భారీ చోరీ.. 3రోజుల్లో రికవరీ.. శెభాష్ అన్నవరం పోలీస్..!


allada satya prasad
111
Annavaram
2023-05-15 03:56:07

అర్దరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి, లోపలి ప్రవేశించి, బీరువాలో ఉన్న సుమారు రూ. 22.44లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాల తోపాటు దొంగిలించిన రూ. 50 వేలునగదును  2 రోజుల్లోనే ఛేదించిన అన్నవరం పోలీసులను పెద్దాపురం ఎస్డీపీఓ కె.లతాకుమారి అభినందించారు. ఈమేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆమె మీడియాకి చోరీ, రికవరీ వివరాలు వెళ్లడించారు.  కాకినాడ జిల్లా  అన్నవరంలోని శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల వెనుక గోగుల వీరభద్రరావు అద్దెకు ఉంటున్న ఇంటికి 12వ తేదీన తాళాలు వేసి, ఆ ఇంటిలో ఎవరూలేని అర్ధరాత్రి సమయంలో ఇనుప కట్టరుతో ఇంటి తాళాల్ని పగులగొట్టి, బీరువాలోని సుమారు రూ. 21.29 లక్షలు విలువ చేసే 33.8 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 1.15లక్షలు విలువ చేసే 1.5 కేజీల వెండి వస్తువులు, రూ. 50వేలు నగదును అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన చిటికెల నాగేశ్వరరావు (32) దొంగిలించాడన్నారు. బాధితుడు గోగుల వీరభద్రరావు ఫిర్యాదు మేరకు 116/2023 యు/ఎస్ 457, 380 గా అన్నవరం పోలీసులు కేసు నమోదుచేశారని పేర్కొన్నారు. అనంతరం తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ. కె.కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం ఎస్సై పి.శోభన్ కుమార్, ఏలేశ్వరం ఎస్సై జి.సతీష్ , ప్రత్తిపాడు ఎస్సై ఎం.పవన్ కుమార్, మిగతా పోలీసు సిబ్బంది 3బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా 2రోజుల్లోను దొంగను గుర్తించారని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని చోరీమొత్తం, నేరానికి ఉపయోగించిన కట్టర్, తెలుపు రంగు మారుతి స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరస్తుడు చెందిన చిటికల నాగేశ్వరరావును కోర్టులో హాజరు పరిచామన్నారు. పెద్దచోరీని 3 రోజుల్లోనే చాకచక్యగా చేధించిన పోలీసు సిబ్బందిని ఎస్డీపీఓ అభినందించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ఇంటర్ నెట్ జూదానికి అలవాటు పడి దొంగతనాలు..
తాళాలు వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలే లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుచున్న నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన చిటికల నాగేశ్వ రరావు (32 ) గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజరుగా 2015 చేరాడు. అప్పటి నుండి ఇతను ఆలమూరు మండలం నర్సిపూడి, కిర్లంపూడి  మండలం సోమవరం గ్రామంలో గ్రామీణ బ్యాంకులో పని చేసాడు. అనంతరం గొల్లప్రోలు గ్రామంలో గ్రామీణ బ్యాంకులో పనిచేస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు అన్నవ రంలో శ్రీసత్య దేవా జూనియర్ కాలేజీ వెనుక న్యూ కాలనీలో కుటుంబంతో కాపురం ఉన్నాడు.  ఏలేశ్వరం, నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తూ అంత ర్జాల జూదం పందాలకు అలవాటు పడి అక్రమార్జనకు బ్యాంకు లాకర్లలోని  బంగారాన్ని దొంగిలించి అమ్ముకొన్న కేసులో అవకతవకలకు పాల్పడినందున నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పందాలకు డబ్బు కోసం దొంగతనాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో ఏలేశ్వరం గ్రామంలో ఏటీఎం చోరీకి పాల్పడి రూ. 2.34 లక్షలు చోరీ చేసాడు. ఈ కేసులో ఏలేశ్వరం పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఆపై జైలు నుండి బెయిలుపై విడుదల అయ్యాడు. అనంతరం అన్నవరంలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరికి పోయాడు.