రాష్ట్ర వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ 2021 ప్రవేశ పరీక్షను ఈనెల 21వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య కె.విశ్వేస్వర రావు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్ష కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తామన్నారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సోషల్ సైన్సెస్‌కు 5149, మేథమేటిక్స్‌కు 4857, బయలాజికల్ సైన్సెస్‌కు 3371, ఇంగ్లీషుకు 600, ఫిజికల్ సైన్సెస్‌కు 1661 మంది దరఖాస్తు చేసారన్నారు. పరీక్షకు 5346 బాలురు, 10,292 మంది బాలికలు దరఖాస్తు చేసారు.ఉర్దూ మీడియంలో పరీక్షకు 88 మంది దరఖాస్తు చేసారని, వీరికి కర్నూలులో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసామన్నారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, పరీక్ష సమయం వివరాలలతో సంక్షిప్త సందేశం(ఎస్‌ఎంఎస్)ను పంపామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరు కావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేదిలేదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు.