తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 17 నుండి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే " Student Manual in English" or "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూప్ లు , వాటి లోని సీట్లు, వాటిలో ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.
విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థులకు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, కళాశాల ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి ఆన్ లైన్ లో జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టీటీడీ కోరుతోంది.
విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.