నిరుద్యోగులూ ..తస్మాత్ జాగ్రత్త..
Ens Balu
4
Srikakulam
2021-07-03 12:42:46
శ్రీకాకుళం జిల్లాలోని రూర్బన్ మిషన్ కార్యక్రమంలో నకిలీ నియామకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి నియామకాలు ఏమి జరగటం లేదని నిరుద్యోగులు గుర్తించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రూర్బన్ మిషన్ – గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించుటకు ఉద్దేశించిన కార్యక్రమంలో వివిధ హోదాల్లో నియామకాలు చేస్తున్నట్లు, అందుకు తగిన నియామక పత్రాలు జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అవుతున్నట్లు గ్రహించడం జరిగిందన్నారు. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ మేరకు సమాచారం అందించారని పేర్కొన్నారు. రూర్బన్ మిషన్ లో ఎటువంటి నియామకాలు జరగటం లేదని, నిరుద్యోగులు మోసగాళ్ళ భారీన, వారి మాయలో పడరాదని ఆయన హెచ్చరించారు. మోసగాళ్ళు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి మోసాలకు గురి కావద్దని ఆయన సూచించారు. తమ స్నేహితులకు, ఇతర నిరుద్యోగ యువతకు కూడా సమాచారాన్ని చేరవేయాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీలకు కూడా సమాచారాన్ని అందిస్తున్నామని, పంచాయతీ కార్యాలయల్లో సమాచారాన్ని ప్రదర్శించాలని ఆయన ఆదేశించినట్లు చెప్పారు. జారీ చేసిన నకిలీ నియామక పత్రాల నకళ్లను కూడా ఆయన విడుదల చేసారు.