శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలలకు ఎన్‌బిఏ గుర్తింపునకు అవసరమైన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, కమిటీలు సెప్టెంబర్‌లో కళాశాలలను సందర్శించనున్న నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీకి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో మౌళిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు. ఐటి తరగతి గదులు, ల్యాబ్‌ల ఆధునీకరణ, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కళాశాలలోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలలో అమలు చేస్తున్న పాలన, బోధన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు జె ఈవో సదా భార్గవి ఎస్‌జిఎస్ కళాశాల పరిసరాలను పరిశీలించి కాంక్రీట్ వ్యర్థాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు . ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో రికార్డులనుపరిశీలించి, పలు సూచనలు చేశారు. డిఈవో గోవిందరాజన్, డిఇ(ఎలక్ట్రికల్) సరస్వతి, ఇఇ మనోహర్, ఎస్‌జిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అసుంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.