విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి..కలెక్టర్


Ens Balu
31
Parvathipuram
2023-02-17 07:26:28

విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారించి  సైన్స్, సాంకేతికరంగాలలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  శుక్రవారం   డా. డి.వి.ఎం.ఎం. పాఠశాల నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరు ప్రారంభించారు.  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టరు మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులలో సైన్స్, సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని, జిజ్ఞాసను పెంచుతాయని తెలిపారు. తాను కూడా  హైస్కూలు చదువుకొనేటప్పుడు జిల్లాస్థాయిలో మొదటి స్థానం, జోధ్ పూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొని 4వ స్థానం పొందినట్లు తెలిపారు.  తక్కువ ఖర్చుతో వస్తువుల ఉత్పత్తి చేయుట గూర్చి పరిశోదనలు చేయాలని విద్యార్థులకు సూచించారు.

 పర్యావరణహిత వస్తువులు తయారుచేసేటప్పుడు ప్రస్తుతం అందుబాటులో గల వస్తువుల కంటే తక్కువ ధరకు అందించినపుడే  ప్రోజెక్టు విజయవంతమవుతుందని తెలిపారు.  ప్రోజెక్టు తయారు చేసేటప్పుడు వాటిలో వాడే వస్తువులగూర్చి పూర్తి విషయ సేకరణ చేయాలన్నారు.  ఇటువంటి ప్రదర్శనలలో పాల్గొని ప్రోజెక్టును వివరించుట ద్వారా విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ది చెందుతాయన్నారు. నేటిరోజులలో ఉద్యోగ రంగంలో రాణించుటకు   చదువుతో పాటు వివిధరంగాలలో నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలన్నారు.   నేడు విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయని, సాంకేతికత అందుబాటులోనికి వచ్చిందని,   యాప్ ద్వారా నూతన విద్యాబోధన అందజేయుటకు  ఎనిమిదవ తరగతి నుండే  టాబ్ లు అందజేస్తున్నట్లు తెలిపారు.  ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి  సైంటిస్టులుగా ఎదగాలని,  జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.

అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను వారు రూపొందించిన ప్రోజెక్టులు గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో అయిదు అంశాలపై వైజ్ఞానిక ప్రదర్శన పెట్టగా జిల్లాలో గల 15 మండలాల నుండి    పర్యావరణహిత వస్తువులు తయారీపై 14 ప్రోజెక్టులు,   ఆరోగ్యం మరియు పరిశుభ్రత అంశాలపై 14 ప్రోజెక్టులు,  సాంకేతికత మరియు యాప్ లు అంశంపై 12 ప్రోజెక్టులు,  పర్యావరణ మార్పులపై 14 ప్రోజెక్టులు,  మోడలింగు  మాధమెటిక్స్ పై 14 ప్రోజెక్టులు విద్యార్థులు తయారుచేసారు.  ఈ కార్యక్రమలో  జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.డి.వి.రమణ, ఉప జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మజీరావు, ఉపాద్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.