ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్ష విధానంలో సమూల మార్పులు చేసింది. రానున్న రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ప్రత్యేక జీఓ జారీచేశారు. తద్వారా విద్యావిధానంలో సరికొత్త మార్పులు తీసుకు వచ్చి విద్యార్ధుల కోసం అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తుంది. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండేవి. ఆ తరువాత కరోనా సమయంలో దానిని కాస్తా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఆ తరువాత మళ్లీ సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండడంతో 11 పరీక్షలు విద్యార్ధులకు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో తెలియజేసింది. సెకండరీ విద్యావిధానంలో మార్పులు తెస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని ఆచరణలో పెట్టేందుకు అపుడే తొలి అడుగు ముందుకి వేసింది.