మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్..


Ens Balu
11
Guntur
2021-07-01 12:12:14

నిరక్షరాస్యత, అవగాహన లేమితో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందలేకపోతున్న కుటుంబం దీనావస్థ తెలుసుకొని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  మానవత్వంతో స్పందించి ఒక్క రోజులోనే సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవటంతో పాటు, ఉపాధి కల్పించి నిరు పేద కుటంబంలో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే జూన్ 25వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గుంటూరు నగరంలోని ప్రధాన డ్రైన్లో దుర్భర పరిస్థితులలో ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి జీవనోపాధి పొందుతున్నాడని ఒక వ్యక్తి ఫోటోను ప్రచురించారు. ఈ వార్తను చూసి చలించిన  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే ఫోటోలోని వ్యక్తిని గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్  రెడ్డికి సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు సంబంధిత వ్యక్తి ఏ.టీ.అగ్రహారంలోని సుగాలి కాలనీ ఒకటో లైను లో  నివశిస్తున్న రౌతు నాగరాజుగా గుర్తించి, అతని కుటుంబ వివరాలు సేకరించారు. భార్య , ఆరుగురు పిల్లలతో అద్దె ఇంటిలో నివశిస్తున్న నాగరాజు నిరక్షరాస్యత, ఆజ్ఞానంతో ఇప్పటి వరకు ఆధార్ కార్డు కూడ నమోదు చేసుకోలేదని, అందువలన కనీసం బియ్యం కార్డు కూడ మంజూరు కాలేదని తెలిసింది. నాగరాజు దంపతులకు  సంబంధిత ప్రాంతంలోని 52వ వార్డు సచివాలయ అడ్మిన్ ఇతర సచివాలయ ఉద్యోగులు, వాలంటీరు  ఆధార్ కార్డు నమోదు చేయించి, బియ్యం కార్డుకు దరఖాస్తు చేశారు. బియ్యం కార్డు దరఖాస్తు చేసిన వెంటనే  కార్డు మంజూరు చేయించారు.  రౌతు నాగరాజు కు నగరపాలక సంస్థలో  కాంట్రాక్టు పద్దతిలో పారిశుద్ధ్య కార్మికునిగా ఉపాధి కల్పించారు. బియ్యం  కార్డు మంజూరు కావటంతో పేదలందరికీ ఇళ్ళ పథకం కు సచివాలయ ఉద్యోగులు దరఖాస్తు చేయించటం జరిగింది.

    గురువారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్  ( ఆసరా, సంక్షేమం) కే. శ్రీధర్ రెడ్డి తో కలసి  రౌతు నాగరాజు , భార్య రౌతు భవాని దంపతులకు బియ్యం కార్డును అందించారు. రౌతు నాగరాజు పిల్లలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రేమగా పలకరించి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నాగరాజుకు సూచించారు. చిన్న పిల్లలను వెంటనే అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించాలన్నారు.  నాగరాజు కుటుంబానికి మూడు రోజులలోనే ఆధార్ కార్డు నమోదు, బియ్యం కార్డు  మంజూరు చేసిన 52వ వార్డు సచివాలయం  అడ్మిన్ సెక్రటరీ రాధిక, ఇతర సచివాలయ ఉద్యోగులకు,  వాలంటీరుకు చాలా మంచి పని చేశారని జిల్లా  కలెక్టర్ వివేక్ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా రౌతు నాగరాజు మాట్లాడుతూ ఇంటి ముంగింటకే వచ్చి సంక్షేమ పథకాలు అందించటంతో పాటు, ఉపాధి కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువు లేకపోవటం వలన అవగాహన లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న మా లాంటి పేదలకు సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్కు, సచివాలయ అధికారులకు జీవితాంతం ఋణపడి ఉంటామన్నారు.  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారి నిశిత దృష్టికి, సున్నిత హృదయ స్పందన తోడవడంతో దుర్భర స్థితిలోని ఒక కుటుంబం  ప్రగతి ప్రయాణంలో నిలద్రోక్కుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు  లేదు.