ఖరీఫ్ కి డీలర్లు సిద్దంగా ఉండాలి..


Ens Balu
8
Kakinada
2021-07-07 15:20:29

ఖరీఫ్ సీజన్ లో రైతులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ ఉత్పాదక డీలర్లు సిధ్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయాధికారులతో వ్యవసాయ ఉత్పాదకత, నాణ్యతాప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత డీలర్లు నిజాయతీతో క్రయ విక్రయాలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. రైతులతో అన్యాయంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. గతంలో రైతులు బ్యాంక్ లోన్ లతో పాటు, వ్యవసాయ ఉత్పాదకతల కోసం తిరిగే పరిస్ధితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పరిస్ధితులను అధిగమించే విధంగా ఒన్  స్టాప్ విధానంలో రైతు భరోసా కేంద్రాలు ప్రవేశపెట్టారన్నారు. డిలర్లు తమ పరిధిలోని ఆర్.బి.కె.ల ద్వారా తమ ఉత్పాకతలను విక్రయించుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతు కొనుగోలు చేసే ప్రతి వ్యవసాయ ఉత్పాదకతకు తప్పనిసరిగా రసీదు జారీ చేయాలన్నారు. రసీదు జారీ వలన రైతు తో పాటు డీలర్ కు లాభం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకతలు నిర్వహించే ప్రతీ డీలరు తప్పని సరిగా రికార్డు నిర్వహించడంతో పాటు లైసెన్సు ఆయా షాపుల్లో ప్రదర్శించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరుగు మందుల జారీలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని, తదనుగుణంగా డీలర్లు తమ ఉత్పదకతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా గతంలో కన్నా భిన్నంగా ప్రతి గ్రామంలో అర్హత కలిగిన వ్యవసాయ సెక్రటరీలు పని చేస్తున్నారని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. 
జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) జి.లక్ష్మిశ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం విత్తనం నాటిన నాటి నుండి పంట చేతికి వచ్చే వరకు పూర్తి భరోసా ఇస్తుందని, తదనుగుణంగా డీలర్లు వ్యవహరించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వలన రైతులు ఆర్ధికంగా నష్టపోతారని, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. డీలర్లు లైసెన్సుల నిబంధనల పట్ల తక్కువ అవగాహన తో ఉన్నారని, ఇది సరైన చర్య కాదన్నారు. కంపెనీల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పాదకతల పట్ల ఏమైన సేందేహాలు ఉంటే వ్యవసాయాధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. సందేహాల నివృత్తి కోసం ఆర్.బి.కె.ల సేవలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పురుగు మందుల షాపుల లైసెన్సూలు-1136 , విత్తనాల డీలర్ల లైసెన్సులు – 515, ఎరువుల షాపుల లైసెన్సులు – 1181 గా ఉన్నాయని జేసి లక్ష్మిశ వివరించారు. 
జిల్లా ఎస్.పి. నయీమ్ అద్నాన్ అశ్మీ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పదకతల పంపిణీ వ్యవహారంలో ఏమైన అవక తవకలు జరిగితే రెవెన్యూ, పోలీస్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కఠినంగా వ్యవహరిస్తాయన్నారు. 
వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం రైతులు వ్యవసాయ ఉత్పాదకత డీలర్ల వద్ద వస్తారన్నారు. అలాంటి సమయంలో వారికి నాణ్యతతో కూడిన వాటిని అందించాలన్నారు. సీజనల్ లో మధ్యస్ధ వర్గాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలు పంపిణీ జరుగుతుందని, వీటి వలన అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించ కూడదన్నారు. డీలర్ల వద్దకు వచ్చే ఉత్పాదకాలను వెంటనే స్ధానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నాణ్యతా ప్రమాణాలు తెల్సుకోవాలని జేడి పలు సూచనలు చేశారు. ప్రతీ డీలర్ తమ షాపు వద్ద స్టాకు బోర్డుతో పాటు ధరల పట్టీ ప్రదర్శించాలన్నారు. 
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్.పి. రవి కుమార్ మాట్లాడుతూ రైతులు, విభిన్న వర్గాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతాల నాణ్యతా లోపాలపై తగు సమాచారం తమ దృష్టికి వస్తుందన్నారు. వీటిని బేరీజు చేసుకుని, తనిఖీలుచేపట్టడం జరుగుతుందన్నారు. తనిఖీ సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాలు, లైసెన్సు నియమ నిబంధనలు పాటిస్తున్నదీ లేనిది పరిశీలించడం జరుగుతుందన్నారు. కాలం చెల్లిన ఉత్పాదకతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీలర్లు వ్యవహరించాలని ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్.పి. రవికుమార్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు బి.రామారావు, జి.వి.పద్మశ్రీ, వ్యవసాయ ఉత్పాదకతల డీలర్లు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.