త్రిసభ్య కమిటీ విచారణకు హాజరైన కాలంచెల్లిన కార్యవర్గం


Ens Balu
155
Visakhapatnam
2023-04-21 07:36:18

ప్రతిష్టాత్మక వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో అప్రజాస్వామికంగా పాలిస్తూ, కార్యకలాపాలు చేపడుతున్న కాలచెంచెల్లిన కార్యవర్గంపై జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున వేసిన త్రిసభ్య కమిటీ అధికారుల విచారణ వాడీ వేడిగా సాగింది. శుక్రవారం ఉదయం విశాఖ ఉడా కాంప్లెక్స్ లోని 6వ అంతస్తులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రార్ మూర్తి నోటీసు మేరకు అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి దాడి రవికు మార్, ఉపాధ్యక్షుడు ఆర్. నాగరాజు పట్నాయక్, కోశాధికారి పిఎన్. మూర్తిలు రికార్డులతో సహా హాజరయ్యారు. వారితోపాటు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అక్రమ నిర్వహణ, నిర్వహణపై ఫిర్యాదులు చేసిన వారు కూడా హాజరయ్యారు. ఈ విచారణలో జిల్లా కలెక్టర్ విచారణ కమిటీ వేసిన తరువాత కూడా ఏవిధంగా సభ్యత్వాలు నమోదు ప్రక్రియ చేపట్టారని, అసలు విజెఎఫ్ బయిలా ప్రకారం సర్వసభ్య సమావేశం ఎప్పుడు పెట్టారని, సంఘం రిజిస్ట్రేషన్ రెవిన్యువల్స్, ఆడిట్ రిపోర్టులు, ఈ-ఫైలింగ్ లు, మినిట్స్ బుక్స్ ఎక్కడా అని ప్రశ్నించడంతో కంగుతిన్న కాలం చెల్లిన కార్యవర్గం తెల్లమొహం వేసింది. సొసైటీ యాక్టుకి విరుద్ధంగా ప్రస్తుత పాలక వర్గం వ్యవహరించడం వలనే సభ్యులు ఫిర్యాదులు చేశారనే విషయాన్ని విచారణ ఎదుర్కొంటున్న వారికి తెలియజేశారు. 

అయితే దానికి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకే తమ సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టామని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, మీరు చేస్తున్నది చట్టవిరుద్ధమని జిల్లా రిజిస్ట్రార్ తేల్చిచెప్పారు. జనరల్ బాడీ సమావేశాలు లేకుండా, సభ్యుల ఆమోదం లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా 11ఏళ్లు ఏ విధంగా నిర్వహణ ఏవిధంగా చేస్తారని ప్రశ్నించినపుడు కూడా... కొంతమంది సభ్యులు  ప్రెస్ క్లబ్ పై కోర్టు కేసులు వేశారని అందుకే ఆలస్యం అయ్యిందని సమాధానం ఇచ్చారు. దానిపైనా జిల్లా రిస్ట్రార్ మాట్లాడుతూ, అలా కోర్టు కేసులు వేసిన విషయాన్ని అయినా సర్వసభ్య సమావేశం పెట్టి సభ్యులకు చెప్పారా? చెబితే దానికి సంబంధించిన ఆధారాలు, మినిట్స్, ఇవ్వాలని కనీసం కొంత సమయం కావాలని కోరారా? అన్నిప్రశ్నించడంతో మళ్లీ తెల్లమొహం వేశారు సదరు నిర్వహకులు. ఇలా జిల్లా రిజిస్ట్రార్ ప్రభుత్వ నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టును అనుసరించి వేసిన ప్రశ్నలకు వీరిదగ్గర సమాధానాలు లేకపోవడంతో, రికార్డులు కూడా సక్రమంగా లేకపోవడంతో సుమారు గంటపాటు జరిగిన విచారణ అనంతరం వీరు నీరసంగా బయటకు రావాల్సి వచ్చింది. 

ఆ తరువాత ఫిర్యాదులు చేసిన వారిన కూడా జిల్లా రిజిస్ట్రార్ మూర్తి విచారించారు. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని వారి ముందు ఉంచారు. చట్ట విరుద్ధ, అనధికార పాలకవర్గ అక్రమాలపై త్రిసభ్య కమిటీ కి పలు ఆధారాలు సమర్పించారు  వీజేఎఫ్ సీనియర్ సభ్యులు యుగంధర్ రెడ్డి, ఎస్.ఎస్ .శివ శంకర్, జి. జనార్ధన రావు, ఈశ్వర్ చౌదరి,  బంటయ్యలు. కాగా మొత్తం విచారణలో కోశాధికారి పాత్రవిషయంలోనూ, లెక్కల విషయంలోనూ చాలా అంశాలకు సమాధానాలు లేకపోవడంతో కమిటీ మొత్తం అంతర్మధనంలో పడింది. ఎలాగైనా ఈ విచారణ నుంచి సేఫ్ గా బయట పడేందుకు వారి వెనుక ఒక న్యాయవాధిని కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారమే అంతా చేసినపుడు విచారణ సమయంలో న్యాయవాదిని ఎందుకు వెంట పెట్టుకొని వెళ్లాల్సి వచ్చిందనే కోణంలో ఇపుడు యావత్ ప్రెస్ క్లబ్ సభ్యుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. చూడాలి విచారణ మొత్తంలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది..!