జాతీయ ఉపకార వేతన పరీక్షలో ఎంపికైన విద్యార్దులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఆగస్టు 30వ తేదీ లోగా నమోదు కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. జాతీయ ఉపకార వేతనాలకు ఎంపిక అయిన ప్రతీ విద్యార్థి www.scholarships.gov.in పోర్టల్ లో జరిగిన దిగా నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎంపిక అయిన విద్యార్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా చరవాణికి వచ్చిన యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ను అప్లోడ్ చేయవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్ లో ఆధార్ వివరములు, తల్లి లేదా తండ్రితో జాయింట్ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. బ్యాంక్ ఖాతాకు విద్యార్థి ఆధార్ మాత్రమే అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థి వివరాలు మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగా మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలలో ఉందాలని ఆయన సూచించారు. ఉపకార వేతనాలకు ఎంపిక అయిన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.12 వేలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. విద్యార్థి వివరాలలో దిద్దుబాట్లు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని, విద్యార్ధి కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అంగవైకల్యం ఉన్నవారు అంగవైకల్య ధృవీకరణ పత్రం మొదలగు పత్రాలు సమర్పించాలని ఆయన అన్నారు.
పోర్టల్ లో నమోదు చేయని విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాదని, ఒకరికి ఒకే ఉపకార వేతనం అనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర ఉపకార వేతనాలు పొందుచున్న విద్యార్ధులు ఆయా ఉపకార వేతనాల నుండి ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన వివరించారు. నవంబరు 2018, 2019, ఫిబ్రవరి 2020 సంవత్సరాలలో ఈ పరీక్ష వ్రాసి ఎంపికై పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఈ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు అప్లోడ్ చేసిన ఫ్రెష్, రెన్యువల్ అప్లికేషన్ ను సంబంధిత పాఠశాల, కళాశాల నోడల్ ఆఫీసర్ లాగిన్ ద్వారా వెరిఫై వెరిఫై చేయించి, తదుపరి జిల్లా విద్యాశాఖాధికారి లాగిన్ ద్వారా వెరిఫై చేయించుకోవాలని ఆయన వివరించారు. విద్యార్థులు తమ పోర్టల్ అప్లికేషన్ ప్రింట్ కు దృవపత్రాలను జతపరచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్ధి లాగిన్ ద్వారా అప్లికేషన్ స్థితి తనిఖీ చేసుకావాలని, దీనిని ఎన్.ఎస్.పి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా గాని ఉమాంగ్ ( UMANG) యాప్ ద్వారా గాని మొబైల్ ఫోన్లో తనిఖీ చేసుకొనవచ్చన్నారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపికైన ప్రతి విద్యార్ధి 30వ తేదీ లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసుకొనుటకు సహకరించాలని ఆయన ఆదేశించారు.