ఆ సచివాలయ మహిళా పోలీసులు మహా కిలాడీలు..!


Ens Balu
309
Anakapalle
2023-08-09 04:45:34

ఆ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మామూలోళ్ల కాదు..భర్తలతో కలిసున్నా విడాకులు తీసుకున్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సంపాదించారు..అదీ వారు పనిచేసే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో..డిజిటల్ అసిస్టెంట్ ఏమైనా తక్కువ తిన్నాడా అంటే..పెళ్లికాకుండానే పెళైనట్టు మేరేజి సర్టిఫికేట్ తయారు చేసేసుకున్నాడు. టెక్నాలజీని వినియోగించి పథకం వేశారు గానీ పోలీసులు పట్టి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆ కిలేడీ మహిళా పోలీసులు..ఘరానా డిజిటిల్ అసిస్టెంట్ ల నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం వివరాలు ఒక్కసారి తెలుసుకుంటే... ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందడానికి నకిలీ ధ్రువపత్రాలను తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్‌ను అనకాపల్లి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్‌ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్‌ సహాయకుడు సుధీర్‌ అవివాహితుడైనా డిజిటల్‌ కీ ఉపయోగించి నకిలీ వివాహ పత్రం సృష్టించుకున్నాడు. ఇదే సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారుచేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్‌ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వారికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరయిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాగా ఈవిషయం తెలియడంతో జిల్లాలోని సహచర మహిళా పోలీసులంతా ఉలిక్కి పడ్డారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ ఉద్యోగులైన వీరు ఇలాంటి వ్యవహారం నడిపారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరి వల్ల మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ వ్యవహారం అనకాపల్లి జిల్లాతోపాటు, రాష్ట్రంలోనూ హాట్ టాపిక్ అయ్యింది..!