ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్..


Ens Balu
6
Srikakulam
2021-03-19 17:01:42

శ్రీకాకుళంజిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ రైలును ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ కొబ్బరి రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొబ్బరి ఉత్పత్తి కమిటీలు,  రైతులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన రైతులు పండిస్తున్న పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించి వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కిసాన్ రైలును ప్రారంభించిందని అన్నారు. తొలిసారిగా మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో కిసాన్ రైలును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కిసాన్ రైలులో ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, పూలు రవాణా చేయవచ్చని చెప్పారు. లారీ లాంటి వాహనాలలో అయితే ఖర్చు ఎక్కువ, సమయం అధికంగా అవుతుందని, కిసాన్ రైలు ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మంచి గిట్టుబాటు ధర లభించనుందని కలెక్టర్ గుర్తుచేసారు. సరైన గిట్టుధర లేక ఇబ్బంది పడుతున్న పండ్లు, కూరగాయల రైతులకు ఇది ఊరటగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. కొబ్బరి పంటతో పాటు పలు ఉద్యాన పంటలకు  జిల్లా ప్రసిద్ధి చెందిందని, వాటిని కిసాన్ రైలు ద్వారా మార్కెట్ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొలుత కొబ్బరి ఉత్పత్తి కమిటీలతో మాట్లాడి పలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ దీనిపై పునరాలోన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని సంఘాలను, రైతులను, అధికారులను  కోరారు.   ఈ కార్యక్రమంలో ఏ.పి.యం.ఐ.పి పథక సంచాలకులు ఏ.వి.యస్.వి.జమదగ్ని, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పి.యల్.ప్రసాద్, టెక్కలి సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఏ.పి.మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, ఉద్యానవన అధికారులు ఎం.అనూష, పి.స్వాతి, సిహెచ్.చంద్రశేఖరరావు, పి.ప్రసాద్, సిహెచ్.శంకరరావు, పి.మాధవీలత, కొబ్బరి ఉత్పత్తి కమిటీల అధ్యక్షులు జి.రాజు, బి.మోహనరావు, బి.వెంకటేశ్వరరావు, ఎ.శివాజీ, బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.