విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలను మార్ఫింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఓ సూర్యకళ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. కొందరు కావాలనే దేవాలయం వీడియోలను రీమిక్సులు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో అవసరమైతే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి చర్యల్లో దేవస్థానం సిబ్బంది పాత్ర ఉందని తేలితే కచ్చితంగా సదురు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా పీఆర్వో, కెమెరామ్యాన్ తప్ప ఆలయంలోపలకి మొబైల్స్ అనుమతిని నిషేదించినట్టు చెప్పారు. అంతేకాకుండా సింహాచల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి ఆస్కారమేలేదని ఈఓ చెప్పారు. టెండర్లు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లోనూహిందువులను, దేవునిపై విశ్వాసమున్నవారినే తీసుకుంటున్నామని ఈఓ వివరించారు.