అవినీతి అధికారిణిని ఆగమేఘాలపై తీసుకొస్తున్నారు..
Ens Balu
3
Tadepalle
2021-03-03 20:11:39
ప్రభుత్వంలో అవినీతి అధికారులను ఏశాఖ ముఖ్య అధికారులైనా, ప్రజాప్రతినిధులనైనా పక్కనపెడతారు.. విచిత్రంగా పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి నిలువెత్తు నిలువటద్దమైన అధికారిణిని ఆగమేఘాలపై విశాఖజిల్లాకు జిల్లా పంచాయతీ అధికారిణిగా తీసుకు వస్తున్నారు. అదీ రెండు లక్షల రూపాయల దుర్వినియోగం కేసులో విజిలెన్సు విచారణ పెండింగ్ లో ఉండగా.. అదొక్కటే కాదు సుమారు 56 లక్షల నిధుల విషయంలో కూడా ఈమె రాతపూర్వక ఫిర్యాదులున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా మొత్తం ఈమె అవినీతిపై కోడై కూస్తోంది. అదే విషయాన్ని విశాఖలోని మీడియా మొత్తం నెత్తీనోరూ కొట్టుకొని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నా ఆ అధికారిణి సుభాషిణికి విశాఖలో డిపీఓగా పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర సచివాలయం నుంచే కాకుండా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా చాలా మంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి అధికార యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి ఫోన్లు చేసి వాట్సప్ ద్వారా ఆమె అవినీతికోసం సమాచారం అందించారు. ఒక్కసారి ఆ అధికారిణి తెలివితేటలు, ఆమె నెట్వర్క్ కోసం తెలుసుకుంటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం ముద్రవేసి ఆమెను ఏజెన్సీ ప్రాంతం విఆర్ పురం బదిలీ చేస్తే.. విశాఖలో డిపిఓను పరిపాలనా పరమైన ఆదేశాలతో బదిలీ చేస్తున్నారని తెలుసుకొని, ఆరు నెలలుగా లాంగ్ లీవ్ పై వున్న ఆ అధికారిణి వేరేచోట పోస్టింగ్ కోసం రెండు రోజుల క్రితం విఆర్ పురంలో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ కాకపోతే ఆమెను బదిలీచేయడం కుదరదు. ఆ సాంకేతిక కారణం సచివాలయ అధికారుల ద్వారా తెలుసుకొని చక్రం తిప్పగలిగారంటే ఈ అధికారిణి అడ్డదారేంటో మీరే చెప్పాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం విజిలెన్సు విచారణ అవినీతి ఆరోపణలున్న అధికారులకు ఆ శాఖ ఉన్నతాధికారులు పోస్టింగులు ఇవ్వరు..ఇవ్వకూడదు.. దానికితోడు రెండు లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారి విచారణ ఈమె వ్యవహారం పై విచారణ చేస్తున్నారు. అదే సమయంలో విజిలెన్సు ఎంక్వైరీ కూడా పెండింగ్ లోవుంది. జిల్లా కలెక్టర్ సైతం ఈమె వ్యవహారంలో చాలా కోపంగా ఉన్నారు. జిల్లా పంచాయతీని మొత్తం సర్వనాశం చేసి జిల్లాకు చెడ్డపేరు తీసుకువచ్చారనే కారణంతో అంతా మండిపడుతున్నారు. ఇంతమందినీ దాటుకొని నేరుగా విశాఖ అడ్డదారిలో వచ్చేయడానికి ఈ అధికారిణి ఎలా నెట్వర్క్ చేసి జీఓ రప్పించుకోగలిగారు. డిపిఓ సుభాషిణి విశాఖ వస్తున్నారని తెలియగానే విశాఖలోని మీడియా సంస్థలన్నీ ఆమె అవినీతిని రెండురోజులుగా చూపిస్తూ వచ్చాయి. అయితే సాంకేతిక విషయాలను మాత్రం ఈ అధికారణి కోసం ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా కొంత మంది వివరాలు అందించారు. దీనితో రంగంలోకి దిగిన ఈఎన్ఎస్ లైవ్ యాప్ అసలు విషయాన్ని బయటకు తీసుకు రావడానికి ఈ ప్రత్యేక కధనాన్ని ప్రచురించాల్సి వచ్చింది. ఈమె అవినీతి విషయాలన్నీ ఆధారాలతో రుజువు కావడంతో ఆమెపై వేటువేయాలని విచారణ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఏకంగా విశాఖజిల్లా లాంటి ప్రతిష్టాత్మక జిల్లాకు పంచాయతీ అధికారణిగా పోస్టింగ్ వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి అధికారిణికి పోస్టింగ్ ఇవ్వడానికి ఓ మంచి పరిపాలనా దక్షత ఉన్న విశాఖజిల్లా డిపిఓ క్రిష్ణకుమారిని బదిలీచేయడంపైనా సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్క అధికారిణి కోసం ఆమె చేసిన అవినీతి వ్యవహారాలన్నీ ఒకేసారి వైరల్ చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయం కాస్త జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. మరి ప్రభుత్వం ఈ అవినీతి అధికారిణినే విశాఖ జిల్లా డిపిఓగా నియమిస్తుందా లేదంటే మంచి అధికారిని తీసుకు వస్తారా అనేది తేలాల్సి వుంది.