దుర్గగుడి ఏసీబీ కేసు టార్గెట్ ఎవరిపై..


Ens Balu
5
Vijayawada
2021-02-22 16:16:55

విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసివున్న శ్రీ కనక దుర్గఅమ్మవారి ఆలయంలో  విచ్చలవిడిగా జరుగుతున్నట్లు వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసిబి అధికారులు మూడు రోజులపాటు వివిధశాఖలు తనిఖీ చేసి, ఈ రోజు  ప్రభుత్వానికి నివేదిక అందించారని తెలిసింది.  ఏసీబీ తన నివేదికలో దేవాదాయ శాఖ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు  ఆలయంలో అవకతవకలకు పాల్పడ్డారని, దానికి ప్రధాన కారణం ఈఓ సురేష్ బాబేనని ఆనివేదికలో వెల్లడించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న రికార్డులు కూడా నివేదికతోపాటు అందజేశారు. శానిటేషన్ టెండర్లు, మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరలు గల్లంతైనట్టు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్‌లో లెక్కలు తేలనట్టు నివేదికలో ఏసీబీ తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించిన అనంతరం తీసుకునే నిర్ణయంపై ఈఓ సురేష్ బాబు ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్ననే   విశాఖపట్నంలోని ఒక ఆశ్రమ అధిపతి ఆశీస్సులు పొంది తిరిగివచ్చారని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంపై ఆయనపై చర్యలు ఉంటాయో లేదో అని అనుమానం పలువురు  వ్యక్తం చేస్తుండగా, ఆసీస్సులు లేని మరికొందరిపై కూడా అరెస్ట్ వేటు తప్పదని తెలుస్తోంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పబడుతున్న నెలవారీ ఎవరికెంత ముట్టచెపుతున్నట్లు నమోదుచేస్తున్న అనామతు పుస్తకం కూడా ఈరోజు ప్రభుత్వానికి అందించిన వాటిల్లో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే కనుక బయట పెట్టినట్లైతే ఏ స్థాయినుండి ఏ స్థాయి లోనివారికి  భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న అమ్మవారి సొమ్ము దారి మళ్లి పోతోందనేది వెళ్లడవుతుందని చెబుతున్నారు.  చల్లగా చూడాలని తాము భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్న కానుకలు కొందరు అవినీతిపరులు పప్పుబెల్లల్లా దిగమింగుతుంటే అమ్మ అలాంటి దుర్మార్గులను శిక్షించకుండా ఉంటుందాని కూడా చెవులు కొరుక్కుంటున్నారు.  అసలు అమ్మవారి ఆలయ నీడలో పెరిగిన పలువురు పిండాలు తిన్నవారు, కొబ్బరిచిప్పలు ఏరుకునేవారు అంటూ ఒకరిపై మరొకరు చేసుకునే విమర్శలు తరచు మీడియాలో  రావటంతో, అసలు అమ్మనీడలోనే ఇలాంటి నాయకులు ఏదుగుతున్నారా? అనే ప్రశ్న వ్యక్తం అవుతోంది. ఏమైనా ఈరోజు ఏసీబీ సమర్పించిన నివేదికతో పలువురు అరెస్ట్ కాక తప్పేటట్లు లేదని,మరి కొందరికి బదలీ వేటు తప్పకపోవచ్చునని చెబుతున్నారు. అసలు ఆ నివేదిక ఎవరిపై వేటువేస్తుందో వేచి చూడాలి..