7కొండ‌ల‌కు సూచిక‌గా7అగరబత్తి బ్రాండ్లు..


Ens Balu
20
Tirumala
2021-09-07 12:43:01

టిటిడి ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. శ్రీ‌వారి ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి అగ‌ర‌బ‌త్తుల విక్ర‌యాల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. టిటిడి ఆల‌యాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో పుష్పాల వినియోగం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ర‌కంగా ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. స్వామి సేవ‌కు ఉప‌యోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై టిటిడి యాజ‌మాన్యం ఆలోచ‌న చేసింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ టిటిడి ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభం లేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి అందిస్తామ‌ని ముందుకొచ్చింది. ఈ మేర‌కు ఆ సంస్థ‌తో టిటిడి అవ‌గాహ‌న కుదుర్చుకుని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ఇలా..

            టిటిడి స్థానికాల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది ఎస్వీ గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రానికి త‌ర‌లిస్తారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన సిబ్బంది వీటిని ర‌కాల వారీగా పుష్పాల‌ను వేరు చేస్తారు. అనంత‌రం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ త‌రువాత పిండికి నీరు క‌లిపి కొన్ని ప‌దార్థాల‌తో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్ర‌మాన్ని మ‌రో యంత్రంలో వేసి అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేస్తారు. వీటిని ప్ర‌త్యేక యంత్రంలో 15 నుంచి 16 గంట‌ల పాటు ఆర‌బెట్టిన త‌రువాత మ‌రో యంత్రంలో ఉంచి సువాస‌న వెదజ‌ల్లే ద్రావ‌కంలో ముంచుతారు. చివ‌ర‌గా వీటిని మ‌రోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేలా ఏర్పాట్లు చేశారు. 

విడుద‌ల చేయ‌నున్న బ్రాండ్‌లు ఇవి.. 1)అభ‌య‌హ‌స్త 2)తంద‌నాన 3)దివ్య‌పాద 4) ఆకృష్టి 5)సృష్టి 6)తుష్టి 7) దృష్టి..