంగా పరిగణించి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. షాపులు పెట్టుకోవడం కోసం అక్టోబర్ 15 లోగా ధరకాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

 నిబంధనలు మేరకు ఫస్ట్ కం ఫస్ట్ కేటాయింపు చెయ్యడం జరుగుతుందన్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపితే అటువంటి షాపులను సీజ్ చేయాలని అధికారులకు ఆర్డీవో  సూచించారు. పండుగ మూడు రోజులు రెవిన్యూ, అగ్నిమాపక, పోలీసు ఇతర శాఖల అధికారులు టీముగా ఏర్పడి పర్యవేక్షిస్తుండాలని సూచించారు. దుకాణాదారులు తాము విక్రయిస్తున్న షాపుల్లో నోస్మోకింగ్, జేబు దొంగలున్నారు జాగ్రత్త, పోలీసు, అగ్నిమాపక కేంద్రాల సెల్ పోన్ నెంబర్ల గల ప్లెక్సీలను ప్రతి షాపు నందు ఏర్పాటు చేసే విధంగా చర్యలు  చేపట్టాలన్నారు.  షాపు నుండి షాపుకు 3 మీటర్ల దూరం తప్పని సరిగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులకు ముందు క్రమంలో ప్రాధాన్యతనిచ్చి బాణ సంచా విక్రయించే విధంగా  వుండాలన్నారు.  ప్రతి షాపులో సి.సి. కెమోరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.  

 దీపావళి పండుగ మూడు రోజులు మాత్రమే దుకాణదారులు బాణసంచాను ఉదయం నుండి సాయంత్రం వరకు విక్రయించుకోచ్చునని ఆర్డీవో సూచించారు. బాణం సంచా తాత్కాలిక  దుకాణాలు సుబ్రహ్మణ్యం మైదానం, అప్సర ధియేటర్ సెంటర్, క్వారీ సెంటర్, స్టేడియం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ సి ఎం ఏ సి పి లు వి. వరహాలు బాబు, వై. అనిత జూలియాలు మాట్లాడుతూ బాణాసంచా కొనుగోలు దారులు దుకాణాలకు మార్గంతో పాటు,  వెలుపలకు వెళ్లు మార్గాన్ని కూడ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా బాణసంచా విక్రయించే ప్రాంతంలో నిర్ధేశించిన ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ సి ఎం ఏ సి పి లు వి. వరహాలు బాబు, వై. అనిత జూలియా,  అగ్నిమాపక అధికారి ఎన్. గోపి కృష్ణ, డిప్యూటీ ఏ సి. కే. రాజశేఖర్,తహసీల్దార్ వి. సుస్వాగతం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.