2వేల హెక్టార్లలో బిందుసేద్యం లక్ష్యం..


Ens Balu
27
Kakinada
2022-09-01 16:48:13

కాకినాడ జిల్లాలో 2022-23 సంవత్సరానికి 2వేల హెక్టార్ల విస్తీర్ణంలో బిందు, తుంపర సేద్య వసతుల విస్తరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్థేశించిందని డిస్ట్రిక్ట్ మైక్రో ఇరిగేన్ అధికారిణి కె.స్వాతి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం క్రింద అర్హులైన రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీ అందిస్తామని, ఈ సదుపాయాలను పొందగోరే రైతులు, సమీప రైతు భరోసా కేంద్రాలలో తమ ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రం నకళ్లతో విలేజి హార్టికల్చర్/అగ్రికల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్ ను సంప్రతించి ఎపియంఐపి యాప్ లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. బిందు సేద్య పరికరాలను 5 ఎకరాల లోపు పొలం కలిగిన రైతులకు 90 శాతం రాయితీ పైన, 5 నుండి 12.50 ఎకరాలు కలిగిన రైతులకు 50 శాతం రాయితీ పై అందించనున్నామని పేర్కొన్నారు.

 తుంపర సేద్య పరికరాలను రాయితీపై పొందేందుకు ఒక ఎకరం పైన పొలం ఉన్న రైతులు అర్హులని,  ఒక ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 55 శాతం రాయితీ పైన, 5 ఎకరాలకు పైబడిన రైతులకు 45 శాతం రాయితీ పైన తుంపర సేద్య పరికరాలను అందిస్తామని తెలిపారు.  తక్కవ ఖర్చుతో నాణ్యమైన హెచ్చు దిగుబడులను అందించే బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీ పై పొందే పధకాన్ని  కాకినాడ జిల్లాలో అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.