విద్యాప్రమాణాలు మరింతగా మెరుగుపరచాలి


Ens Balu
26
Bapatla
2023-01-05 12:38:39

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యాప్రమాణాలు మరింతగా పెంచాలని బాపట్ల జిల్లా కలెక్టరు కె.విజయకృష్ణన్ ఆదేశించారు.  పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై సంబంధిత ప్రధానాచార్యులతో గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యార్థులు చక్కగా చదువుకునే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురుకుల పాఠశాలల్లో కల్పించాలని కలెక్టరు చెప్పారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. వారి నైపుణ్యాలకు మెరుగులుదిద్దాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో డ్రాపౌట్స్ నియంత్రించాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా పరిధిలో రెండు బాలుర, ఆరు బాలికల గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. అందులో 4321 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.

 నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యాబోధన అందించాలన్నారు. డ్రాపౌట్స్ కారణాలపై సర్వే నిర్వహించి నివేదిక పంపాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యం సాధించడానికి అధ్యయన తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలను సమర్థంగా నడపాలని కలెక్టరు చెప్పారు. వివిధ పాఠశాలల్లో మురుగునీటి సమస్య, వంటగ్యాస్ సమస్య పరిష్కరించాలని ప్రధానాచార్యులు కలెక్టరు దృష్టికి తెచ్చారు. మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకోసం ప్రణాళికలు రూపొందించాలని కలెక్టరు ఆదేశించారు. రేపల్లె, యద్దనపూడి, అద్దంకి పాఠశాలల్లో ఆర్వోప్లాంట్ల ఏర్పాటు, మరమ్మతులకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య రానివ్వరాదని ఆమె సూచించారు.  

  గురుకుల పాఠశాలల్లో విద్యాకుసుమాలు వికసించేలా విద్యాబోధన ఉండాలని కలెక్టరు విజయకృష్ణన్ ఆదేశించారు. ప్రత్యేక అధికారులు ప్రతి గురువారం తనిఖీ చేసే సమయాలలో సిబ్బంది సహకరించాలన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పర్యావరణం, సామాజిక బాధ్యతపై విద్యార్థులలో అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగే వేదికగా పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆమె పలు సూచనలు చేశారు. నరసాయపాలెం పాఠశాలలో సౌర విద్యుత్ వ్యవస్థను తక్షణమే పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల ద్వారా పరిపాలన వ్యవస్థ కుంటుపడకుండా మానవవన రులను సమకూర్చుకోవాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో గురుకుల పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్ సి. శాంతివిశాల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.